వైఎస్ కొండారెడ్డి, దివంగత వైఎస్ కుటుంబ సభ్యుడు. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్‌చార్జ్, దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టర్లపై బెదిరింపులకు పాల్పడడం, చివరికి సీఎం జగన్ దృష్టికి వెళ్లడం. ఆయన సీరియస్ కావడం, అనంతరం కొండారెడ్డి జైలుపాలు కావడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
వైఎస్ కొండారెడ్డి పేరు చెబితే… ఆయనతో మనకెందుకులేబ్బా అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భయంతో అంటుంటారు. గతంలో ఈయన్ను వైఎస్ జగన్ బాగా ప్రోత్సహించారనే ప్రచారం జరుగుతోంది. జగన్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైఎస్ కొండారెడ్డి ఆర్థికంగా బాగా ఎదిగాడనే టాక్.
ఇటీవల కాలంలో వైఎస్ కొండారెడ్డి వ్యవహారశైలిపై వైఎస్ జగన్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల శ్రేయోభిలాషిగా కొండారెడ్డిని కుటుంబ సభ్యులు చూస్తున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వాహకుల్లో కీలక వ్యక్తి అని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
గతంలో వైఎస్ షర్మిల ఆంధ్రాలో పాదయాత్ర చేసినప్పుడు అన్నీ తానై కొండారెడ్డి నడిపించారని సమాచారం. వరుసకు అన్న అయిన కొండారెడ్డిపై షర్మిలకు అలాగే విజయమ్మకు ప్రత్యేక అభిమానం అని తెలిసింది.
ప్రస్తుతం తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిలకు వైఎస్ కొండారెడ్డి వెన్నుదన్నుగా నిలిచినట్టు తెలిసింది. పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో షర్మిల చేపట్టిన పాదయాత్ర వెనుక కొండారెడ్డి మార్గనిర్దేశం ఉందని వైసీపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు వైఎస్ షర్మి ల రాజకీయాలకు వైఎస్ జగన్ సపోర్ట్ లేని విషయం తెలిసిందే.
షర్మిలపై వ్యక్తిగతంగా వైఎస్ జగన్, ఆయన భార్య భారతి అభిమానం చూపుతారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ కొండారెడ్డి కాంట్రాక్టర్లపై బెదిరింపులకు దిగడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
వైఎస్ కొండారెడ్డి అరెస్ట్‌తో ఒక దెబ్బకు రెండు పిట్టలనే చందంగా ఎవరెవరికి ఎలా అర్థం కావాలో, అలా అర్థమయ్యేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.