గంటా శ్రీనివాసరావు అంటే జనాలకు తెలుగుదేశం అనే దాని కన్నా ప్రజా రాజ్యమే ఎక్కువగా గుర్తుకు వస్తుంది. నిజానికి గంటా రాజకీయాల్లోకి ప్రవేశించింది తెలుగుదేశం ద్వారానే. కానీ చిరంజీవి పార్టీ పెట్టగానే అందులోకి జంప్ అన్నారు. అక్కడి నుంచి ఆయనకు మెగానుబంధం పెనవేసుకుంది. అల్లు అరవింద్ తో మరీ ఎక్కవ బంధం అలుముకుంది.
అందుకే తన నియోజకవర్గమైన అనకాపల్లిలో అరవింద్ ను తెచ్చి ఎంపీగా పోటీ చేయించారు. సరే ఆ తరువాత ప్రజా రాజ్యం దుకాణం మూత పడింది. చిరుతో కలిసి గంటా కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ పాత గూడు అయిన తెలుగుదేశంలోకి వచ్చారు. అయినా చిరుతో ముఖ్యంగా అల్లు అరవింద్ తో బంధాలు మానలేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే. సరైనోడు సినిమా ఫంక్షన్ 10న విశాఖలో జరగబోతోంది. ఈ ఫంక్షన్ గురించి మాట్లాడడానికి విశాఖలో అల్లు అరవింద్ ఆదివారం (3న) ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వినికిడి. ఈ ప్రెస్ మీట్ లో గంటా కూడా పాల్లొంటారని వార్తలు వినవస్తున్నాయి. ఫంక్షన్ కు ఎలాగూ గంటానే ఏర్పాట్లకు సహకారం అందిస్తారు. ఇంతకు ముందు సన్నాఫ్ సత్యమూర్తికి అలాగే సహకారం అందించారు. కానీ ఏర్పాట్ల ప్రెస్ మీట్ కు కూడా గంటా హాజరవుతారని వినవస్తుంటే ఆశ్చర్యంగా వుంది. మంత్రికి, సినిమా ఫంక్షన్ కు ఏమిటి సంబంధం అని? సినిమా ఫంక్షన్ కు హాజరు కావచ్చు..కానీ సన్నాహాలు ఇలా చేస్తున్నాం అని చెప్పడానికి మంత్రి ఎందుకనో?
గంటా తన కొడుకును హీరో గా చేయాలని అరవింద్ ద్వారా దర్శకుడు మారుతిపై ప్రెజర్ తెస్తున్నారు. ఆ బంధం కూడా వుండనే వుంది. ఇక గతంలో చిరుతో కలిసి వున్నపుడు కొన్ని వ్యాపార బంధాలు కూడా వున్నాయని వదంతలు వున్నాయి. అందుకే కావచ్చు తెలుగుదేశంలోకి వచ్చేసినా, పాత ప్రజా రాజ్యం బంధాలు గంటా వదులుకోలేకపోతున్నారు.
ఇదిలా వుంటే గంటాను లొకేష్ కాస్త దూరం పెట్టారని, 2019న నాటికి అవసరమైతే గంటా మరొసారి జంప్ అంటారని విశాఖ రాజకీయ సర్కిళ్లలో గుసగుసలు వున్నాయి. ఇలా ‘అల్లు’కున్న బంధాలు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తాయి