అమెరికాలో దక్షిణాగ్రంలో వున్న ఫ్లారిడా నుంచి క్యూబా రాజధాని హవానాకు 80 నాటికల్ మైల్స్ (సముద్రంలో దూరాన్ని అలాగే కొలుస్తారు) మాత్రమే! కానీ దాన్ని దాటడానికి అమెరికా అధ్యక్షుడికి 88 ఏళ్లు పట్టింది. 1928లో కాల్విన్ కూలిడ్జ్ తర్వాత 2016 మార్చి 20 న ఒబామా మూడు రోజుల క్యూబా పర్యటనకై భార్య, కూతుళ్లతో కలిసి వెళ్లి సుహృద్భావ వాతావరణం నెలకొల్పడానికి తన వంతు కృషి చేశాడు. స్పెయిన్-అమెరికా యుద్ధం తర్వాత 1898లో క్యూబా ద్వీపం అమెరికా ఏలుబడిలోకి వచ్చింది. అమెరికా క్యూబాకు స్వాతంత్య్రం యిచ్చింది కానీ తన కిష్టం లేని వాళ్లు గద్దె కెక్కితే తన సైన్యాన్ని ఉపయోగించి దింపేసే ఆప్షన్ చేతిలో పెట్టుకుంది. గద్దె కెక్కిన క్యూబా వాళ్లందరూ అమెరికా భక్తులే. అందుకని వాళ్ల పాలన ఎంత ఘోరంగా వున్నా అమెరికా కాపాడుతూ వచ్చింది. 1959లో ఫిడల్ కాస్త్రో అనే మార్క్సిస్ట్ తిరుగుబాటు లేవదీసి, అప్పుడు రాజ్యమేలుతున్న బాతిస్తాను కూలదోసి అధికారంలోకి వచ్చాడు. అమెరికా బాతిస్తాను సమర్థించింది కానీ లాభం లేకపోయింది. కాస్త్రో గద్దె కెక్కుతూనే క్యూబాలోని అమెరికన్ల ఆస్తులను, వ్యాపారాలను జాతీయం చేసేశాడు. అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాడు. కమ్యూనిస్టు పాలన భరించలేని క్యూబన్లు అమెరికాకు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతూ, తమ మాతృదేశంపై కత్తికట్టారు. వారి దుర్బోధలకు తలవొగ్గి అమెరికా 1961లో బే ఆఫ్ పిగ్స్ పేర క్యూబా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేసి భంగపడింది. తర్వాత సిఐఏ ద్వారా ఫిడెల్‌ను చంపించాలని ఎన్నో విఫలయత్నాలు చేసింది. అధ్యక్షస్థానంలో రిపబ్లికన్ వున్నా, డెమోక్రాట్ వున్నా క్యూబా పట్ల ద్వేషం వహించారు, వారి అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడదామని చూశారు. ఈ అవకాశాన్ని సోవియట్ యూనియన్ చక్కగా వుపయోగించుకుని క్యూబాకు అండగా నిలిచింది. ఆర్థిక, సైనిక సహాయసహకారా లందించింది. ఆ విధంగా క్యూబా అమెరికాకు పక్కలో బల్లెంలా, చెవిలో జోరీగలా, చెప్పులో రాయిగా మిగిలిపోయి సతాయిస్తూ వచ్చింది. పౌరహక్కులపై అనేక ఆంక్షలు పెట్టినా, ఫిడెల్ మనసున్న నియంతగా, సమర్థపాలకుడిగా పేరు తెచ్చుకుని ప్రజల ఆదరాన్ని పొందుతూ వచ్చాడు.
రష్యన్ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు క్యూబా పని అయిపోయిందనుకున్నారు కానీ అయిపోలేదు. కమ్యూనిజం వేరే దేశాల్లో అనేక రూపాల్లో బతుకుతూనే వచ్చింది. కాపిటలిజాన్ని వాటేసుకున్న యూరోపియన్ దేశాలు, అమెరికా గత దశాబ్ద కాలంలో ఆర్థికసంక్షోభంలో కూరుకుపోవడంతో వివిధ దేశాల ప్రజలు – ముఖ్యంగా దక్షిణ అమెరికా ప్రజలు – సోషలిజంవైపు ఆకర్షితులవుతున్నారు. కమ్యూనిస్టు పాలకుల్లో కొందరు మారిన పరిస్థితులకు అనుగుణంగా అనేక విధానాలపై మెత్తబడుతూ, క్యూబా కంటె మెరుగ్గా సోషల్ డెమోక్రసీ పాటిస్తూ, ప్రజాదరణ కోల్పోకుండా చూసుకుంటున్నారు. వామపంథాకు మరలే లాటిన్ అమెరికా దేశాలన్నిటికీ దిక్సూచిలా, పెద్దన్నలా వుంటూ వచ్చిన క్యూబా క్రమేపీ తన శిష్యుల నుంచే నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిడెల్ కాస్త్రో తర్వాత అధికారంలోకి వచ్చిన అతని తమ్ముడు, విప్లసహచరుడు అయిన రౌల్ కాస్త్రో అనేక రంగాల్లో ప్రయివేటు పెట్టుబడులు అనుమతించాడు. ప్రస్తుతం క్యూబాలోని కార్మికులలో 20% మంది ప్రయివేటు రంగంలోనే పనిచేస్తున్నారు. ఉచితంగా అందిస్తున్న విద్య, వైద్య సౌకర్యాలు ఉన్నత ప్రమాణాల్లో వుండేట్లు రౌల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. సహకార రంగాన్ని ప్రోత్సహిస్తున్నాడు. క్యూబా యువత ఇంటర్నెట్‌వైపు, సెల్‌ఫోన్ల వైపు గ్లోబలైజేషన్ తదనంతరం పెరుగుతున్న మార్కెటు వైపు దృష్టి సారిస్తున్నారని గమనించి ఒక పరిమితి వరకు వాటి వాడకాన్ని అనుమతిస్తున్నాడు. ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా మార్పును ఆహ్వానిస్తున్నాడని చెప్పాలి. ఆర్థికపరమైన యిబ్బందులు కూడా మారి తీరాలని చెప్తున్నాయి. తాము ఎగుమతి చేసే పెట్రోలు ధరలు పడిపోవడంతో గతంలోలా వెనెజులా క్యూబాకు సహాయం అందించలేకపోతోంది. అమెరికా విధించిన వ్యాపార ఆంక్షల వలన నష్టం చాలా జరుగుతోందని, విదేశీ ఋణాలు నానాటికి పెరుగుతున్నాయని, యితరదేశస్తుల్లా తాము అవకాశాలు అందుకోలేకపోతున్నామని క్యూబన్లు ఫీలవుతున్నారు. పైగా క్యూబాలో కొత్తతరానికి 70ల నాటి విప్లవస్ఫూర్తి కానీ ఎప్పుడో ఏభై ఏళ్ల నాటి వైరం గురించి పట్టించుకోవాలన్న ఆసక్తి కానీ లేదు.
ఇక అమెరికాలో కూడా ప్రజాభిప్రాయం మారుతోంది. క్యూబాపై పాతపగలు ఎవరికీ గుర్తు లేవు. క్యూబా నుంచి పారిపోయి వచ్చి అమెరికా స్థిరనివాసం ఏర్పరచుకున్న క్యూబన్-అమెరికన్లలో కూడా రెండు వర్గాలున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌తో పోటీ పడుతున టెడ్ క్రూజ్ క్యూబన్-అమెరికనే. అతను క్యూబాతో స్నేహం వద్దని వారిస్తున్నాడు. ఇంకో వర్గపు క్యూబన్ అమెరికన్లు స్నేహహస్తం చాస్తే తప్పేముందని అడుగుతున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికాలో దేశాలన్నిటి మధ్య సయోధ్య వుండాలి అని నినాదమిస్తూ పొరుగునే వున్న క్యూబాను వెలివేస్తే ఎలా అని అడుగుతున్నారు. అమెరికాను సామ్రాజ్యదేశంగా భావిస్తూ తరతరాలుగా పోరాడుతూ వచ్చిన క్యూబాతో ఎలాగోలా చెలిమి సాధిస్తే దాని బాటలో నడిచే వెనెజులా, బొలీవియా, ఈక్వడార్‌లు కూడా తమ ధోరణి మార్చుకోవచ్చు కదా అని వాదిస్తున్నారు. క్యూబాలో గేట్లు తెరిస్తే అక్కడకూ వెళ్లి టూరిజం వగైరా అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు కదాని అమెరికన్ వ్యాపారస్తులు భావిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాలన్నీ యుఎస్ ప్రదర్శించే క్యూబన్ వ్యతిరేక ధోరణిని గర్హిస్తున్నాయి. వారిచేత ఎత్తి చూపించుకోవడం దేనికి అనే ఆలోచనా వుంది. 'క్యూబాలో ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదు, పౌరహక్కులకు రక్షణ లేదు, అందుకే మేం వారితో చేతులు కలపలేము' అని అమెరికా ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. 'ఈ కారణాలతో వైరం పూని మీరు వారిని దూరంగా పెట్టినా గత 50 ఏళ్లలో వాళ్లేమైనా మారారా? అంతకంటె వారితో చెలిమి చేసి, స్నేహంతో నచ్చచెప్పి మార్పించే ప్రయత్నం చేయాలి' అని మరి కొందరు సూచిస్తున్నారు. ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక అతను యీ దిశగా ఆలోచించసాగాడు. ఈ లోగా 'అమెరికా క్యూబాపై ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేయాలి' అని ఐక్యరాజ్యసమితి 2013లో తీర్మానం చేసింది. ఇంకోళ్లు చెప్పగా తాము అలా చేస్తే తమ యిమేజి దిగజారిపోతుందని భయపడిన అమెరికా దాన్ని వ్యతిరేకించింది. దానితో పాటు దాని దత్తపుత్రుడు ఇజ్రాయేలు కూడా!
కానీ మెట్టు దిగడం ఎలా అని రౌల్, ఒబామా ఆలోచిస్తూ వుండగా అదే ఏడాది డిసెంబరులో నెల్సన్ మండేలా అంత్యక్రియల్లో యిద్దరూ కలిసి పలకరించుకున్నారు. క్యూబాతో బంధాలు పునరుద్ధరించాలా అక్కరలేదా అని ఫ్లారిడాలో సర్వే నిర్వహిస్తే చాలా మంది పునరుద్ధరించాలని ఓటు వేశారు. వాళ్లలో చాలామంది రిపబ్లికన్ పార్టీ సమర్థకులు వుండడం ఒబామాను ఆలోచనలో పడేసింది. దక్షిణ అమెరికాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ క్యూబా, అమెరికాల మధ్య శాంతి, సుహృద్భావం నెలకొల్పడానికి రాయబారం చేశారు. వీటిన్నిటి వలన అమెరికాలో క్యూబాకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారి వుంటుందని అంచనా వేసి కాబోలు 2014 చివరి నాటికి ఒబామా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. 2015 ఏప్రిల్‌లో పనామాలో అమెరికా దేశాల అధినేతల సమావేశం జరిగినప్పుడు రౌల్, అతనూ మాట్లాడుకున్నారు. దాని ఫలితమే ఏడాది తిరిగేలోగా యిప్పుడు ఒబామా పర్యటన. ఈ లోపుగా యిరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తిరిగి నెలకొల్పారు. గత ఏడాది జులైలో రాయబార కార్యాలయాలు తెరిచారు. రాకపోకలకు, వాణిజ్యానికి అనుమతులిచ్చారు. ఈ పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. తన కుటుంబసభ్యులతో వెళ్లడం వలన ఒబామా పర్శనల్ టచ్ యిచ్చారు. అక్కడ ప్రభుత్వవ్యతిరేకాభిప్రాయలు వెల్లడించే హక్కు ప్రజలకు వుండాలంటూ ప్రసంగించారు. రౌల్ దానికి అభ్యంతర పెట్టలేదు. ఆంక్షలు ఎత్తివేయమని అడిగాడు. సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ వుంది కాబట్టి, కావాలనుకున్నా ఒబామా ఏమీ చేయలేడు. పైగా త్వరలోనే దిగిపోతున్నాడు. సిబిఎస్ న్యూస్ వారు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అమెరికా ప్రజల్లో 62% మంది క్యూబా పర్యటనను సమర్థించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా దూసుకుపోతున్న డోనాల్డ్ ట్రంప్ కూడా క్యూబాతో సత్సంబంధాలకు సై అంటున్నాడు కాబట్టి క్యూబా-అమెరికా స్నేహబంధం బలపడవచ్చు. ఒకరి భావజాలం నుంచి మరొకరు నేర్చుకోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)