ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకుంది. ఇవాళ వినుకొండలో వైసీపీ, టీడీపీ మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదంతా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమక్షంలోనే జరగడం గమనార్హం.
గత సార్వత్రిక ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరపున బ్రహ్మనాయుడు గెలుపొందారు. అప్పటి నుంచి ఆయనపై టీడీపీ ఇన్చార్జ్ జీవీ ఆంజనేయులు నిత్యం ఏదో ఒక ఆరోపణ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో బ్రహ్మనాయుడిపై ఆరోపణల్ని పెంచారు. ఈ నేపథ్యంలో బ్రహ్మనాయుడు అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారని జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేసిన ఆంజనేయులుపై కేసు నమోదైంది.
కేసు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు వినుకొండలో ర్యాలీ చేపట్టాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ర్యాలీ రాగానే, ఎదురుగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి వాహనం వచ్చింది. ఎమ్మెల్యే వాహనంపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మట్టి తవ్వకాలపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే వాహనం దిగి మరీ సవాల్ విసిరారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఇలా పరస్పరం ఎదురెదురు పడి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం…. ఇరుపార్టీలు పరస్పరం దాడికి తెగబడ్డాయి. ఘర్షణలో ఇరుపార్టీలకు చెందిన 10 మంది గాయాలపాలయ్యారు. ఇరుపార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున గుడి కూడి ఘర్షణకు దిగడంతో సర్ది చెప్పడం పోలీసులకు సాధ్యపడలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరుపార్టీల కార్యకర్తలు, నాయకులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. వినుకొండలో ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు. ఈ ఘటనకు బాధ్యులు మీరంటే మీరని ఇరుపార్టీలు విమర్శించుకోవడం గమనార్హం.