అదేమిటో కొందరి అక్రమ వ్యాపారాలు త్వరగా వెలుగులోకి వస్తాయి. మరి కొందరివి ఎప్పుడో గాని బయటపడవు. అదంతా ఆ వ్యాపారవేత్త స్వభావంపై ఆధారపడి వుంటుందనుకోవాలి. ''తాగింది కుసింత, ఊసింది ఊరంత'' అనే టైపు వాళ్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. సంజయ్ భండారీ వంటి నిండుకుండలు తొణకరు, బెణకరు. అందుకే ఎన్నో ఏళ్లగా డిఫెన్సు సామగ్రి వ్యాపారం చేస్తున్నా, ఫైవ్‌స్టార్ లైఫ్ గడుపుతున్నా, ఎందరో విఐపిలతో భుజాలు రాసుకుని తిరుగుతున్నా మీడియా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వుండడానికి అతనేమైనా మంత్రం వేశాడేమో తెలియదు. ఇప్పుడైనా రాబర్డ్ వాద్రాతో లింకు కారణంగా యింత ఫోకస్ పడింది కానీ లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోయేదే. వాద్రాపై వల వేస్తే యీ చేప పడింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2014లో బిజెపి అధికారంలోకి రాగానే వాద్రా సన్నిహితులెవరాని ఇంటెలిజెన్సు బ్యూరోను ఆరా తీయమంది. ఒక రహస్య రిపోర్టులో వాళ్లు అతని సన్నిహితుల్లో ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఒకడని చెప్పారు. అయితే లింకేమీ దొరకలేదు. భండారీని గట్టిగా తోమాలన్నా యిబ్బందే, ఎందుకంటే అతను బిజెపి జాతీయ కార్యదర్శికి మిత్రుడని, మరొక సీనియర్ బిజెపి నాయకుడి కొడుక్కి స్నేహితుడని రాశారు. దాంతో బిజెపి వారు కాస్త తగ్గారు.
ఇప్పుడీ సంగతి బయటకు రావడం తమాషాగా జరిగింది. తమకు కన్నెఱ్ఱగా మారిన ఆప్‌కు గత అసెంబ్లీ ఎన్నికలలో ధనసహాయం ఎక్కణ్నుంచి వచ్చిందో చూసి, దాన్ని కట్టడి చేయాలని బిజెపి నాయకత్వం కేంద్రశాఖలన్నిటినీ హెచ్చరించింది. హవాలా ఆపరేటర్లు ఆప్‌కు విరాళాలిస్తున్నారని వారికి సమాచారం వచ్చింది. దాంతో ఇన్‌కమ్‌టాక్స్ శాఖ ద్వారా యీ ఏడాది మొదట్లో హవాలా ఆపరేటర్లపై దాడి చేయించారు. దీపక్ అగర్వాల్ అనే ఓ ఆపరేటరు ఖాతాలో ఓ ఢిల్లీ కంపెనీ తరఫున రూ.100 కోట్ల పైబడి వ్యవహారం నడిపినట్లు బోగసు బిల్లులు కనబడ్డాయి. ఆ కంపెనీ సంజయ్ భండారీదని తేలింది. ఇక అక్కణ్నుంచి అతని విషయాలన్నీ తవ్వి తీశారు. 20 (35 అని కొందరంటున్నారు) షెల్ కంపెనీల ద్వారా అతను చేసిన ట్రాన్సాక్షన్లన్నీ అనుమానస్పదంగా అనిపించాయి. అతని ఫోన్ ట్యాప్ చేశారు. అతనికి అన్ని పార్టీల నాయకులతో, సీనియర్ జర్నలిస్టులతో, డిఫెన్సు శాఖలోని అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయని తేలింది. తక్కినవారి మాట ఎలా వున్నా వాద్రా కూడా ఎక్కడో అక్కడ దొరక్కపోతాడా అనుకుని ఐటీ వారు అతనిపై దాడి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం భండారీకి ఉప్పందింది. ఏప్రిల్ 26న అతని డిఫెన్సు కాలనీలోని ఆఫీసులపై, గ్రేటర్ కైలాశ్లోని యిళ్లపై దాడి జరిగిన సమయానికి తన కంప్యూటరును శుబ్భరంగా తుడిచి పెట్టేశాడు. సాఫ్ట్వేర్ వ్యాపారం కూడా చేసే అతనికి టెక్నికల్‌గా చాలా తెలివి వుంది. వాట్స్అప్ ఎన్క్రిప్షన్ కోడ్ కూడా బ్రేక్ చేయగల సాఫ్ట్వేర్ తయారుచేయించాడు. ఇన్‌కమ్‌టాక్స్ వాళ్ల చేతికి తన క్లయింట్ల పేర్లు చిక్కకుండా సిమ్ కార్డును క్రష్ చేసేశాడు.
దాడి సందర్భంగా అధికారులకు కళ్లు చెదిరేటన్ని ఆస్తులు, వ్యవహారాలు బయటపడ్డాయి. అతని దగ్గర దొరికిన దస్తావేజుల పరిశీలనలో తేలినవి – అతనికి హైలెవెల్లో వున్న విఐపిల సన్నిహిత సంబంధాలున్నాయి, డిఫెన్సు మినిస్ట్రీలో వుండవలసిన రహస్య (క్లాసిఫైడ్) డాక్యుమెంట్లు – పాతా, కొత్తా – అతని యింట్లో వున్నాయి. అతనికి లండన్‌లో బోర్డన్ స్ట్రీట్‌లో 2013లో రూ. 10 కోట్లకు కొన్న ఫ్లాట్, దుబాయిలోని జుమేరాలో 2010 రూ. 5 కోట్లకు కొన్న మరొక ఫ్లాట్ వున్నాయి. పనామాలో వున్న కంపెనీల్లో వాటాలున్నాయి. అతని యింటికి రాని పెద్ద లీడరు లేడు. వారిలో ఆడ్వాణీ, రాబర్ట్ వాద్రాతో సహా అనేకమంది వున్నారు. షీలా దీక్షిత్‌తో వారానికి రెండు సార్లు మాట్లాడేవాడు. అతని సన్నిహితుల్లో సీనియర్ బిజెపి నాయకుడు జాతీయ కార్యదర్శి సిద్ధార్థ నాథ్ సింగ్ వున్నాడు. ఏడాదిలో 164 కాల్స్ చేశాడు. ''కేవలం పరిచయమే తప్ప, వ్యాపారబంధం ఏదీ లేదు' అంటాడు సిద్ధార్థ. అశోక గజపతిరాజు సెక్రటరీ అప్పారావుతో కూడా 355 కాల్స్ చేశాడు. అనేకమంది మంత్రుల సెక్రటరీలతో, బ్యూరాక్రాట్స్తో సంజయ్ రెగ్యులర్‌గా టచ్‌లోనే వున్నాడు. డిఆర్డిఓ నుంచి రిటైరైన డా. పికె వాసుదేవ సేవలు సంజయ్ వుపయోగించు కుంటున్నాడని హోం శాఖ అంటోంది. ''హిందూస్తాన్ టైమ్స్''లో సీనియర్ ఎడిటరైన శిశిర్ గుప్తాకు 478 కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. బ్రిగేడియర్ సతీష్ కుక్రేజాతో కూడా తరచుగా మాట్లాడుతూంటాడని కాల్ రికార్డు చెప్తోంది. మీడియా వాళ్లు వేసిన ప్రశ్నలకు వాళ్లెవరూ సమాధానాలివ్వలేదు. దాడి తర్వాత అతను వెంటనే మోదీకి అత్యంత సన్నిహితులైన యిద్దరి ద్వారా మోదీకి కబురంపాడట – 'మీ రాజకీయ శత్రువుల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాను, దానికి బదులుగా నన్ను కేసుల్లోంచి తప్పించి, ఇమ్యూనిటీ కల్పించాలి.' అని. దానికి మోదీ స్పందించలేదు. అది తెలిసి భండారీకి సన్నిహితులైన కాబినెట్ మంత్రుల దగ్గర్నుంచి ఉన్నత పదవుల్లో వున్నవారందరూ మొఖం చాటేశారు.
అరవింద్ కోసం గేలం వేస్తే దానిలో భండారీ పడ్డాడు. భండారీ నోట్లో వాద్రా దొరికాడు. అదెలా జరిగిందంటే, భండారీ తన మెయిల్ బాక్స్ అంతా తుడిచేసినా, అతను తన మెయిల్సన్నిటినీ తన సెక్రటరీకి కాపీ పెట్టిన విషయాన్ని ఐటీవారు గమనించి సెక్రటరీ కంప్యూటరు స్వాధీనపరచుకుని, చెక్ చేస్తే ఈ-మెయిల్స్ బయటపడ్డాయి. సెంట్రల్ లండన్‌లో ఉన్న ఒక ఫ్లాట్ గురించి అతనికి, రాబర్డ్ వాద్రా సెక్రటరీకి మధ్య నడిచిన ఈ-మెయిల్స్ విషయం బయటకు రాగానే మీడియా దృష్టి దానిపై పడింది. రాజకీయంగా అది పెద్ద అంశం అయిపోయింది. తక్కిన విషయాలపై జరగవలసినంత చర్చ జరగటం లేదు. లండన్ ఆఫీసుల్లో వున్న రికార్డుల ప్రకారం ఆ ఫ్లాట్ (ఫ్లాట్ నెం.12, బ్రయాన్స్టన్ స్క్వేర్, లండన్) 2005 నుంచి ఒక బ్రిటిషు జంట పేరు మీద వుంది. వాళ్లు వాద్రా బినామీలా కాదా అన్నది తెలియదు. బినామీలన్న అనుమానం ఎందుకు వస్తోందంటే, లండన్‌లో వున్న సంజయ్ సహాయకుడు సుమిత్ ఛద్దా ఆ యింటి మరమ్మత్తులకైన ఖర్చు గురించి వాద్రా సెక్రటరీకి మెయిల్స్ రాశాడు. వాద్రా ఒక ఈమెయిల్ ఆ సంగతి చూస్తానని జవాబిచ్చాడు. ఆ యింటి సొంతదారులెవరని ఇన్‌కమ్‌టాక్స్ వాళ్లు భండారీని అడిగితే 'దస్తావేజులు చూస్తే తప్ప చెప్పలేను' అన్నాడు. రాబర్ట్ వాద్రా తెలుసా అంటే తెలుసు అన్నాడు. వాద్రా లాయర్లు తమ క్లయింటుకు 12వ నెంబరు ఫ్లాట్‌ను ప్రత్యక్షంగాకాని, పరోక్షంగా కాని కొనలేదని జవాబిచ్చారు. అదే బిల్డింగులో వున్న ఒక ఫ్లాట్ (12 వ నెంబరు అవునో కాదో తెలియదు)ను షార్జాలో 2010లో నెలకొల్పిన మేఫెయిర్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ రూ. 19 కోట్లకు కొందని ఎన్‌ఫోర్స్‌మెంటు డైరక్టరేట్ కనుగొంది.
సంజయ్ భండారీ యీ స్థాయిలో వ్యాపారం చేయడానికి, ఢిల్లీలో యింత పలుకుబడి సాధించడానికి కారణం అతని తండ్రి రాజేంద్ర కుమార్ భండారీ పేరు మోసిన హోమియోపతి వైద్యుడు కావడం, ఢిల్లీలోని ప్రముఖులలో చాలామంది – రాజకీయ నాయకులతో సహా – ఆయన క్లయింట్లు కావడం. వాళ్లు హోమియో క్లినిక్కులు, హోమియో స్టోర్స్ చాలానే వున్నాయి. ఢిల్లీలో మోడర్న్ స్కూలులో చదివిన సంజయ్ కు స్కూల్లోనే ఉన్నత కుటుంబాల పిల్లలతో స్నేహం ఏర్పడింది. పెద్దయ్యాక తండ్రి వ్యాపారమే చూసుకునేవాడు. తండ్రి పేరు చెప్పే అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆయిల్, నేచురల్ గ్యాస్‌కు డిమాండ్ వుండే రోజుల్లో 2002-07 మధ్య ఆ వ్యాపారం చేసి డబ్బు గడించాడు. 2006లో యుపిఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఒక రూలు పెట్టింది. దాని ప్రకారం రూ. 300 కోట్లు, ఆ పై బడి డిఫెన్సు కాంట్రాక్టు తెచ్చుకున్న విదేశీ కంపెనీ కాంట్రాక్టులో 30% డబ్బును ఇండియాలో పెట్టుబడిగా పెట్టి, దాని ద్వారా అమ్మిన వస్తువుల తాలూకు స్పేర్ పార్టులు, లేదా రిపేరు సర్వీసులు అందించాలి. ఈ రూలు వచ్చాక 2008లో భండారీ ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రై.లి. అనే పేర డిఫెన్సు కాంట్రాక్టుల ఆఫ్సెట్ కంపెనీ పెట్టాడు. డిఫెన్సు కాలనీలో అతని పొరుగున వున్న ఒక రియల్ ఎస్టేటు వ్యాపారస్తుడు అతన్ని పెద్దవాళ్ల సర్కిల్‌కు పరిచయం చేశాడు. భండారీ స్నేహితుల్లో బిమల్ సరీన్ అనే అతను యిప్పటికే ఆ వ్యాపారంలో వున్నాడు. అతని సహాయంతో డిఫెన్సు కాంట్రాక్టుల వ్యాపారంలో దిగాడు. 2010 జనవరిలో ప్రగతి మైదాన్‌లో జరిగిన డిఫెన్సు ఎక్స్‌పోలో ఓ స్టాల్ తీసుకున్నాడు కానీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు.
అయినా అతను నిరుత్సాహ పడలేదు. డిఫెన్సు శాఖలో స్నేహితులను సంపాదించుకుని, ఎవరో పెద్ద చేపను (ఎవరో యింకా తెలియలేదు) పట్టుకుని తన పనులు సాధించుకున్నాడు. అందుకే ఇతను చిన్న స్థాయి వాడే అయినా 2012లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 75 పిలాటస్ బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 4 వేల కోట్లకు అమ్మిన స్విజర్లండ్ కంపెనీ పిలాటస్ కంపెనీ యితని సేవలను వుపయోగించుకుంది. 2010లో స్విస్ బ్యాంకు ద్వారా 25 లక్షల స్విస్ ఫ్రాంకులొకసారి, 75 లక్షల స్విస్ ఫ్రాంకు లొకసారి కంపెనీ నుంచి ఓఐయస్ ఎడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీ ఖాతాకు వచ్చాయి. అది సంజయ్‌కు సంబంధించినదే. లక్ష రూ.ల పెయిడ్అప్ కాపిటల్‌తో ఢిల్లీ డిఫెన్సు కాలనీ అడ్రసుతో పెట్టారు. ఓఖ్లాలోని తమ స్థలంలో రాడార్స్, ఏరియల్ వెహికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతామని రిజిస్ట్రార్ అఫ్ కంపెనీకి చెప్పారు. కానీ ఓఖ్లా అడ్రసు బోగస్! డిఫెన్సు, ఏరోస్పేస్ కొనుగోళ్లలో యిలాటి ఆఫ్సెట్ చెల్లింపులు సహజంగా అవుతూ వుంటాయి. తమకు బేరం కుదిర్చిపెట్టినందుకు ఆ విదేశీ ఉత్పత్తిదారులు యీ ఏజంట్లకు కమిషన్ చెల్లిస్తూంటారు. బేరం కుదరడానికి యీ కంపెనీ వాళ్లు డిఫెన్సు, విమానయాన శాఖల్లోని మంత్రులు, అధికారులకు ముడుపులు చెల్లించినట్లుగా రుజువైతే అది నేరమౌతుంది. అశోకగజపతి రాజు విమానయాన శాఖా మంత్రి కాబట్టే ఆయన సెక్రటరీతో సంజయ్‌కు అన్ని ముచ్చట్లు!
రాబర్ట్ వాద్రాకు లండన్‌లో బినామీ ఆస్తి వుందా లేదా అన్న విషయం మీదే గురి పెట్టడం వలన ఎన్నో సంగతులు మరుగున పడతాయి. అన్నిటికన్న ముఖ్యమైన విషయం డిఫెన్సు శాఖలో సంజయ్ భండారీకి వున్న పలుకుబడి. 2012 నాటి డిఫెన్సు ఎక్స్‌పోలో అతని స్టాల్ అందర్నీ ఆకర్షించింది. అతను వాద్రాకు సన్నిహితుడన్న విషయం అప్పుడే బయటకు వచ్చింది. డిఫెన్సు కాంట్రాక్టుల విషయంలో అతను అక్రమ మార్గాలు అవలంబించాడని ఆరోపణలున్నాయి. తను ప్రాతినిథ్యం వహిస్తున్న కంపెనీతో పోటీ పడే యితర కంపెనీల గురించి డిఫెన్సు శాఖ ద్వారా సమాచారం సేకరించడం, వారిపై నిరాధారమైన ఆరోపణలు చేసి తప్పించడం వంటివి చేశాడట. నఫే సింగ్ అనే అతను యిచ్చిన ఫిర్యాదు ప్రకారం – 126 ఫైటర్ ప్లేన్లు కొనుగోలుకు సంబంధించిన ఫైలు ఆఫీసులోంచి మిస్సయిపోయింది. తర్వాత ఎక్కడో రోడ్డు మీద దొరికింది. దానికి కారకుడు భండారీయే అని అతని ఆరోపణ. ఎఫ్-16, ఎఫ్-18 సప్లయి చేయడానికి పోటీపడిన అమెరికన్్ కంపెనీలకు కేంద్ర హోం శాఖ ఫైళ్ల ఫోటో కాపీలు అంద చేసినది కూడా భండారీయేట. పిలాటస్కు, భండారీని పరిచయం చేసి, అతనికి డిఫెన్సు శాఖ తలుపులు బార్లా తీసిపెట్టిన దెవరో తేలాలి. అది రాబర్ట్ వాద్రాయే అనే రుజువు దొరికితే బినామీ ఆస్తుల గొడవ దాని ముందు పాలిపోతుంది. భండారీ పలుకుబడి యుపిఏ హయాం తర్వాత అంతరించిందా, ఎన్డిఏ హయాంలో కూడా కొనసాగుతోందా, కొనసాగుతూంటే దానికి కారకులెవరు అనేది కూడా విచారణలో బయటకు రావాలి. మీడియా యీ విషయంలో చురుగ్గా వ్యవహరించి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చేట్లు చేస్తేనే బాగుంటుంది. ''హిందూస్తాన్ టైమ్స్'' ఒక్కటే యీ వ్యవహారంలో చాలా విషయాలు బయట పెట్టింది. తక్కినవారు తగినంత శ్రద్ధ చూపటం లేదని తోస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)