ఎమ్బీయస్‌ : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు

దాదాపు పదిహేనేళ్లగా పుదుచ్చేరిలో ప్రముఖుడిగా వున్న ఏలుతున్న ఎన్‌. రంగసామి యీ సారి తన గద్దెను నిలుపుకుంటాడా లేదా అన్నది పుదుచ్చేరి ఎన్నికలలో ఆసక్తి కలిగించే అంశం. మన యానాంతో కలిపి దాని మొత్తం…

దాదాపు పదిహేనేళ్లగా పుదుచ్చేరిలో ప్రముఖుడిగా వున్న ఏలుతున్న ఎన్‌. రంగసామి యీ సారి తన గద్దెను నిలుపుకుంటాడా లేదా అన్నది పుదుచ్చేరి ఎన్నికలలో ఆసక్తి కలిగించే అంశం. మన యానాంతో కలిపి దాని మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 30. 2001లో కాంగ్రెసు (11 సీట్లు) డిఎంకె (7 సీట్లు) ల కూటమి గెలిచింది. ఎడిఎంకెకు 3, యితర పార్టీలకు తక్కిన  సీట్లు వచ్చాయి. కాంగ్రెసు నాయకుడు షణ్ముగం అనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 1991 నుంచి తట్టాన్‌చావిడీ అనే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన రంగసామి మేలో పిడబ్ల్యుడి మంత్రి అయ్యాడు. కొన్ని నెలల్లోనే పార్టీలో ముసలం పుట్టి, ముఖ్యమంత్రి సీటు దిగి వణ్నియార్‌ కులస్తుడైన రంగసామిని కూర్చోబెట్టవలసి వచ్చింది. రంగసామి మొదటిసారిగా 1990లో ఎన్నికలలో దిగినపుడు ఓడిపోయాడు. చాలా నిరాశకు గురై రాజకీయాల్లోంచి తప్పుకుందామనుకున్నాడు. ఒక మిత్రుడు సేలంలో వున్న అప్పా పైత్యం స్వామి అనే గురువుగారిని దర్శించమని సలహా యిచ్చాడు. ఆ స్వామీజీ 'నువ్వు ఓపికపట్టు, రాజకీయాల్లో రాణిస్తావు' అని సలహా యిచ్చాడు. రంగసామి ఆయన మాట మన్నించి వుండిపోయాడు. 1991లో మళ్లీ పోటీ చేసే అవకాశం వచ్చింది. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. అది జరిగిన పదేళ్లకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక రంగసామికి స్వామీజీ చెప్పిన మాట వేదవాక్కే. అనేక కీలకమైన నిర్ణయాలు కూడా ఆయన దగ్గర్నుంచి సంకేతం రాలేదన్న కారణంగా ఆపిపెట్టేవాడు. చివరకు స్వామీజీ గతించినప్పుడు సేలంలో వున్న ఆయన సమాధిని పోలిన స్మారకచిహ్నాన్ని పుదుచ్చేరిలో కట్టించాడు. 2006 ఎన్నికలలో మళ్లీ కాంగ్రెసు డిఎంకె కలిసి పోటీ చేయగా కాంగ్రెసుకు 10, డిఎంకెకు 7 వచ్చి అధికారంలోకి వచ్చాయి. ఎడిఎంకెకు 3, ఎండిఎకెకు 3 యితరులకు తక్కినవీ వచ్చాయి. రంగసామే ముఖ్యమంత్రి అయ్యాడు. 

ముఖ్యమంత్రిగా వున్నా సరే రంగసామి చాలా సాధారణ జీవితం గడుపుతాడు. ప్రజల మనిషిగా పేరుబడిన అతన్ని ఎవరు కావాలంటే వాళ్లు సులభంగా కలవవచ్చు. రాష్ట్రనిధుల్లో చాలాభాగం తన నియోజకవర్గంలోనే ఖర్చుపెట్టి అక్కడ బాగా పేరు తెచ్చుకున్నాడు. అతని అభిమానులు ప్రతీ ఏడూ అతని పుట్టినరోజును ఘనంగా జరుపుతారు. అతన్ని వివిధ గెటప్పుల్లో ఫ్లెక్సీల్లో చూపించి మురిసిపోతారు. కొన్ని ఫోటోలు యిక్కడున్నాయి చూడండి. ఈ ప్రజాదరణ తక్కిన నాయకులకు నచ్చలేదు. తమను పట్టించుకోడని హై కమాండ్‌కు ఫిర్యాదు చేసి, వాళ్లను ఒప్పించారు. దాంతో వాళ్లు రంగసామిని 2008లో తప్పుకోమని వైద్యలింగం అనే అతన్ని ముఖ్యమంత్రి చేశారు. దాంతో ఒళ్లు మండిన రంగసామి అప్పటికి వూరుకుని సరిగ్గా ఎన్నికలకు ముందు 2011లో కాంగ్రెసులోంచి బయటకు వచ్చేసి తన పేరు పొడి అక్షరాలతో ఎఐఎన్‌ఆర్‌సి (ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌) అని పార్టీ పెట్టుకున్నాడు. ఈసారి ఎడిఎంకె అతనితో జతకట్టింది. ఇతనికి 15, ఎడిఎంకెకు 5 వచ్చాయి. డిఎంకె- కాంగ్రెసు కూటమిలో డిఎంకెకు 2, కాంగ్రెసుకు 7 వచ్చి ప్రతిపక్షంలో కూర్చున్నాయి. రంగసామి ముఖ్యమంత్రి అయిపోయాడు. పొత్తు కుదుర్చుకునేటప్పుడు తమకు మంత్రి పదవులు యిస్తానని మాట యిచ్చి తర్వాత తప్పాడని జయలలిత ఆరోపించింది. ఇలా డిఎంకె, కాంగ్రెసు, ఎడిఎంకె అన్ని పార్టీలతో అవకాశవాది ఐన రంగసామి చెడుగుడు ఆడేశాడు. ఈ మధ్య కాలంలో బిజెపితో చెలిమి ప్రారంభించాడు. 2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు అవగాహనకు వచ్చి పుదుచ్చేరి నుంచి వున్న ఒక్క పార్లమెంటు సీటును భారీ మార్జిన్‌తో గెలిచాడు. ఆ తర్వాత యిచ్చిపుచ్చుకోవడంలో భాగంగా బిజెపి నాయకుడికి నామినేటెడ్‌ ఎమ్మెల్యే పోస్టు కట్టబెట్టాడు. 

రంగసామికి, గవర్నరు వీరేంద్ర కటారియాకు పడేది కాదు. అతను కాంగ్రెసువాది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పుదుచ్చేరి హౌసింగ్‌ బోర్డు ద్వారా యిళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, యితర శాఖల్లో నిధులు తరలించేస్తున్నారని, సంక్షేమ పథకాల పేరుతో రంగసామి అనుయాయలకు మాత్రమే డబ్బు పంచుతున్నారని, ప్రాంతాల మధ్య వివక్షత చూపుతున్నారని గవర్నరు రిపోర్టులు పంపుతూండేవాడు. ఫైళ్లు ఓ పట్టాన క్లియర్‌ చేసేవాడు కాదు. కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంటు గవర్నరుకు అధికారాలు ఎక్కువుంటాయి. రంగసామి అనుచరులు అతన నివాసం ఎదుట ప్రదర్శనలు నిర్వహిస్తూ వుండేవారు. మోదీ ప్రధాని కాగానే రంగసామి గవర్నరును తీసేయమని కోరాడు. పుదుచ్చేరి బిజెపి కూడా అదే డిమాండుతో హోం మంత్రి రాజనాథ్‌ సింగ్‌ను కలిసింది. మోదీ వెంటనే 2014 జులైలోనే అతన్ని తప్పించివేశాడు. ఇలా రంగసామి-బిజెపి సఖ్యత సాగుతూండగానే గత సంవత్సరం రాజ్యసభ సీటు ఖాళీ అయింది. సహజంగా బిజెపికి రాజ్యసభలో బలం తక్కువ వుంది కాబట్టి అది కావాలని అడిగింది. చూద్దాం చూద్దాం అంటూ రంగసామి ఎడిఎంకెతో బేరం పెట్టాడు. ఎడిఎంకెకు యిస్తే వూరుకోం అంటూ రంగసామి పార్టీలోనే అసమ్మతి వర్గీయులు గొడవ చేశారు. చివరకు గోకులకృష్ణన్‌ అనే తన పార్టీ మనిషినే ఎడిఎంకెలోకి పంపి, ఆ పార్టీ అభ్యర్థిగా ముద్ర కొట్టి నెగ్గించుకున్నాడు. ఈ వింత ఏర్పాటుకు ఎడిఎంకె కూడా ఒప్పుకుంది. ఇది బిజెపిని మండించింది. గతంలో గవర్నరు చేసిన ఆరోపణలనే యిప్పుడు బిజెపి రాష్ట్రశాఖ చేస్తోంది. దానికి ప్రతిగా రంగసామి కేంద్రం వరద సహాయనిధులు విడుదల చేయటం లేదంటూ బహిరంగ విమర్శలు చేయసాగాడు. 

ఇంత జరుగుతున్నా స్థానిక బిజెపి నాయకులు పొత్తు కొనసాగుతుందని అంటున్నారు. రంగసామి మాత్రం ఎటూ చెప్పటం లేదు. ప్రస్తుతానికి పిఎంకె రంగసామితో చేతులు కలిపింది. తమిళనాడులో జట్టుకట్టిన డిఎంకె, కాంగ్రెసు యిక్కడ కూడా జట్టుకట్టాయి. రాబోయే ఎన్నికల్లో ఆ కూటమికి 17 వస్తాయని రంగసామికి 7 మాత్రమే వస్తాయని అంచనాలు వినవస్తున్నాయి. త్రిశంకు సభ ఏర్పడితే మాత్రం రంగసామి ఏదో ఒక ట్రిక్కు వేసి మళ్లీ ముఖ్యమంత్రి అయిపోవచ్చు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016)

[email protected]