హోళీ వస్తూ వస్తూనే వసంత రుతువు రాకను తెలియజేస్తుంది. ప్రకృతిలోని రంగులన్నీ జీవితం నిండా విరబూయాలని కోరుకునేవారి ఆకాంక్షలకు నాంది ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భరతఖండమంతా భాసిల్లే ఈ రంగుల కేళి మన శ్వాసలో ఓ ఉల్లాసమైన రాగం. చెడు పై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ హోళీ పండగ ఖండాంతరాల్లో ఎక్కడున్నా మన భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీకగా నిలుస్తుంది.
తాజాగా ఈ వారాంతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హోళీ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని కాన్సస్ నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక హిందూ దేవాలయం ప్రాంగణంలో జరిగిన హెచ్టీ సిసి హోళీ మేళా వేడుకల్లో నాట్స్ సేవాదళ బృందం పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జరిగేందుకు సహకరించారు. స్థానిక తెలుగువారు, ప్రవాస భారతీయులు, పలు దేశాలకు చెందిన వారు చిన్నాపెద్దా తేడా లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా పరస్పరం రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
యువతీ యువకులు ఆనందోత్సాహాలతో ఒకరికొకలు ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రంగ్ బర్సే అంటూ నృత్యాలు చేస్తూ ఆనందంగా హోళీ పండగను ఆస్వాదించారు. జాతీయ సమైక్యత ప్రతిబింభించేలా కులమతాలకతీతకంగా రంగుల పండుగలో పాలుపంచుకుంటూ సర్వమత సమ్మేళనాన్ని చాటుతూ తమ జీవితంలో నూతన సొబగులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ హోళీ పండుగ వేడుకల్లో భారతీయవంటకాల ఘుమఘుమల్లో నాట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార స్టాల్ ప్రత్యెక ఆకర్షణగా నిలచి, విచ్చేసిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సాహంతో నాట్స్ సేవాదళం సభ్యులు వందలాదిమందికి రుచికరమైన ఆహారాన్ని తాజాగా తయారుచేసి అందించారు. ఈ సందర్భంగా సేకరించిన పూర్తి మొత్తాన్ని స్థానిక హిందూ దేవాలయానికి విరాళంగా అందజేశారు.
హోళీ వేడుకల్లో ఆహార ఏర్పాట్ల పరంగాను, విరాళాల సేకరణలోనూ స్పూర్తిమంతంగా ముందువరసలో నిలచిన నాట్స్ సేవాబృందాన్ని ప్రవాస భారతీయులు అభినందించారు. కార్యక్రమంలో నాట్స్ కాన్సస్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, బృంద సభ్యులు వెంకట్ మంత్రి, రాజ గోపాలుని, రవి ఆయసోల, శ్రీదేవి గొబ్బూరి తదితరులు, పెద్దసంఖ్యలో సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.