జయలలితపై ప్రజల ఆశలు వమ్ము అవుతున్నాయని గ్రహించిన సినిమా నటులు కొందరు పత్రికలు ప్రారంభించి ఆమె గురించి విమర్శలు గుప్పించసాగారు. నిజానికి సినిమారంగం వారు పత్రికలు పెట్టడం తమిళనాడులో వింత కాదు. చిత్రాలయ శ్రీధర్ ''చిత్రాలయ'', కమలహాసన్ ''మైయ్యమ్'', ఎస్‌వి శేఖర్ ''నారదర్'' యిలా ఎన్నో ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. చో రామస్వామి ''తుగ్లక్'' మాత్రం విజయవంతమైంది. భాగ్యరాజా ''భాగ్యా'' అని పత్రిక పెట్టి ప్రశ్నోత్తరాలతో ఆకట్టుకోసాగాడు. ఇవన్నీ చూసి కొత్తగా పార్టీ పెట్టిన టి.రాజేందర్ ''ఉషా'' అనే అనే రాజకీయ వ్యంగ్య పత్రిక పెట్టి జయలలితను ఘాటుగా తిట్టసాగాడు. దీనికి కౌంటర్‌గా అన్నట్లు ప్రముఖ రాజకీయ నాయకుల గురించి డాక్యుమెంటరీలు తీసి ప్రజల్లో వారి యిమేజి పెంచుతూ, వారి వారసులుగా తమను తాము చూపుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎమ్జీయార్ గురించి ''చరిత్ర నాయకన్ ఎమ్జీయార్'' పేర ఒక ఫీచర్ ఫిల్మ్ తీస్తానంటూ విజయన్ అనే జర్నలిస్టు ముందుకు వచ్చాడు. ఎమ్జీయార్ పాత్రను రంగస్థల నటుడు టికెఎస్ చంద్రన్ వేస్తాడని చెప్పి ఎమ్జీయార్ భార్య వద్ద అతని ఫర్ క్యాప్, శాలువా, కుర్తా తీసుకున్నాడు. ఈ సినిమా తయారైనట్లు లేదు. జయలలిత మీదే సినిమా తీస్తానంటూ కలైచెల్వి ఆరంగనాయకం అనే ముందుకు వచ్చాడు. బేబీ శ్రీదేవి అనే ఆమెను చిన్న జయలలితగా సెలక్టు చేశారు. ఇదీ పూర్తి కాలేదు. కామరాజ్‌పై గంటసేపు వీడియో ఫిల్మ్ అంటూ ఎస్‌విఎస్ మణియన్ అనే పాత్రికేయుడు మొదలుపెట్టాడు.
ఏది ఏమైనా పాలనలో అవినీతి అనేది జయలలితకు పూర్తి వ్యతిరేకాంశంగా మారింది. దీనికి తోడు ఆమె కేంద్రంతో కలహించసాగింది. కావేరీ నీటి విషయంలో తటస్థంగా వున్నందుకు కేంద్రంపై కక్ష కట్టి తన ఎంపీల ద్వారా అల్లరి చేయసాగింది. కావేరీ వివాదంపై యిచ్చిన మధ్యంతర నీటి కేటాయింపు ఉత్తర్వును సుప్రీం కోర్టుకు రిఫర్ చేయాలని అన్నందుకు కేంద్రమంత్రిగా వున్న చిదంబరం కారుపై తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 400 మంది ఎడిఎంకె గూండాల చేత దాడి చేయించింది. ఇది చాలనట్లు బిజెపివారితో చేతులు కలిపి, రాజకీయంగా ప్రధాని పివికి యిబ్బందులు కలిగించసాగింది. శంకరాచార్య జయంతికి మద్రాసు వచ్చిన పివిని అవమానించింది. జయలలితకు బుద్ధి చెప్పాలనుకున్న పివి, జనతా పార్టీ అధ్యక్షుడిగా వున్న సుబ్రహ్మణ్యస్వామి చేత జయలలితపై అవినీతి ఆరోపణలు చేయించాడంటారు. లేకపోతే ఇంటెలిజెన్సు రిపోర్టులు, కేంద్ర ఫైళ్లు స్వామికి ఎలా వచ్చాయని, తన వెనక్కాలే ఇంటెలిజెన్సు బ్యూరో అధికారులు ఎందుకు కనబడుతున్నారని జయలలిత సూటిగా అడిగింది. 1992 అక్టోబరులో స్వామి జయలలితపై ఆరోపణలు చేస్తూ ఆమెను రాజకీయాల్లోంచి డిస్‌క్వాలిఫై చేయాలని ఎలక్షన్ కమిషనర్‌ను డిమాండ్ చేస్తూ, కేసు పెట్టడానికి అనుమతించాలని గవర్నరుకు వినతిపత్రం యిచ్చాడు. డిఎంకె కూడా అలాటిదే యిచ్చింది. జయలలితకు అనుకూలంగా వుండే గవర్నరు భీష్మనారాయణ్ సింగ్ ఆ ఫైలును అలాగే పెట్టి వుంచాడు. అలా జయలలిత మెడపై పివి కత్తి వేళ్లాడదీశారు.
మరొకరైతే రాజీ పడేవారేమో, కానీ జయలలిత పోరాటమార్గాన్ని ఎంచుకుంది. తమిళనాడుకు తగినంత కరువు సహాయనిధి యివ్వలేదని ఆరోపించి, నేషనల్ ఫ్రంట్ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆర్థికవిధానాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో వాకౌట్ చేయించింది. 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు ఆమె పివిని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని విమర్శించింది. 'ద్రవిడ రాజకీయాల వారసురాలు హిందూత్వ పార్టీని సమర్థించడం ఘోరం' అంటూ డిఎంకె యాగీ చేసింది. దీనిపై వ్యాఖ్యానిస్తూ జయలలిత ''రుణానిధిలో నిఘంటువులో ద్రవిడ సిద్ధాంతం అంటే – మెజారిటీ హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారి మనోభావాలను పట్టించుకోకపోవడం. మైనారిటీల హక్కులు కాపాడుతూనే, రాజ్యాంగం మెజారిటీకి యిచ్చిన హక్కులు కూడా రక్షించాలి. కాంగ్రెసు మానిఫెస్టోలో ఏముంది? బాబ్రీ మసీదును చెడగొట్టకుండానే రామమందిరం కట్టాలని వుంది. అంటే హిందువుల మనోభావాల గురించి కాంగ్రెసు వాదించిందనట్లేగా, నేనూ అదే పని చేస్తున్నాను. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగినందుకు యుపిలో బిజెపి ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు మన్నించనందుకు దాన్ని డిస్మిస్ చేస్తామంటున్నారు. మరి కావేరీజలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించింది. దాన్నెందుకు డిస్మిస్ చేయరు?
''ఉత్తరాది వాళ్లకు దక్షిణభారతం గురించి ఐడియా లేక యిన్నాళ్లూ యిలా వుందనుకున్నాం. ఇవాళ దక్షిణాది వ్యక్తి ప్రధానిగా వుండి కూడా మా ప్రయోజనాలు పట్టించుకోవటం లేదు. తమిళనాడుకు (ఆమె ఉద్దేశం ఎడిఎంకె) కాబినెట్‌లో సీటు యివ్వలేదు. పైగా స్వామి ద్వారా నన్ను యిరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. స్వామి ఒక యీగ, దోమ లాటి వాడు. ఏమీ చేయలేడు. అతనికి నీతి లేదు. చంద్రశేఖర్ ప్రధానిగా వున్నపుడు నాకు ఎన్నికల నిధులు యిస్తానని చెప్పి ఆయన దగ్గర స్వామి చాలా తీసుకున్నాట్ట. ఈ విషయం చంద్రశేఖరే నాకు చెప్పారు. నాకు పైసా ముట్టలేదు. ఇప్పుడు స్వామి నాపై కేసు వేసి చంద్రస్వామిని మద్రాసు తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. స్వామిని ఎలాగైనా కలవమని, టిఫెన్‌కో, భోజనానికో పిలవమని చంద్రస్వామి కబుర్లు పెడుతున్నాడు. నా యింట్లోకి అడుగుపెట్టనివ్వని జవాబిచ్చాను. స్వామి మాత్రం నేను ఫీలర్లు పంపుతున్నానని మీడియాకు చెప్పుకుంటున్నాడు. ఇలాటి బ్లాక్‌మెయిలర్ అతను.'' అని వాదించింది.
ఆ కేసులే దరిమిలా మెడకు చుట్టుకోవడంతో జయలలిత జైలుకెళ్లింది. ఇప్పటికీ కేసు సుప్రీం కోర్టులో వుంది. అవి విచారణ కాకుండా గవర్నరు భీష్మనారాయణ్ సింగ్ అడ్డుపడుతూంటే పివి ఆయన్ని తప్పించి 1993 మేలో మఱ్ఱి చెన్నారెడ్డిని ఆ స్థానంలో వేశారు. ఇక అప్పణ్నుంచి చెన్నారెడ్డికి, జయలలితకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరికీ చాలా విషయాల్లో పోలిక వుంది. ఆయన ముఖ్యమంత్రిపై కేసులు వేయడానికి అనుమతి యివ్వడమే కాదు, వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని రేడియో ప్రసంగంలో వ్యాఖ్యానించి, అధికారులను తన వద్దకు రప్పించుకుని మంతనాలు సాగించి, యిలా జయలలితకు పిచ్చెత్తించాడు. వారిద్దరి మధ్య వైరాన్ని సినీదర్శకుడు శంకర్ ''కాదలన్'' (తెలుగులో ''ప్రేమికుడు''గా డబ్ అయింది)లో వాడుకున్నాడు. దాన్లో విలన్ గవర్నరు. తెలుగువాడు. అతన్ని అందరూ 'గారు' అని సంబోధిస్తారు. ఆ పాత్ర గిరీశ్ కర్నాడ్‌కు యిచ్చి చెన్నారెడ్డిలాగే గెటప్ వేశారు. ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా కనబడడు. సినీనిర్మాత కుంజుమోన్ జయలలితకు సన్నిహితుడని గుర్తు పెట్టుకోవాలి. (సశేషం) ఫోటో – (గవర్నరు పాత్రలో గిరీశ్ కర్నాడ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)