ఎమ్బీయస్‌: కేరళలో కూడా తారాతోరణం

దక్షిణాదిన సినిమాతారలు రాజకీయరంగంలో రావడం తమిళనాడుతో ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఆ తర్వాత కర్ణాట కూడా  ఆ బాటలో నడిచింది. ఏటా అనేక చిత్రాలు నిర్మించే కేరళలో మాత్రం సినిమా, రాజకీయం రెండింటిని…

దక్షిణాదిన సినిమాతారలు రాజకీయరంగంలో రావడం తమిళనాడుతో ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. ఆ తర్వాత కర్ణాట కూడా  ఆ బాటలో నడిచింది. ఏటా అనేక చిత్రాలు నిర్మించే కేరళలో మాత్రం సినిమా, రాజకీయం రెండింటిని వేర్వేరుగా చూశారు. అభిమానసంఘాలంటూ వుంటే  ఆ సభ్యులే పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తారు. కేరళలో అభిమానసంఘాలు, బిరుదప్రదానాలు లేవు. మలయాళ సూపర్‌ స్టార్‌ ప్రేమ్‌ నజీర్‌ 1970లలో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేసిన రోజుల్లో కాస్త వూగాడు కానీ ఓ సారి ఓడిపోవడంతో మళ్లీ రాజకీయాల్లోకి దిగలేదు. 1999లో మురళి అనే నటుడు  లెఫ్ట్‌ మద్దతుతో అలప్పుళాలో కాంగ్రెసు అభ్యర్థి విఎం సుధీరన్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. లెఫ్ట్‌ లెనిన్‌ రాజేంద్రన్‌ను కూడా నిలబెడితే అతనూ కాంగ్రెసుకు చెందిన కెఆర్‌ నారాయణన్‌ చేతిలో ఓడిపోయాడు. ఇలా నటులు ఓడిపోయినా ''ఛెమ్మీన్‌'' సినిమా ద్వారా జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చుకున్న దర్శకుడు రామూ కారియట్‌ మాత్రం 1965 అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గాడు. అలాటి కేరళలో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. మే 16 నాటి అసెంబ్లీ ఎన్నికలలో నలుగురు తారలు పోటీ చేస్తున్నారు.

రాజకీయాల్లోకి రావడమే కాక, మంత్రి కూడా అయిన తొలి మలయాళ నటుడు కెబి గణేష్‌ కుమార్‌. అతని తండ్రి బాలకృష్ణ పిళ్లయ్‌ కాకలు తీరిన రాజకీయయోధుడు. కేరళ కాంగ్రెసును చీల్చి తన పేర కేరళ కాంగ్రెసు (బి) ప్రారంభించినవాడు. గణేశ్‌ తన 19వ యేట సినిమా రంగంలో ప్రవేశించాడు. రౌడీ యువకుడిలాటి పాత్రల్లో, సపోర్టింగ్‌ కారెక్టర్లలో రాణించాడు. ఆ పరిస్థితుల్లో తండ్రి కొడుకుని 2001లో 35 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి దింపి తన పక్క నియోజకవర్గంలో నిలిపాడు. గణేశ్‌ తన ప్రత్యర్థి ప్రకాశ్‌ బాబును దాదాపు 10 వేల తేడాతో ఓడించాడు. ఎకె ఏంటోనీ కాబినెట్‌లో ట్రాన్స్‌పోర్టు మంత్రిగా చేరి స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించి మంచి పేరే తెచ్చుకున్నాడు. రెండేళ్లు పోయాక తండ్రి బాలకృష్ణ పిళ్లయికి తనే మంత్రి కావాలన్న ఆశ పుట్టి కొడుకుని తప్పుకోమన్నాడు. గణేశ్‌ మారు మాట్లాడకుండా దిగిపోయాడు. ఈ మోడర్న్‌ 'యయాతి-పురూరవుడి' గాథ ఆధారంగా ''లయన్‌'' అనే సినిమా దిలీప్‌ హీరోగా 2005లో వచ్చింది. తండ్రి అవినీతిపరుడైన రాజకీయనాయకుడు. పేరు బాలగంగాధర మేనోన్‌. అతనికి తోడుగా అల్లుళ్లు. అతని కొడుకు (పేరు కృష్ణకుమార్‌) మాత్రం మంచివాడు. మోసం, దగా చేయకుండా నిజాయితీగా తనకంటూ ఒక రాజకీయ వేదిక ఏర్పరచుకుందామని ప్రయత్నిస్తాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. 

2006 వచ్చేసరికి రాష్ట్రం మొత్తంలో లెఫ్ట్‌ హవా వీచి, కొల్లమ్‌ జిల్లాలో 12 స్థానాల్లో 11 గెలిచింది. కొడుకు నుంచి మంత్రి పదవి గుంజుకున్న బాలకృష్ణ కూడా సిపిఎం అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. కానీ గణేశ్‌ 11 వేల తేడాతో సిపిఐ అభ్యర్థిని ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐదేళ్లు పోయేసరికి 2011లో 20 వేల తేడాతో గెలిచి ఫారెస్టు, స్పోర్ట్‌స్‌ మంత్రి అయ్యాడు. అతని భార్య డా|| యామిని తంగచ్చి అతనిపై గృహహింస కేసు పెట్టడంతో రెండేళ్ల తర్వాత రాజీనామా చేయవలసి వచ్చింది. తర్వాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గణేశ్‌ 2014లో బిందు మేనోన్‌ను  పెళ్లాడాడు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా గణేశ్‌ సినిమాలో, టీవీ సీరియల్స్‌లో, టీవీ షోల్లో చేస్తున్నాడు. పాత్రల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ మంచివాడి పాత్రలు వేస్తున్నాడు. ఈ ఎన్నికలలో కూడా నిల్చుంటున్న గణేశ్‌ యీ సారి లెఫ్ట్‌ ఫ్రంట్‌తో జత కట్టవచ్చంటున్నారు. గణేశ్‌ కాకుండా రాజకీయాల్లోకి వచ్చిన మరో నటుడు హాస్యనటుడు ఇన్నోసెంట్‌. అతనికీ రాజకీయ నేపథ్యం వుంది. తండ్రి సిపిఎం కార్యకర్త. 2014 పార్లమెంటు ఎన్నికలలో చాలాకుడి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు. అతనికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ మద్దతు యిచ్చింది. కాంగ్రెసు అభ్యర్థి పిసి చాకోపై అలిగిన కాంగ్రెసు కార్యకర్తలు ఇన్నోసెంట్‌కు ఓటేయడంతో అతను గెలిచాడు.

వీళ్లను చూసి చాలామంది నటులకు ఆశ పుట్టింది. వారిలో సురేశ్‌ గోపీని చెప్పుకోవాలి. తెలుగు వారికి కూడా సుపరిచితుడైన యితను బిజెపి అభిమాని. బిజెపి తరఫున నిలబడతాడని అనుకున్నారు కానీ తనకు ఎన్‌ఎఫ్‌డిసి చైర్మన్‌ పదవి యివ్వలేదని అలిగి నిలబడనని చెప్పాడట. కాంగ్రెసు తరఫున ఆరూర్‌ నుంచి సిద్దిఖీ, పత్తనపురం నుంచి జగదీశ్‌ నిలబడుతున్నారు. వడకాంజెరి నియోజకవర్గంలో కరుణాకరన్‌ కూతురికి ప్రత్యర్థిగా సిపిఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నానని నటీమణి కెపిఎసి లలిత ప్రకటించగానే ఆమెకు వ్యతిరేకంగా ''మాకు కావలసినది ఆకాశంలో తారలు కాదు, నేలపై నిలిచి మాతో కలిసి పనిచేసేవాళ్లు'' అంటూ వూరంతా పోస్టర్లు వెలిశాయి. ఇతర నటీనటులు ముఖేశ్‌, శ్రీనివాసన్‌, నెడుముడి వేణు, షీలా, రాజసేనన్‌, దేవన్‌ కూడా రంగంలోకి దిగవచ్చని వార్తలు వస్తున్నాయి.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]