మనకి సాధారణంగా సినిమాతారల పక్కన బాడీగార్డులు వుంటారని తెలుసు. తారల అభిమానులతో వచ్చిన చిక్కేమిటంటే వాళ్లు స్టార్ల కోసం గంటల తరబడి వేచి వుంటారు. వచ్చాక మీదపడబోతారు. పడనీయకపోతే రాళ్లేసి గాయపరుస్తారు. సినిమావాళ్లకు ముక్కుమీదో, మొహం మీద చిన్న గాటు పడినా కెరియర్‌కు యిబ్బంది. అందువలన వాళ్లు బాడీగార్డులను పెట్టుకుని తమను తాము కాపాడుకుంటూ వుంటారు. సల్మాన్ ఖాన్ ఓ సారి ఔరంగాబాద్‌కు వెళితే అతను వస్తున్నాడని తెలిసి అభిమానులు అతనెక్కిన టెంపో తలుపులు బాదసాగారు. అతని బాడీగార్డు షేరా – ఒకప్పుడు మిస్టర్ బాంబే, మిస్టర్ మహారాష్ట్ర కూడా – అతన్ని ముందుసీటులోంచి వెనక సీటులోకి లాగేశాడు. ఈ జనసందోహం తాకిడికి బెదిరి, అతన్ని ఆహ్వానించిన నిర్వాహకులు మీరు సభకు రానక్కరలేదు, వెనక్కి క్షేమంగా వెళితే అంతే చాలు అన్నారు. టెంపోలోంచి దిగకుండానే మళ్లీ ఎయిర్‌పోర్టుకి బయలుదేరాడు. చుట్టూ జనం చుట్టుముట్టేసి తోసేస్తూండడంతో టెంపో ఒక పక్కకు ఒరిగిపోయింది. అలాగే 30 కి.మీ.లు ప్రయాణం చేశారు. అప్పటికీ సల్మాన్ అభిమానులు బైకులు వేసుకుని టెంపోను వెంబడించారు. చివరకు ఎయిర్‌పోర్టు రాగానే షేరా సల్మాన్‌ను ఎలాగోలా లోపలకి చేర్చి ఊపిరి పీల్చుకున్నాడు. అలాగే ఫ్లిప్‌కార్ట్ వాళ్లు తమ దశమ వార్షికోత్సవానికి అక్షయ కుమార్‌ను అతిథిగా పిలిచారు. అతనికి జనాలతో కలవడం సరదా. అభిమానుల మధ్య దూసుకుపోతూ వుంటే జనాలకు, అతనికి మధ్య అడ్డుగోడలా నిలబడడానికి సెక్యూరిటీవాళ్లకు తల ప్రాణం తోకకు వచ్చింది.
కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల వ్యవహారం యిలా వుండదు. వాళ్లు జనంలోకి దూసుకుపోదామని చూడరు. తమ సెక్యూరిటీ అందరికీ తెలిసేట్లు వుండాలని కూడా కోరుకోరు. తాము అందరికీ అందుబాటులో వుంటామని, ఎవరైనా సరే తమ వద్దకు స్వేచ్ఛగా రావచ్చనే యింప్రెషన్ కలిగిస్తూనే తమకు రక్షణ కల్పించాలని కోరుకుంటారు. బాడీగార్డులు ఎవరికీ తెలియకుండా తమను అనుసరించాలని, తాము హాజరయ్యే సమావేశాల్లోని చర్చలు బయటకు ప్కొకుండా చూడాలని, తమను కలిసే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకోవాలని సెక్యూరిటీ ఏజన్సీలను కోరతారు. విదేశాల నుంచి వచ్చే సిఇఓలైతే మరీ జాగ్రత్తగా వుంటారు. ఏదైనా ఒక భవంతికి సిఇఓ వస్తున్నారన్నా, లేక అక్కడ సమావేశంలో పాల్గొంటున్నారన్నా సెక్యూరిటీ ఏజన్సీ వాళ్ల రక్షణకై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ భవంతిలో అగ్నిమాపక సామగ్రి సరిగ్గా పనిచేస్తోందా లేదా, అగ్నిప్రమాదం జరిగితే బయటకు వెళ్లే మార్గాలన్నీ బాగా ప్లాన్ చేశారా లేదా అని పరీక్షిస్తారు. ఆ భవంతి ప్లాను మనసులో ముద్ర పడిపోయేదాకా సాధన చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే తమ క్లయింటును ఎంత వేగంగా, సురక్షితంగా బయటకు తీసుకెళ్లడమా అని ప్రణాళికలు ముందే రచించుకుంటారు. సమావేశాలు జరిగే బోర్డు రూము గదులను కనీసం ఒక రోజు ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు. మైకులు, ట్రాన్స్మిషన్ బగ్స్, లేకుండా అణువణువూ గాలిస్తారు. కిటికీ తెరల అంచులు వుండవలసినదాని కంటె ఎక్కువ మందంగా వున్నాయా, కిటికీకి, అద్దానికి మధ్య వున్న యిన్సులేషన్ అవసరమైనదాని కంటె ఎక్కువగా వుందా అనే చిన్న విషయాలు కూడా లేజర్ గన్స్‌తో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతా సవ్యంగానే వుందని తృప్తి చెందాక అప్పుడు ఆ గదికి మామూలు తాళాలు కాకుండా అల్ట్రా వయొలెట్ తాళాలు వేస్తారు. అల్ట్రా వయొలెట్ పెన్నుతో సెక్యూరిటీ ఏజన్సీ సిబ్బంది సంతకం చేస్తేనే తలుపు తెరుచుకుంటుంది.
ఊళ్లోకి విమానంలో వచ్చిన అతిథి ఎయిర్‌పోర్టు దిగగానే యీ సెక్యూరిటీ ప్రారంభమవుతుంది. ఎగ్జిక్యూటివ్‌తో అనుక్షణం వుంటూ రక్షణ కల్పించేవారిని ఇపి (ఎగ్జిక్యూటివ్ ప్రొటెక్షన్) ఏజంటు అంటారు. ఒకసారి ఆరకిల్ కంపెనీ నుంచి ఉన్నతోద్యోగి విదేశం నుంచి ముంబాయి వచ్చారు. హోటల్ గ్రాండ్ హయాత్‌లో ఆయనకు రూము బుక్ చేశారు. ఇపి ఏజంటు ఆయనను ఎయిర్‌పోర్టులో కలిసి తను ఏర్పాటు చేసిన టాక్సీలో ఎక్కించుకోబోతూ వుండగానే ఆయన చటుక్కున హయాత్ టాక్సీ కనబడితే దాన్లో ఎక్కేశాడు. ఏజన్సీ మనిషి గుండె గుభేలుమంది. వెంటనే తన కారులో హోటల్‌కు ఆగమేఘాల మీద వెళ్లి, ఆయన వచ్చే సమయానికి అక్కడ కలిసి రిసీవ్ చేసుకున్నాడు. ఇలాటి సందర్భాల్లో ఆయన ఎక్కిన టాక్సీ ఎటుపోతోందో, ఏమో గమనించడానికి జిపిఎస్‌ను విస్తారంగా వాడతారు. ఆధునిక సామగ్రి సంగతి సరేసరి. సిఇఓలు తమ వ్యాపార వ్యవహారాలు చూడడం అయిపోయాక వూళ్లో షికారు కొడదామనుకుంటారు. ఏవైనా టూరిస్టు స్పాట్ చూద్దామనుకుంటారు. వాళ్లు వెళ్లే ప్రాంతాన్ని కెమెరాల ద్వారా గమనిస్తూ, ఒక కంట్రోలు రూము నిర్వహిస్తారు. ఏదైనా అపాయం సంభవించేట్లు వుంటే ముందుగా హెచ్చరిస్తారు. వారి వెంట వుండేవారిని ఇపి జేబులోనే కెమెరా అమరుస్తారు. ఇన్ని ఏర్పాట్లు చేయాలంటే ఆర్నెల్ల ముందుగానే సిఇఓ రాక గురించి, వారు సందర్శించబోయే ప్రదేశాల గురించి ముందస్తు సమాచారం కావాలని ఏజన్సీలు అడుగుతాయి. అనుకోకుండా ఎవరైనా వచ్చే సందర్భాల్లో కనీసం అయిదారు రోజుల గడువు కోరతారు. ఏజన్సీలు సిఇఓల గురించి సమస్త వివరాలు అంటే – ఆయన అలవాట్లు ఏమిటి, యిక్కడ ఆయన స్నేహితులు ఎవరు, స్వభావరీత్యా ముభావియా, సరదా మనిషా, ఎటువంటి ఆహారం యిష్టపడతారు, ఎలాటి వాహనాల్లో తిరగడానికి యిష్టపడతారు, ఆయన అభిరుచులేమిటి, ఎటువంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు వంటి సమాచారమంతా సేకరించి పెట్టుకుంటారు.
గ్లోబల్ కంపెనీల నుంచి వచ్చే సిఇఓలకు సాధారణంగా సరికొత్త కార్లు యిస్తూ వుంటారు. అవి సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ అయి వుంటాయి. ఎంత కొత్తకారైనా సరిగ్గా పనిచేస్తోందా, మధ్యలో ఆగిపోయి సెక్యూరిటీ రిస్కు తెచ్చిపెడుతుందాని పరీక్షిస్తారు. ఇక డ్రైవర్ల నయితే శల్యపరీక్షకు గురి చేస్తారు. అతని పాత రికార్డులు తవ్వి తీయడమే కాదు, వాహనం ఎక్కడైనా యిరుక్కుపోతే ఎంత త్వరగా రద్దీలోంచి తప్పించగలడు, దాడి జరిగితే క్లయింటును ఎలా రక్షించగలడు అనే విషయాల్లో పరీక్ష పెట్టి చూడడమే కాదు, తర్ఫీదు కూడా యిస్తారు. ఇంత ప్లాన్ చేసినా ఒక్కోప్పుడు అతిథులు అప్పటికప్పుడు ఏవో వింత కోరికలు కోరతారు. ట్విట్టర్‌కు సిఇఓగా పనిచేసిన డిక్ కొస్టోలో ముంబయి వచ్చినపుడు అపోలో బందర్ లోని తను బస చేసిన తాజ్‌మహల్ హోటల్ నుంచి రేడియో క్లబ్బు దాకా ఫుట్‌పాత్‌పై నడుస్తానన్నాడు. ఇపి ఏజంటు తన వెనక్కాల కాస్త దూరంలో నడవాలి తప్ప తన పక్కనే మరీ ప్రముఖంగా కనబడకూడదన్నాడు. ఇపి ఏజంటుకు చచ్చేచావైంది. ఫుట్‌పాత్ నిండా ముష్టివాళ్లు ఏజంటుకు అడ్డుపడుతూ క్లయింటుకు, అతనికి మధ్య దూరాన్ని పెంచేస్తున్నారు. కంటికి కనబడకుండా పోతే క్లయింటు భయపడతాడు. బిచ్చగాళ్లు డిక్ వద్దకు కూడా వెళ్లి డబ్బులడగసాగారు. వీళ్లు నిజంగా ముష్టివాళ్లో, పోటీ కంపెనీ తాలూకు కిరాయి మనుషులో అతనికి తెలియదు. అందువలన ఇపి ఏజంటు కేసి ప్రశ్నార్థకంగా చూసేవాడు. ఇతను ఫర్వాలేదులే అనేట్టు చూసేవాడు.
అలాగే ఒక ఇటాలియన్ కంపెనీ సిఇఓ తమ ఇండియన్ యూనిట్లో వున్న లేబరు సమస్య తీర్చడానికి వచ్చింది. కోపంతో వున్న కార్మికులు ఆమెను ఏమైనా చేస్తారేమోననే భయం వుంది. ఆవిడ కొలాబా కాజ్‌వేలో షాపింగు చేస్తానన్నపుడు ఇపి ఏజంటు హడిలిపోయాడు. 'అదంతా డేంజర్ జోన్, మత్తుమందుకు అలవాటు పడినవాళ్లు అక్కడ సంచరిస్తూ వుంటారు' అని నచ్చచెప్పబోయినా ఆమె వినలేదు. సరే కానీయండి అన్నాడు ఇపి ఏజంటు. ఆవిడకు 50 ఏళ్లు వున్నా మంచి ఫిట్‌గా వుంది. లిఫ్టు ఎక్కేది కాదు, మెట్ల మీదనే నడుస్తాననేది, రిస్కు ఎక్కువ కదాని ఏజంటు బాధ. అంతేకాదు, ఆవిడ కుర్చీలో 12 గంటలపాటు ఏకధాటిన కూర్చునేది. ఇతను చచ్చినట్లు అంతసేపూ కాస్త దూరంలో కూర్చోవలసి వచ్చేది. ఇలా 20 రోజులు గడిచాయి. హమ్మయ్య అనుకుంటూండగా ఆఖరి రోజున యీ కొలాబా షికారు పెట్టింది. అక్కడ కూడా అతి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతే మధ్యలో అడ్డం వచ్చే మత్తుమందు భాయీలను తప్పించుకుంటూ, ఆమెను అందుకోలేక ఏజంటు నానా అవస్తా పడ్డాడు.
లేబరుతో సమస్యలున్నపుడు సిఇఓల రక్షణ భారం మరింత పెరుగుతుంది. అలాటి కేసుల్లో క్విక్ రియాక్షన్ టీము (క్యూఆర్టి) ఒకటి ఏర్పాటు చేస్తారు. చర్చల సందర్భంగా ఒక్కసారిగా కార్మికనాయకులు తిరగబడి దాడి చేస్తే, ఘొరావ్ చేస్తే, బయటకు వెళుతూంటే కారు టైరులో గాలి తీసేస్తే ఏం చేయాలి, సిఇఓను బయటకు ఎంత త్వరగా తీసుకెళ్లగలం అనేవి ప్లాను చేసుకుంటారు. ఒక కంపెనీ యాజమాన్యానికి, కార్మిక నాయకులకు మధ్య చర్చలు జరిగే హాల్లో సీటింగు ఎరేంజిమెంటు మార్చాలని ఏజంటు చెప్పాడు. ఎందుకన్నాడు ఎచ్ఆర్ డిపార్టుమెంటుకు డైరక్టరుగా వున్నాయన. 'వాళ్లు సడన్‌గా మూకుమ్మడిగా మీమీద పడితే మీ మేనేజ్మెంటు ఉద్యోగులందరినీ ఒక గదిలోకి తీసుకెళ్లి పోలీసులు వచ్చేదాకా కాపాడాలి కదా అందుకని..' అంది ఏజన్సీ. ఆయనకు నచ్చకపోయినా ఊరుకున్నాడు. సమావేశంలో ఏ దుర్ఘటనా జరగలేదు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. 'సిఇఓను, ఆయన టీమును ఆఫీసు నుంచి యింటికి, యింటి నుంచి ఆఫీసుకు చేరేటప్పుడు మేం రక్షణ కల్పిస్తాం' అని ఏజన్సీ చెపితే ఆ డైరక్టరు 'మీరు ఉత్తినే హడావుడి చేస్తున్నారు. నా కారు వెనక్కాల మీవాళ్ల కారు వస్తే నేను కార్మికులను చూసి భయపడుతున్నాననే భావం కలుగుతుంది. నాకు ఎస్కార్ట్ ఏమీ వద్దు' అని మొండికేశాడు.
ఆయన అలా అన్నా ఆయనకు తెలియకుండా కాస్త దూరంలో క్యూఆర్టి వాహనం అనుసరించేట్లు చూసింది ఏజన్సీ. రెండు రోజులు గడిచాక కార్మికులు ఆయన కారుపై దాడి చేశారు. ఇనుప రాడ్లతో కిటికీ అద్దాలు పగలకొట్టి మీద పడ్డారు. క్యూఆర్టి వెంటనే రంగంలోకి దిగి, అతన్ని కాపాడింది. అప్పటికే అతని చెయ్యి విరిగింది. కొంచెం వుంటే ఏమయ్యేదో ఏమో! 'థ్రెట్ పెర్సెప్షన్ ఎనాలిసిస్' చేసి యిలాటివి ముందే వూహించడంలోనే ఏజన్సీ యొక్క ప్రతిభ తెలుస్తుంది. వీళ్ల ఎనాలిసిస్ మాట ఎలా వున్నా అతిథులకు వుండే చాదస్తాలు, భయాలు వాళ్లకు ఎలాగూ వుంటాయి. ఫలానా హోటల్లో ఫలానా మూల వుండే రూమైతేనే నాకు సేఫ్ అంటాడొక సిఇఓ. ఫలానా కారు వుంటేనే నాకు కుదురుతుంది అంటాడు మరొకడు. ఒకసారి ఒక మహిళా సిఇఓ పార్టీలో పాల్గొంటూ తన ఏజంటుకు ఒక వ్యక్తిని చూపించి అతను ఆ రోజు పార్టీలో ఎవరెవరితో మాట్లాడాడో వాళ్లందరి వివరాలూ తనకు కావాలని అడిగింది!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)