ఆమెకు బాబు నుంచి ఆహ్వానం లేదు!

నంద్యాల‌లో కూడా తానే చ‌క్రం తిప్పుతాన‌ని గ‌త కొన్ని నెల‌లుగా చెబుతున్న మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియకు కీల‌క స‌మావేశానికి చంద్ర‌బాబు నుంచి ఆహ్వానం అంద‌లేదు. దీంతో నంద్యాల‌తో అఖిల‌ప్రియ‌కు ఎలాంటి సంబంధం లేద‌నే…

నంద్యాల‌లో కూడా తానే చ‌క్రం తిప్పుతాన‌ని గ‌త కొన్ని నెల‌లుగా చెబుతున్న మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియకు కీల‌క స‌మావేశానికి చంద్ర‌బాబు నుంచి ఆహ్వానం అంద‌లేదు. దీంతో నంద్యాల‌తో అఖిల‌ప్రియ‌కు ఎలాంటి సంబంధం లేద‌నే సంకేతాల్ని చంద్ర‌బాబు స్ప‌ష్టంగా ఇచ్చిన‌ట్టైంది. ఇవాళ మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నంద్యాల జిల్లాలోని నంద్యాల‌, డోన్‌, ఆదోని నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు, నేత‌ల‌తో చంద్ర‌బాబు స‌మీక్ష స‌మావేశం త‌ల‌పెట్టారు.

నంద్యాల టీడీపీలో గ్రూపు రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు సీరియ‌స్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. నంద్యాల‌లో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌, ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, మ‌రో నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు. వీరు కాద‌ని భూమా అఖిల‌ప్రియ సొంత కుంప‌టి పెట్టుకున్నారు. ఇటీవ‌ల భూమా బ్రహ్మానంద‌రెడ్డితో సంబంధం లేకుండా లాయ‌ర్‌ను లోకేశ్ స‌మ‌క్షంలో అఖిల‌ప్రియ టీడీపీలో చేర్చించడం వివాదాస్ప‌దంగా మారింది.

నంద్యాల‌లో అఖిల‌ప్రియ ప్ర‌త్యేకంగా కార్యాల‌యాన్ని కూడా తెరిచి సొంతంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. అఖిల‌ప్రియ‌కు ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి తోడ‌య్యారు. ఇద్ద‌రూ నంద్యాల‌లో తిరుగుతూ ఫ‌రూక్‌, బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఏవీ ల‌కు వ్య‌తిరేకంగా ఒక గ్రూప్‌ను త‌యారు చేసుకున్నారు. బ్ర‌హ్మానంద‌రెడ్డికి గ‌తంలో తానే నంద్యాల టికెట్ ఇచ్చాన‌ని, ఈ ద‌ఫా త‌న త‌మ్ముడిని నంద్యాల‌లో నిలుపుతాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

నిజానికి అఖిల‌ప్రియ ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్‌. ఆళ్ల‌గ‌డ్డ‌లో రాజ‌కీయంగా ఆమెకు ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. భూమా కుటుంబం నుంచే కిషోర్‌రెడ్డి రాజ‌కీయంగా ఎదుగుతున్నారు. అఖిల‌కు అత‌ని నుంచి రాజ‌కీయంగా ప్ర‌మాదం పొంచి వుంది. సొంత నియోజ‌క‌వ‌ర్గాన్ని చక్క‌దిద్దుకోవ‌డం వ‌దిలేసి, నంద్యాల‌లో ఆమె ఏదో చేయాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల లోకేశ్ పాద‌యాత్ర నంద్యాల‌లో అడుగు పెట్టిన‌ప్పుడు ఏవీ సుబ్బారెడ్డితో గొడ‌వ అంద‌రికీ తెలిసిందే.

నంద్యాల‌కు వ‌చ్చే స‌రికి ఏవీకి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌డం విశేషం. ఇవాళ స‌మీక్ష స‌మావేశానికి అఖిల‌కు ఆహ్వానం అందక‌పోవ‌డం, ఆమె త‌మ్ముడిని అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం ద్వారా నంద్యాల‌లో టీడీపీ బాధ్యులెవ‌రో చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నంద్యాల‌లో త‌న పాత్ర‌పై చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన త‌ర్వాత కూడా… అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు ఆ నియోజ‌క వ‌ర్గంలో జోక్యం చేసుకునేందుకు సాహసిస్తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.