ఐసిస్.. ఐఎస్ఐఎస్.. ఐస్.. ఇస్లామిక్ స్టేట్.. ఖలీఫా రాజ్యం.. ఇలా పేరేదైనా జరుగుతున్నది మారణహోమం. ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేదు. భూమ్మీద ఇప్పుడు ఏ ప్రాంతమూ ఇస్లామిక్ స్టేట్ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదన్నది నిష్టుర సత్యం. తృటిలో తప్పిపోయిందిగానీ, లేదంటే భారతదేశంలో నిన్న (శనివారం) అత్యంత దారుణమైన మారణహోమం జరిగి వుండేది. హైద్రాబాద్లో ఎన్ఐఏ పక్కా వ్యూహంతో తీవ్రవాదుల్ని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.
అదే సమయంలో, పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఐసిస్ పడగ విప్పింది.. దారుణమారణహోమం జరిగిందక్కడ. ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట ఐసిస్ పంజా విసురుతోంది. ఎప్పుడు ఏక్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియక మొత్తంగా మానవాళి భయాందోళనలకు గురవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ దేశమూ ఇప్పుడు ఉగ్రవాదానికి మినహాయింపు కాదు.
ఒకప్పటి పరిస్థితులు వేరు. ఆయా దేశాల్లోని అంతర్గత వివాదాలు, పొరుగు దేశాలతో గొడవలు.. ఇలా పలు కారణాలతో తీవ్రవాదం పెచ్చుమీరేది. ఆ తీవ్రవాద సంస్థలన్నీ ఆయా దేశాలకే పరిమితమయ్యేవి. క్రమక్రమంగా ఇప్పుడు తీవ్రవాదం ఒక్కటవుతోంది. మానవాళికి వ్యతిరేకంగా బుసకొడుతోంది. మారణహోమానికి ఐసిస్ బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూల చీమ చిటుక్కుమన్నా, అది ఐసిస్ పనే అవుతోందిప్పుడు.
'ఐసిస్ పనైపోయింది..' అని ఓ పక్క అగ్రదేశాలు చెబుతోంటే, ఇంకోపక్క ఐసిస్, తన సత్తా చాటుతోంది. సత్తా చాటడమంటే, ప్రాణాలు తీయడమన్నమాట. దొంగల్లా వచ్చి, బాంబులు పెట్టి మారణహోమం సృష్టించడం ఒకప్పటి తీవ్రవాదం తాలూకు దుశ్చర్యల ట్రెండ్. ఇప్పుడు అలా కాదు, బాంబుల పేలుతున్నాయ్.. తుపాకీలు మోగుతున్నాయ్.. కుత్తుకలు తెగుతున్నాయ్.. ఒకటేమిటి… మారణహోమంలో కొత్త కొత్త విధానాల్ని అమలు చేస్తోంది ఐసిస్. టార్గర్లో పీక్స్టేజ్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఐసిస్.
అమెరికా ఏం చేయగలగుతోంది.? బ్రిటన్ ఏం చేస్తోంది.? అనడానికీ వీల్లేని పరిస్థితి. అగ్రరాజ్యాలే వణికిపోతున్నాయిప్పుడు. ఒక దేశం ఇంకో దేశం పట్ల సానుభూతి ప్రదర్శించడం మాత్రమే మిగులుతోంది. ప్రపంచమంతా తీవ్రవాదాన్ని ఖండిస్తోంది.. కానీ, ఆ తీవ్రవాదాన్ని తుదముట్టించలేకపోతోంది. ఇంకా ఇంకా ఐసిస్ బలపడితే ఇంకేమన్నా వుందా.? నరరూపరాక్షసుల వికటాట్టహాసం నడుమ మానవాళి అంతరించిపోదూ.!