గతంలో ఏ పేపర్ చూసినా ఒకే రకం వార్తలుండేవి. ఆ తర్వాత పార్టీల ప్రకారం మారిపోయాయి. ఏపీలో ఈనాడు వార్తలు వేరు, సాక్షి వార్తలు వేరు. ఎవరి ఎలివేషన్లు వారివి, ఎవరి విమర్శలు వారివి. ఎవరి పాఠకులు వారికే ఉన్నారు. కానీ ఇటీవల సాక్షి పూర్తిగా ఈనాడు ట్రాప్ లో పడినట్టు కనిపిస్తోంది. ఈనాడులో వార్త వస్తే, కౌంటర్ గా మరుసటి రోజు సాక్షిలో దానికి వివరణ ఇవ్వాలి అనే రూలు పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని అమానవీయ ఘటనలపై కూడా ఈనాడు రాద్ధాంతానికి సాక్షి ఇలాగే వివరణ ఇచ్చుకుంటూ పోయింది. తాజాగా రోడ్లు బాగోలేవంటూ ఈనాడు కథనాలిచ్చింది. దానికి ఈరోజు సాక్షిలో కౌంటర్ ఇచ్చారు. నాడు-నేడు అంటూ ఫొటోలు ఇచ్చారు. అసలు ఈనాడు చూడనివారికి కూడా నిన్న ఆ పేపర్లో ఏం రాశారో చూద్దామన్న ఉత్సుకత కలిగించారు. ఇలా పూర్తిగా ఈనాడు ట్రాప్ లో పడిపోయి, ఆ పేపర్ చదివి, దానికి కౌంటర్లు ఇవ్వడానికే ఓ వింగ్ ని ఏర్పాటు చేసుకున్నట్టుంది సాక్షి.
ఏపీలో రోడ్ల మరమ్మతులు మొదలయ్యాయి. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పనులు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి కూడా. ఈ దశలో ఈనాడు అసలు మరమ్మతులు మొదలు కాని రోడ్లను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందనే కోణంలో కథనం ఇచ్చింది. ప్రజలు నమ్ముతారా లేదా అనేది వేరే విషయం. అనవసరంగా మధ్యలో సాక్షి తలదూర్చింది.
పాత ఫొటోలతో జనాల్ని మభ్యపెట్టాలనేంత దుస్సాహసం ఈనాడు చేయదు. అలా చేస్తే సోషల్ మీడియాలో ఆ పత్రికను చెడుగుడు ఆడుకుంటారు జనం. కాబట్టి అవి తాజా ఫొటోలే. అయితే ఏపీ మొత్తం అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పాలనేది ఈనాడు కుటిల ఆలోచన. దాన్ని తిప్పికొట్టడం మానేసి, రామోజీకి కళ్లు కనపడట్లేదు, ఏపీలో రోడ్లు అద్దాల్లా ఉంటే అబద్ధాలు రాస్తారా అంటూ సాక్షి కౌంటర్ వార్తలతో పేపర్ నింపేసింది.
నెలా, రెండు నెలల క్రితం ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో సాక్షి ఎప్పుడూ ఆ రోడ్ల గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు రోడ్లు బాగు చేసే సరికి నాడు-నేడు అంటూ ఫొటోలు వేస్తోంది. నాడు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి అంటూ జనాలకి మరోసారి సాక్ష్యాలతో సహా చూపెడుతోంది. ఇంతలో ఈనాడు మిగతా రోడ్ల గురించి ప్రస్తావిస్తే మరోసారి సాక్షి ఉలిక్కి పడింది.
రోడ్ల పాపం పూర్తిగా టీడీపీదేనా, మూడేళ్లుగా ఆ పాప ప్రక్షాళణ ఎందుకు సాధ్యం కాలేదు అనేది ప్రజలకు అనవసరం. ఇప్పుడు రోడ్లు బాగున్నాయా లేదా అనేదే వారికి అవసరం. ప్రస్తుతం ఏపీలో దాదాపు 75శాతం రోడ్లు కొత్త రూపు సంతరించుకున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేదు. అనవసరంగా ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా ట్రాప్ లో పడటం కూడా తెలివైన పని అనిపించుకోదు.