జాతీయ స్థాయిలో రాజమౌళి 'బాహుబలి' ఉత్తమ చిత్రంగా ఎంపికైనందుకు తెలుగువారమంతా విపరీతంగా సంతోషపడాల్సిందే. ఇది ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికైందని కొందరు అనుమానించవచ్చు. సాధారణంగా తెలుగు చిత్రాలు ఆ కేటగిరీలోనే ఎంపికవుతుంటాయి. కాని బాహుబలి హిందీ సినిమాలను కూడా అధిగమించి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మళ్లీ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా క్రిష్ సినిమా 'కంచె' ఎంపికైంది. సో…తెలుగువారికి డబుల్ బొనాంజ అన్న మాట.
అయితే బాహుబలికి ఉత్తమ చిత్రంగా ఎలా అవార్డు ప్రకటించారో అర్థం కాలేదు. ఇందుకు పారామీటర్స్ (ప్రమాణాలు) ఏమిటి? బాహుబలి డాక్యుమెంటరీ కాదు. కథా చిత్రం. అంటే ఫీచర్ ఫిల్మ్. ఇది కథా చిత్రాల విభాగంలో అవార్డు గెలుచుకుంది. కాని ఇది పూర్తి కథా చిత్రమా? కాదు కదా…! ఇది 'బాహుబలి ది బిగినింగ్' పేరుతో తీసిన మొదటి భాగం. అంటే సగం సినిమా. సగం సినిమాకు అవార్డు ఇస్తారా? శుభం కార్డు పడని చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎలా ఎంపిక చేశారు. ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రం అంటే ఓకే. సమంజసమే. కాని పూర్తికాని సినిమాకు అవార్డు ఇవ్వడం విచిత్రంగా ఉంది.
ఎంపిక కమిటీ వారికి ఇది పూర్తికాని చిత్రమని, రెండో భాగం విడుదల కాబోతోందని తెలియదా? జ్యూరీలో ఎవరైనా తెలుగోళ్లు ఉన్నారా? అసలు రెండో భాగంతోనూ పూర్తవుతుందో కాదో చెప్పలేం. మూడో భాగమూ ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మూడో భాగం లేకపోయినా రెండో భాగంతోనైనా సినిమా ముగుస్తుంది. అంతవరకు గ్యారంటీ. సినిమా నిర్మాతలు, దర్శకుడు కూడా 'అసలు కథ' రెండో భాగంలోనే ఉంటుందని చెప్పారు. మరి అసలు కథ లేని మొదటి భాగానికి ఉత్తమ చిత్రం అని ఎలా ముద్ర వేశారు. 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనే ప్రశ్నతో మొదటి భాగం ముగిసింది. అది తెలియాలంటే రెండో భాగం చూడాలి.
ఒకటి, రెండు భాగాలు కలిపితేనే బాహుబలి సంపూర్ణమైన సినిమా అవుతుంది. అంటే రెండో భాగాన్ని కూడా 'ఉత్తమ చిత్రం'గా ఎంపిక చేయాల్సిందే. తప్పదు. అలా చేయకపోతే మొదటి భాగాన్ని ఉత్తమ చిత్రంగా ఎలా, ఎందుకు ఎంపిక చేశారో జ్యూరీ జవాబు చెప్సాల్సి ఉంటుంది. ఈ విషయం ఎవరో ఒకరు ప్రశ్నించకుండా ఉంటారా? రెండో భాగాన్ని పూర్తిగా విస్మరించడమో, ప్రాంతీయ భాషా విభాగంలో చేర్చడమో చేయకూడదు. అలాగే దానిలోని ఏదో ఒక అంశానికే (ఫొటోగ్రఫీ, మ్యూజిక్, గ్రాఫిక్స్ వగైరా) అవార్డు ఇచ్చి ఊరుకోకూడదు. రెండో భాగానికి కూడా ఉత్తమ చిత్రం అవార్డు వచ్చినట్లయితే ఒక కథా చిత్రానికి ఉత్తమ కథా చిత్రంగా రెండు జాతీయ అవార్డులు వచ్చినట్లు అవుతుంది. ఇది విచిత్రమే కాదు. ప్రపంచ రికార్డు కూడా.
ఇప్పటివరకు అపజయం లేకుండా కొనసాగుతున్న రాజమౌళి సగం సినిమాకు నేషనల్ అవార్డు సంపాదించి విజయానికి కొత్త నిర్వచనంలా నిలిచాడు. బాహుబలి మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మొదటి భాగం ఏమిటో కొందరు మర్చిపోయి ఉంటారు. రెండో భాగం విడుదలైనప్పుడు మొదటి భాగం ఒకసారి చూసుకొని (సీడీలు) థియేటర్‌కు వెళ్లాలి. 1954లో జాతీయ అవార్డులు ప్రవేశపెట్టారు. అప్పటినుంచి తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు తీసినా 'ఉత్తమ చిత్రం' అవార్డు దక్కలేదు.
శంకరాభరణం, స్వాతిముత్యం, మేఘసందేశం, ఆనందభైరవి…ఇలా ఎన్నో క్లాసిక్స్ ప్రాంతీయ భాషా విభాగానికి పరమితమయ్యాయి. ఇలాంటి సినిమాలకు ఇతర విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కాయి. కొన్నింటికి ఒకటి కంటే ఎక్కువ అవార్డులు (మేఘసందేశం మొదలైనవి) దక్కించుకున్నాయి. 2012లో రాజమౌళి సంచలన చిత్రం 'ఈగ' కూడా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికైంది. ఏది ఏమైనా కథే లేని సగం సినిమాకు అవార్డు ఇచ్చి ఒక కొత్త చరిత్ర సృష్టించారు.