ఎమ్బీయస్‌: జాట్‌ రిజర్వేషన్‌

మార్చి నెలాఖరులో హరియాణా గవర్నమెంటు జాట్‌కి రిజర్వేషన్‌ యిస్తూ బిల్లు పాస్‌ చేసేసింది. వాళ్లను బిసిలలో 'సి' వర్గంలో చేర్చింది. దీనివలన సమస్య పరిష్కారమైందనుకుంటే పొరబాటు. జాట్‌ వంటి బలమైన సామాజిక వర్గానికి రిజర్వేషన్‌…

మార్చి నెలాఖరులో హరియాణా గవర్నమెంటు జాట్‌కి రిజర్వేషన్‌ యిస్తూ బిల్లు పాస్‌ చేసేసింది. వాళ్లను బిసిలలో 'సి' వర్గంలో చేర్చింది. దీనివలన సమస్య పరిష్కారమైందనుకుంటే పొరబాటు. జాట్‌ వంటి బలమైన సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పిస్తే దేశంలో యిప్పటికే ఆందోళన చేస్తున్న కాపులు, గుజ్జర్లు, పటేళ్లు వంటి కులాలు తమ డిమాండ్‌ను మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్లి ఆ యా రాష్ట్రప్రభుత్వాలకు యిబ్బంది కలిగించడం ఖాయం. జాట్‌లలో పేదలు లేరా, అంటే వున్నారు. ఆ మాట కొస్తే అగ్రవర్ణాలని చెప్పబడే అన్ని కులాలలోనూ పేదలున్నారు. ఒకప్పుడు రాజ్యాలు ఏలిన వారి వారసులు యిప్పుడు దీనావస్థలో వుండడం కూడా చూస్తున్నాం. అయితే ఆ పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని మొత్తం కులానికి ఆపాదించి, రిజర్వేషన్‌ కల్పించడం ఏమంత సబబు అనేదే ప్రశ్న. హరియాణా జనాభా 2.50 కోట్లయితే వారిలో జాట్లు 26% మంది. రాష్ట్రంలోని భూమిలో 75% వారి చేతుల్లోనే వుంది. సగటున ఒక జాట్‌ కుటుంబానికి  2-3 ఎకరాల భూమి వుంటుందని అంచనా. క్లాస్‌ 1, 2 అధికారుల్లో 18% జాట్లే. అంతకంటె తక్కువ శ్రేణి ఉద్యోగుల్లో, పోలీసుల్లో వారి శాతం 40! వ్యాపారాల్లో కూడా వారిది సింహభాగమే. ఇక రాజకీయాల్లో అయితే హరియాణా ఏర్పడిన దగ్గర్నుంచి భజన్‌లాల్‌, యిప్పటి ఖట్టర్‌ తప్ప ముఖ్యమంత్రులందరూ జాట్లే! మంత్రుల్లో చాలామంది జాట్లు వుండేవారు. ఈసారి కాబినెట్‌లోనే వారి ప్రాతినిథ్యం తగ్గింది. ఇలా అన్ని రంగాలలో బలంగా వున్న జాట్లు తమను ఓబిసిల్లో కలపమని అడగడం ఒక వింతైతే దాన్ని అంగీకరించడం మరీ వింత. దేశంలోని మిగతా భాగాల్లో చిచ్చు రగిలించే యీ చేష్ట బిజెపి ప్రభుత్వం చేపట్టడానికి కారణమేమిటి? 

జాట్లు ఎప్పణ్నుంచో రిజర్వేషన్‌ గురించి అడుగుతూండడం జరుగుతోంది. ప్రతీ ఏటా పంటల మధ్య విరామం వచ్చినపుడు కొన్నాళ్లు ఉద్యమం అనడం, తర్వాత చల్లారడం ఒక ఆనవాయితీగా మారింది. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. మరి అలాటిది యీ సారి యింత పెద్దగా ఎందుకు, హింసాత్మకంగా ఆందోళన ఎందుకు జరిగింది? అంటే రాజకీయ కారణాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పివి నాటి రోజులతో కొంత పోలిక కలుస్తుంది. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడు ప్రధాని ఇందిర ఒకసారి హైదరాబాదు వచ్చారట. కాబినెట్‌ సహచరులను '..రెడ్డి', '…రెడ్డి' అని పరిచయం చేస్తూ వుంటే రెడ్డి పదం అనేకసార్లు వినబడి ఇందిర 'మీ రాష్ట్రంలో రెడ్లు తప్ప వేరెవరూ లేరా?' అని అడిగారట. ఇది కట్టుకథ కావచ్చు కానీ ఆమె ప్రధాని పదవిలో బలపడ్డాక ఆంధ్రలోనే కాక, యితర రాష్ట్రాలలో కూడా అప్పటిదాకా బలంగా వున్న కులాల వారి ప్రాధాన్యత తగ్గించడానికి, ఆ కులాల ముఖ్యమంత్రులను తీసివేసి, అప్పటిదాకా రాజకీయప్రాధాన్యం లేని కులానికి చెందిన తన విధేయులకు ఛాన్సిచ్చారు. ఆ విధంగా బలమైన కులాలైన రెడ్డి-కమ్మ-వెలమలను కాదని బ్రాహ్మణుడైన పివి నరసింహారావు ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఎంత పాలనాసమర్థుడో ప్రధాని అయ్యాకనే తెలిసింది కానీ ముఖ్యమంత్రిగా ఆయనను యితర కులాలవారు కుదురుగా వుండనీయలేదు. ఏదో ఒక పేచీ పెడుతూనే వచ్చారు. చివరకు ఆయన తెచ్చిన భూసంస్కరణల బిల్లు అమలు కాకుండా చూడడానికి 1972లో జై ఆంధ్ర ఉద్యమం తెచ్చారు. దాన్ని పివి సరిగ్గా హేండిల్‌ చేయలేకపోయారు. కఠినంగా ఎవరిపై చర్య తీసుకోవాలన్నా భయమే. సరైన సమయంలో సరైన ఆదేశాలు యివ్వకుండా చేష్టలుడిగి చూస్తూ వుండడంతో ఉద్యమం తీవ్రమైన రాష్ట్రం నష్టపోయింది. చివరకు ఆయన పదవి పోయింది, రాష్ట్రపతి పాలన వచ్చింది. 

ఇప్పుడు హరియాణా దగ్గరకు వద్దాం. అది ఏర్పడిన దగ్గర్నుంచి జాట్లే ప్రముఖస్థానం వహిస్తూ వచ్చారు. భజన్‌లాల్‌ తప్ప యిప్పటిదాకా అందరూ జాట్‌ ముఖ్యమంత్రులే. భజనలాల్‌ కూడా జాట్లకే ప్రాధాన్యత యిచ్చాడు. జాట్ల బలంతో ఐఎన్‌ఎల్‌డి నాయకుడు ఓం ప్రకాశ్‌ చౌటాలా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. జాటేతర ఓట్లు యితర పార్టీల మధ్య చీలిపోతున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికలైన కొన్ని నెలలకు అక్టోబరులో హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. చౌటాలాను ఓడించాలంటే జాటేతర ఓట్లన్నీ తమకే పూర్తిగా పడాలని బిజెపి నాయకత్వం ప్లాన్‌ చేసింది. మొత్తం 90 సీట్లలో అది నెగ్గిన 47 అసెంబ్లీ స్థానాలలో 72% అంటే 34 స్థానాలు ఉత్తర, దక్షిణ హరియాణానుంచి గెలిచినవే. అక్కడ జాటేతర కులాలైన పంజాబీలు, బనియాలు, బ్రాహ్మణులు జాట్‌ల కంటె ఎక్కువ. జాట్‌లు అధికసంఖ్యలో వున్న నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్‌ నుంచి జాట్లు వచ్చి బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు కాబట్టి జాట్లు కూడా బిజెపికి ఓటు వేయడం చేతనే తక్కిన 13 స్థానాలు వచ్చాయి. ఈ విషయాన్ని బిజెపి నాయకత్వం గుర్తించినా జాటేతరులందరికీ తమ పార్టీ ఒక్కటే శరణ్యం అనే రీతిలో తమను చూపుకోవాలని ప్రయత్నించింది. 

అందుకే మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఆయన జాట్‌ కాదు, క్షత్రియుడు. అసలైన హరియాణావాడు కాదు, మూలాలు పంజాబ్‌లో వున్నాయి. కుటుంబం పంజాబ్‌ నుంచి వచ్చి హరియాణాలో స్థిరపడింది. పోనీ హరియాణాలో స్థిరపడి క్షేత్రస్థాయి రాజకీయాల్లో నలిగినవాడా, యిక్కడ ఎమ్మెల్యేగా చేశాడా అంటే అదీ కాదు. హరియాణాలో చదువుకున్నాక ఢిల్లీలో స్థిరపడి, పెళ్లి చేసుకోకుండా 1977 నుండి ఆరెస్సెస్‌లో వుంటూ 1994లో బిజెపిలో చేరాడు. హరియాణాలో బిజెపి తరఫున ఆర్గనైజేషనల్‌ జనరల్‌ సెక్రటరీగా 2000 నుండి 2014 వరకు ఉన్నాడు తప్ప యిక్కడ ఎమ్మెల్యేగా కాని, మంత్రిగా కాని పని చేయలేదు. 2014 లోకసభ ఎన్నికలలో బిజెపి ఎలక్షన్‌ కాంపెయిన్‌కు చైర్మన్‌గా పనిచేశాడు. అలాటివాణ్ని పట్టుకుని వచ్చి కర్నాల్‌ .నియోజకవర్గంలో టిక్కెట్టు యిస్తే అక్కడి బిజెపి నాయకులు యితను స్థానికుడు కాదని గోల చేశారు. కానీ అధినాయకత్వం పట్టుబట్టి నిలబెట్టి 64 వేల మెజారిటీతో గెలిపించుకుంది. అంతటితో ఆగకుండా అతన్ని ముఖ్యమంత్రిని చేసింది. అంతేకాదు, కాబినెట్‌లో యిద్దరే యిద్దరు జాట్‌లకు మంత్రిపదవులు యిచ్చింది.  ఇవన్నీ జాట్‌లను మండించాయి. తామంటే ఖాతరు లేనట్లుంది యీ ప్రభుత్వం, వీళ్లకు బుద్ధి చెప్పాలనుకుంది. అదను చిక్కినపుడు తడాఖా చూపించింది.

ఏ మాత్రం పరిపాలనానుభవం, రాజకీయ చతురత లేని ఖట్టర్‌ పరిస్థితి తీవ్రతను అంచనా వేయడంలో విఫలమై, తొలిదశలో పట్టించుకోకుండా, మలిదశలో అదుపు చేయలేకుండా ఆ ఆందోళనను మిస్‌హేండిల్‌ చేశారని సంఘటనాక్రమం చూస్తే తెలుస్తుంది. మార్చి 7-8 తారీకుల్లో గుడ్‌గావ్‌లో జరగబోయే హేపెనింగ్‌ హరియాణా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమావేశం ఎంత ఘనంగా నిర్వహించాలా అన్న ధ్యాసలోనే ముఖ్యమంత్రి, అధికారగణం వున్న సమయంలో, ఫిబ్రవరి రెండో వారంలో రెండు చోట్ల అతి సాధారణంగా ఉద్యమం ప్రారంభమైంది. 2010 నాటి జాట్‌ ఉద్యమం జరిగినపుడు .. మంది పోయారు. వారిలో ఒక యువకుడు హిసార్‌ జిల్లాలోని మయ్యార్‌ గ్రామానికి చెందినవాడు. అక్కడ, రైల్వే పట్టాలపై కాస్సేపు కూర్చుని ఆందోళన చేయాలని అనుకుని పిలుపు నిస్తే గుప్పెడు మంది కూడా రాలేదు. అధికారులు వాళ్లను లేపే ప్రయత్నం కూడా చేయలేదు. మీ డిమాండ్లు ప్రభుత్వానికి తెలియపరుస్తాం అని కాస్సేపటికి చెపితే వాళ్లు లేచిపోయారు. జీంద్‌ జిల్లాలోని నరవాణాలో జిల్లా కార్యాలయం ఎదుట ప్రదర్శన జరిగింది. దీన్ని ఫిబ్రవరి 8 న ఆదర్శ్‌ జాట్‌ మహాసభ (ఎజెఎమ్‌), బినైన్‌ ఖాప్‌ అనే చిన్న సంస్థలు నిర్వహించాయి. వాళ్లు ఫిబ్రవరి 15 న హరియాణా బంద్‌కు పిలుపు నిస్తూ, ఫిబ్రవరి 27న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాంతో కాబినెట్‌లో వున్న అభిమన్యు సింధు, ఓం ప్రకాశ్‌ ధన్‌కర్‌ అనే జాట్‌ మంత్రులు వాళ్లను చర్చలకు పిలిచి వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.  రూ.6 లక్షల వార్షికాదాయం కంటె తక్కువ వున్న అన్ని కులాలవారికి కలిపి 20% రిజర్వేషన్‌ యిస్తామని, వారిలో జాట్‌ పేదలు కూడా వుంటారని ప్రతిపాదించారు. దానితో సమస్య ముగిసిపోయిందనుకున్నారు. 

ఇది పెద్ద జాట్‌ సంస్థలను మండించింది. ప్రభుత్వం తమను సంప్రదించకుండా తనకు అనుకూలమైన బోగస్‌ జాట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదిర్చేసుకుని తమ పరపతిని, ప్రయోజనాలను దెబ్బ తీస్తోందని అనుకుని ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయి. అఖిల భారతీయ జాట్‌ ఆరక్షణ్‌ సంఘర్షణ్‌ సమితి (ఎబిజెఎఎస్‌ఎస్‌)లోని అన్ని చీలిక వర్గాలు ఏకమై ఫిబ్రవరి 12 నుంచి తీవ్ర ఆందోళన చేపట్టాయి. 'కోయీ నహీ నేతా, బస్‌ జాట్‌ ఏక్‌తా' (నాయకుడెవరూ లేడు, జాట్‌ ఐక్యతే నాయకుడు) అనే నినాదంతో ఉద్యమించారు. నిజంగా అదే జరిగింది. నడిపించే నాయకుడంటూ లేకుండా బొత్తిగా అరాచకంగా ఆందోళన నడిచింది. హవా సింగ్‌ సంఘ్‌వాన్‌ అనే 69 ఏళ్ల మాజీ సిఆర్‌పిఎఫ్‌ జవాను నాయకత్వంలో వందలాది మంది జాట్లు మయ్యార్‌ రైల్వే ట్రాక్‌ను దిగ్బంధం చేశారు. మూడు రోజుల తర్వాత రోహతక్‌ జిల్లాలోని ప్రధాన ఖాప్‌లకు చెందిన జాట్లు సంప్లాలోని రైళ్లనే కాక, రోడ్లను కూడా దిగ్బంధం చేశారు. నేషనల్‌ హై వే నెం. 10పై వాహనాలు ఆపేశారు. అప్పుడు ఖట్టర్‌ మేల్కొన్నాడు. ఫిబ్రవరి 17 న జాట్‌ సమితిలోని అన్ని వర్గాలను, ప్రధాన ఖాప్‌లను చండీగఢ్‌కు పిలిపించి, రాబోయే ఎసెంబ్లీ సెషన్‌లో స్పెషల్‌ బాక్‌వర్డ్‌ కాస్ట్‌గా గుర్తించి 10% రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేస్తానని హామీ యిచ్చాడు. 

2012లో హరియాణా ప్రభుత్వం వేసిన కెసి గుప్తా కమిషన్‌ జాట్లకు స్పెషల్‌బిసిగా గుర్తింపు యిమ్మనమని చెప్పింది. 2013లో భూపిందర్‌ హూండా ప్రభుత్వం ఆ నివేదిక అంగీకరించి 10% కోటా యిచ్చింది. ఇలా యిస్తే మొత్తం రిజర్వేషన్‌ 50% పరిధి దాటుతోంది కాబట్టి దీన్ని పంజాబ్‌, హరియాణా హైకోర్టు కొట్టేసింది. 2014లో యుపిఏ ప్రభుత్వం 9 రాష్ట్రాలలోని జాట్లను కేంద్రప్రభుత్వపు ఒబిసి జాబితాలో కలిపింది. 2015లో దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆ తీర్పుపై అదే ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌డిఏ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతానికి హరియాణాలో తప్ప తక్కిన 8 రాష్ట్రాలలో జాట్లు రాష్ట్ర ఒబిసి జాబితాలో వున్నారు. ఈ పరిస్థితిలో మళ్లీ 10% స్పెషల్‌ బిసి అంటే హైకోర్టు కొట్టేస్తుందని, అందువలన 27% కోటా వున్న ఒబిసిల్లోనే తమనూ ఒక ఒబిసిగా గుర్తించి తీరాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉద్యమాన్ని దావాగ్నిలా జాట్‌లు పెద్ద సంఖ్యలో వున్న రోహతక్‌, ఝజ్జర్‌్‌, భివానీ, హిసార్‌, సోనీపత్‌ జిల్లాలకు వ్యాపింపచేశారు. వందలాది ప్రయివేటు కార్లు, ట్రక్కులు, బస్సులు, పోలీసు జీపులు,ఒక రైల్వే స్టేషన్‌ తగలబడ్డాయి. మొత్తం 19 రోజుల ఉద్యమంలో 30 మంది చనిపోయారు. 72 మంది పోలీసులతో సహా 320 మంది గాయపడ్డారు. రూ.1100 కోట్ల మేరకు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు ్తనష్టం జరిగింది. రైల్వేలకు రూ. 200 కోట్ల నష్టం. రైళ్లు ఆపివేయడం వలన పక్క రాష్ట్రాలకు కూడా కలిగిన నష్టం కలుపుకుంటే మొత్తం రూ. 34 వేల నష్టమట! ఇది యీ స్థాయికి రావడానికి కారణం రెండు, మూడు సంఘటనలు దోహదపడ్డాయి.

ఉద్యమం ప్రారంభమైన కొన్ని రోజులకే ఒబిసి వర్గానికి చెందిన కురుక్షేత్ర నియోజకవర్గపు బిజెపి ఎంపీ రాజ్‌కుమార్‌ సైనీ ఆందోళనకారులను ఉద్దేశించి 'సువర్‌ కే బచ్చే' (పందినాకొడుకులు) అన్నాడు. అంతేకాదు జాట్‌ వారి యూత్‌ ఆర్మీని ఎదుర్కోవడానికి 'ఒబిసి బ్రిగేడ్‌'ను తయారుచేస్తానన్నాడు. దమ్ముంటే వీధుల్లో కొట్లాడదాం రమ్మన్నాడు. మన దగ్గర కాపులను ఒబిసిల్లో చేరిస్తే ఉద్యమిస్తానని ఆర్‌.కృష్ణయ్య కూడా అన్నారు, యిలాటి భాష వుపయోగించలేదు. అధికార పార్టీకి చెందిన సైనీ అలా నోరు పారేసుకోవడంతో అతన్ని ఖట్టర్‌కానీ, కేంద్రనాయకత్వం కానీ అదుపు చేయకపోవడంతో జాట్లకు – ముఖ్యంగా యువతకు – మండింది. జాట్‌ పెద్దలు వారిస్తున్నా వారు తీవ్రహింసకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌ మాత్రం సైనీని ఖండిస్తూ జాట్ల ఆందోళనను, వారి ఆందోళనా విధానాన్ని సమర్థిస్తూ ప్రకటన చేశాడు. ఖట్టర్‌ ఎవరినీ వారించకుండా మౌనంగా వుండిపోయాడు. 

రోహతక్‌లో ఒక కాలేజీలో రెండు విద్యార్థి బృందాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొట్టారు. వారిలో చాలామంది జాట్లు. జాట్‌ యువకులను పోలీసులు హింసిస్తున్నారనే వార్త, దానితో బాటు జాట్లు ఆరాధ్యదైవంగా భావించే ఛోటూ రామ్‌ విగ్రహంపై జాటేతరులు రాళ్లు వేశారన్న పుకారు కూడా వ్యాపించింది. ఇక దానితో జాట్లు ఆయుధాలు చేతపట్టి రోడ్లు ఆక్రమించి, జాటేతరుల దుకాణాలను గురిపెట్టి దాడి చేశారు. వారిలో సంఘవ్యతిరేక శక్తులు కూడా చొరబడ్డాయని ఉద్యమనాయకులు అంటారు కానీ, వాళ్లు జాట్ల దుకాణాలు ఎందుకు లూటీ చేయలేదని జాటేతర వ్యాపారస్తులు అడుగుతున్నారు. కర్ఫ్యూ విధించినా రోహతక్‌లో చిన్నాపెద్దా దుకాణాలు 400 ధ్వంసమయ్యాయి. పోలీసు పోస్టుకు 20 మీటర్ల దూరంలోనే అనేక షాపులను దగ్ధం చేశారు. అక్కడే కాదు, అనేక చోట్ల పోలీసులు గొడవలను ఆపడానికి ప్రయత్నించలేదు. దార్లలో అడ్డంకులు పెడుతున్నా, హైవేల మీద ఎక్సవేటర్లు పెట్టి గోతులు తవ్వేస్తున్నా వారు చూస్తూ కూర్చున్నారు. వారిలో జాట్లు చాలామంది వుండడం ఒక కారణమైతే, ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం మరో కారణం. ఆందోళనకారులు పోలీసులను చూసి భయపడడం మానేశారు.  చివరకు చాలా ఆలస్యంగా ఆర్మీని దింపారు. అయితే గొడవలు జరిగేచోటుకి ఆర్మీ వెళ్లడానికి వీలులేకుండా రోడ్లన్నీ భారీ వాహనాలతో నిండిపోయాయి. షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్లతో ఆర్మీ వెళ్లిన తర్వాత కూడా మన పోలీసులే అన్న ధీమాతో ఆందోళనకారులు వుంటే, అప్పుడు ఆర్మీ 'మేం ఆర్మీ సుమా, జాగ్రత్త' అనే ప్లకార్డులు పట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. 

చివరకు అమిత్‌ షా సైనీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసి నోరు మూయించాడు, కానీ అది బాగా ఆలస్యమైంది. ఈలోగా జాటేతరులు భివానీలో జాట్ల దుకాణాలపై దాడి చేశారు. ఈ గొడవలు జరుగుతూంటే జాతీయ పత్రికలు సంయమనం పాటించాయి కానీ స్థానిక ప్రింట్‌ మీడియా, టీవీలు పూర్తి కవరేజి యిచ్చి ఆవేశకావేషాలు మరింతగా రెచ్చగొట్టాయి. మామూలు పౌరులకు పోలీసులపై నమ్మకం నశించిపోయింది. సోనీపత్‌-గోహానా రోడ్డు మీద వున్న కాలేజీ నడిపే ఒక జాటేతరుడు ''మా కాలేజీపై పడి 300 కంప్యూటర్లు ఎత్తుకుపోయారు, పుస్తకాలు, ఫర్నిచర్‌ తగలబెట్టారు. నా ఉద్యోగుల్లో చాలామంది జాట్లు వున్నారు. నేను నాశనమైతే వాళ్లకేం లాభం? కాళ్లావేళ్లా పడినా ఆందోళనకారులు వినలేదు. పోలీసులు  వాళ్లను చెదరగొట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లరి మూకలపై కాల్పులు జరపవద్దని వారికి ఆదేశాలున్నాయేమో. కర్ఫ్యూ మాకే తప్ప ఆ మూకలకు కాదు.'' అంటూ వాపోయాడు. ఆలిండియా కిసాన్‌ సభ నాయకుడు ''ఆంగన్‌వాడీ వర్కర్లు సమ్మె చేసినా, ప్రదర్శన నిర్వహించినా కేసులు పెడతారు. వీళ్లు యింత విధ్వంసం జరిపిినా మెతకగా వ్యవహరిస్తున్నారు'' అని ఫిర్యాదు చేశారు. ఢిల్లీకి 1200 క్యుసెక్కుల నీళ్లు సరఫరా చేసే మునాక్‌ కాలువను ఆందోళనకారులు మూసేస్తే స్థానిక పంచాయితీ నచ్చచెప్పి తెరిపించింది. 

జాట్లు యిలా చెలరేగిపోయినా ఖట్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లి అందరికీ నచ్చచెప్పే బదులు వెళ్లి చండీగఢ్‌, ఢిల్లీలలో కూర్చున్నారంటూ కొందరు విమర్శించారు. నిజానికి ఖట్టర్‌ గొడవ చల్లారాక వెళ్లి బాధితులను ఓదార్చబోయారు కానీ వాళ్లు హేళనగా కేకలు వేశారు. జాట్‌ మంత్రులు జాట్ల వద్దకు వెళితే వాళ్లకూ అదే మర్యాద దక్కింది. గ్రామాల్లో వున్న వాళ్ల యిళ్లపై రాళ్లు విసిరారు. అప్పుడు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎన్నికైన జాట్‌ కేంద్రమంత్రి సంజీవ్‌ బల్యాన్‌ జాట్ల డిమాండ్‌ పరిశీలించడానికి వెంకయ్య నాయడు అధ్యక్షతన ఒక హైలెవెల్‌ కమిటీ వేస్తామని ప్రకటించాడు. అప్పణ్నుంచి ఆందోళన తగ్గుముఖం పట్టింది. ఇన్వెస్టర్స్‌ మీట్‌ ప్రశాంతవాతావరణంలో జరిగింది కానీ ఆ సమావేశంలో మహీంద్రా గ్రూపు సిఎండి ఆనంద్‌ మహీంద్ర 'పెట్టుబడిదారుడు శాంతిభద్రతలు వున్న చోటే పెట్టుబడి పెడతాడు, ఇటీవలి ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలు చేపడతారని ఆశిస్తాను' అన్నాడు. 'తప్పకుండా' అన్నాడు ఖట్టర్‌. 

చివరకు మార్చి 29న అసెంబ్లీలో  జాట్‌ రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశారు. దాని ప్రకారం జాట్లను బిసి 'సి' కేటగిరిలో వేశారు. బిల్లు న్యాయవిచారణ పరిధిలోకి రాకుండా 9 వ షెడ్యూల్‌లో చేర్చమని కేంద్రాన్ని కోరడం జరిగింది. దీని ప్రకారం జాట్‌లు, జాట్‌ శిఖ్కులు, రోర్‌, బిష్ణోయ్‌, త్యాగి, ముల్లా జాట్‌, ముస్లిము జాట్లకు కలిపి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ అండర్‌టేకింగ్‌లలో, లోకల్‌ బాడీస్‌లో వున్న మూడవ, నాల్గవ తరగతి ఉద్యోగాలలో 10%, 1,2 తరగతి ఉద్యోగాలలో 6%, రిజర్వేషన్‌ లభిస్తుంది. గవర్నమెంటు, ఎయిడెడ్‌ కాలేజీల్లో 10% రిజర్వేషన్‌ లభిస్తుంది. జాట్లు సంతోషించారు, గొడవ చల్లారినందుకు హరియాణా బిజెపి నాయకులు సంతోషించారు కానీ అంతిమంగా కోర్టు ఏమంటుందో తెలియదు. ఒబిసిల్లో యిప్పటికే వున్న కులాలవారు ఏమంటారో తెలియదు. ఈ రిజర్వేషన్‌ ప్రభావం యితర రాష్ట్రాలలోని ఆందోళనలపై ఎలాటి ప్రభావం కలిగిస్తుందో తెలియదు. ఏది ఏమైనా ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్న జాట్లకు రిజర్వేషన్‌ కల్పించే యీ బిల్లు కారణంగా దేశంలో నిప్పు ముట్టించినట్లే అయింది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

[email protected]