వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ చరమాంకంలో కష్టాలొచ్చాయి. సొంత నియోజక వర్గమైన చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత రాజకీయంగా చంద్రబాబు మకాం మార్చారు. కర్నాటక రాష్ట్ర సరిహద్దుల్లో బాగా వెనుకబడిన నియోజకవర్గమైన కుప్పానికి బాబు వలస వెళ్లారు.
కుప్పం నియోజకవర్గ ప్రజల అమాయకత్వమే రాజకీయ రక్షగా చంద్రబాబు భావించారు. కుప్పం ప్రజలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రాజకీయ సమీకరణలు మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ, అలాగే పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ, ఆ పార్టీ మద్దతుదారులు ఏకపక్షంగా విజయాలు సాధించారు. దీంతో కుప్పంలో తన రాజకీయ పునాదులు కదులుతున్నాయని గ్రహించిన చంద్రబాబు అప్రమత్తం అయ్యారు.
నెలకో, రెండు నెలలకోసారి కుప్పం వెళ్లి ప్రజల యోగక్షేమాలను ఆరా తీయడం పనిగా పెట్టుకున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏనాడూ తమ దగ్గరికి రాని చంద్రబాబు, ఇప్పుడు ఉన్నట్టుండి వస్తుండడంపై కుప్పం ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.
ఇదంతా ఓటమి ఘనతగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధ, గురు, శుక్రవారాల్లో వరుసగా మూడు రోజులు కుప్పంలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. 11వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు.
కర్ణాటక సరిహద్దులోని బెల్లకోకిల గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంతో ఆయన పర్యటన మొదలవుతుంది. 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు పర్యటన ముగించుకుని కుప్పం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరుతారు.