తన హయాంలో 66 వేల కోట్ల రూ.ల దేశీయ, విదేశీయ పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని జయలలిత చెప్పుకున్నా, నిజానికి కమిషన్ల బెడద భరించలేక కొత్తవాళ్లెవరూ రావటం లేదని యిన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్లు చెప్పసాగారు. ట్యుటికొరిన్‌లో ప్రభుత్వంతో కలిసి టైటానియం స్పాంజి ప్లాంటు పెడదామనుకున్న బొంబాయి కంపెనీ వెనక్కి తగ్గింది. తమిళనాడుకు రావలసిన 'సింగపూర్ కారిడార్' కర్ణాటకకు తరలిపోయింది. బ్రిటిషు వాణిజ్య మంత్రి మద్రాసు పర్యటించాక తమ పెట్టుబడులు యిక్కడ కాక, మహారాష్ట్రలో పెడితే మంచిదనుకున్నాడు. ఏడాదికి 720 మిలియన్ల యూనిట్ల విద్యుత్ లోటు అనేక పరిశ్రమలను నిరుత్సాహ పరుస్తోంది. తక్కిన పరిశ్రమల మాట ఎలా వున్నా బ్రహ్మాండంగా వర్ధిల్లినది కటౌట్ల పరిశ్రమ.
అప్పట్లో సినిమా పరిశ్రమ డల్‌గా వుండి పబ్లిసిటీ ఆర్టిస్టులు జీవనోపాధి కోసం వేరే మార్గాలు వెతుక్కోవాలా అని ఆలోచిస్తూండగా జయలలిత అధికారంలోకి రావడం, రాష్ట్రమంతా నేల యీనినట్లు నింగినంటే 80 అడుగుల కటౌట్లు పెట్టించడం ప్రారంభమైంది. ఒక్కో కటౌట్‌కు 60 నుంచి 75 వేల దాకా ఖర్చయ్యేది. ఒకప్పుడు 60 అడుగులంటే అబ్బో అనుకునేవారు. కానీ యిప్పుడు 80 సర్వసాధారణం అయిపోయింది. దాన్ని ఎనిమిదడుగుల ప్లయివుడ్ ముక్కలు పదిటిని కలిపి తయారుచేస్తారు. తనను చూసి యిక కరుణానిధి నుంచి కాన్షీరామ్ దాకా అందరి బొమ్మలూ వెలవసాగాయి. మద్రాసులో యివి తయారుచేసే పెద్ద సంస్థలు 5 వుండగా, చిన్నవాటికి లెక్కలేదు. సందర్భం అక్కరలేదు, ఓ పెద్ద సభ పెట్టినా చాలు, డజన్లకొద్దీ కటౌట్లు నిలబెడతారు. జయలలితవి అన్నీ పెద్ద కోటు తొడుక్కున్న ఒకే పోజులో వుంటాయి. తర్వాతి కాలంలో యీ కోటు పోజు మారింది.
ఒకసారి మదర్ థెరిసా ప్రభుత్వ అతిథిగా మద్రాసు వచ్చారు. ప్రభుత్వ కారులో ఎయిర్‌పోర్టు నుంచి వస్తూండగా యీ కటౌట్లు ఆవిడ దృష్టిని ఆకర్షించాయి. ''ఏమిటవి?'' అని తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మహిళా అధికారిని అడిగారు. ''మా ముఖ్యమంత్రివి. ఇలాటివి మీరు ఎప్పుడైనా చూశారా?'' అని అడిగిందామె. ''ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. అవునూ, ఒక్కోదానికి ఎంత ఖర్చవుతుంది?'' అని అడిగారు థెరిసా. ''సరిగ్గా తెలియదు, 50, 60 వేలవుతుందేమో. తమ నాయకురాలిపై విశ్వాసం చాటుకోవడానికి కార్యకర్తలు ఎంత ఖర్చుకైనా వెనకాడరు.'' అంది అధికారిణి. థెరిసా నిట్టూర్చారు – ''ఒక్క కటౌట్‌పై పెట్టే ఖర్చుతో ఎంతమంది పేదవాళ్లకు తిండి పెట్టవచ్చో!'' అంటూ. 1995 జనవరి 1 నుంచి 5 వరకు తంజావూరులో జరిగిన 8వ ప్రపంచ తమిళ సమావేశంలో 200 అ||ల జయలలిత కటౌట్ పెట్టారని తెలిస్తే ఆవిడ ఏమనేదో తెలియదు.
తంజావూరులో తమిళం పేర జరిగిన సభ జయలలిత తనకున్న ప్రజాదరణ చాటుకోవడానికి నిర్వహించినదే తప్ప, తమిళ అభివృద్ధికి కాదని విమర్శలు వచ్చాయి. ఆ వూళ్లో నాలుగు పెద్ద రోడ్లు తప్ప మరేమీ లేవు. ఆధునిక సౌకర్యాలు ఏమీ లేవు. అక్కడకు 10 లక్షల మందిని రప్పించింది. 11 వేల మంది పోలీసులతో బందోబస్తు. సభ జరగడానికి 50 వేల మంది పట్టే ఒక స్టేడియం కట్టించి దానికి తన తల్లి పేర 'అన్నై (అమ్మ) సంధ్య స్టేడియం' అని పేరు పెట్టింది. తోలుబొమ్మలాటల దగ్గర్నుంచి సినిమాల దాకా నానారకాల వినోద ప్రదర్శనలతో వచ్చినవారిని అలరింప చేశారు. వచ్చిన ప్రతి కవి, ప్రతి వక్త జయలలితను ఆకాశానికి ఎత్తివేశారు. స్పీకరు ముత్తయ్య అయితే జయలలితను ఆధునిక తమిళానికి మాతగా కీర్తించాడు. మంత్రులు సాష్టాంగపడ్డారు. ఆమె, శశికళ పట్టుచీరలతో, భారీ నగలతో వచ్చినవారికి కనువిందు చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజల హృదయాల్లో తనకున్న స్థానాన్ని ఏమీ చేయలేకపోయాయని నిరూపించుకోవడానికే జయలలిత యీ సభలు తలపెట్టిందని విమర్శలు వచ్చినా ఆమె ఖాతరు చేయలేదు. తన వైభవం చూసి ప్రతిపక్షాలు కుళ్లుకుంటాయని తెలుసు కాబట్టి వారెవ్వరూ రాకుండా చూసుకుంది.
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెసు నేత ఎస్‌ఆర్ బాలసుబ్రమణియన్‌కు ఆహ్వానం లేదు. గవర్నరు చెన్నారెడ్డికి అటెండరు ద్వారా డిసెంబరు 30న ఆహ్వానం వెళ్లింది. ఆయనకు ఒళ్లు మండి రాలేదు. డిఎంకె నాయకుడే కాక, తమిళభాషకు ఎంతో సేవ చేసిన కరుణానిధికి పంపిన ఆహ్వానపత్రంపై ''కరుణానిధి, మాజీ ఎమ్మెల్యే'' అని చిరునామా రాశారు. ఆయనకు మంట పుట్టి దాన్ని తిప్పి పంపుతూ ''జె జయలలిత, మాజీ నటీమణి'' అని చిరునామా రాశాడు. ఇక డిఎంకె, పిఎంకె, సిపిఐ, సిపిఎం ఎవరికీ సరిగ్గా ఆహ్వానాలు వెళ్లలేదు, వాళ్లు రాలేదు. తనను విమర్శించే ''తుగ్లక్'', ''నక్కీరన్'', ''జూనియర్ వికటన్'', ''దినమలర్'' పత్రికల ప్రతినిథులకు సమావేశాలకు రావడానికి పాసులు యివ్వలేదు. జాతీయస్థాయి నాయకులను మాత్రం జయలలిత ఆహ్వానించింది. మొదటిరోజు సభకు రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను పిలిస్తే ఆయన రాలేదు. ఉపరాష్ట్రపతి కెఆర్ నారాయణన్ వచ్చారు. మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్ వచ్చి ''నేను తంజావూరు వాడినే, ఒక సభకు యింతమంది జనం రావడం కనీవిని ఎరగను'' అని ఉపన్యసించడంతో చప్పట్లు కురిశాయి. ఆఖరి రోజు సభకు ప్రధాని పివి నరసింహారావును ఆహ్వానించారు. మీరు రావద్దని స్థానిక కాంగ్రెసు నాయకులు ప్రాధేయపడినా, భవిష్య రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని పివి సభలకు హాజరయ్యారు.
ఖఱ్చు విషయానికి వస్తే సమావేశాలకోసం అంటూ తంజావూరును ముస్తాబు చేయడానికి కోట్లు ఖర్చయ్యాయి. 127 కి.మీ.ల రోడ్డుకై 20 కోట్లు, బస్సు స్టాండు, షెల్టర్ల నిర్మాణానికై 84 లక్షలు, ఈ సమావేశాలకై వచ్చే డెలిగేట్లు బస చేయడానికై కట్టిన యిళ్ల ఖర్చు 20 కోట్లు, వాలంటీర్లు వుండడానికై స్కూళ్లలో, ప్రభుత్వ భవనాల్లో అదనపు రూములు కట్టడానికై 2 కోట్లు, సదస్సు జరిగే యూనివర్శిటీ బిల్డింగుకు మెరుగులు దిద్దడానికి కోటిన్నర, ఆర్ట్ గ్యాలరీకై 86 లక్షలు, సమావేశం జరిగే చోట కట్టిన పబ్లిక్ టాయిలెట్లకై కోటిన్నర, సభల స్మారక చిహ్నంకై 75 లక్షలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఏడు చోట్ల ఆర్చిలు కట్టడానికి 54 లక్షలు, స్వాగతం బ్యానర్లకై 12 లక్షలు ఖర్చయ్యాయి. సమావేశం జరిగే రోజుల్లో రూ.5 ల అన్నం పాకెట్లను రూపాయికే అమ్మారు. ఫుడ్‌స్టాళ్లలో వున్న వాలంటీర్లందరూ ''జె'' అని రాసి వున్న టీషర్టులు వేసుకున్నారు. అదెవరి పేరో వేరే చెప్పనక్కరలేదు. ఖర్చు ప్రజలది, పబ్లిసిటీ జయలలితకు! తక్కిన పథకాలపై ప్రపంచ బ్యాంకు యిచ్చిన ఋణాలను వీటికి మళ్లించడం జరిగింది.
ఇదంతా ఆర్భాటమే తప్ప తమిళ భాష గురించి చేసినదేముంది? అని అడుగుతారని కాబోలు తమిళ యూనివర్శిటీ క్యాంపస్ ప్రాంగణంలో తమిళభాషపై సదస్సు పెట్టారు. దాని నిర్వహణను 'ఇంటర్నేషనల్ అకాడెమీ ఫర్ తమిళ్ రిసెర్చ్ (ఐఏటిఆర్) అనే పారిస్ సంస్థకు అప్పగించారు. వెళ్లినవారు వెళ్లారు. అక్కడ 400 రిసెర్చి పేపర్లు చదవడం జరిగింది. అక్కడ కూడా కాస్త వివాదం వచ్చింది. శ్రీలంక టైగర్ల పట్ల సానుభూతి చూపే విదేశీ తమిళ స్కాలర్లను రానీయలేదు. వారిలో శ్రీలంక యూనివర్శిటీ ప్రొఫెసర్లే కాక జర్మనీ, స్వీడన్ దేశాలకు చెందినవారు కూడా వున్నారు. వాళ్లను దేశానికి రప్పించడం దేనికి, తిప్పి పంపడం దేనికి అని అడిగితే ఐఏటిఆర్ అధ్యక్షుడు జపాన్‌లో తమిళ ప్రొఫెసరు నబోరు కరాషిమా వద్ద జవాబు లేదు. ఎందుకంటే వారిని బహిష్కరించిన సంగతి ఆయనకు చెప్పలేదు. దీనికి తోడు స్వాగతం బ్యానర్లపై ఎన్నో భాషాదోషాలు కనబడ్డాయి. వేదికపై ప్రసంగించినవారిలో చాలామంది వ్యాకరణపరంగా తప్పులు మాట్లాడారు. ఏది ఏమైతేనేం, తమిళం పేర రూ.100 కోట్లు ఖర్చు పెట్టి, తన పాప్యులారిటీ చాటుకుంది జయలలిత. ఇదే సందర్భంలో ఆమె మరొక పాయింటు కూడా గుర్తించింది – తమిళ భాష, తమిళ సంస్కృతి పేర ప్రజలను కూడగట్టడం సాధ్యం కాదని! గతంలో ద్రవిడ రాజకీయాలు బ్రాహ్మణ వ్యతిరేకత, తమిళ దురభిమానం చుట్టూ పరిభ్రమించాయి. వాటికి పస తగ్గిపోయింది. వాటిపై ఎక్కువగా మాట్లాడడం టైము వేస్టు, ఓట్లు రాలవు. అంతకంటె ఉచిత పథకాలతో, ఆర్భాటాలతో ప్రజలను ఆకట్టుకోవడం సులభం అని ఆమె గ్రహించింది. ఈ విషయం కరుణానిధికి చాలా ఆలస్యంగా ఎఱికలోకి వచ్చింది. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)