మట్కా అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అదొక జూదం. దాని గురించి తెలిసిన వాళ్లను అడిగితే పేకాట కంటే ప్రమాదకరం అని చెబుతారు. ఇప్పుడీ జూదాన్ని తన సినిమాకు కాన్సెప్ట్ గా తీసుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు మట్కా అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈరోజు ఈ సినిమా లాంఛ్ అయింది. ప్రారంభోత్సానికి ముందే సినిమాకు సంబంధించి చాలా వివరాలు వెల్లడించిన మేకర్స్, ఈరోజు కథకు సంబంధించి కొన్ని ఎలిమెంట్స్ బయటపెట్టాడు.
టైటిల్ ప్రకారం చూసుకుంటే, ఈ సినిమా మట్కా చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమౌతోంది. 1958-82 మధ్య జరిగిన కథతో ఇది రాబోతోంది. అంతేకాదు, ఆ కాలంలో యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇలా 24 ఏళ్ల స్పాన్ ఉన్న కథతో మట్కా రాబోతోంది.
దీనికి విశాఖను బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు దర్శకుడు. టైటిల్ పోస్టర్ లో రూపాయి నాణెంతో పాటు, పాత కరెన్సీ నోట్లు, వింటేజ్ కారు, ఓ పురాతన భవంతి, కొన్ని వార్తాపత్రికల కట్టల్ని చూపించాడు దర్శకుడు.
ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవ్వబోతున్నాడు వరుణ్ తేజ్. 24 ఏళ్ల నిడివి ఉన్న కథ కావడంతో.. స్టోరీకి తగ్గట్టు 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్ అంటున్నాడు దర్శకుడు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. వింటేజ్ లుక్స్ కు ఆమె సరిగ్గా సరిపోతుంది. ఇక మరో కీలక పాత్ర కోసం నోహా ఫతేహిని తీసుకున్నారు. ఆమెతో ఓ ఐటెంసాంగ్ కూడా ప్లాన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.