నాతో పాటు మ‌రో 30 మంది చేరిక‌కు రెడీ!

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఏ పార్టీలో చేరాలో ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న రాజ‌కీయ పంథా ప‌రిశీలిస్తే… ఆయ‌నో పెద్ద క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్‌గా క‌నిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు…

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఏ పార్టీలో చేరాలో ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న రాజ‌కీయ పంథా ప‌రిశీలిస్తే… ఆయ‌నో పెద్ద క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్‌గా క‌నిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు వ్య‌తిరేక‌మ‌నే మాట త‌ప్ప‌, మిగిలిన విష‌యాల్లో స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. టీఆర్ఎస్ వ్య‌తిరేక పార్టీల అధినేత‌ల‌తో వ‌రుస భేటీల‌వుతూ వారితో ఆడుకుంటున్నారు.

కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కుటుంబానికి మంచి రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. ప్ర‌ముఖ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు కొండా వెంక‌ట‌రంగారెడ్డి మ‌న‌వ‌డే కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. విశ్వేశ్వ‌ర‌రెడ్డి తాత‌ రంగారెడ్డి పేరు మీదే జిల్లా ఏర్పాటైంది. విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఇంజ‌నీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రుడు. ఈయ‌న పారిశ్రామిక‌వేత్త కూడా. టీఆర్ఎస్ నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. 2014లో చేవెళ్ల  నుంచి టీఆర్ఎస్ త‌ర‌పున ఎంపీగా గెలుపొందారు. కేటీఆర్‌తో విభేదాల కార‌ణంగా టీఆర్ఎస్ నుంచి బ‌య‌టికొచ్చారు.

అనంత‌రం కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. అనంత‌రం కాంగ్రెస్‌కు కూడా దూరంగా ఉంటూ వ‌చ్చారు. కొంత కాలానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మ‌న‌సు నిండా రాజ‌కీయ ఆకాంక్ష‌లున్న‌ప్ప‌టికీ, ఏ పార్టీలో చేరాలో నిర్ణ‌యించుకోలేక‌పోతున్నారు. ఒక రోజు బండి సంజ‌య్‌తో, మరొక‌సారి టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో భేటీ అవుతారు. రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. అప్ప‌ట్లో బీజేపీలో విశ్వేశ్వ‌ర‌రెడ్డి చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది వాయిదా ప‌డింది. తాజాగా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రం తీసుకునే చర్యలను బట్టి బీజేపీలో చేరికపై తన నిర్ణయం ఉంటుందన్నారు. మరో నెల రోజుల పాటు స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్న‌ట్టు విశ్వేశ్వర‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్‌పై బీజేపీ బలంగా పోరాటం చేస్తే తనతో పాటు మరో 30 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.  

టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేసే పార్టీకే తాను మద్దతు ఇస్తానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. విశ్వేశ్వ‌ర‌రెడ్డి మాట‌లు వింటుంటే బీజేపీ వైపు మొగ్గు చూపేలా క‌నిపిస్తున్నారు. మ‌రో ఏడాదిలో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న దృష్ట్యా ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.