జనసేనాని పవన్‌కల్యాణ్‌కు మాటలెక్కువ, పని తక్కువ. తానెంతో సింఫుల్ అని చెప్పుకుంటారే తప్ప, మాటల్లో మాత్రం ఎంతో గొప్ప అని చాటుకునేందుకు యత్నిస్తుంటారు. పవన్‌కల్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పొలిటికల్ కామెంట్స్‌పై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
తాను టాలీవుడ్ హీరో కావడానికి వదినమ్మే కారణమని ఆయన అన్నారు. ఆమె తన జీవితాన్ని చెడగొట్టిందని సరదా కామెంట్స్ చేశారు.
‘ఇది నేను కోరుకున్న జీవితం కాదు. నేను చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను. నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. సినిమా అంటే నాకు ఇష్టం, సమాజం అంటే బాధ్యత’ అని పవన్ అన్నారు.
సినిమాల్లో హీరోగా రాణించావని, మరి రాజకీయాల్లో ఏం సాధించావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం అంటే పార్టీ పెట్టి పదేళ్లు అవుతోందని వార్షికోత్సవాలు నిర్వహించడం కాదని, కనీసం చట్టసభల్లో అడుగు పెట్టలేని దుస్థితికి తన రాజకీయ పంథానే కారణమని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
రాజకీయ తెరపై విలన్ పాత్ర పోషిస్తున్నాడని, చంద్రబాబు పల్లకీ మోసే నాయకుడిగా ప్రజానీకం గుర్తిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా పవన్ రాజకీయాల్లో ఉన్నాడనే మాట తప్ప, ఆయన ఏం సాధించారనే నిలదీతలు ఎదురవుతున్నాయి. గత పదేళ్లలో ఏం పొడిచావు బ్రో అని ఆయన సినిమా భాషలోనే ప్రశ్నిస్తున్నారు.