ఆస్కార్ పిస్టోరియస్.. ప్రపంచ ప్రఖ్యాత బ్లేడ్ రన్నర్‌గా ఒకప్పుడు అందరికీ తెల్సిన వ్యక్తి. అప్పటికీ ఇప్పటికీ పిస్టోరియస్ అంటే అందరికీ అదే గౌరవం. నడవడానికే కాళ్ళు లేవు.. అయినా 'రన్నర్' అనిపించుకోవాలి. మంచానికే పరిమితమవ్వాలనుకోలేదు. పోరాడాడు.. పోరాడాడు.. రన్నింగ్‌కి అనుకూలమైన బ్లేడ్స్ తయారుచేయించుకున్నాడు. కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా పరుగు ఆపలేదు. ఆ పోరాటమే అతన్ని జీవితంలో అత్యున్నత స్థాయికి చేర్చింది.
కానీ, విధి వెక్కిరించింది. ఆస్కార్ పిస్టోరియస్ తన స్నేహితురాల్ని కాల్చి పారేశాడు. ప్రపంచం షాక్‌కి గురయ్యింది. ఎవరో దుండగులు వచ్చారనుకుని కాల్చేశానన్నాడు పిస్టోరియస్. కాదు కాదు, ప్రియురాలితో వాగ్యుద్ధం జరిగిందనీ, ఆ కోపంలో ప్రియురాల్ని కాల్చి చంపేశాడనీ ప్రాసిక్యూషన్ వాదించింది. ప్రాసిక్యూషన్ వాదనే నెగ్గింది. పిస్టోరియస్ దోషిగా తేలాడు. తక్కువలో తక్కువ 15 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించాల్సి వుంటుంది. కానీ, పిస్టోరియస్ గత జీవితాన్నీ, జీవితంలో అతను సాధించిన విజయాల్నీ, ఎందరికో ఆయన స్ఫూర్తి కలిగించిన వైనాన్నీ దృష్టిలో పెట్టుకుంది న్యాయస్థానం.
చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్న న్యాయస్థానం ఆరేళ్ళ జైలు శిక్షతో సరిపెట్టింది. న్యాయమూర్తి కూడా శిక్ష విధించే విషయంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, పిస్టోరియస్ కోసం జైలుకు చేరుకున్న అతని అభిమానులు, సామాన్యులు పెట్టిన కంటతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాధితురాలి కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగిందంటూనే, పిస్టోరియస్కి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకాశమంత ఎత్తుకి.. ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకి.. తన కీర్తిని పెంచుకున్న పిస్టోరియస్, ఒక్కసారిగా తన కీర్తిని కుప్పకూల్చేసుకున్నాడు. క్షణికావేశం.. అతన్ని ఈ రోజు నేరస్తుడ్ని చేసింది. కానీ, పిస్టోరియస్ ఎప్పటికీ యువతకు స్ఫూర్తిగానే నిలుస్తాడు.. అతను శారీరక వికలాంగుల్లోనూ, మానసిక వికలాంగుల్లోనూ నింపిన మానసిక స్థయిర్యం, నేర్పిన పోరాట పటిమ అలాంటిది.