ఇదో ముతక సామెత లాంటి నానుడి. ఎద్దు ఎక్కడన్నా ఈనుతుందా.? ఎద్దు మగది కదా.! అది దూడని ఎలా ఈనగలదు (జన్మనివ్వగలదు).? అన్న ఆలోచన లేనివారిని ఉద్దేశించి ఈ ప్రస్తావన తీసుకొస్తుంటారు. ఏదన్నా సమస్య తలెత్తితే, పరిష్కారం పక్కన పెట్టి హడావిడి చేసేవాళ్ళకి ఇది సరిగ్గా సరిపోతుంది.
పాలకులు కూడా హడావిడిగాళ్ళే. ముందూ వెనుకా ఆలోచించరు. సమస్యకు పరిష్కారమూ వెతకరు. మొన్నీమధ్యనే హైద్రాబాద్లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పలువురు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదానికి కారణం కొందరు యువకులు పూటుగా మద్యం సేవించి, నిర్లక్ష్యంగా కారు నడపడం. వీరి కారణంగా మరో కారులో ప్రయాణిస్తున్న వారు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా వుంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఈ ఘటన.
మామూలుగా అయితే ప్రమాదానికి కారణం మద్యం సేవించడమే. అలా మద్యం సేవించింది యువకులు గనుక, 21 ఏళ్ళ లోపు వయసున్న యువకులకు మద్యం విక్రయించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టింది. అంతేనా, మద్యం విక్రమించే దుకాణాలు, బార్ల వద్ద సిసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హుకూం జారీ చేసింది. వీటిల్లో 21 ఏళ్ళ లోపు వయసున్నవారికి మద్యం అమ్మరాదన్న నిబంధన పాతదే, కానీ అమలవడంలేదంతే.
ప్రమాదానికి కారణం యువకులు ప్రయాణిస్తున్న కారు కావడంతో, 21 ఏళ్ళ వయసు నిబంధనని తెరపైకి తెచ్చారు బాగానే వుంది.. అదే ప్రమాదానికి కారణం మధ్య వయసున్న వ్యక్తులైతే ఏం చేస్తారు.? అదీ పక్కన పెడదాం, సీసీ కెమెరాలే సర్వరోగ నివారిణి అనుకుంటే ఎలా.? చాలా కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు బాగానే వుంది.. కానీ వాటిల్లో ఎన్ని పనిచేస్తున్నాయి.?
మద్యం విక్రయాలపై జనం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.. కారణం, జరిగిన ప్రమాదం తాలూకు తీవ్రతే. మద్యాన్ని నియంత్రిస్తామన్న మాట మాత్రం ప్రభుత్వం నోట రావడంలేదు. ఇక్కడ మద్య నియంత్రణ లేదా నిషేధమొక్కటే అన్ని అనర్ధాలకీ అసలైన మందు. తాగితే లివర్ చెడిపోతుంది, కానీ అది తాగినోడి ఖర్మ. తాగితే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అది చచ్చినోళ్ళ ఖర్మ. ప్రభుత్వం స్పందించడంలేదని ఎవరన్నా ప్రశ్నిస్తే, ఇదిగో సీసీ కెమెరాలు – 21 ఏళ్ళలోపు వయసున్నవారికి మద్యం విక్రయించొద్దని ఆదేశాలు. 22 ఏళ్ళ కుర్రాడు పది మద్యం బాటిళ్ళు తీసుకెళ్ళి పధ్నాలుగేళ్ళ కుర్రాళ్ళతో కలిసి పండగ చేసుకుంటే అప్పుడేం చేస్తారు.? ఇప్పుడర్థమయ్యిందా ఎద్దు ఈనింది అనగానే దూడని కట్టేయమన్నారన్నట్టే వుంది తెలంగాణ ప్రభుత్వం తీరు కూడా వుందని.!