అందరూ అరెస్టయ్యారు.. నారాయణ మాత్రం లక్కీ

కక్ష సాధింపు అనుకోండి, నిజంగానే వారు తప్పుచేశారని నమ్మండి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ కొంతమంది టీడీపీ నేతలు జైలుకెళ్లి వచ్చారు. కేసులు నమోదు కావడం ఆలస్యం, అరెస్ట్, రిమాండ్, బెయిల్.. ఇలా…

కక్ష సాధింపు అనుకోండి, నిజంగానే వారు తప్పుచేశారని నమ్మండి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ కొంతమంది టీడీపీ నేతలు జైలుకెళ్లి వచ్చారు. కేసులు నమోదు కావడం ఆలస్యం, అరెస్ట్, రిమాండ్, బెయిల్.. ఇలా జరిగింది వ్యవహారం. 

తాజాగా అమరావతికి సంబంధించిన కేసులో చంద్రబాబుపై కూడా కేసు నమోదైందని అంటున్నారు. బాబు కూడా జైలుకెళ్లడం ఖాయమనే మాటలు వినబడుతున్నాయి. అయితే టీడీపీ నేతల అరెస్ట్ ల విషయంలో మాత్రం ఒక్క నారాయణే అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి.

టీడీపీ నుంచి అరెస్టయిన ప్రముఖుల్లో ఇద్దరు మాజీ మంత్రులున్నారు. అందులో ఒకరు అచ్చెన్నాయుడు, మరొకరు కొల్లు రవీంద్ర. అచ్చెన్నాయుడు తన శాఖకు సంబంధించిన అవినీతి వ్యవహారాల్లో అరెస్టయ్యారు, ఒకటీ రెండు రోజులు జైలులో ఉండి, ఆ తర్వాత పైల్స్ పేరుతో ఆస్పత్రిలో చేరి బెయిల్ పై బయటపడ్డారు. 

ఇక కొల్లు రవీంద్ర ఓ హత్యకేసు విషయంలో అరెస్టయ్యారు. చింతమనేని ప్రభాకర్, .. నోటి దురుసుతో అరెస్టయి, జైలుకెళ్లి వచ్చారు.

పట్టాభిది మరీ విచిత్రమైన కేసు. ఏకంగా టీడీపీ ఆఫీస్ పై దాడికి కారణం అయ్యాయి ఆయన మాటలు. ఆ తర్వాత ఆయన జైలుకెళ్లొచ్చి, అట్నుంచి అటు ఏకంగా విదేశీ విహార యాత్రలకు ఫ్లైటెక్కారు. కామన్ పాయింట్ ఏంటంటే అందరూ జైలు తిండి తిని బయటకు వచ్చినోళ్లే.

నారాయణ తప్పించుకున్నారు…

నారాయణ మాత్రమే జైలుకెళ్లకుండా తప్పించుకున్నారు. బెయిలుపై బయటకొచ్చారు. టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టైన తర్వాత ఆయన్ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. 

నారాయణ విద్యాసంస్థలకు ఆయన అసలు చైర్మన్ కాదని, ఆ పదవికి గతంలోనే రాజీనామా చేశారని చెప్పారు. దీంతో మేజిస్ట్రేట్ నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. ఇలా నారాయణ జైలుకెళ్లకుండా తప్పించుకున్నారు.

చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

ఇక బ్యాలెన్స్ ఉంది చంద్రబాబు మాత్రమేనని అంటున్నారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. చంద్రబాబు కూడా జైలుకెళ్తారా అనే చర్చ అనవసరం. ఎఁదుకంటే, ఆయనది అలాంటిలాంటి బ్రెయిన్ కాదు, తన కోసం ఆయన ఏర్పాటుచేసుకున్న లాబీయింగ్ అసాధారణమైంది. 

నారాయణకే గంటల్లో బెయిల్ వచ్చిందంటే, ఇక చంద్రబాబు ఏ రేంజ్ లో తప్పించుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.