థియేటర్లు ఘొల్లు మంటుంటే దీక్షలేమిటి?

సరిపడా థియేటర్లు కేటాయించలేదంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే చిన్న సినిమా యూనిట్ నిరహారా దీక్షకు కూర్చుంది. ప్రెస్ నోట్లు మినహా పట్టించుకునేదెవరు? గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ వీటి వల్ల ఒరిగిందేమిటి?…

సరిపడా థియేటర్లు కేటాయించలేదంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే చిన్న సినిమా యూనిట్ నిరహారా దీక్షకు కూర్చుంది. ప్రెస్ నోట్లు మినహా పట్టించుకునేదెవరు? గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. కానీ వీటి వల్ల ఒరిగిందేమిటి? విత్తు ముందా? గుడ్డు ముందా? అన్న సమస్యలాంటిదే ఇదీనూ. థియేటర్లు ఇవ్వడం లేదని వీళ్లు, ఇచ్చిన థియేటర్ల దగ్గర ఈగలు తోలుకోవాల్సివస్తోందని వాళ్లు, ఇది ఎప్పటికీ తెగని పంచాయతీ. 

బ్రహ్మానందంతో మహేష్ బాబు అన్నట్లు మనం కాస్సేపు నిజాలు మాట్లాడేసుకుందాం. అసలు సినిమాను కళగా చూడ్డం మానేసి దశాబ్దాలు దాటిపోతోంది. అడవిరాముడు టైమ్ లో జయప్రద పైట తీసి గాలికి రెపరెప లాడించినపుడే సినిమా అన్నది కాసుల వ్యాపారం అన్నది సెట్ అయిపోయింది. సినిమా అన్నది పేరుకే 24 క్రాప్ట్స్. కానీ కనిపించిన క్రాఫ్ట్స్ ఇంకా చాలా వున్నాయి. వాళ్లూ బతకాలి. థియేటర్ దగ్గర పల్లీలు అమ్మేవాళ్లు, టీ,కాఫీ క్యాంటీన్లు, సైకిల్ స్టాండ్ లు, ఆఖరికి అనకూడదు కానీ బ్లాక్ టికెట్ లు అమ్ముకునేవాళ్ల వరకు అందరూ ఈ క్రాప్ట్స్ లో భాగమే. 

సగటున రెండు నుంచి నాలుగు థియేటర్లు వుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అంటే ప్రతివారం రెండు సినిమాలు విడుదల చేసుకోవచ్చు. వారం దాటి బతికే అవకాశం వున్న సినిమాలకు మిగిలిన రెండు థియేటర్లు అనుకుందాం. కానీ అసలు వారం కూడా బతికే సినిమాలు ఎన్ని? మూడు రోజుల ముచ్చటే అయిపోయింది కదా? కొన్నాళ్లు ఓపిక పడితే ఇక థియేటర్లు రోజువారీ అద్దెలకు వస్తాయేమో? అప్పుడు వీకెండ్ వేసి తీసేసే సినిమాలు వుంటాయి. మిగిలిన రోజులు మరొకరు వేసుకుంటారు.

పెద్ద సినిమాల సీజన్ అయిపోవడం భయం, వారానికి నాలుగు నుంచి ఆరు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో బతికి బట్టకట్టేవి ఎన్ని? ఎందుకు ఆడడం లేదు? చిన్న సినిమాను బతికించండి..బతికించండి అని గగ్గోలు నిజమే. కానీ సత్తా వుంటే, మనం బంగారం మంచిదయితే ఈ గగ్గోలు అవసరమా? క్షణం, బిచ్చగాడు, ఇలాంటి సినిమాలకు ఎవరు థియేటర్లు ఇచ్చారు. తొలి వారం లేకపోవచ్చు..మలి వారం పిలిచి ఇవ్వాల్సిందే కదా? అంటే థియేటర్ ను కావాలని గోల చేయకూడదు..సినిమా కావాలి అని అట్నుంచి డిమాండ్ వచ్చేలా చేయగలగాలి.

అసలు ఛిన్న సినిమా ఎవరు కొంటున్నారు. కొన్నా అడ్వాన్స్ లు ఎన్ని థియేటర్ల నుంచి వస్తాయి? ఎందుకు అడ్వాన్స్ లు రావు? ఆ సినిమా వేస్తే తమ సైకిల్ స్టాండ్ కూడా ఫుల్ కాదని అనుకున్నపుడు ఆ థియేటర్ వాడు ఆ సినిమాకు ఎందుకు అడ్వాన్స్ ఇస్తాడు. సినిమా తీసే వాళ్లు లాభాల కోసం చూసుకోవచ్చు కానీ, థియేటర్ వాడు ఆలోచించకూడదా? థియేటర్ లీజులో వుండొచ్చు..అప్పుడు లీజు దారుడే ఎగ్జిబిటర్ అవుతాడు. తమ థియేటర్ కు ఏ సినిమా లాభమో అది డిసైడ్ చేసుకునే హక్కు అతనికే వుంటుంది.

పది మంది వెళ్లి లక్స్ సబ్బు కావాలంటే, స్టోర్ వాడు చచ్చినట్లు ఆ సబ్బులు దుకాణంలో పెట్టాల్సిందే. ఎవడూ అడగని దాన్ని తెచ్చి డెడ్ స్టాక్ చేసుకోమని వాడిని డిమాండ్ చేసే హక్కు మనకు ఎక్కడిది? ఏ వ్యాపారంలోనైనా రాజకీయాలు, తమ వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే కార్యక్రమాలు సాగుతూనే వుంటాయి.సిమెంట్ సిండికేట్, రైస్ మిల్ సిండికేట్ ఇవన్నీ భయంకరంగా వేళ్లూనుకున్నాయి మన సమాజంలో? మిల్లులు కంట్రోల్ లో పెట్టుకుని, ధాన్యం కొని స్టాక్ పెట్టేసి, కృత్రిమంగా రేట్లు పెంచే కార్యక్రమం, దాన్ని చూడకుండా వదిలేసేందుకు రాజకీయ నాయకులను పోషించే కార్యక్రమం జరుగుతూనే వుంది. 

కానీ మన జనానికి దానిపై దీక్ష చేసే ఆలోచనా లేదు..తీరికా లేదు. ఎంత రేటు అయితే అంతకు అంతా పెట్టి కొనడమే. లేదు అంటే మానేసుకో అంటున్నారు. మాల్స్ మల్టీ ఫ్లెక్స్ వచ్చాక చిన్న దుకాణాలు, చిన్న థియేటర్లు మూతపడుతున్నాయి. నెలకు నాలుగు సినిమాలు చూసేవాళ్లు తప్పనిసరిగా ఈ చిన్న వాటిలోకూడా ఓ సినిమా చూడాలని రూల్ పెట్టగలరా? జనాలక కళ్లకు భారీ సినిమాలు అలవాటైపోయాయి. చిన్న సినిమాలు రాజును చూసిన కళ్లతో అన్నట్లు వుంటున్నాయి. ఎక్కడో మంచి సినిమా వస్తే మాత్రం అక్కున పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ జనాలు ఇంకా రెడీగానే వున్నారు మంచి చిన్న సినిమా వస్తే ఆదరించడానికి. ఆ లెవెల్ సినిమా తీస్తే థియేటర్లు అవే వస్తాయి.

అసలు జనం ముందుకు వెళ్తే కదా మంచి చెడ్డ తెలిసేది..అని వాదించవచ్చు. మన సినిమా అంత సూపర్, తరుము, తోపు అనుకున్నపుడు ఖర్చులో ఖర్చు మరో కొటి ఖర్చుచేసుకుని, పాతిక జిల్లాలకు పాతిక థియేటర్లు స్వంతగా అద్దెకు తీసుకుని వేసుకోవడమే. బాగుండే అప్పుడు అడ్వాన్స్ లు వస్తాయి..థియేటర్లు వస్తాయి..సినిమా అంటే వస్తే కోటి, పోతే కింగ్ కోటి అనే టైపు. అందువల్ల ఆ మాత్రం రిస్క్ తప్పదు. అంతే కానీ, ఆ నలుగురు, థియేటర్ల గుత్తాథిపత్యం, ఇలాంటివి అన్నీ పగిలిపోయే కోటలు కావు. ఇంతకన్నా ఘోరమైన సిండికేట్లు, జనాల జీవితాలతో ఆడేసుకునేవి ఇంకా చాలా వున్నాయి. వాటిపై పెట్టాలి దృష్టి ముదుగా. వాటి ముందు సినిమా చాలా చిన్న విషయం. 

అయినా అనేక ఊళ్లలో అనేకనేక థియేటర్లు సరైన సినిమాలేక, ఏవో చిన్నా చితకా సినిమాలతో సరిపెట్టుకునే రోజులు ఏడాదిలో అనేకం వున్నాయి. అలాంటపుడు ఇలాంటి సినిమాలు విడుదల చేసుకోవడమే.