'అసని' తుపాను ఒడిశా వైపు వెళ్లిపోతోందన్నారు, ఆ తర్వాత మచిలీపట్నాన్ని టార్గెట్ చేసిందన్నారు, కొన్ని గంటల తర్వాత ముప్పు బాపట్ల జిల్లాకు అని తేల్చి చెప్పారు. చివరిగా ఇప్పుడు తీవ్ర తుపాను కాస్తా తుపానుగా బలహీనపడి తోకముడిచిందనే కబురు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఆధునిక సాంకేతికత ఆధారంగా తుపానుల ముప్పుని కచ్చితంగా అంచనావేయగలుగుతున్నారు. తీరం ఎక్కడ దాటుతుందనే విషయంలో కూడా పక్కా లెక్కలుంటున్నాయి. కానీ ఈసారి 'అసని' ఆ లెక్కలకు అందలేదు.
సహజంగా వేసవిలో వచ్చే తుపాన్లు తీరం దాటడానికి ముందే తమ దిశ మార్చుకుంటాయి. అసని తుపానుకి పేరు పెట్టకముందే ఈ విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దాని గతిని అంచనా వేయడంలో మాత్రం శాస్త్రవేత్తలు సక్సెస్ కాలేకపోయారు.
ఒడిశాకి తీవ్ర ముప్పు ఉంటుందని ముందుగా అంచనా వేశారు. మహా అయితే ఉత్తరాంధ్రకు ఇబ్బంది ఉంటుందని అప్రమత్తం చేశారు. అయితే ఇది పూర్తిగా గోదావరి జిల్లాలను టార్గెట్ చేస్తుందని మాత్రం ఊహించలేకపోయారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 'అసని' తుపాను బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. నిన్న తుపాను బాపట్ల జిల్లాని కూడా వణికించింది. మచిలీపట్నం, బాపట్ల మధ్య మధ్య తీరం దాటే అవకాశమున్నట్టు ఇప్పుడు అధికారులు చెబుతున్నారు.
బలహీనపడినట్టేనా..?
తీవ్ర తుపానుగా ఉన్న 'అసని' క్రమంగా బలహీనపడి తుపానుగా మారిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు ఉదయానికల్లా తుపాను వాయుగుండంగా మరింత బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుపాను పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని చెబుతున్నారు.
ప్రస్తుతం తుపాను మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. మరి కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రయాణిస్తుంది.
ఇక దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, గోదావరి, ఉత్తరాంధ్రలో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ప్రస్తుతం భారీ వర్షాలు ఉత్తరాంధ్రను వణికిస్తున్నాయి. 'అసని' విషయంలో ఇప్పటి వరకు అధికారుల అంచనా ఏదీ వర్కవుట్ కాలేదు.
తాజాగా 'అసని' బలహీనపడిందని చెబుతున్నారు. అయితే మళ్లీ అది దిశ మార్చుకుంటే మాత్రం తీరానికి ముప్పు తప్పేలా లేదు.