జగన్‌కు గుదిబండగా సలహాదారులు!

రాయలసీమ నీటి పారుదల రంగంపై విపక్షనేత చంద్రబాబు నిర్వ‌హించిన మీడియా సమావేశం విస్తృత చ‌ర్చ‌కు తెర‌లేపింది. ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారులపై వెచ్చించే ఖర్చును తగ్గించుకుంటే రాయలసీమలో ఒక ప్రాజెక్టును…

రాయలసీమ నీటి పారుదల రంగంపై విపక్షనేత చంద్రబాబు నిర్వ‌హించిన మీడియా సమావేశం విస్తృత చ‌ర్చ‌కు తెర‌లేపింది. ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారులపై వెచ్చించే ఖర్చును తగ్గించుకుంటే రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు అని బాబు అన్నారు. అంటే జగన్ జమానాలో అంత మంది సలహాదారులు ఉన్నారని చెప్ప‌డం బాబు వ్యూహం. 

పోనీ వ్రతం చెడ్డా ఫ‌లితం ఏమైనా ఉందా? అంటే అదీ లేదు. ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాజుల కాలంలో భజన పరులు “రాజు గారు మీ నవ్వు అద్భుతం అంటే మురిసిపోయిన రాజు తన మెడలోని హారం బహుమానంగా ఇచ్చినట్లు జగనన్నా మీరు మీ నవ్వు మహా అద్భుతం మీరు తప్ప మరెవ్వరూ అలా నవ్వలేరు అనగానే మురిసిపోయి సలహాదారు పదవులను బహుమానంగా ఇస్తున్నారు” అని వెటకారంగా అన్నా ప్రజలు నిజ‌మే అనుకుంటున్నారు.

సాగునీటి పారుదలపై స్పందించని సలహాదారులు

కీలకమైన ప్రజా సంబంధాల వ్యవ‌హారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మినహా పెద్ద సంఖ్యలో ఉన్న సలహాదారులు ఎవరూ స్పందించరు. నిన్న విపక్ష నేత చంద్రబాబు రాయలసీమ నీటి పారుదల స్థితిగతులపై తన పాలనను జగన్ పాలనతో పోల్చుతూ వివ‌రించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడ్డ‌మే ఓ విడ్డూరం. కానీ సాహసం చేశారు. 

విచిత్రంగా అధికార పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. నీటి పారుదల శాఖలో నెలకు లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకుంటున్న దాదాపు నలుగురు సలహాదారులు ఏమయ్యారు? అయినా బాగా నవ్వారు జగనన్నా అంటే పదవులు ఇస్తే వారు నవ్వు గురించి చెప్పగలరు గాని నీటి పారుదల గురించి ఎలా చెబుతార‌ని వైసీపీ నేత‌లే ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి.

తెలంగాణ నుంచి జగన్ నేర్చుకోవాలి

నీటి పారుదల సమస్యలు, తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలు ఏర్పడినప్పుడు తెలంగాణ నుంచి అక్కడి రాజకీయ నాయకులు స్పందించరు. సామాజిక స్పృహ కలిగిన నీటి పారుదల నిపుణులు స్పందిస్తారు. అక్కడి సలహాదారులు కేవలం గతంలో పని చేసిన అధికారులు, తమకు భజన చేసే వారిని ఎంపిక చేయలేదు. తెలంగాణ ఆర్తి, సామాజిక నేపథ్యం కలిగిన నిపుణులను నియమించారు. అలాంటి వారు మాట్లాడితే సమాజం కూడా అర్ధం చేసుకుంటుంది. 

కానీ ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి. అందుకే చంద్రబాబు మునుపెన్నడూ నీటి పారుదల శాఖ గురించి మాట్లాడే సాహసం చేయలేకపోయారు నేడు సీఎం యంత్రాంగంపై ఉన్న నమ్మకంతో జగన్‌ను రాయలసీమ ద్రోహి అని తిట్ట గ‌లిగారు.  

గతంలో నీటి సమస్య గురించి ఎవరు మాట్లాడినా అది రాయలసీమకు లాభమా?నష్టమా? అన్న కోణంలో విశ్రాంత నిపుణులు సుబ్బరాయుడు, రాయలసీమ ఉద్యమ నేతలు బొజ్జా దశరథ రామిరెడ్డి, మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, రాయ‌ల‌సీమ నీటి అధ్య‌య‌నం వేదిక, ఇతర ప్రజా సంఘాల నేతలు విశ్లేషించేవారు. వీరి విశ్లేషణ అధికార పార్టీకి పరోక్షంగా ఉపయోగపడేది. అత్యంత కీలకమైన చంద్రబాబు మీడియా సమావేశంలో రాయలసీమ నీటి సరఫరా, సమస్య పరిష్కారం గురించి చేసిన ప్రతిపాదనలపై సీమ ఉద్యమ నేతలు స్పందించలేదు.

అంటే చంద్రబాబు చెప్పిన మాటలు నిజమా? అంటే కానే కాదు. వాస్తవానికి నిన్న చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, వివరాలలో అనేక అభ్యంతరాలు ఉన్నాయి. అయినా ఎందుకు స్పందించలేదు అంటే నిన్న చంద్రబాబు మీడియా సమావేశం ఉద్దేశం రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం కాదు. 

జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం మాత్రమే. అలాంటప్పుడు రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదంలో తాము ఎందుకు జోక్యం చేసుకోవాలి? అయినా రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలక చర్యలు జగన్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశించామ‌ని, అలాంటివి జరగడం లేద‌ని, ఈ సమయంలో ఎందుకు స్పందిస్తామని “గ్రేట్ ఆంధ్ర” ప్ర‌తినిధితో ఒక రాయలసీమ ఉద్యమ నేత అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ప్రభుత్వం ఒక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కేవలం 5 సంవత్సరాలు పనిచేసిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై నీటి పారుదల విషయంలో మాట్లాడే సాహసం చేయలేదు. అదే విభజిత రాష్ట్రంలో తనను రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఎందుకు అనగలిగారు. 

పోనీ చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పినవి నిజాలా? అసత్యాలు, వక్రీకరణలు. అవి ఎంతగా అంటే పోతిరెడ్డిపాడు విస్తరణ వైఎస్ చేపడితే అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం చేసింది. ఇప్పుడు ఏకంగా తానే పోతిరెడ్డిపాడు విస్తరణ చేశానని చెప్పుకున్నారు. నీటి పారుదల శాఖ తీరు తెన్నులపై జగన్ సమీక్ష చేసుకోవాలి. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి తన నుంచి రాయలసీమ ప్రజలు ఆశించిన వైపు అడుగులు వేయాలి. లేకపోతే తనకు ఆయువు పట్టు లాంటి సీమలోనే పట్టు సడలే పరిస్థితులు ఉత్పన్నం కాక తప్ప‌దు.

పీ.ఝాన్సీ