సర్కారువారి పాట సినిమాకు రేట్లు ఫిక్స్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేటుపై 45 రూపాయలు పెంచుతూ 3 రోజుల కిందటే జీవో రాగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం సర్కారువారి పాట కోసం ప్రత్యేక జీవో విడుదల చేశారు.
తెలంగాణలో ఈ సినిమాకు 50 రూపాయలు పెంచారు. తాజా పెంపుతో హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్సుల్లో సర్కారువారి పాట టికెట్ రేటు 350 రూపాయలకు చేరుకుంది. రీక్లెయినర్ సీటు రేటు 410 రూపాయలకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో 12వ తేదీ నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు అమల్లోకి వస్తుంది. తెలంగాణలో ఈ టికెట్ రేట్ల పెంపునకు వారం రోజుల పాటు అనుమతి ఇచ్చారు. అయితే తెలంగాణలో ఈ వారం రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునే వెసులుబాటును కల్పించారు. నాన్-ఏసీ థియేటర్ల టికెట్ రేట్లలో ఎలాంటి మార్పుల్లేవు.
జీవోలు రావడంతో సర్కారువారి పాటకు అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలోని దాదాపు అన్ని థియేటర్లలో ఉదయం 7 గంటలకే షో ప్రారంభం కానుండగా.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో ఉదయం 6 గంటలకే సర్కారువారి పాట షో పడబోతోంది.
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రయిలర్, సాంగ్స్ హిట్టవ్వడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.