అత్యాచారాలు టీడీపీ పనే.. జనం నమ్ముతారా..?

అత్యాచారాలు, అఘాయిత్యాలకు కారణం టీడీపీ వాళ్లేనని, అందుకే ఆ మూడు ఛానెళ్లు వారి వివరాలు చూపించట్లేదని సాక్షాత్తూ సీఎం జగన్ ఆరోపించారు. ఇప్పుడు విజయసాయి కూడా అత్యాచారాలు టీడీపీ పనేనంటున్నారు. దీంతో టోటల్ వైసీపీ…

అత్యాచారాలు, అఘాయిత్యాలకు కారణం టీడీపీ వాళ్లేనని, అందుకే ఆ మూడు ఛానెళ్లు వారి వివరాలు చూపించట్లేదని సాక్షాత్తూ సీఎం జగన్ ఆరోపించారు. ఇప్పుడు విజయసాయి కూడా అత్యాచారాలు టీడీపీ పనేనంటున్నారు. దీంతో టోటల్ వైసీపీ అంతా ఇదే ఆరోపణ ఎత్తుకుంది. సింపుల్ గా టీడీపీపై నెపాన్ని నెట్టేసింది. మరి దీన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు. సత్వర విచారణతో నేరాలు జరగకుండా చూస్తామనే భరోసా ప్రజలకు ఇవ్వాలే కానీ, అత్యాచారాలను కూడా టీడీపీ ఖాతాలో వేయాలనుకోవడం సెల్ఫ్ గోల్ కాదా..?

ఏపీలో వరుస అత్యాచారాలు జరిగాయనే మాట వాస్తవం. విజయవాడ ఘటనలో పోలీసులు వెంటనే రియాక్ట్ అయినా అఘాయిత్యాన్ని ఆపలేరనే విషయం తేలిపోయింది. తీరా ఇప్పుడు లేటుగా రియాక్ట్ అయ్యారనే అపప్రద మూటగట్టుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన హత్య గ్యాంగ్ రేపా కాదా అనే విషయం పక్కనపెడితే.. అక్కడ అక్రమ సంబంధం అనే కీలక వ్యవహారం ఉంది. దానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరూ ఏమీ చేయలేరు.

ఇక చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే అపగలదు అని ఎవరైనా చెప్పారంటే అది పెద్ద జోక్ అనుకోవాల్సిందే. అయితే ప్రభుత్వాలు ప్రజలకు భరోసా కల్పించాలి. తామున్నామనే ధైర్యం ఇవ్వగలగాలి. సత్వర ఆర్థిక సాయంతో పాటు, సత్వర న్యాయ సాయం కూడా అందాలి. కానీ భారత్ లో న్యాయ నిర్ణయాలు ఎంత త్వరగా అమలవుతాయో అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుబట్టలేరు కానీ, ప్రతిపక్షాలకు బురదజల్లడం అత్యవసరం. రాష్ట్రంలో మిగతా సమస్యలేవీ లేనప్పుడు.. అత్యాచారాలు జరగకుండా ఆపడం ప్రభుత్వానికి చేతకాదు అని నిందవేయడం వాటికి నిత్యవసరం. మరి ఇలాంటి అపవాదుల్ని ఎలా తిప్పికొట్టాలి, ఇప్పుడు వైసీపీ చేస్తున్నదేంటి..?

ఏపీలో జరుగుతున్న అత్యాచారాలకు టీడీపీ నేతలు కారణం. ఈ స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు వైసీపీ నేతలు ముందూ వెనకా ఆలోచించారో లేదో కానీ, జనాలకు మాత్రం ఇది నమ్మశక్యంగా లేదు. మత కల్లోలాలకు ఫలానా పార్టీ కారణం అంటే ఈజీగా నమ్మొచ్చు. కానే రేప్ లకు ఫలానా పార్టీ నేతలే కారణం అని ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు, చెప్పరు కూడా. కానీ వైసీపీ ఆ పని చేసింది.

ఇలాంటి ఆరోపణలతో తమమీద వచ్చిన అపవాదులు తొలగకపోగా.. కొత్తగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీడీపీ రాజకీయ లాభం కోసమే ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ వాటిని ఎదుర్కొనే విధానం ఇది కాదు. మరో మార్గాన్ని వైసీపీ అన్వేషించాల్సిందే. ప్రజలకు భరోసా కల్పించాలంటే పోలీస్ నిఘా మరింత పెంచాల్సిందే.