ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచింది. అధికార పక్షం వైసీపీపై ప్రజా వ్యతిరేకతను పెంచి, తద్వారా ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని అనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ఇదే పని చేస్తోంది. అయితే టీడీపీ వ్యూహాల్ని తిప్పి కొట్టడంలో వైసీపీ అట్టర్ ప్లాప్ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సీఎం వైఎస్ జగన్‌ను రాయలసీమ ద్రోహిగా ప్రజల ముందు నిలబెట్టేందుకు చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టులను భుజాన వేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అపరభగీరథుడిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. సీమ సమాజం కలగా భావిస్తూ వచ్చినా కృష్ణా నీటిని కరవు ప్రాంతానికి తరలించడంలో వైఎస్సార్ పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదే సందర్భంలో ఆయన తనయుడిగా వైఎస్ జగన్ మరింతగా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారని రాయలసీమ ప్రజలు భావించారు. అబ్బే…అంతంత మాత్రంగానే పనులు జరిగాయి.
సీమకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, వైఎస్ జగన్‌కు పెద్ద తేడా లేదనే అభిప్రాయం జనాల్లో వుంది. వైసీపీకి రాయలసీమ కంచుకోట. గత ఎన్నికల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 49 వైసీపీకి దక్కాయి. ఆ ప్రాంతానికి వైఎస్ జగన్ ఎంతో చేయాల్సి వుంది. ప్రధానంగా రాయలసీమ బీడు భూముల్ని తడిపే సాగునీళ్లు కావాలి. వాటిని అందిస్తాడని, తమ కలలు నెరవేరుస్తాడని జగన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, అవన్నీ కల్లలయ్యాయి. కొద్దోగొప్పో జగన్ చేశాడే తప్ప, వైఎస్సార్‌ను మరిపించేలా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించలేదన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
ఇదే అవకాశంగా తీసుకున్న చంద్రబాబునాయుడు 70 ఏళ్లకు పైబడిన వయసులో సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు తమ హయాంలో చేసిన ఖర్చు, అలాగే జగన్ ప్రభుత్వం గత నాలుగేళ్ల ఏం చేసిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బాబు చెప్పిన వాటిలో కొన్నింటికి సంబంధించి అబద్ధాలున్నాయని సాగునీటి నిపుణులు పేర్కొన్నారు. అయితే వాస్తవాలేంటో ఎఫెక్టీవ్‌గా చెప్పగలిగే నాయకులు వైసీపీలో కొరవడ్డారు. దీంతో చంద్రబాబు చెప్పిందే నిజమని నమ్మే పరిస్థితి.
ఇక వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి రాజకీయంగా వైసీపీని బద్నాం చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఏకంగా వివేకా హత్య కేసు, సీబీఐ విచారణ, వైసీపీ వక్రభాష్యం అంటూ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌నే రూపొందించింది. వివేకానందరెడ్డికి న్యాయం.ఇన్ పేరుతో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అధికార పార్టీ తీరుపై ప్రజానీకాన్ని చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం విద్యావంతులు, మేధావులు, తటస్థులను తప్పకుండా ఆలోచింపజేస్తోంది.
ఇదే ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు, ఆయన మరణానికి మానసిక వేధింపుల గురించి వెబ్సైట్ క్రియేట్ చేయాలని వైసీపీ ఎప్పుడూ ఆలోచించలేదు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ దారుణంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాటు వ్యాఖ్యలను జనంలోకి తీసుకెళ్లాలనే కనీస ప్రయత్నం ఇంత వరకూ వైసీపీ చేయలేదు. చంద్రబాబుపై సహజంగా జనంలో వ్యతిరేకత వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడిందే తప్ప, ఇందులో ఆ పార్టీ చేసిన కృషి ఏమీ లేదని చెప్పక తప్పదు. ఎన్నికల ముంగిట ప్రచారంలో ప్రస్తుతానికి టీడీపీ పైచేయి సాధిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకనో వైసీపీ నిస్తేజంగా, నిరుత్సాహంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ ధోరణి ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక మిగిలిన నాయకుల గురించి ఆలోచించడం వృథా. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు తన తండ్రి వైఎస్సార్, అలాగే తన పాలనలో ఏం జరిగిందో చెప్పగలిగే ధైర్యం జగన్‌కు లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవైపు తన ప్రధాన ప్రత్యర్థి వయసు పైబడుతున్నా, చురుగ్గా వ్యవహరిస్తుంటే… సీఎం జగన్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బహిరంగ సభల్లో చంద్రబాబును ఉద్దేశించి ముసలాయన అంటూ జగన్ వెటకరిస్తుంటారు.
ఆ ముసలాయనే తనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఇతరత్రా వేదికల ద్వారా విమర్శలు గుప్పించడాన్ని జగన్ గమనంలోకి తీసుకోవాలి. యువకుడైన తాను ఏం చేస్తున్నారో జగన్ పునరాలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.