నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్చార్జ్గా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఇంత వరకూ బాగానే వుంది. మరి కోటంరెడ్డితో పాటు మిగిలిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరెందుకు వాళ్లను తమ పార్టీ ఇన్‌చార్జ్‌లుగా టీడీపీ నియమించలేదనే చర్చకు తెరలేచింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధకు ఓట్లు వేశారనే కారణంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి, నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలతో పాటు గుంటూరు జిల్లా తాడేపల్లి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో అన్నీ మాట్లాడుకునే ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారన్నది బహిరంగ రహస్యమే. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని మాత్రమే నెల్లూరు రూరల్ ఇన్చార్జ్గా టీడీపీ నియమించింది. ఉదయగిరి, వెంకటగిరి, తాడికొండ టీడీపీ ఇన్‌చార్జ్‌లుగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలను నియమించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాలో టీడీపీ తర్జనభర్జన పడుతున్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై క్లారిటీ వస్తే ఆయన్ను ఏదో ఒక నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఉదయగిరి, తాడికొండ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు లేవని ఆ పార్టీ నాయకులు తెగేసి చెబుతున్నారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంతోనే వైసీపీ ఆయన్ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న విషయాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది. అలాంటప్పుడు ఆయన్ను తామెందుకు భరిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.
తాడికొండలో కూడా శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత వుంది. అందుకే ఆమెను వైసీపీ ఎంతో ముందుగానే పక్కన పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో తన సీటుపై స్పష్టత ఇస్తే, వైసీపీకి ఓటు వేస్తాననే డిమాండ్‌ను సీఎం జగన్ ముందు శ్రీదేవి పెట్టినట్టు ప్రచారం జరిగింది.
అయితే శ్రీదేవి డిమాండ్‌కు జగన్ తలొగ్గకపోవడం వల్లే ఆమె టీడీపీకి టచ్‌లోకి వెళ్లిందనేది వాస్తవం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవిని టీడీపీ వాడుకుంది. అంతే తప్ప, ఆమెకు టికెట్ ఇచ్చే ఉద్దేశం టీడీపీకి ఎంత మాత్రం లేదు. తాడికొండలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ టీడీపీకి బలమైన అభ్యర్థి ఉన్నారు. ఆయన్ను కాదని శ్రీదేవికి టికెట్ ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. టీడీపీ రాజకీయాల్లో మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కరివేప ఆకులని చెప్పొచ్చు.