పాక్ ఈ రోజు ఓడిపోవాలి

టీ 20 ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్ అనిపించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇతర జట్ల సమీకరణాలపై కూడా ఆధారపడే పరిస్థితిలోకి వచ్చింది. పూర్తిగా ఇతర జట్ల ఆట తీరుమీదే ప్రపంచకప్ లో…

టీ 20 ప్రపంచకప్ కు హాట్ ఫేవరెట్ అనిపించిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఇతర జట్ల సమీకరణాలపై కూడా ఆధారపడే పరిస్థితిలోకి వచ్చింది. పూర్తిగా ఇతర జట్ల ఆట తీరుమీదే ప్రపంచకప్ లో టీమిండియా పయనం ఆధారపడి లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే మనోళ్లు ఈ రోజు జరగబోయే గ్రూప్ లెవల్ లీగ్ మ్యాచ్ పై దృష్టి పెట్టారు. న్యూజిలాండ్ , పాకిస్తాన్ ల మధ్య జరగబోయే నేటి మ్యాచ్ లో కివీ జట్టు గెలవడం భారత్ కు అనుకూల సమీకరణం. ఇప్పటికే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది.

అలాగే ఆ జట్టు ఆస్ట్రేలియాపై కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. ఇక భారత జట్టు తన తొలి మ్యాచ్ లో కివీ జట్టులో ఓడిపోయి నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ పై గెలిచినా… సెమిస్ కు చేరాలంటే తన తర్వాతి మ్యాచులలో ఆసీస్ , బంగ్లాలపై తప్పని సరిగా గెలవాల్సిన స్థితిలో ఉంది. ఒకవేళ ఈ రోజు గనుక కివీతో మ్యాచ్ లో పాక్ గెలిస్తే.. రెండో స్థానం విషయంలో ఇండియాకు పోటీగా తయారవుతోంది. ఒకవేళ కివీ గెలిస్తే.. ఆ జట్టు సెమిస్ బెర్త్ ఖాయం చేసుకొంటుంది.. పాక్ ఇంటి దారి పడుతుంది. ఆ పై ఆసీస్ తో జరిగే మ్యాచ్ ఫలితం మీద భారత జట్టు సెమిస్  చాన్సెస్ ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. 

ఒకవేళ పాక్ ఈ రోజు న్యూజిలాండ్ మీద ఓడినా కూడా.. ఇండియా ఆసీస్ , బంగ్లాలపై విజయాలు సాధిస్తేనే ధాటిగా సెమిస్ లోకి అడుగుపెడుతుంది. అలాగాక పాక్ గెలిస్తే… తర్వాతి రెండు మ్యాచ్ లలో మనోళ్లు ఎక్కడైనా ఎదురుదెబ్బ తగిలితే… రన్ రేట్ల లెక్కలు భారత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ లోనూ, రెండో మ్యాచ్ లోనూ లో స్కోరింగ్స్ వల్ల టీమిండియా నెట్ రన్ రేట్ మైనస్ ల స్థాయిలోనే ఉంది. కాబట్టి.. ఈ మ్యాచ్ లో పాక్ ఓడి.. ట్రోపీ నుంచి సైడైపోతే మనోళ్లకు కొంత ప్రశాంతత. ఇలా కాదు.. రన్ రేట్ల లెక్కలు అక్కర్లేదు బంగ్లా, ఆసీస్ లపై గెలిచి గ్రాండ్ గా సెమిస్ కు వెళ్లగల్ల సత్తాను టీమిండియా కనబరిస్తే.. ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం లేదు!