కన్నడ ఇండస్ట్రీ ఇప్పుడు కొంచెం యమ ఖుషీ..!

సినిమాల విషయంలో కన్నడనాడుది చాలా ఇబ్బందికరమైన స్థితి. శాండల్‌ వుడ్‌ అంటూ పేరు పెట్టుకున్నా.. దీని గుభాలింపు మాత్రం తక్కువే! దశాబ్దాల సినీ చరిత్ర ఉన్నా.. కన్నడ చిత్రసీమ మార్కెట్‌ మాత్రం అంతంత మాత్రమే!…

సినిమాల విషయంలో కన్నడనాడుది చాలా ఇబ్బందికరమైన స్థితి. శాండల్‌ వుడ్‌ అంటూ పేరు పెట్టుకున్నా.. దీని గుభాలింపు మాత్రం తక్కువే! దశాబ్దాల సినీ చరిత్ర ఉన్నా.. కన్నడ చిత్రసీమ మార్కెట్‌ మాత్రం అంతంత మాత్రమే! మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరోలు, టాలెంటెడ్‌ దర్శకులు, మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్టులు ఉన్నా.. కన్నడ చిత్రసీమ తన మార్కెట్‌ విస్త్రుతిని పెంచుకోలేకపోతోంది! దీనికి ప్రధానమైన కారణం.. కర్ణాటక భౌగోళిక, సామాజిక పరిస్థితులు! మరి సినీ పరిశ్రమ విస్తృతి కీ భౌగోళిక, సామాజిక పరిస్థితిలకు సంబంధం ఉంటుందా? అంటే ఉంటుందనే చెప్పాలి.

కర్ణాటకలో సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల భాషల ప్రభావం ఆ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రాయలసీమలోని మూడు జిల్లాలు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు. సరిహద్దుల్లోని ఈ జిల్లాలపై కర్ణాటక ప్రభావం ఎలా ఉన్నా.. ఈ జిల్లాల ప్రభావం కర్ణాటక మీద చాలా ఎక్కువ!  బెంగళూరులో ఏ మూలకు వెళ్లినా కొత్తగా కర్ణాటకకు వెళ్లిన వాళ్లో.. దశాబ్దాల కిందట అక్కడకు వెళ్లి సెటిలైన వాళ్లో.. అక్కడే వ్యవసాయం చేసుకొంటూ బతికి ఇప్పుడు మెట్రో నగరంలో భూ స్వాములుగా ఉన్న వాళ్లో కనిపిస్తారు. అధికారిక భాష కన్నడే అయినా.. తెలుగుది అనధికార డామినేషన్‌. 

మరోవైపు తమిళులు.. బెంగళూరుకు కూతవేటు దూరంలో తమిళనాడు సరిహద్దు ఉంది. భాషాభిమానం మెండుగా ఉండే తమిళులూ బెంగళూరును ఓన్‌ చేసుకున్నారు. ఇలా తెలుగు వాళ్లు, తమిళులు కలిసి.. స్థానికులకు తమ తమ భాషలు నేర్పించేశారు! తమ సినిమా రుచులను కూడా చూపించేశారు.ఇదంతా దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రస్థానం. ఇంకేముంది.. కన్నడ చిత్ర పరిశ్రమకు పురిటి దగ్గరే కష్టాలు మొదలయ్యాయి. తెలుగు, తమిళులు ఎక్కువగా నివసించడం చేత.. ఇక్కడ ఈ భాషల సినిమాలదే 'ఆట'! అచ్చమైన కన్నడీగులు కూడా క్రమంగా తెలుగు, తమిళ సినిమాల మత్తుకు అలవాటు పడిపోయారు. 

ఈ క్రమంలో కన్నడ సినిమా నిరాదరణకు గురైంది. కేవలం తెలుగు, తమిళాల ప్రభావమే కాదు.. ఒకవైపు మహారాష్ట్ర ప్రభావమూ ఉంది. మరాఠా గడ్డతో రాజధానిని పంచుకునే ప్రాంతాల్లో హిందీ భాష ప్రభావం ఉంది. దీంతో వాళ్లకు బాలీవుడ్‌తో అనుబంధం ఏర్పడింది. ఇంతే కాదు.. కర్ణాటకలో ఇంకో భాష రాజ్యం ఉంది. తుళూ.. కొన్ని ప్రాంతాల్లో రాజ్యం ఏలుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు తుళూ వారే. కొన్ని జిల్లాల పరిధిలో ఈ భాషే అధికారికం. అసలే చిన్న రాష్ట్రం.. ఆపై ఇన్ని భాషల ప్రభావంతో.. కన్నడ భాష ఉనికి ఏమీ అంతగా ముప్పు రాలేదు కానీ, సినీ పరిశ్రమ మాత్రం చిత్తైపోయింది. 

ఈ పరిస్థితిల్లో మార్పు తీసుకురావడానికి చాలా సంవత్సరాల కిందటే.. కన్నడలోకి అనువాదాల నిషేధింపు మొదలైంది. భారీ బడ్జెట్‌తో రూపొందే తెలుగు, తమిళ భాషల సినిమాలను కన్నడలోనికి అనువాదం చేసి కాసులు దండుకొంటుండటంతో.. కన్నడ చిత్ర పరిశ్రమ పెద్దలంతా కలిసి డబ్బింగులపై నిషేధం పెట్టారు. కేవలం సినిమాల మీదే కాకుండా.. సీరియల్స్‌ అనువాదాన్ని కూడా నిషేధించారు. అయితే ఇలాంటివి చేస్తే ఏదో అధ్బుతాలు  జరుగుతాయని వాళ్లు ఆశిస్తే.. విజయానికి ఒక షార్ట్‌ కట్‌ కనుకొన్నారు కన్నడ క్రియేటర్లు! ఎలాగూ డబ్బింగులు నిషేధం కాబట్టి.. రీమేక్‌లు మొదలుపెట్టారు! 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్టైన ప్రతి సినిమానూ రీమేక్‌ చేయడం మొదలుపెట్టారు. దీని వల్ల కన్నడ కళాకారులకు పని దొరుకుతుందేమో కానీ.. కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి అయితే పెరగదు కదా! ఇవ్వాళ కూడా వస్తున్న వంద సినిమాల్లో 50 సినిమాలకు పైగా రీమేక్‌ లే ఉంటాయి. మిగిలిన వాటి నాణ్యత, నవ్యత అంతంత మాత్రమే! ఆదరణ లేకపోవడమో.. అధ్బుతాలు చేయలేకపోవడమో.. శాండల్‌ వుడ్‌ స్థాయి అయితే పెరగలేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం అక్కడ నుంచి మెరుపులు మెరుస్తున్నాయి! కన్నడ చిత్ర సీమలో వస్తున్న కొన్ని సినిమాలు యావత్‌ దేశం అటెన్షన్‌నూ పొందుతున్నాయి. 

ఎంతగా అంటే.. రీమేక్‌లకు అలవాటు పడిపోయి, అందులోనే కొట్టుమిట్టాడుతున్న కన్నడ ఇండస్ట్రీలోని సినిమాలు కూడా రీమేక్‌ అయ్యేంతలా! గత రెండు దశాబ్దాల గమనాన్ని గమనిస్తే… దర్శకుడు కమ్‌ హీరో రవిచంద్రన్‌ ఒకటీ రెండు అధ్బుతాలులు చేశాడు. తమ సినిమాను సరిహద్దు దాటించేయత్నం చేశాడు. నాగార్జున హీరోగా వచ్చిన 'శాంతి క్రాంతి'కి రవిచంద్రనే దర్శకుడు. అయితే ఈ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఉపేంద్ర వంతు. 'ఓం'తో సంచలనం సృష్టించిన ఉప్పీ.. దాని తెలుగువెర్షన్‌కు దర్శకత్వం వహించాడు. ఒక కన్నడ సినిమా రీమేక్‌ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఉప్పీకి తెలుగునాట ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. 

ఉపేంద్రను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెచ్చుకుని గౌరవించింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఉప్పీ స్థాయిలో అవతల భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ క్రియేటర్‌ మరెవరూ లేరనే చెప్పాలి. అయితే కొన్ని కన్నడ సినిమాలు మాత్రం అడపాదడపా రీమేక్‌ అవుతూ వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి జోగి.. దీన్ని తెలుగులో 'యోగి' అంటూ ప్రభాస్‌తో తీశారు. అన్నాతంగి.. రాజశేఖర్‌ హీరోగా గోరింటాకు పేరుతో రీమేక్‌ అయ్యింది. ముంగారు మలె.. ఈ సినిమాను 'వాన' పేరుతో రీమేక్‌ చేశారు. తాజ్‌ మహల్‌.. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ మధ్యనే చార్మినార్‌ సినిమాను ''కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'' అంటూ తీశారు. అయితే కన్నడ రీమేక్‌ లేవీ అంతగా సత్తా చాటలేదు. 

'ఓం'కు రీమేక్‌గా వచ్చిన ఓంకారం దగ్గర నుంచి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' వరకూ ఏదీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. గోరింటాకు ఒకటీ దీనికి మినహాయింపులా ఉంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మరిన్ని కన్నడ సినిమాలు పరాయి భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. ఈ సందర్భాన్ని కన్నడ చిత్ర పరిశ్రమ సెలబ్రేట్‌ చేసుకుంటోంది! సమంత దగ్గరుండి.. యూటర్న్‌ అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేయిస్తోంది. అలాగే 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి' అనే సినిమా ఇప్పటికే తమిళంలో రీమేక్‌ అయ్యింది తెలుగులో త్వరలోనే రీమేక్‌ కాబోతోంది. 

అలాగే 'గోధి బన్నా సధార్నా మ్యాకట్టూ' అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్టుగా ప్రకాష్‌ రాజ్‌ ప్రకటించాడు. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ను హిందీలో కూడా కొనుకున్నారట. కర్వా, ఉలిదావరు కండట్టే, లూసియా.. వంటి సినిమాలు కూడా తెలుగు, తమిళాల్లో రీమేక్‌ అవుతున్నాయి! మరి తెలుగు, తమిళాల్లో ఏ సినిమాలు వస్తాయా.. వాటిని రీమేక్‌ చేసుకుందామా.. అని ఎదురుచూసే పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాలు వరసగా ఇలా రీమేక్‌ అవుతుండే సరికి ఆ ఇండస్ట్రీ యమ ఖుషీగా ఉంది.

మరి ఈ సినిమాలు గనుక ఇతర భాషల్లో హిట్టు అయితే.. కన్నడ చిత్ర పరిశ్రమకు కొత్త ఊపు వస్తుంది. కొత్తగా ఏం చేయలేక.. రీమేక్‌ల మీదే పడ్డ కన్నడ స్టార్‌ హీరోల దృక్పథంలో కూడా ఈ సినిమాలు మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంది. విజయానికి షార్ట్‌ కట్‌ రీమేక్‌ కాదు.. కొత్తగా ఆలోచించడమే అనే సందేశాన్ని శాండల్‌ వుడ్‌కు ఇవ్వగలవు ఈ సినిమాలు. మరి ఈ సబ్జెక్టులు ఇతర భాషల్లో ఏ మేరకు సత్తా చాటతాయో చూడాలి.