మార్చి 11 నుంచి 13 వరకు చంద్రబాబుగారు పెట్టుబడుల కోసం లండన్ వెళ్లినపుడు అక్కడ లండన్ ఐ చూసి దాన్ని అమరావతిలో పెట్టే అవకాశాలు పరిశీలించారని పేపర్లో వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ఫలానా టైములో జరగాలని నిర్ణయించేది ఆయనే. మళ్లీ అది నడుస్తూండగా మూడు రోజుల లండన్ యాత్ర పెట్టుకున్నదీ ఆయనే. అదేమిటో మరి! లండన్‌లో కొన్ని కంపెనీ ప్రతినిథులు కలిసి పెట్టుబడులు పెడతానన్నారట, సంతోషం. కింగ్స్ కాలేజ్ హాస్పటల్ వాళ్లు అమరావతిలో వెయ్యి పడకల ఆసుపత్రి పెడుతున్నారని, భారతదేశంలో వాళ్ల ఆసుపత్రులన్నిటికి అదే హెడాఫీసనీ బాబు చెప్పగా ఇండియన్ జర్నలిస్టులందరూ రిపోర్టు చేశారు. అదేమిటో గాని బ్రిటిషు పత్రికలలో యీ విషయం వచ్చినట్లు లేదు. కింగ్స్ కాలేజి వాళ్ల వెబ్‌సైట్‌కి వెళ్లి చూసినా మార్చి నెల ప్రెస్ రిలీజుల్లో కూడా లేదు.(https://www.kch.nhs.uk/news/media/press-releases) అంటే ఒప్పందం అండస్థాయిలోనే వున్నట్టుంది. దాన్నే బ్రహ్మాండంగా చూపించవలసిన అగత్యం ఆశలగ్యాసుపై బండి నడుపుతున్న ఆంధ్రపాలకులకు వుంది కానీ అవతలివాళ్లకు లేదు. గతంలో ఈయన సింగపూరు వెళ్లినపుడు అమరావతి సింగపూరు ప్రభుత్వమే చేపడుతుందని మన యిండియన్ ప్రెస్ రాయడమూ, ఆ ముక్క సింగపూరు మీడియాలో కనబడకపోవడమూ చూశాం. తర్వాత మనవాళ్లే అబ్బే సింగపూరు ప్రభుత్వం కాదష, కంపెనీలట అనడమూ జరిగింది. మరి కొన్నాళ్లకు వాళ్లవి గొంతెమ్మ కోర్కెలని తేల్చడమూ జరిగింది. కింగ్స్ వాళ్లయినా ఆంధ్ర రాష్ట్రాన్ని సీరియస్‌గా తీసుకుంటారని ఆశిద్దాం.
దాని మాట ఎలా వున్నా ఆ ప్రెస్ రిలీజులో ఒక అంశమే నన్ను కాస్త కంగారు పెట్టింది. లండన్ వెళ్లిన సందర్భంగా ముఖ్యమంత్రి బృందం లండన్ ఐ చూడడానికి వెళ్లారు. రోజంతా పని అంటే కష్టమే, సరదాగా చూడ్డానికి వెళ్లి వుండవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉత్తినే వెళ్లారని మనం అనుకుంటామని కాబోలు 'లండన్ ఐను అమరావతిలో పెట్టే అవకాశాలు పరిశీలించమని బాబు అధికారులను ఆదేశించారు' అని వార్త యిచ్చారు. ఆంధ్ర ప్రజలందరు వెంటనే 'మేమేమీ అనుకోం కానీ దయచేసి లండన్ ఐ పెట్టే ప్రతిపాదన మానుకోండి' అని తక్షణం చెప్పాలి. లండన్ ఐ అంటే పెద్ద జెయింట్ వీలు, అది కూడా అమరావతిలోనే ఎందుకు? అమరావతిలో ఎన్ని పెడతారో అర్థం కావటం లేదు. వస్తే గిస్తే కింగ్స్ మెడికల్ కాలేజీ వారి ఆసుపత్రి కూడా అమరావతిలోనే! ఇక యిది కూడా అక్కడేనా? తక్కిన ఆంధ్ర దేశం గొడ్డుపోయిందా? ఎగ్జిబిషన్లో పెట్టే పెద్ద చక్రం లాటిది ఎక్కినపుడు పరిసరాలు కనబడతాయి. అరకు వ్యాలీలాటి చోట పెడితే కొండలు, లోయలైనా కనువిందుగా కనబడతాయి. కేబుల్ కారు చూడండి, రెండు కొండల మధ్య నడుపుతారు, మామూలు మైదాన ప్రాంతాల మీదుగా ఎవరూ పెట్టరు. అమరావతిని పైనుంచి చూస్తే ఏం కనబడుతుందో వూహించండి!
ఆలు, చూలు లేదు రేపే ఆయన లండన్ ఐ పెట్టేస్తున్నట్లు నీకు కంగారెందుకయ్యా, ఆంధ్రను ఎదగనీయవా? టూరిస్టులను రానీయవా? అని మీరనవచ్చు. ఆంధ్ర ఎదగాలి, రాజీవ్ గాంధీ బోఫోర్స్‌తో సహా అనేక రకరకాల స్కాముల్లో నిత్యస్మరణీయులు, అత్యంత వివాదాస్పదులు ఐన హిందూజాల (వారే యీ పెట్టుబడి మేళాకు సూత్రధారులట) ద్వారా వచ్చినా ఫర్వాలేదు కానీ పెట్టుబడులు రావాలి. అవి రాకుండా వూరికే అంతర్జాతీయ టూరిస్టులకు అల్టిమేట్ డెస్టినేషన్‌గా చేస్తాం అంటూ హంగామా చేస్తే 'తాత్కాలిక రాజధాని కూడా ఏర్పడ లేదు కానీ, మీకు షోకులు కావలసి వచ్చాయా' అంటూ కేంద్రం మరీ బిగబట్టేస్తుంది. ఇప్పటికే వాళ్లు ఆంధ్రకు చాలా యిచ్చేసినట్లు ఫీలై పోతున్నారు. అమిత్ షా గారు వచ్చి ఏడాదిన్నరలో రూ.1.40 లక్షల కోట్లు యిచ్చామని ప్రకటించేశారు. ఎయిమ్స్‌కు 1618 కోట్లు, అమరావతికి 1500 కోట్లు, మిస్సేల్ ఫ్యాకరీకి 3200 కోట్లు, నేవీకి 3000 కోట్లు అంటూ శంకుస్థాపన రాయి వేయగానే నిధుల సంచి అందించిన ధోరణిలో చెప్పేశారు. ఈ అంకెలన్నీ కేంద్ర బజెట్‌లో ఎక్కడ కనబడుతున్నాయో ఆయనే చెప్పాలి. ఇవన్నీ యిద్దామనుకుంటున్నాం అని కాదు, యిచ్చేశాం అని చెప్పారు. అదీ బ్యూటీ! ఇప్పుడు లండన్ ఐ అని మొదలెడితే, యింకేం మరి దాని మీద వచ్చే ఆదాయంతో బతికేయవచ్చు, మీ రాజధానికి సరిపడా నిధులు మీరే తెచ్చేసుకోండి అనవచ్చు. అదీ నా భయం. వెంకయ్యనాయుడు గారికి ఆప్తుడు, అయితేగియితే ఆంధ్ర బిజెపి అధ్యక్షుడు అయిన కంభంపాటి హరిబాబు గారు యివాళ టీవీ చర్చలో 'రాజధాని నిర్మాణానికి నిధులివ్వలేదని బిజెపిని ఆడిపోసుకుంటే ఎలా? ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులిస్తారు కానీ యింద్రభవనం కడతానంటే యిస్తారా?' అని ప్రశ్నించారు. అదీ వాళ్ల ధోరణి. ఇప్పుడు ఇంద్రభవనం ముంగిట్లో రంగులరాట్నాన్ని నిలబెడతామంటే ఏమంటారు? ఆ ఐరావతం మీకు అవసరమా అంటారు. ఎందుకంటే అంతమంది పర్యాటకులు వచ్చే ఒరిజినల్ లండన్ ఐ యే తెల్లఏనుగులా తయారయి, నిర్వాహకులు చేతులు ఎత్తేస్తూ చేతులు మార్చేసుకుంటున్నారు.
లండన్ ఐ అంటే ఏమిటో, దాన్ని మన దగ్గర నడపడం ఎంతవరకు సాధ్యమో కాస్త చూదాం. లండన్‌లో థేమ్స్ (కొందరు టేమ్స్ అంటారు) దక్షిణతీరంలో 443 అడుగుల ఎత్తున, 394 అడుగుల వ్యాసంతో 1999లో అప్పటికి ప్రపంచంలోనే ఎత్తయిన ఫెర్రిస్ వీల్‌గా కట్టారు. ఆ ఏడాది డిసెంబరులో ప్రధాని దానికి ప్రారంభోత్సవం చేసినా సాంకేతికమైన యిబ్బంది వచ్చి మూణ్నెళ్ల దాకా ఆపరేషన్లు మొదలుపెట్టలేదు. దానికి 32 కాప్సూల్స్ (రైలు పెట్టెల్లాటివి) వుంటాయి. అవి అతి నెమ్మదిగా పైకి కిందకు తిరుగుతూ వుంటాయి. ఒక్కో దాంట్లో 25 మంది ఎక్కవచ్చు. పైకి వెళుతున్న కొద్దీ లండన్ నగరం కనబడుతూ వుంటుంది. ఆర్నెల్ల కితం నేనూ ఎక్కా, బోరు కొట్టింది. నాలాగే చాలామంది ఫీలయ్యారో ఏమో అదనపు ఆకర్షణగా 4-డి చిత్రప్రదర్శన జోడించారు. ప్రస్తుతం ఏటా 37.50 లక్షలమంది ఎక్కుతారు. కానీ దాని నిర్వహణాభారం భరించలేక స్పాన్సర్లు మారుతూ వస్తున్నారు. స్థలం యజమానులు అద్దె పెంచమంటే మా వల్ల కాదన్నారు స్పాన్సర్లు. బ్రిటిషు ఎయిర్వేస్, ట్యుసాడ్స్, మెర్లిన్ ఎంటర్టైన్మెంట్.. యిలా చేతులు మారుతూ వచ్చి 2015 నుంచి కోకాకోలా తీసుకుంది. ఏటా అనేకమంది (2014లో1.74 కోట్ల మంది) టూరిస్టులు సందర్శించే లండన్‌లోనే లండన్ ఐ నిర్వహణ అంత కష్టంగా వుంటే అమరావతికి వచ్చే టూరిస్టులు ఎంతమంది వుంటారనుకుని లెక్కలు వేయాలి? అదే 2014లో భారతదేశానికి వచ్చిన మొత్తం పర్యాటకులు 2.25 కోట్లు! దానిలో మన తెలుగు రాష్ట్రాలకు ఎంతమంది వచ్చి వుంటారో చూసుకుంటే అంకె చాలా తక్కువ వుండి వుంటుంది.
అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేసేస్తాం కాబట్టి కుప్పలుతిప్పలుగా వచ్చి పడిపోతారు అని అనుకునే సావకాశం లేదు. ఎందుకంటే పర్యాటకులు ఆధునిక భవంతులు చూడడానికి రారు. ప్రకృతి అందాలు చూడడానికి, చారిత్రక ప్రదేశాలు చూడడానికి వస్తారు. అమెరికాలో ఎన్నో ఆధునిక నగరాలున్నాయి, అయినా యూరోపుకి బోల్డు మంది టూరిస్టులు వెళతారు. ఎందుకంటే అక్కడ చరిత్ర వుంది. ఆనాటి భవనాలున్నాయి. లండన్‌కి వస్తే గతవైభవం వుంది, రవి అస్తమించని సామ్రాజ్యపాలకులు కట్టిన అద్భుత భవంతులున్నాయి. అమరావతికి మాత్రం చరిత్ర లేదా అంటే వుంది. కానీ అమరావతి నేలిన రాజుల రాజ్యపు విస్తీర్ణం బ్రిటన్ సామ్రాజ్యంతో పోలిస్తే చాలా చిన్నది. చిన్నదైనా, పెద్దదైనా చరిత్ర తాలూకు ఆనవాళ్లుంటే, అది ఆకర్షణీయంగా వుంటే కాస్త చూడడానికి వస్తారు. మన దగ్గర ఆనవాళ్లేమున్నాయి? రోము మురికిగానే వుంటుంది. కానీ రెండు వేల ఏళ్ల క్రిందటి శిథిలాలు చూడడానికి వస్తారు. మన దగ్గర శిథిలాలు కూడా లేవు. మనకు చరిత్ర పట్ల ఖాతరు లేదు. చూపించడానికి పాతది లేదు కాబట్టి కొత్త బిల్డింగులు కడతాం, పెద్ద జెయింటు వీలు ఎక్కి చూద్దురుగాని అంటే ఏం మోజు వుంటుంది?
టూరిస్టులను ఆకర్షించాలంటే సుందరమైన ప్రకృతి పరిసరాలనైనా చూపించాలి. మనం పురాతన సంస్కృతినే కాదు, ప్రకృతినీ కాపాడుకోము. రోడ్ల వెడల్పు పేరుతో చెట్లన్నీ కొట్టేశాం. రాజధాని ప్లాను చేశాం కానీ పర్యావరణం గురించి పట్టించుకోకుండానే ముందుకు దూసుకుపోతున్నాం. లండన్ ఐ నదీతీరాన్న వుంది. పై నుంచి చూస్తే నది పరిశుభ్రంగా కనబడుతుంది. చూడముచ్చటగా వుంటుంది. మనవాళ్లు నదీజలాలను ఎలా కలుషితం చేస్తారో విపులంగా చెప్తే వాంతి వస్తుంది. ప్రకృతిమాత, నదీమాత అంటూ శ్లోకాలు చదవడమే తప్ప వాటిని పవిత్రంగా కాదు, పరిశుభ్రంగా వుంచాలన్న ధ్యాస కూడా వుండదు మనకు. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. మళ్లీ మట్టి పొట్లాలు, కుంకుమ పొట్లాలు ఎన్ని నదిలో పారేస్తారో ! ప్లాస్టిక్ వ్యర్థాలతో వూరంతా ఎలా నింపేస్తారో ఏమో! ఆంధ్రపౌరులు పాలకులకు చేయవలసిన విన్నపమొకటే – 'పర్యావరణం కాపాడండి చాలు, లండన్ ఐ వంటి షోకులు అక్కరలేదు. మన దగ్గర చూడడానికీ చరిత్రా లేదు, నడిపించడానికి డబ్బూ లేదు' అని.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)