విద్యాలయాలను రణరంగాలుగా, రాజకీయవేదికలుగా మారుస్తున్న ఘట్టం శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో కూడా చూస్తున్నాం. మామూలుగా చూస్తే ఇండియా ఓడిపోతే సంబరాలు చేసుకున్నవారికి బుద్ధి చెప్తే తప్పేముంది అనేయవచ్చు సింపుల్‌గా. కానీ సంఘటనల తర్వాత వచ్చిన స్టేటుమెంట్లు చూస్తే ఆందోళనకారుల రహస్య ఎజెండా తెలుస్తుంది – ఎన్‌ఐటి శ్రీనగర్ నుంచి జమ్మూకి మార్చేయాలి, యూనివర్శిటీ ప్రాంగణంలో గుడి కట్టాలి, గేటు వద్ద జాతీయపతాకం ఎగరవేయాలి, యూనివర్శిటీలో సెంట్రల్ ఫోర్సెస్‌ను శాశ్వతంగా వుంచాలి… యివీ డిమాండ్లు. యూనివర్శిటీకి వచ్చేది దేనికి, చదువుకోవడానికా? గుళ్లో పూజలు చేయడానికా? నడి రోడ్ల మీద గుళ్లు, మసీదులు కట్టేస్తున్నారు, అది చాలదా? ఇన్నాళ్లూ లేని భక్తి యిప్పుడెందుకు వచ్చింది? అవతలివాళ్లను రెచ్చగొట్టడానికా? వాళ్లు వూరుకుంటారా? మసీదు కట్టమంటారు, యింకోళ్లు చర్చి అంటారు, మరోళ్లు గురుద్వారా అంటారు. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అయ్యవార్లందరినీ వంటవాళ్లు చేసినట్లు, మంత్రాలు వచ్చినవాళ్లనే టీచర్లగా వేసి పార్ట్‌టైమ్ పూజారిగా పనిచేయాలని రూలు పెట్టాలి.
శ్రీనగర్ నుంచి విద్యాసంస్థ ఎత్తేయాలన్న డిమాండు గురించి చెప్పాలంటే – అసలది అక్కడెందుకు పెట్టారో మొదట ఆలోచించాలి. దేశంలోనే కాదు, నగరంలో కూడా కొన్ని కల్లోలిత ప్రాంతాలుంటాయి. సంఘవ్యతిరేక శక్తులు అక్కడకు చేరి, ఆ ప్రాంతాన్ని తమ యిష్టారాజ్యంగా ఏలతాయి. పాలనావ్యవస్థకు, పోలీసులకు అక్కడ రక్షణ వుండదు. అభివృద్ధి ఫలాలు అక్కడకు చేరకుండా ఆ శక్తులు అడ్డుకుంటూ వుంటాయి. విషయం బాగా అర్థం కావాలంటే మన పాత బస్తీయే తీసుకోండి. ఒకప్పుడు అనేక ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే వుండేవి. వాటి కోసం వచ్చేపోయేవారితో అక్కడ మిశ్రమజనాభా వుండేది. ప్రభుత్వం తెలివితక్కువగా ట్రాఫిక్ సమస్య పేరు చెప్పి క్రమేపీ అనేక ఆఫీసులను అక్కణ్నుంచి మూసీకి యివతలివైపుకి తరలించేసింది. దాంతో ఆ ప్రాంతం మొత్తం మజ్లిస్‌కు ధారపోసినట్టయింది. వారి అండతో కొందరు, వారిని చూసి యింకొందరు అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ కరంటు మీటరు చెక్ చేయాలన్నా భయమే, ఫంక్షన్ల కోసం వైరుల్లోంచి కరంటు లాగేసినవాళ్లను పట్టుకోవాలన్నా భయమే. తమకు యిష్టమైనవాళ్లను ఓటేయాలన్నా భయమే, ప్రత్యర్థులకు తమ బ్యానర్లు కట్టుకోవాలన్నా భయమే, గణేశ్ విగ్రహం ఊరేగింపన్నా భయమే. కార్పోరేషన్ అధికారులు, ఆస్పత్రులలో వైద్యులు అందరూ మజ్లిస్ చేతిలో దెబ్బలు తిన్నవారే. దాడి చేసినవారిపై ప్రభుత్వం చర్య తీసుకోవద్దు. అధికారంలో ఏ పార్టీ వున్నా యిదే తంతు. మజ్లిస్‌తో ఒప్పందం – పాత బస్తీ జోలికి మేం రాము. ఇష్టారాజ్యం, భరతుడికి పట్టంలా మీకిష్టం వచ్చినట్లు పాలించుకోండి అని. అక్కడ మెట్రో లైన్ వేయాలన్నా ఒవైసీగారు తలవూపాలి. లేకపోతే ఆ లైను అక్కడితోనే సమాప్తం.
దీనికి విరుగుడేమిటి? పాతబస్తీ ప్రజలు ఆధునిక సౌకర్యాలు నోచుకోవాలంటే ఏం చేయాలి? కొన్నయినా ప్రభుత్వాఫీసులు, పెద్ద కళాశాలలు అక్కడ పెట్టాలి. రోడ్లు విశాలం చేయించాలి, సిసిటివి కెమెరాలు అడుగడుగునా పెట్టి నిఘా వేయాలి. ఇవన్నీ అక్కడ సాగవండీ అంటూ వదిలేశారు కాబట్టే అవి ఘెట్టోల్లా తయారయి, ఉగ్రవాదులు దాక్కోవడానికి సురక్షితమైన డెన్‌లా తయారయ్యాయి. కొన్ని అరణ్యప్రాంతాలు, పర్వతప్రాంతాలు పౌరసమాజానికి దూరంగా వుండి అభివృద్ధి ఫలాలు అందుకోలేనప్పుడు అక్కడ నక్సలైట్లు ప్రబలుతారు. గిరిజనులను బెదిరించి తమ గుప్పిట్లో పెట్టుకుంటారు, నక్సలైట్ల జాడ చెప్పమని పోలీసులూ గిరిజనులను హింసిస్తారు. దీనికి పరిష్కారం – ఆ ప్రాంతాన్ని మెయిన్‌ల్యాండ్‌తో కలుపుతూ రహదారులు వేయడం, ఆసుపత్రులు పెట్టి, స్కూళ్లు పెట్టి, వారి ఉత్పాదనలకు మార్కెట్లు నెలకొల్పి, మైదానప్రాంత జనాల పట్ల గిరిజనుల్లో భయాన్ని పోగొట్టి వారిని జనజీవనంలోకి తీసుకురావడం! వారి స్థితిగతులు మెరుగుపడితే వారు నక్సలైట్ల బోధలు వినడం మానేస్తారు. ఇలా జరుగుతుందని నక్సలైట్లు ముందే వూహిస్తారు కాబట్టి రోడ్లు వేయడానికి, స్కూళ్లు, ఆస్పత్రులు కట్టడానికి వచ్చిన కంట్రాక్టర్లను చంపివేస్తారు, అధికారులను ఎత్తుకుపోతారు. కట్టినవాటిని కూలుస్తారు, తగలబెడతారు. తమ పట్టు పోకుండా వుండడానికై గిరిజనులకై కట్టిన సౌకర్యాలను నాశనం చేస్తారు.
ఇప్పుడు కశ్మీరు సంగతి చూదాం. పాత బస్తీని మజ్లిస్‌కు ధారాదత్తం చేసినట్లే కశ్మీర్‌ను షేక్ అబ్దుల్లా కుటుంబానికి ధారపోశారు. ఎందుకు? అతను కశ్మీర్‌ను భారత్‌లో కలిపి వుంచుతానని మాట యిచ్చాడు కనుక! అతను మాట యిచ్చేదేముంది బోడి, కశ్మీరు మన దేశంలో అంతర్భాగమే కదా! అని చాలామంది ఆశ్చర్యపడవచ్చు. ఎలా? అని అడిగితేే మహాభారత గాథలు చెప్తారు. అలా చూడబోతే నేపాల్, భూటాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బర్మా, ఆగ్నేయాసియా దేశాలు – అన్నీ ఒకప్పుడు భారతీయులు పాలించినవే. కానీ అవన్నీ స్వతంత్ర దేశాలు కాలేదా? ఒకప్పుడు మనం పాలించాం అనే లెక్క వేస్తే మరి అఫ్గనిస్తాన్ నుంచి మొఘలులు వచ్చి ఇండియాను పాలించారు, అందుచేత ఇండియా మాదే అని ఆఫ్గన్లు అంటే…? ఆంగ్లేయులు వదిలి వెళ్లేనాటికి కశ్మీరు సంస్థానాధిపతి హిందూస్తాన్, పాకిస్తాన్ ఎవరితోనూ కలవకుండా స్వతంత్ర దేశంగా వుంటానన్నాడు.
కశ్మీరు చరిత్ర చెప్పుకురావాలంటే చాలా వుంది. సింపుల్‌గా తేల్చేస్తే – హైదరాబాదును దేశంలో విలీనం చేయాలని గట్టిగా అనుకున్న పటేల్ కశ్మీర్‌ను మాత్రం విడి దేశంగా వుంచేస్తే మంచిదని పటేల్ అనుకున్నాడు. ఏదో ఒకటి చేసి, భారత్‌లో కలపాలని నెహ్రూ అన్నాడు. తన పూర్వీకులు కశ్మీరు వాళ్లు అనే ఫీలింగుతో అయితే కాదని నా నమ్మకం. ఎందుకంటే వాళ్లు అలహాబాదునే తమ స్వస్థలం అనుకున్నారు. కశ్మీరులో ఆస్తులేమీ కొనలేదు. సరిహద్దుల్లో నేపాల్‌లా వదిలేస్తే పాకిస్తాన్ కబళిస్తుందనుకున్నాడో ఏమో తెలియదు. నిజంగా పాకిస్తాన్ కబళించబోయింది. అప్పుడు కృష్ణ మేనోన్ తెలివితక్కువ సలహాపై ఐక్యరాజ్యసమితికి సమస్యను నివేదించి వ్యూహాత్మక తప్పిదం చేశాడు నెహ్రూ. యథాతథ పరిస్థితి కొనసాగి కశ్మీరులో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో వుండిపోయింది. కశ్మీరును వివాదాస్పద ప్రాంతంగా అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. అనేక దేశాలు కశ్మీరును భారత్‌లో భాగంగా తమ మ్యాప్‌లలో చూపించడం లేదు. నిజానికి కశ్మీరు ప్రజలు భారత్‌తో కాని, పాకిస్తాన్‌తో కాని కలవాలనుకోరు. తమ జాతి వేరని, తాము స్వతంత్రదేశంగా వుండాలని కోరుకుంటారు. అక్కడి వ్యాపారస్తులు తమ బోర్డులు 'ఇండో-కశ్మీర్ ఎంపోరియం' అని రాసుకోవడం గమనించవచ్చు. ఇండియా, కశ్మీర్ వేర్వేరు దేశాలన్న భావం స్ఫురిస్తుంది. 'ఇండో-తమిళనాడు స్టోర్స్' అని ఎక్కడైనా చూస్తామా? వాళ్లకు జమ్మూ వాళ్లన్నా పడదు. జమ్మూవాసులు, కశ్మీరువాసులు ఒకరినొకరు నమ్మరు. కశ్మీరుని భారత్‌తో ఎలాగైనా కలిపి వుంచాలనే ఆరాటంతో జమ్మూతో దానికి బలవంతపు పెళ్లి చేశారు. కశ్మీరు రాజు తన దుష్పరిపాలన కారణంగా ప్రజాదరణ కోల్పోయాడు. ప్రజల తరఫున షేక్ అబ్దుల్లా తిరుగుబాటు వీరుడిగా ఖ్యాతి పొందాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజు భారత్‌తో ఒప్పందం చేసుకుని విలీనం చేస్తానన్నాడు. తనకు అధికారం యిస్తే యిబ్బంది విలీనానికి అడ్డు పెట్టనని షేక్ అబ్దుల్లా బేరం పెట్టాడు.
ఆ విధంగా కశ్మీరు భారత్‌లో భాగమైంది. షేక్ అబ్దుల్లా చచ్చేటన్ని హిరణ్యాక్షవరాలు కోరాడు. అన్నీ యిచ్చి నెత్తిమీద కుంపటి తెచ్చుకుంది భారత్. కశ్మీరుపై ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో లెక్కలు తీస్తే గుండెలు అవిసిపోతాయి. ఎక్కడైనా ప్రజాభిప్రాయం ప్రకారం పోవాలని ఎవరైనా చెప్తారు. కశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరిపి దాని ప్రకారం దానికి స్వాతంత్య్రం యిచ్చేయడమో, తక్కిన రాష్ట్రాలతో సమానంగా దాన్ని చూడడమో చేయాలని ఎవరైనా అంటే సబబైన మాటే. కానీ భారతప్రభుత్వానికి ప్లెబిసైట్ నిర్వహించే దమ్ము లేదు. దశాబ్దాలుగా ఎన్నిసార్లు డిమాండ్ వచ్చినా తోసి పుచ్చుతూంటుంది. ఎందుకలా? దానికి తెలుసు – ప్లెబిసైట్ నిర్వహిస్తే భారత్ నుంచి విడిపోతామని వాళ్లంటారు. హైదరాబాదు కేసులో రాజు భారత్‌లో కలవను అన్నాడు, ప్రజలు కలుస్తామన్నారు. కశ్మీరు కేసులో ప్రజలు కలవము అన్నారు, రాజు కలుస్తానన్నాడు. హైదరాబాదులో ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లినట్లే కశ్మీరులో కూడా వెళ్లాలిగా, వెళ్లలేరు. అందువలన ప్రజల గొంతు నొక్కడానికి భారత్ ప్రభుత్వం షేక్ అబ్దుల్లాతో ఒప్పందం కుదుర్చుకుంది. 'నీ యిష్టం వచ్చినట్లు పాలించు, మేం నీ జోలికి రాము' అని. అబ్దుల్లా కుటుంబం ఎన్నికలను రిగ్ చేస్తూ తమ అధికారాన్ని కొనసాగించారు. భారత్ కళ్లు మూసుకుని కూర్చుంది. గట్టిగా ఏమైనా అంటే విడిపోతామని అంటారని భయం. కశ్మీరు రాజకీయ చరిత్రను అధ్యయనం చేసినవారు యిప్పటిదాకా ఏ నాలుగైదు సార్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని అంటారు. అబ్దుల్లా కుటుంబ రాజకీయాలు, ప్రజాస్వామ్యాన్ని పరిహసించి ప్రజలను పేదలుగా, విద్యాహీనులుగా వుంచడంతోనే అక్కడ అశాంతి రగిలింది. దాన్ని పాకిస్తాన్ తనకు అనువుగా మార్చుకుంది. సాధారణ ప్రజలను రెచ్చగొట్టింది. గత 30 ఏళ్లగా కశ్మీరులో శాంతియుత వాతావరణం లేదు. అక్కడి పిల్లలకు బయటకు వెళ్లి ఆడుకోవడం తెలియదు. సైన్యం నిత్యం పహరా కాయవలసినదే.
సైన్యంతో నిత్యసహజీవనం చాలా కష్టం. సైనికులలో గొప్ప లక్షణాలతో బాటు కొన్ని అవలక్షణాలు కూడా వుంటాయి. సరిహద్దుల్లో పరదేశపు సైనికులతో పోరాడడం వేరు. కానీ ఘర్షణాపూరిత ప్రాంతాన్ని అనుక్షణం పహరా కాస్తూ వుండవలసిన వాతావరణం వేరు. నిత్యం చావుతో దాగుడుమూతలాడుతూ, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని భయానక వాతావరణంలో వారు కొన్నిసార్లు పౌరుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారు. ప్రతి యువకుణ్ని అనుమానిస్తారు. కొన్ని సందర్భాల్లో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు. తమపై టెర్రరిస్టులు దాడి చేస్తే కక్ష కొద్దీ పౌరులను శిక్షిస్తారు. ప్రపంచం మొత్తంలో అదే కథ. అయితే వారిని అక్కడకు పంపిన ప్రభుత్వం వారి చర్యలను వెనకేసుకుని రాకతప్పదు. దాంతో పౌరులకు సైన్యం పట్ల, దాని తప్పుల్ని కాస్తున్న ప్రభుత్వం పట్ల ద్వేషం. కశ్మీరు యిలాటి దుర్భర పరిస్థితుల్లో దశాబ్దాలుగా బతుకుతోందని గ్రహించాలి. పరిస్థితి చాలా డెలికేట్‌గా వుంటుంది. ప్రజలను నొప్పించకుండా వారిని భారత దేశ స్రవంతిలోకి తీసుకురావడం ఎంతో ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. నెహ్రూ తర్వాత వచ్చిన ప్రధానులందరూ తమ తమ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కానీ ఎవరూ సఫలీకృతం కాలేదు. ప్రతిపక్షంలో వుండగా బిజెపి కశ్మీరు ప్రత్యేక ప్రతిపత్తి తీసేయాలి అని నినదిస్తుంది. కానీ అధికారంలోకి వచ్చేసరికి యిబ్బందులు బోధపడతాయి.
ఆడ్వాణీ రథయాత్ర చేసి పేరు తెచ్చుకున్నాడు కదాని అతని తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన మురళీ మనోహర్ జోషి ఏక్‌తా యాత్ర చేసి 1992 రిపబ్లిక్ డేన శ్రీనగర్ వెళ్లి లాల్ చౌక్‌లో జాతీయపతాకం ఎగరవేయబోయాడు. ఒక్క కశ్మీరీ యైనా రాలేదు. జోషి, ఆ యాత్రకు కన్వీనరుగా వున్న నరేంద్ర మోదీతో సహా మొత్తం 67 మంది బిజెపి కార్యకర్తలున్నారు. అంతకు రెండు రోజుల ముందే పోలీసు హెడ్‌క్వార్టర్సు వద్ద బాంబు పేలడంతో ఉగ్రవాదులు తమ మీద కూడా దాడి చేస్తారేమోనని భయంతో జమ్మూ నుంచి రోడ్డుపై వచ్చే ప్లాను మానుకుని, విమానంలో ఎగిరి వచ్చి, ముందురోజు రాత్రి బిఎస్‌ఎఫ్ మెస్‌లో తలదాచుకుని, పొద్దున్నే చుట్టూ మిలటరీ వాళ్లను పెట్టుకుని మొత్తం కార్యక్రమం 12 ని||లలో ముగించి, హమ్మయ్య అని తిరిగి వచ్చాడు జోషి. మామూలు చోట జండా ఎగరవేయడం ఏ మాత్రం ఘనకార్యం కాదు, కానీ కశ్మీరులో మాత్రం సాహసకృత్యమే. అప్పుడు కేంద్రంలో కాంగ్రెసు వుంది కాబట్టి అలా అఘోరించిందని అనుకుంటే ప్రస్తుతం బిజెపికి కేంద్రంలో సొంతంగా అధికారం చలాయిస్తోంది. మరి తన కశ్మీరు విధానాన్ని అమలు చేయగలిగిందా? లేదే! కశ్మీరు అసెంబ్లీలో బిజెపికి మెజారిటీ రాలేదు. పిడిపితో కలిసి అధికారం పంచుకుంది. అది నిశ్చయంగా రాజకీయ అవకాశవాదమే, కానీ ఆచరణవాదం కూడా. ముఫ్తీ మరణం తర్వాత మెహబూబాతో ఒప్పందం కుదరడానికి నెలన్నర పట్టింది. అయినా బిజెపి ఓపిక పట్టింది. ఎందుకంటే జింగోయిజం ఎక్కడైనా నడుస్తుంది కానీ కశ్మీరులో నడవదు. అది అంతర్జాతీయ సమాజపు నిరంతర నిఘాలో వుంటుంది. వ్యవహారాలు డెలికేట్‌గా డీల్ చేయాలి. అక్కడి తూకాన్ని అప్‌సెట్ చేయడానికి చూసేవాళ్లు భారత్‌కు మేలు చేసినవారు కారు. ఇది మనసులో పెట్టుకుని ఏప్రిల్‌లో జరిగిన సంఘటనలను విశ్లేషించాలి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)