సినీనటి, టీవీ కార్యక్రమాల నిర్మాత రాధిక ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’’లో పాల్గొంటూ తన తండ్రి ఎమ్మార్ రాధా తెలుగువాడని, ఆ కారణంగా తమిళ సినీరంగంలో, రాజకీయరంగంలో తనను గేలి చేసేవారని చెప్పింది. ఇది విని చాలా ఆశ్చర్యం కలిగింది. నేను పదేళ్లు మద్రాసులో పనిచేసినప్పుడు రాధిక గురించి ఇలా వినలేదు. అప్పట్లో (85-95) ఆమె చాలా ఫామ్‌లో ఉన్న హీరోయిన్. తమిళ సినిమాల్లో కూడా వేసే జయప్రద, జయసుధ, జయచిత్ర, శ్రీదేవి తెలుగువాళ్లని, రమ్యకృష్ణ తండ్రి తెలుగువాడని అందరూ అనేవారు తప్ప రాధిక తెలుగమ్మాయని ఎవరూ కాజువల్‌గా కూడా అనలేదు. ఆమె, నిరోషా ద్రవిడ ఉద్యమంలో ముఖ్యనాయకుడైన ఎమ్మార్ రాధా కూతుళ్లని, రాధారవి వాళ్లకు సవతి సోదరుడనీ అందరికీ తెలుసు.
రాధిక రాడాన్ సంస్థ స్థాపించి చాలాకాలం విజయవంతంగా నడిపిన తర్వాత, ఒక ఐదారేళ్ల క్రితమనుకుంటా, తన సంస్థ పేరు గురించి వివరిస్తూ అది తన తండ్రి పేరు మీదుగా పెట్టానని, ఆయన పేరు రాధాకృష్ణ నాయుడని అంది. నాయుడంటే తెలుగువాడే కాబట్టి ఎమ్మార్ రాధా తెలుగువాడా అని తెలుసుకుని విస్తుపోయాను. తమిళం కేంద్రంగా నడిచిన ద్రవిడ ఉద్యమ నాయకుల్లో తమిళుల సంఖ్య ఒకటి తగ్గిందే అనుకున్నా. పెరియార్ కన్నడిగ అంటారు, కరుణానిధి తెలుగు, ఎమ్జీయార్ మలయాళీ, అణ్నా మాత్రం తమిళుడు. ఇప్పుడు రాధా కూడా తెలుగా? అనుకున్నాను.
పైగా రాధిక తన తండ్రి కులం పేరు కూడా చెప్పడం వింతగా కనిపించింది. ద్రవిడ నాయకులు హిందూమతానికీ, కులవ్యవస్థకీ వ్యతిరేకంగా భీకరంగా పోరాడారు. డిఎంకె అధికారంలోకి వచ్చాక రోడ్ల పేర్లలో కులసూచకాలు కనబడితే తీసేయించారు. రాధా కూడా తను ఫలానా కులస్తుడని చాటుకున్న దాఖలాలు లేవు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించాడు కాబట్టి అబ్రాహ్మణుడని మాత్రం అర్థమౌతుంది. అంతకుమించి కులం తోక పెట్టుకోలేదు. మరి రాధిక ఎందుకు చెప్పిందో అనుకున్నాను.
గత నెలలో ఇంటర్వ్యూలో మాత్రం రాధిక తన తండ్రి చిత్తూరు, మద్రాసు ఆ ప్రాంతాలకు చెందిన నాయుడని, అది తనకు చాలాకాలం తర్వాత తెలిసిందని, తను తెలుగు సినీరంగంలోకి వచ్చినపుడు తమిళమ్మాయనే అందరూ అనేవారని, తమిళ రంగంలో మాత్రం తెలుగమ్మాయి అని తెలుసుకుని ‘గొల్టి’ అని పిలిచేవారని, తను డిఎంకె తరఫున ప్రచారానికి వెళ్లినపుడు యితర పక్షాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు కూడా ఆ పేరుతో పిలిచేవారని చెప్పుకుంది. గొల్టి అంటే ఏమిటని రాధాకృష్ణ అడిగినదానికి సమాధానంగా ‘స్లాంగ్ అంతే’ అని జవాబిచ్చింది. మనం తమిళులను అరవ్వాళ్లు అంటాం, దానిలో తప్పేమీ లేదు. ఎందుకంటే తెలుగు ప్రాంతాలకు దక్షిణ సరిహద్దుల్లో ఉన్న తమిళప్రాంతం పేరు ‘అరువనాడు’. వాళ్లని అరవలు అని, వాళ్ల భాషని అరవం అని అనడం తెలుగువాళ్లకు అలవాటైంది. అలాగే కన్నడవాళ్లకు సరిహద్దుల్లో ఉన్న తమిళప్రాంతం పేరు ‘కొంగునాడు’. వాళ్లు తమిళులను కొంగ అంటారు. కొంగాట్టి అనే పదం కూడా విన్నాను.
మరి తమిళులు మననేమంటారు? ‘వడగర్లు’ అంటారు. వడ అంటే ఉత్తరం, వాళ్లకు ఉత్తరాదిన ఉంటాం కాబట్టి ఉత్తరాదివాళ్లు అని అర్థమన్నమాట. మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తూ తమిళనాడులో స్థిరపడిన తెలుగువారిని కదలేస్తే ‘మేం వడగర్లను చేసుకోం’ అన్నారు. మనకు నార్త్ ఇండియన్లని వేరేవాళ్లుంటే మనం వీళ్లకు నార్త్ ఇండియన్లన్నమాట అనుకుని నవ్వుకున్నాను. మరి యింతకీ యీ గొల్టి ఏమిటి? ఓ సారి ఆరుద్రగారిని అడిగాను. ఆయన ‘ఏమీ లేదు, తెలుగు అనే పదాన్ని తిరగేసి, అటూయిటూ చేస్తే గొల్టి అయింది. దానికి అర్థమేమీ లేదు.’ అన్నారు. కానీ అది తెలుగువాళ్లను ఉద్దేశించిన మర్యాదకరమైన పదమేమీ కాదు. మందబుద్ధి, ఏబ్రాసి అన్న అర్థంలో వాడతారు. ఎవరైనా ఆ పదం మనపట్ల వాడితే అభ్యంతర పెట్టవలసినదే! రాధికను తీసిపారేయడానికే ఆ పదం వాడేవారనేది ఆమె మాటల్లోనే తెలిసింది.
ఇలా అనగానే మనం ఆవేశపడనక్కర లేదు. మనం తమిళుల గురించి గౌరవంగా మాట్లాడతామా అని ఆలోచించుకుని చూడాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అరవగోల అంటాం. హీనమైన చాకిరీ చేయవలసి వస్తే అరవచాకిరీ అంటాం. తమిళవైష్ణవులకు మంగలి చేసే సర్వాంగ క్షౌరాన్ని అరవచాకిరీ అంటారని మాండలిక పదకోశంలో ఉంది. పనికిరాని పోచికోలు కబుర్లు చెపుతున్నాడంటే ‘సొల్లు’ చెపుతున్నాడ్రా అంటాం. ఆ పదానికి తమిళంలో చెప్పడమనే అర్థమే ఉంది. అది మనకు విసుగు కలిపిస్తుంది కాబట్టి సొల్లు అంటూ తీసిపారేస్తాం. ఎక్కడైనా అతి కనిపిస్తే చాలు, అరవానికి అంటకడతాం. అరవ యేక్షన్ అనేస్తాం. తమిళుణ్ని ఎవడినైనా తీసిపారేయాలంటే ‘సాంబారుగాడు’ అంటాం. కానీ తమిళనాడులో సాంబారు పదాన్ని బ్రాహ్మల్ని ఉద్దేశించి వాడతారు. మన దగ్గర చూడండి, పప్పు అందరూ తింటారు. కానీ బ్రాహ్మణ్ని గేలి చేయడానికి పప్పు బ్రాహ్మడు అంటారు. అలాగే అక్కడ సాంబారు. ఒక తరం తమిళ హీరోల్లో జెమినీ గణేశన్ మాత్రమే బ్రాహ్మడు (పూర్తిగా కాదు, దాని గురించి వేరే వ్యాసంలో ఓ సారి రాశాను). అతనికి నిక్‌నేమ్ సాంబార్. భార్య స్నేహితుడితో మాట్లాడితే, చాటుగా విని ఆపార్థం చేసుకునే భర్త పాత్రలు చాలా వేశాడతను. అలాటి ఘట్టాల్లో హాల్లో ‘సాంబార్’ అనే చాలామంది కేకలు వేసేవారని ఓ మిత్రుడు చెప్పాడు.
ఎమ్మార్ రాధా విషయానికి వస్తే, అతడు తెలుగువాళ్లకు కూడా తెలిసిన పెద్ద హీరో అయి వుంటే, ప్రజలు ఆరాధించిన నాయకుడైతే యీ పాటికే మన తెలుగు రిసెర్చర్లు ఆ ‘నాయుడు’ కమ్మనాయుడా? బలిజనాయుడా? సెట్టిబలిజ నాయుడా?’ అని శోధించేసి, మా వాడంటే మా వాడంటూ లావులావు పుస్తకాలు రాసేసేవారు. వీలైతే విగ్రహాలు పెట్టేసేవారు. ఆ ప్రమాదం రాలేదు. నా నుంచి తెచ్చిపెట్టే ఉద్దేశం కూడా లేదు కాబట్టి, క్లుప్తంగానే అతని గురించి రాస్తాను. అతను తమిళ సినిమాల్లో విలన్‌గా, కామిక్ విలన్‌గా, కారెక్టరు నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. శివాజీ, ఎమ్జీయార్‌ల సరసన మాత్రమే కాక, ఆనాటి ప్రముఖ చిత్రాలన్నిటిలో నటించాడు. విలక్షణమైన డైలాగు డెలివరీతో ప్రత్యేకత చూపుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో డబ్ అయి వచ్చాయి కాబట్టి పాతతరం తెలుగువాళ్లకు అతని గురించి తెలుసు. డైరక్టు తెలుగు సినిమా ‘‘బొబ్బిలియుద్ధం’’ (1964)లో హైదర్ జంగ్ పాత్ర వేశాడు.
రాధా డైలాగ్ డెలివరీ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే నాగభూషణాన్ని గమనిస్తే చాలు. నాగభూషణం తొలి దశలో అనేక రకాల పాత్రలు వేశాడు. ‘‘ఏది నిజం?’’ (1956) సినిమాలో హీరో పాత్ర కూడా వేశాడు. అప్పట్లో డైలాగులు మామూలుగానే చెప్పేవాడు. అయితే రాధా ప్రధానపాత్రలో నటించిన ‘‘రక్తకన్నీరు’’ (1954) అనే తమిళ సినిమా వచ్చింది. రాధా తండ్రికి మద్రాసులోని కొత్వాల్ చావిడిలో కూరల దుకాణం ఉండేది. దరిద్రం భరించలేక, తల్లితో పోట్లాడి పదేళ్ల వయసులో బాలనటుడిగా రంగస్థలానికి వెళ్లిపోయాడు. దానిలోనే ఎదిగాడు. ‘‘సంతాన దేవన్’’ (1939) సినిమాలో చిన్న పాత్ర వేశాడు. రెండు సినిమాల్లో హీరోగా కూడా వేశాడు. గిరాకీ లేకపోయింది. అప్పుడే ద్రవిడ కళగంలో చేరాడు. పెరియార్‌కు సినిమాలపై సదభిప్రాయం లేదు. నాటకాలనే ప్రోత్సహించాడు. రాధా నాటకరంగానికే పరిమితమై పోయాడు. అక్కడ చాలా పేరు తెచ్చుకున్నాడు.
పెరియార్ శిష్యుడైన తిరువారూరు తంగరసు రాధా హీరోగా ‘‘రక్తకన్నీరు’’ అనే నాటకాన్ని రాశాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఓ ఆధునిక యువకుడు తల్లి బలవంతం చేత మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. సాంప్రదాయంగా ఉండే తన భార్య అతనికి నచ్చదు. ఒక వేశ్య వలలో పడతాడు. భార్యను తృణీకరించి, తరిమివేసి వేశ్యతో దర్జాగా బతుకుతాడు. కానీ చెడు అలవాట్ల కారణంగా అతనికి కుష్ఠు రోగం వస్తుంది. ఆస్తంతా లాక్కుని, వేశ్య తరిమివేస్తుంది. అతను రోడ్ల మీద పడి బిచ్చమెత్తుకుంటాడు. చివరకు భార్య అతన్ని చేరదీస్తుంది. పశ్చాత్తాప పడుతూ ఆమె చేతుల్లోనే మరణిస్తాడు. ఈ సెంటిమెంటల్ కథను రాధా సమాజం పోకడలపై విసుర్లు విసురడానికి, అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెసు రాజకీయాలను తూర్పార పట్టడానికి ఉపయోగించుకున్నాడు. అతను కుష్ఠురోగి అయిన దగ్గర్నుంచి నాటకంలో ఊపు వస్తుంది.
రాధా వాయిసే విచిత్రంగా ఉంటుంది. పైగా తన డైలాగులను నొక్కినొక్కి పలుకుతూ ఒక రకమైన మాడ్యులేషన్‌తో డెలివర్ చేయడంతో ప్రజలు వెర్రెక్కిపోయారు. అప్పట్లో ద్రవిడ ఉద్యమం ఊపులో ఉంది కాబట్టి, దేవుళ్ల గురించి కూడా దుమ్మెత్తిపోసేవాడు. ఆ నాటకం హిట్ కావడంతో దాన్ని కృష్ణన్-పంజు డైరక్షన్‌లో సినిమాగా తీశారు. అదీ సూపర్ హిట్టయింది. సినిమారంగం అతనికి ఎఱ్ఱ తివాచీ పరిచి, ఆహ్వానించింది. అప్పణ్నుంచి 13 ఏళ్ల పాటు క్షణం తీరిక లేకుండా వేషాలు వేశాడు. ‘‘రక్తకన్నీరు’’ను తెలుగులో డబ్ చేస్తూ రాధా పాత్రకు డబ్బింగు చెప్పడానికి నాగభూషణాన్ని పిలిచారు. ఆయన రాధా తరహాలోనే డైలాగులు చెప్తే హాల్లో చప్పట్ల వర్షం కురిసింది. తనకొక మార్గం కనిపించిం దనిపించిది నాగభూషణానికి. దీన్ని తెలుగులో నాటకంగా వేసి ఊరూరా ప్రదర్శిస్తే బాగుంటుం దనిపించింది. కాపీరైటు హక్కుల కోసం రాధాను సంప్రదిస్తే, ‘కాపీరైటేమీ లేదు. ఏ ఊరికా ఊరికి డైలాగులు మార్చేస్తూంటాను. నువ్వూ అలాగే ఆడుకో పో,’ అని నాగభూషణాన్ని ఆశీర్వదించాడు.
నాగభూషణం పాలగుమ్మి పద్మరాజు గారి చేత స్క్రిప్టు రాయించుకున్నా, ఏ ఊళ్లో నాటకం వేస్తే ఆ వూరి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2000 ప్రదర్శనలు యిచ్చారు. ఆయన పేరుకు ముందు ‘‘రక్తకన్నీరు’’ (దుష్టసమాసమే అయినా) వచ్చి చేరింది. అప్పటిదాకా ఆయన్ని పెద్దగా పట్టించుకోని తెలుగు సినిమావాళ్లు పిలిచి వేషాలివ్వసాగారు. యువక పాత్రలలో రాణించలేకపోయిన నాగభూషణం తన 45వ ఏట ‘‘ఉమ్మడి కుటుంబం’’ (1967)లో హీరోయిన్ తండ్రి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పణ్నుంచి పెద్ద తరహా పాత్రలు వేస్తూ ‘‘కథానాయకుడు’’ (1969)లో కామిక్ విలన్‌గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక అప్పణ్నుంచి ఒక దశాబ్దం పాటు ఎదురులేకుండా పోయింది. ఆయన రాధా డైలాగు డెలివరీనే నమ్ముకున్నారు.
డూప్లికేటు రాధా యిలా వెలిగాడు కానీ ఒరిజినల్ రాధా ఏమయ్యాడనే సందేహం రాకమానదు. 1967 జనవరిలో అతని బుద్ధి వక్రించింది, దానితో బాటు జాతకమూ వక్రించింది. ‘పెరియార్’గా పిలవబడే రామస్వామి నాయకర్ ద్రవిడ కళగం (డికె) అనే సంస్థను పెట్టి బ్రాహ్మణాధిపత్యానికి, హిందూమతానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపాడు. అప్పట్లో తమిళనాడు కాంగ్రెసులో బ్రాహ్మణులు నాయకులుగా ఉండడంతో పెరియార్‌కు బ్రిటిషు వారి మద్దతు లభించి, ఉద్యమం విజయవంతమైంది. బ్రిటిషు వారు వెళ్లిపోయాక, ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మారిస్తే లాభమన్నారు పెరియార్ అనుచరులు అణ్నాదురై, కరుణానిధి వగైరాలు. ససేమిరా కుదరదన్నారు పెరియార్. చివరకు 1949లో డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కళగం) పార్టీ అణ్నాదురై నాయకత్వంలో ఏర్పడింది. పెరియార్ అనుయాయుల్లో అనేకమంది అటు వెళ్లిపోయారు కానీ ఎమ్మార్ రాధా మాత్రం ఆయనతోనే ఉండిపోయాడు. డిఎంకె ఎన్నికల్లో పోటీ చేస్తూ కొన్ని స్థానాలు గెలుస్తూ వస్తోంది. డికె దాన్ని శత్రువుగా పరిగణిస్తోంది.
1967 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికే డిఎంకెకు అనుకోని మద్దతు లభించింది. చాలాకాలం కాంగ్రెసు నాయకుడిగా ఉంటూ, దానితో విభేదించి, విడిగా వచ్చేసి 1959లో స్వతంత్ర పార్టీ పెట్టిన రాజాజీ, తమిళనాడు (అప్పటి పేరు మద్రాసు) లో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెసును ఓడించడానికి డిఎంకెకు మద్దతు ప్రకటించాడు. బ్రాహ్మణుడైన రాజాజీ మాటను మన్నించి మద్రాసు రాష్ట్ర బ్రాహ్మణులందరూ డిఎంకెకే మా ఓటు అన్నారు. ఇది డికెకు కోపం తెప్పించింది. ఇన్నాళ్లూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పోరాడి, యిప్పుడు వాళ్ల మద్దతుతోనే అధికారంలో రావడానికి ప్రయత్నిస్తోంది డిఎంకె అనుకున్నారు. ఆ రోజుల్లో డిఎంకెకు ఓట్లు తెచ్చిపెడుతున్న స్టార్ కాంపెయినర్ ఎమ్జీయార్. అతన్ని తుదముట్టిస్తే చాలు, డిఎంకె ఫినిష్ అనుకున్నాడు డికె నాయకుడు ఎమ్మార్ రాధా. దీనికి తోడు ఎమ్జీయార్‌తో అతనికి వృత్తిపరమైన తగాదా ఒకటుంది. రాధా తనకో సినిమా చేయమని ఎమ్జీయార్‌ను అడుగుతున్నాడు. రాధాను ఎమ్జీయార్ అన్నాఅన్నా అని గౌరవిస్తాడు కానీ సినిమా కమిట్ కావడానికి యిష్టపడటం లేదు.
ఈ రెండూ మనసులో పెట్టుకుని 1967 జనవరి 12న ఒక ప్రొడ్యూసర్‌ను వెంటపెట్టుకుని ఎమ్జీయార్ దగ్గరకు వెళ్లాడు రాధా. సన్నిహితమిత్రుడు కాబట్టి సెక్యూరిటీవాళ్లు చెక్ చేయలేదు. లోపలికి వెళ్లాక జేబులోంచి తుపాకీ తీసి ఎమ్జీయార్‌ను కాల్చేశాడు రాధా. బుల్లెట్లు ఎమ్జీయార్ మెడలో యిరుక్కున్నాయి. వెంటనే తుపాకీతో తనను కూడా కాల్చుకున్నాడు రాధా. ఇద్దరూ ఒకే ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఎమ్జీయార్‌కి చావు తప్పి గొంతు లొట్టపోయింది. చాలాకాలానికి కానీ కోలుకోలేదు. జీవితాంతం ఆ గాయంతో బాధపడ్డాడు. కానీ మృత్యుముఖంలో ఉన్న ఎమ్జీయార్ అంటూ డిఎంకె పబ్లిసిటీ గుప్పించడంతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాధాను అరెస్టు చేశారు, కేసు నడిపారు. ఎమ్జీయార్ రాధాను క్షమించానని అన్నా కోర్టు ఏడేళ్లు కఠినశిక్ష వేసింది. అప్పటికే అతనికి 60 ఏళ్ల కాబట్టి దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. నాలుగున్నరేళ్లు పోయాక వదిలేశారు.
ఎమ్జీయార్‌ను చంపబోయాడని తెలియగానే ఎమ్జీయార్ అభిమానులు రాధాపై దాడి చేద్దామని చూశారు. దాంతో రాధిక తల్లి గీత భయపడింది. ఆవిడ శ్రీలంకకు చెందిన వ్యక్తి కాబట్టి, పిల్లల్ని శ్రీలంక పంపేసి హాస్టల్లో పెట్టి చదివించింది. అక్కణ్నుంచి రాధిక లండన్ వెళ్లి చదివింది. మద్రాసుకి తిరిగి వచ్చినపుడు అనుకోకుండా సినిమాల్లో బుక్ అయింది. తన తండ్రి కాల్పుల ఉదంతం రాధికకు గుర్తుంది. తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్లిందట. అక్కడ తన భర్త కాల్చినది సాక్షాత్తూ ఎమ్జీయార్‌నే అని తెలియగానే రాధిక తల్లి గీత మొగుడిమీద విరుచుకు పడిందట, నీకేం పోయేకాలం వచ్చింది అంటూ. రాధకు ఆమె ఒక్కత్తే భార్య కాదు. మరో ముగ్గురో నలుగురో ఉన్నారట. ప్రేమావతి అని ఒకావిడ పోయింది కానీ తక్కిన నలుగుర్ని సరస్వతి, ధనలక్ష్మి, జయ, గీతలను ఏకకాలంలో మేన్‌టేన్ చేసి ముగ్గురు కొడుకుల్ని, ఏడుగురు కూతుళ్లను కన్నాడు. అతని పెద్ద కొడుకు ఎమ్మారార్ వాసు కూడా తండ్రిలాగే కామెడీ విలన్ వేషాలు వేశాడు. మధ్యవయసులోనే పోయాడు.
ఆ కాల్పుల ఉదంతం గురించి నెట్ సీరీస్ తీస్తానంటోంది రాధిక. రిసెర్చి చేసి కనుక్కున్న విషయాలను దానిలో చూపిస్తుందట. తన తండ్రి కాల్చలేదని చూపించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే జైల్లోంచి బయటకు వచ్చాక రాధా ‘నేనే కాల్చాను’ అనే అర్థం వచ్చే టైటిల్‌తో నాటక ప్రదర్శనలు యిచ్చాడట. ఎందుకు కాల్చాడో వివరిస్తూ పుస్తకం కూడా రాశాడట. జైలు నుంచి వచ్చాక నాటకాలు, సినిమాలు వేశాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. మొత్తం మీద 5 వేల నాటకాలు వేసి, చివరకు 1979లో మరణించాడు. రాధిక సినిమాల్లోకి ప్రవేశించేటప్పుడు వచ్చి మేకప్ బొట్టు పెట్టి ‘నా వృత్తి నీ వృత్తి అవుగాక’ అని ఆశీర్వదించాడట.
రాధా పూర్తిపేరు మద్రాసు రాజగోపాలన్ రాధాకృష్ణ. చిన్నతనంలోనే తల్లి మీద అలిగి, యింట్లోంచి పారిపోయి నాటకాల్లో బాలనటుడిగా వేషాలు వేయడం మొదలుపెట్టాడు. అనేక నాటకసమాజాలు మారాడు. వాటిలో ఒక దానిలో బాలనటుడిగా వేస్తున్న శివాజీని చూసి అభిమానించాడు. తన కంటె 21 ఏళ్లు పెద్దవాడైన రాధాను శివాజీ అన్నా అని పిలిచేవాడు. అతను తనను ఎలా పైకి తీసుకుని వచ్చాడో శివాజీ తన ఆత్మకథ ‘‘ఆటోబయాగ్రఫీ ఆఫ్ ఏన్ యాక్టర్’’లో చెప్పుకున్నాడు. ‘‘నేను బాలగానసభలో పనిచేసే రోజుల్లో పరమకుడి అనే ఊరికి వెళ్లాం. అంతకు క్రితం ఆ ట్రూపులో పనిచేసి వదిలిపెట్టి వెళ్లిన రాధా అన్న ట్రూపుకి తిరిగి వచ్చాడు. మా పిల్లలందరికీ తండ్రిలా ఉండేవాడు. ఎంతో ఆప్యాయత కురింపిచేవాడు. మేం పడుక్కున చోటు శుభ్రం చేసేవాడు. మా అందరికీ తల దువ్వేవాడు. ‘తను జీనియస్. ఆల్‌రౌండర్. నాటకానికి సంబంధించిన ప్రతి డిపార్టుమెంటు గురించి క్షుణ్ణంగా తెలుసు ఆయనకు. అవసరమైతే ఎలక్ట్రీషియన్‌గా, కార్పెంటరుగా, పెయింటరుగా కూడా పనిచేసేవాడు.
ఇక స్టేజిపై హీరో, విలన్, కమెడియన్, కారెక్టరు యాక్టరు ఏ పాత్రైనా వేసేసేవాడు. తనంత బాగా కామెడీ ఎవరూ చేయలేకపోయేవారు. తను వేసిన నాటకాలకు బాగా డబ్బులు వచ్చేవి. అయినా నాటకసభ ఆర్థికంగా కష్టాలు పడేవి. నాకు అప్పుడు వయసు 12. ఇంట్లో చెప్పకుండా వదిలి వచ్చి ఐదేళ్లయింది. నేనూ, నా స్నేహితుడు తంగవేలు దీపావళికి యింటికి వెళతామని సభ అనుమతి తీసుకుని వెళ్లాం. మా యింట్లో వాళ్లు నన్ను చూసి ఆశ్చర్యపడ్డారు. నేను చచ్చిపోయానని అనుకున్నారు వాళ్లు. ఇంటికి తిరిగివచ్చాక మళ్లీ డ్రామా కంపెనీకి వెళ్లాలనుకోలేదు మేము. ఒక రోజు రాధా అన్న మా యింటికి వచ్చాడు. ‘నేనూ మీతో పాటు ఉంటాను.’ అన్నాడు. మా వాళ్లు సరేనన్నారు. కొన్నాళ్లు పోయాక తను ‘నేనొక డ్రామా కంపెనీ పెట్టబోతున్నాను. మీరూ వచ్చి నాతో చేరండి.’ అన్నాడు. మా అమ్మ కొత్త కంపెనీలో చేరితే రిస్కు కదా అంది. రాధా అన్న ‘మీ వాళ్లను మద్రాసు తీసుకెళ్లి మంచి తర్ఫీదు యిప్పిస్తాను.’ అని అమ్మకు మాట యిచ్చాడు.
‘నన్ను, తంగవేలును మద్రాసు తీసుకెళ్లి టంకశాల వీధి (మింట్ స్ట్రీట్)లో బస చేయించాడు. డబ్బులిచ్చి రిక్షాలో ఊరంతా తిరిగి రమ్మన్నాడు. సినిమా కంపెనీకి తీసుకెళ్లి నటుడు టిఆర్ రామచంద్రన్‌కు పరిచయం చేశాడు. తర్వాత ముగ్గురు చెట్టియార్లతో కలిసి ఒక నాటక కంపెనీ ప్రారంభించాడు. నాటక ప్రదర్శనలకై ఈరోడ్ వెళ్లినపుడు పెరియార్‌కు పరిచయం చేశాడు. ఆయన చెప్పే రాజకీయపాఠాలు విని చాలా నేర్చుకున్నాను. అణ్నాదురైతో అక్కడే పరిచయమైంది. అయితే రాధా అన్న ప్రారంభించిన కంపెనీకి నష్టాలు వచ్చి, భాగస్తులు విడిపోయి, కంపెనీ మూసేయాల్సి వచ్చింది. నేను యింటికి వెళ్లిపోయి నెలకు రూ.7 జీతంపై మెకానిక్‌గా పనిచేశాను. అయితే బాలగానసభ చేతులు మారి, కొత్త పెట్టుబడిదారులు వచ్చి నన్ను మళ్లీ పిలిచారు. స్టేజిపై మళ్లీ నటించాను.
1946లో ‘‘శివాజీ కణ్డ హిందూ రాజ్యం’’ నాటకంలో శివాజీ పాత్ర వేశాను. అది చూసి పెరియార్ నా పేరుకు ముందు ‘శివాజీ’ అని చేర్చారు. దాంతో విసి గణేశన్ కాస్త శివాజీ గణేశన్ అయ్యాడు. నా తొలి సినిమా ‘‘పరాశక్తి’’ (1952) హిట్ కావడంతో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే తొలి రోజుల్లో నాకు తర్ఫీదు యిచ్చిన, నన్ను మళ్లీ నాటకరంగానికి పిలుచుకుని వచ్చి, యింతటివాణ్ని చేసిన రాధా అన్నను మర్చిపోలేదు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించాను. చివర్లో తిరుచ్చిలో నా యింటికి పక్కనే ఆయనకో ఇల్లు ఏర్పాటు చేశాను. 1979లో తన 72వ ఏట ఆయన ఆ యింట్లోనే మరణించాడు.’ అని శివాజీ రాసుకున్నాడు. రాధికతో మొదలుపెట్టి శాఖాచంక్రమణం చేసినా, రాధా గురించి మీకీపాటికి ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. (ఫోటో రాధిక, ఎమ్జీయార్, రాధా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)