ఎమ్బీయస్‌ : భరతమాతకు జై అనాల్సిందేనా?

'హిందూస్తాన్‌కి జై' అంటాను తప్ప 'భరతమాతకు జై అనను' అని ఒవైసీ అనడం, దాన్ని అతని పార్టీ ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీలో పునరుద్ఘాటించడం, వెంటనే అన్ని పార్టీల వాళ్లూ కలిసి అతన్ని ఆ సెషన్‌…

'హిందూస్తాన్‌కి జై' అంటాను తప్ప 'భరతమాతకు జై అనను' అని ఒవైసీ అనడం, దాన్ని అతని పార్టీ ఎమ్మెల్యే మహారాష్ట్ర అసెంబ్లీలో పునరుద్ఘాటించడం, వెంటనే అన్ని పార్టీల వాళ్లూ కలిసి అతన్ని ఆ సెషన్‌ వరకు (కోడెల వారు సీట్లో వుండి వుంటే ఏడాది చేసేవారేమో!) సస్పెండ్‌ చేయడం జరిగాయి. భరతమాతకు జై అననివాళ్లందరూ దేశద్రోహులే అనీ, రజాకార్ల వారసులనీ వెంకయ్యనాయుడుగారు నిర్వచించారు. వాళ్ల పౌరసత్వాలను, ఓటు హక్కును రద్దు చేయాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ వేరేమీ పని లేనట్లు ఒవైసీని అభిశంసించింది. దేశభక్తికి యింత సింపుల్‌ లిట్మస్‌ టెస్టు వుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. విజయ మాల్యా పారిపోతూ పారిపోతూ 'భారత్‌మాతాకీ జై' అనేసి వుంటే అతనూ దేశభక్తుడి కిందే లెక్కలోకి వచ్చేవాడేమో! భారతమాతకు జై అనని వాళ్లందరూ భారతదేశద్రోహులా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేముందు 'తెలుగుతల్లికి జై' అననివాళ్లందరూ తెలుగుద్రోహులా అని అడుగుతాను. కెసియార్‌ తెలుగులో మహా పండితుడు. ఆ భాషపై ప్రేమ వున్నవాడు, అయినా తెలుగుతల్లిని దెయ్యం అన్నాడు, ఎక్కడ నుంచి వచ్చింది అన్నాడు, ఎక్కడా లేనిదాన్ని పుట్టించారని తీర్మానించాడు. అయినా తెలుగు రాష్ట్రంలో ఆయన ఓటుహక్కు రద్దు కాలేదు సరికదా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకదాన్ని ఏలేస్తున్నాడు. కెసియార్‌ అలా అన్నపుడు మర్యాదహీనంగా మాట్లాడాడని వాపోయారు తప్ప 'తెలుగుతల్లి ఒక కల్పన' అనే పాయింటును ఎవరూ ఖండించలేదు. సొంతంగా కల్పనాశక్తి వుంది కనుక ఆయన 'తెలంగాణ తల్లి'ని కల్పించాడు. అది మన కళ్లెదురే జరిగింది. రేప్పొద్దున్న 'ఎక్కడి తెలంగాణ తల్లి? ఎవరికి తల్లి? దానిలో కెసియార్‌ అమ్మగారి పోలికలు కనబడుతున్నాయి, నేను మరో మంజీరాతల్లి అని సృష్టిస్తాను.' అని వేరెవరైనా అంటే అననూ వచ్చు. భరతమాత అనే మాత ఏదైనా పురాణవ్యక్తి అయితే ఆవిడ గురించి చర్చించవచ్చు. ఎవరో కవి దేశాన్ని తల్లిగా భావించి భరతమాత అన్నారు. చిలకమర్తి వారు దేశాన్ని పాడియావుతో పోల్చారు. గురజాడ వారు దేశమంటే మట్టి కాదోయ్‌, మనుషులోయ్‌ అన్నారు.

ఇలా ఒక్కొక్క కవి ఎలా కావలిస్తే అలా దేశాన్ని ఆరాధించారు. మనం మాతృదేశం అంటారు. జర్మనీవాళ్లు తమ దేశాన్ని పితృదేశంగా భావిస్తారు. చంద్రుణ్ని వారి కవిత్వంలో స్త్రీగా భావిస్తే, మనం పురుషుడిగా భావిస్తాం. దేవతలు కొందరు పరమభక్తులకైనా దర్శనమిచ్చారేమో కానీ భరతమాత మాత్రం ఎవరికీ దర్శనం యివ్వలేదు. ఆవిడ ఎలా వుంటుందో తెలియదు. భారతదేశం మ్యాప్‌ దగ్గర పెట్టుకుని ఆవిడ హిమకిరీటాన్ని ధరించిందని, వింధ్యపర్వతాలను వడ్డాణంగా పెట్టుకుని, కాళ్లకు సముద్రజలాల మంజీరాలతో విలసిల్లుతోందని చిత్రకారుడు చిత్రీకరించవచ్చు. అంత మాత్రం చేత అదే ఆమె రూపమని ఎవరూ ధృవీకరించలేరు. భారతమాతాకీ జై అనేది మన జాతీయనినాదం కాదు, పతాకవందనం తర్వాత, ఉపన్యాసం ముగింపులో 'జైహింద్‌' అనే పద్ధతి వుంది కానీ భారతమాతా కీ జై అనే సంప్రదాయం లేదు. ఎవరైనా అంటే వారి యిష్టం. అననివారిని ఒత్తిడి చేసే హక్కు, దండించే హక్కు ఎవరికీ లేదు – ఎందుకంటే అది జాతీయగీతం కాదు, జాతీయపతాకం కాదు, జాతీయపక్షి, జాతీయపుష్పం వగైరా ఏమీ కాదు. జాతీయగీతం అంటే గుర్తుకు వచ్చింది – దానిలో మనం కీర్తించేది ఒక అధినాయకుణ్ని! ఆయన ప్రజాసమూహాల మనస్సులను పాలించే అధినాయకుడు అతనికి జయహే అంటున్నాం. ఆయన జయగాథలు పాడతామని చెప్తున్నాం. ఆయనకు భారతమాతకు మధ్య బాంధవ్యం ఏమిటో ఎవరైనా చెప్పగలరా? తల్లా, భార్యా, కూతురా? ఆయన రూపాన్ని ఎవరైనా చిత్రీకరించారా? ఆయనా ఒక కల్పనే కదా, ఆయన్నీ ఎవరూ చూడలేదు, పరమ దేశభక్తులు కూడా ఆయన యిలా రాజులా వుంటాడు, లేదా వేదాంతిలా వుంటాడని వర్ణించలేదు కదా. ఒవైసీ జాతీయగీతాన్ని పాడడానికి నిరాకరిస్తే అప్పుడు చర్య తీసుకోవచ్చు. కానీ భారతమాతా కీ జై అనే అనలేదని తప్పు పడితే రేపు మరొకడు 'రాజ్‌ కరేగా ఖాల్సా' అనలేదని అభిశంసించవచ్చు. నమస్కారం అనడానికి బదులుగా ఉత్తరభారతంలో చాలామంది 'రామ్‌రామ్‌' అని పలకరించుకుంటారు. మనం అలా అనం కాబట్టి మనల్ని హిందువులం కాదని ఎవరైనా అంటే ఎలా వుంటుంది? కొందరు సాయి భక్తులకు ఫోన్‌ చేస్తే 'హలో' అనే బదులు 'సాయిరామ్‌' అంటారు. వాళ్లిష్టం. మనల్ని కూడా హలో అనకుండా సాయిరాం అనాలని, లేకపోతే సాయిబాబాను అవమానించినట్లే అని వాదిస్తే ఎలా?

జనగణమనలో వుండే అధినాయకుడికి జయహే అని అనడానికి ఒవైసికి లేని అభ్యంతరం భరతమాతకి జై అనడానికి ఎందుకు రావాలి అనే సందేహం వస్తుంది. ఎందుకంటే రెండూ కల్పనలే. హిందూస్తాన్‌కి జై అన్నా జైహింద్‌ అన్నా ఒక ప్రాంతానికి చెందిన నినాదం. కాల్పనిక పదార్థం కాదు. కానీ అధినాయకుడు, భరతమాత యిద్దరూ కాల్పనిక వ్యక్తులే.  మరి యిద్దరిలో వివక్షత దేనికి? స్త్రీలంటే ఒవైసీకి పడదా? లేక షబానా అజ్మీ సూచించినట్లు 'మాత' అనే సంస్కృతపదం పడదా? (ఆవిడ అమ్మీ అనవచ్చుగా అంది, యింకా నయం భరతమాత బొమ్మకు బురఖా వేస్తే ఒప్పుకుంటావా అని అడగలేదు) ఒవైసీ వివరించలేదు. నాకు తోచిన సమాధానం మాత్రం – విగ్రహారాధనకు సంబంధించినది. భరతమాత అనే పేరుతో చిత్రాలను, శిల్పాలను, విగ్రహాలను తయారుచేసి అమ్ముతున్నారు. ఎప్పుడైతే ఒక ఆకారం అంటూ ఏర్పరచారో అది ముస్లిములకు, క్రైస్తవులకు, యూదులకు సమ్మతం కాదు. బైబిల్‌ కథల్లో చదువుతూనే వుండి వుంటారు. ఇస్రాయేలులో వున్న ప్రజలు అన్యదైవాలను కొలిచి, వాళ్ల విగ్రహాలను యిళ్లల్లో పెట్టుకున్నప్పుడల్లా బైబిల్‌ దేవుడు వారిని శిక్షిస్తూనే వుంటాడు. బైబిల్‌ దేవుడికి, యితర దేవుళ్లకు కొట్టవచ్చినట్లు కనబడే తేడా – విగ్రహారాధనే! బైబిల్‌లోని పాత నిబంధన (ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌) పైన చెప్పిన మూడు మతాల వారికీ శిరోధార్యం. వారికీ విగ్రహారాధనకు చుక్కెదురు. క్రైస్తవంలో క్రైస్తు ఎక్కిన శిలువ కనబడుతుంది తప్ప దేవుడికి రూపమంటూ కల్పించలేదు. ఇస్లాంలో అయితే దేవుడు కాదు కదా, ప్రవక్త బొమ్మ సైతం వేయరు. ఎవరైనా వేసినా వూరుకోరు. ఎన్నోసార్లు ఆ విషయమై గొడవలు జరిగాయి. భరతమాత అనే భావనకు రూపం కల్పించి, విగ్రహం పెట్టారు కాబట్టి ఒవైసీకి అభ్యంతరం కలిగి వుండవచ్చు. రేపు జనగణమనలోని 'అధినాయకుడు'కి కూడా ఏదైనా రూపం కల్పించి విగ్రహాలు పెడితే అప్పుడు దానికి కూడా అభ్యంతర పెట్టవచ్చని నా వూహ. 

ఈ మూడు మతాలే కాదు, శిఖ్కులు మాత్రం విగ్రహారాధన చేస్తున్నారా? వాళ్ల గురుద్వారాలో గ్రంథపఠనం వుంటుంది తప్ప, దేవుడి విగ్రహం వుండదు కదా! ఒక్కో మతానిది ఒక్కో తీరు, దాన్ని మనం అర్థం చేసుకుని, ఆమోదించాలి. హిందూమతంలో కూడా విగ్రహారాధన తప్పనిసరి కాదు. మనం రకరకాలుగా పూజించవచ్చు. నిరాకార పూజలోంచే శివలింగపూజ వచ్చిందంటారు. సాలిగ్రామాన్ని పూజిస్తాం, దానికి ఏ ఆకారం వుంది కనుక! చిదంబరంలో వాయురూపంలో కనబడే పరమశివుడిది ఏ రూపం? పోనుపోను శివలింగానికి కూడా బంగారు నాగుపాము, వెండి పానువట్టం ఏర్పాటు చేసి, విగ్రహారాధనగా మార్చారు. ఏకాగ్రత కుదరడానికి మొదటి మెట్టుగా విగ్రహాన్ని పెట్టుకోమన్నారు కానీ ఎల్లకాలం దాన్నే పట్టుకుని అక్కడే ఆగిపోమనలేదు. తరువాతి దశలో కళ్లు మూసుకున్నా మీ ముందు ఆ రూపం కదలాడాలి. మీ తల్లీతండ్రీ మీ కళ్లముందు లేకపోయినా కళ్లు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వారి రూపం గోచరించదా? దేవుణ్నయినా అలా తలచుకోగలగాలి. పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసేవాళ్లు ఎదురుగా విగ్రహాలు పెట్టుకుని చేస్తారా? ధ్యానముద్రలోకి వెళితే వాళ్లకు అన్నీ గోచరిస్తాయి. దేవుణ్ని చేరుకోవడానికి అనేక మార్గాలు. విగ్రహారాధన ఒక్కటే మార్గమని ఎవరూ అనలేరు. అది కొన్ని మతాల్లోనే వుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న ముఖ్యమతాల్లో  లేదు. భారతమాతా కీ జై అను, భరతమాత విగ్రహానికి దణ్ణం పెట్టుకో అని ఒత్తిడి చేయడం ఏ మాత్రం సబబు కాదు. జై అననివాళ్లను దేశద్రోహులను అనడం పొరబాటు. చట్టసమ్మతం కూడా కాదు. కావాలంటే యిలాటివన్నీ పెట్టి రాజ్యాంగం మార్చి, అప్పుడు సస్పెండ్‌ చేయడాల్లాటివి తలపెట్టవచ్చు. ఈ లోపున దీన్నో పెద్ద అంశంగా చేసుకోవడం అనవసరంగా తలనొప్పి తెచ్చుకోవడమే! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]