డైరక్టర్ హరీష్ శంకర్ తెగ ఉత్సాహంగా వున్నారు..చాన్నాళ్ల గ్యాప్ తరువాత బన్నీ లాంటి హీరోతో సినిమా చేయబోతున్నారని. ప్రకటన వచ్చింది కానీ, ఇంకా సినిమా స్టార్ట్ కావడానికి కాస్త టైమ్ వుంది. అయితే కప్ టు లిప్ అన్నట్లుగా, ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందే సమస్య ఎదురవుతోందని వినికిడి. గతంలో హరీష్ తీసుకున్న అడ్వాన్స్ ఆయనకు బ్రేక్ వేస్తోంది. గతంలో ఎప్పుడో, పూర్వాశ్రమంలో నిర్మాత రమేష్ పుప్పాల దగ్గర మూడు సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నారట డైరక్టర్ హరీష్ శంకర్.
అయితే ఆ తరువాత ఆ ముచ్చటే యాదికి రాలేదట. గబ్బర్ సింగ్ టైమ్ లో బ్రేక్ వేయబోతే పెద్ద హీరోతో సినిమా కదా ఎందుకు అడ్డం పడడం అని అంటే రమేష్ పుప్పాల ఊరుకున్నారని వినికిడి. ఆ తరువాత మరి హరీష్ శంకర్ తన ఫోన్ లో తన నెంబర్ ను బ్లాక్ చేసారని రమేష్ పుప్పాల సన్నిహితులతో అంటున్నారట. అందుకే ఇప్పుడు బన్నీ సినిమా ప్రకటించారు కాబట్టి, తన అడ్వాన్స్ ల గురించి ఫైట్ చేయాలని రమేష్ పుప్పాల డిసైడ్ అయిపోయారని తెలుస్తోంది. ముందు నిర్మాతల మండలిని ఆశ్రయించి, అక్కడ న్యాయం జరగకపోతే తరువాతి స్టెప్ తీసుకుంటారట.
నాకే సమస్య లేదు
ఈ విషయంపై హరీష్ శంకర్ తో మాట్లాడితే, తనకు రమేష్ పుప్పాలతో ఏ సమస్య లేదని, ఆయన సోదరుడి కుమారుడు తన అసిస్టెంట్ గానే వుంటున్నారని, రమేష్ తనకు తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చారని, ఎప్పుడు కనిపించినా మంచిగా మాట్లాడుకుంటామని, ఇవన్నీ గిట్టని వదంతులని కొట్టిపారేసారు
అగ్రిమెంట్ పక్కాగా వుంది
అయితే రమేష్ పుప్పాల వెర్షన్ మరోలా వుంది. మిరపకాయ్ సినిమా అవకాశం ఇచ్చినపుడే, తరువాత మూడు సినిమాలు తమకే చేయాలని, ప్రతి విషయం పక్కగా అగ్రిమెంట్ రాసుకున్నామని, అది వాస్తవం అని అన్నారు. మధ్యలో తన పరిస్థితి కాస్త బాగాలేకపోయిందన్నారు.
ఇప్పుడు అన్నీ సర్దుకుని సినిమాకు రెడీ అంటే, హరీష్ శంకర్ తన ఫోన్ నెంబర్ నే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసారని ఆవేదన వ్యక్తం చేసారు. తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చా అని ఆయన ప్రశ్నించారు. అప్పటికే ఇద్దరికి తెలిసిన వారికి ఈ విషయం చెప్పి, హరీష్ కు కన్వే చేయించినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకే ఇక చాంబర్ ను ఆశ్రయించడం మినహా తనకు గత్యంతరం కనిపించడం లేదన్నారు.