ఎమ్బీయస్‌: బైబిల్‌ కథలు – 44

దీని తర్వాత అధ్యాయం యూదితు. కానీ యిది కాథలిక్‌, యింకా కొన్ని శాఖల బైబిళ్లలోనే కనబడుతుంది. హీబ్రూ బైబిల్‌లో వుండదు. చరిత్ర ప్రకారం చూసినా యిది సరిపోవటం లేదని, జనబాహుళ్యంలో వున్న ఐతిహ్యం బైబిల్‌లో…

దీని తర్వాత అధ్యాయం యూదితు. కానీ యిది కాథలిక్‌, యింకా కొన్ని శాఖల బైబిళ్లలోనే కనబడుతుంది. హీబ్రూ బైబిల్‌లో వుండదు. చరిత్ర ప్రకారం చూసినా యిది సరిపోవటం లేదని, జనబాహుళ్యంలో వున్న ఐతిహ్యం బైబిల్‌లో కలిసి వుంటుందని బైబిల్‌ పరిశీలకులు అంటారు. కథ చిన్నదే కాబట్టి గబగబా చెప్పేసుకోవచ్చు. నెబుచెడ్నజార్‌ అస్సీరియాను పాలించే రోజుల్లో అర్పక్షదుతో యుద్ధం చేస్తూ కొన్ని రాజ్యాలను తన పక్షాన వచ్చి పోరాడమని అడిగాడు. కానీ అవి సాయపడడానికి ఒప్పుకోలేదు. వాటిలో జెరూసలేం ఒకటి. ఆ విధంగా తన ఓటమికి కారణమైన ఆ రాజ్యాలపై అతనికి కోపం వచ్చింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అర్పక్షదును ఓడించి ఆ తర్వాత ఆరేళ్లకు వీళ్లపై పగ తీర్చుకోవడానికి సంకల్పించాడు. తన సేనాని హోలెఫెర్నెస్‌  (Holofernes) అనే అతనికి భారీ సైన్యం యిచ్చి 'నా పేరు మీద రాజ్యాలను జయించు, అక్కడ దేవాలయాలు కూలగొట్టు. ఎదిరించినవాళ్లను నిర్దయగా మట్టుపెట్టు, నాకు లొంగిపోయి, నా ఆధిపత్యాన్ని, దైవత్వాన్ని అంగీకరించినవారిని క్షమించు.' అని సర్వాధికారాలు యిచ్చి పంపాడు. అతను అందర్నీ జయిస్తూ యిస్రాయేలీయుల వద్దకు వచ్చాడు. వాళ్లు కొండల మీద నగరాల్లో వుంటున్నారు. కొండ ఎక్కి వెళితే ప్రమాదకరమని, అంతకంటె కొండకు వెళ్లే కనుమలను, పర్వతపాదాల్లో వున్న జలాశయాలను చేజిక్కించుకుని కొండల మీద వున్న వారికి నీళ్లు అందకుండా చేస్తే దిగి వస్తారని పన్నాగం పన్నారు. కొన్నాళ్లకు యూదుల నీటితొట్టెలు ఖాళీ అయ్యాయి. అంతా గగ్గోలు పెట్టారు. గవర్నరుగా వున్న ఉజ్జీయా (Oziah) ''మనం దేవుడికి మొక్కులు మొక్కాం. ఐదురోజులు వేచి చూదాం. అప్పటికీ ఫలితం లేకపోతే వెళ్లి లొంగిపోదాం'' అన్నాడు. 

ఇది యూదితు (Judith) అనే ఒక వితంతువు వింది. ఆమె భర్త పోయి మూడేళ్లయింది. సౌందర్యవతి అయినా విధవావస్త్రాలు ధరిస్తూ జీవితాన్ని దైవప్రార్థనలో నడుపుతోంది. నగరాన్ని, దేవుడి గుడిని కాపాడడానికి తన వంతు కృషి చేద్దామనుకుంది. శత్రుసైనిక శిబిరానికి అభిముఖంగా వెళదామనుకుంది. ఉజ్జీయా, యితర పెద్దలు మనం అనుకున్న గడువు దాకా ఆగమని బతిమాలారు. అప్పుడు ఆమె ''ఫలానా గడువులోగా పని చేయమని దేవుడికి షరతులు విధించేవారా మీరు? దేవుడు తనకిష్టం వచ్చినప్పుడు కాపాడవచ్చు, కాపాడబడే అర్హత మనకు లేకపోతే కాపాడకనూ పోవచ్చు. బుజ్జగించడానికి, బెదిరించడానికి అతను మనలాగా మామూలు మానవుడా? మన మట్టుకు మనం సాయం కోసం ప్రార్థిద్దాం, ఓపికతో అతని సాయం కోసం వేచి వుందాం. గతంలో మనవాళ్లు అన్యదైవాలను పూజించారు కాబట్టి కాపాడలేదు, యిప్పుడు మనమంతా ఆయన్నే నమ్ముకున్నాం కాబట్టి కాపాడవచ్చు. ఇప్పుడు మన ప్రయత్నం మనం చేయకపోతే శత్రువులు ఆయన గుడిని కూల్చేస్తారు. అలా కూల్చనిచ్చినందుకు దేవుడు మనలను శిక్షించవచ్చు.'' అని వాదించింది. 'సరే నీ యిష్టం' అన్నారు వారు.

అప్పుడామె అత్యంత సుందరంగా అలంకరించుకుని, దాసితో సహా కొండ దిగి హోలెఫెర్నెసు శిబిరం వైపు నడిచింది. అడ్డగించిన సైనికులకు ''నేను హెబ్రీయుల అమ్మాయిని. సైన్యనష్టం కాకుండా నగరం మీ వశం అయ్యే ఉపాయం మీ సేనానికే చెప్తాను.'' అని చెప్పింది. హోలెఫెర్నెసు ఆమెను లోపలకి రానిచ్చి ఆమె అందానికి విస్మితుడయ్యాడు. యూదితు ''మీరు జలాన్ని, ఆహారాన్ని  సరఫరా ఆపివేయడం వలన మా వాళ్లు నిషిద్ధ ఆహారపానీయాలు తింటున్నారు, తాగుతున్నారు. దేవుడి ఆగ్రహానికి గురయ్యారు. మా ప్రజల పాపం పండినపుడు దేవుడు నాకు తెలియపరుస్తాడు. ఎందుకంటే నేను నియమాలు ఉల్లంఘించటం లేదు. దేవుడి అనుగ్రహం పూర్తిగా పోయాక మీరు దండెత్తినపుడు వాళ్లు మిమ్మల్ని ఎదిరించలేరు. ఏ శ్రమ లేకుండా లొంగిపోతారు.'' అని చెప్పింది. సేనాని అది విని సంతోషించాడు. ''సరే మా శిబిరంలోనే ఏదైనా ఒక గుడారంలో వుండు. దేవుడితో మాట్లాడుతూ వుంటూ, ఏ రోజు అనువైనదో చెప్పు'' అన్నాడు. 

అలా మూడు రోజులు ఆమె శత్రుశిబిరంలోనే వుంది. నాల్గవరోజు హోలోఫెర్నెసుకు ఆమెపై కాంక్ష పుట్టింది. ఇంతటి అందగత్తెను అనుభవించకుండా పోనిస్తే నలుగురిలో నగుబాటు కాదా అనుకున్నాడు. ఆమెను ఆ రాత్రి విందుకు పిలిచి, ద్రాక్షసారాయి, ఆహారం ఏర్పాటు చేశాడు. ఆమె కబుర్లు చెపుతూ అతని చేత బాగా తాగించింది. అతను మత్తెక్కి పడిపోగానే పక్కనున్న కత్తి తీసి అతని తల నరికి ఒక సంచీలో పెట్టుకుని దాసితో సహా రాత్రికి రాత్రే శిబిరం నుంచి తప్పించుకుని వచ్చేసింది. తనవారి దగ్గరకు వచ్చి ఆ శిరస్సు చూపి, వారిలో ధైర్యాన్ని నింపింది. ఈలోగా అస్సీరియా సైన్యం తమ సేనాధిపతి మరణించిన విషయాన్ని గ్రహించి దండెత్తకుండా వెనక్కి పారిపోయారు. అది తెలిసి ఇస్రాలేయులు వాళ్లను తరిమికొట్టి, మట్టుపెట్టారు. ఇదీ యూదితు అధ్యాయం. 

దీని తర్వాతిది ఎస్తేరు (Esther) అధ్యాయం. క్రీ.పూ.486 నుంచి 465 వరకు పర్షియాను పాలించిన అహస్యూరెస్‌ (ఇతన్ని గ్రీసువాళ్లు ఒకటవ జెరెక్సెస్‌ అంటారు- (King Ahasuerus (Xerxesm I)కు యీమె భార్య. ఆ రాజు ఇథియోపియా నుంచి ఇండియా వరకు (ఇండియా అని బైబిల్‌లో రాశారు కానీ ఇండియా సరిహద్దు వరకు అనడం కరక్టు – రీడర్స్‌ డైజస్టువారి బైబిలులో అలాగే వుంది) గల 127 రాష్ట్రాలకు వ్యాపించిన సువిశాలమైన రాజ్యాన్ని పాలించాడు. రాజ్యానికి వచ్చిన మూడో ఏట అతను రాష్ట్రప్రముఖులందరినీ ఒకరొకరుగా పిలిచి విందులు యివ్వసాగాడు. అది ఆర్నెల్లపాటు సాగింది. ఆ తర్వాత తన రాజధానిలోని ధనిక, పేద పౌరులందరకూ ఏడు రోజులపాటు విందు యిచ్చాడు. సారాయి ప్రవహించింది. ఏడో రోజు రాత్రి మద్యం మత్తులో రాజు తన భార్య అందాన్ని అతిథులకు చూపిద్దామని ముచ్చటపడి ఆమెకోసం కబురు పంపించాడు. ఆమె కూడా ఆ ఏడురోజులూ కోటలో వున్న స్త్రీలకు విందు యిస్తోంది. రాజు రమ్మన్నాడని చెప్పినా ఆమె అందరి ఎదుటా రావడానికి యిచ్చగించలేదు. ఆ మాట వినగానే రాజు మండిపడ్డాడు. తన మంత్రులను సలహా అడిగాడు. ''మీరు దీనిపై చర్య తీసుకోకపోతే మన రాజ్యంలో ఏ భార్యా భర్త మాట వినదు. మగవాళ్లందరం చేతకానివాళ్లగా ముద్రపడతాం.'' అని వారు సలహా యిచ్చారు. వెంటనే రాజు ఆమెను రాణిగా తొలగించి, తన ఎదుట ఎప్పటికీ రాకూడదని శాసించాడు. కొత్త భార్య కోసం ప్రకటించాడు.

దేశంలోని అందమైన యువతులందరినీ రప్పించి, వారికి సౌందర్యపోషణలో ఏడాదిపాటు తర్ఫీదు యిప్పించి, రాజు ఎదుట నిలిపి, వారిలో ఎవరో ఒకరిని రాణిగా ఎంచుకోవాలని నిర్ణయించారు. అలా వచ్చిన యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఆమె నెబుచెడ్నజారు జెరూసలెం నుంచి తీసుకుని వచ్చిన యూదు బందీల కుటుంబానికి చెందినామె. ఆమెకు పెత్తండ్రి కొడుకు మొర్దెకయి (Mordecai) సంరక్షకుడిగా వున్నాడు. ''నువ్వు యూదు యువతివని ఎవరికీ చెప్పవద్దు'' అని హెచ్చరించి పంపాడతను. చివరకు ఆమె రాణీగా ఎంపికైంది. ఆమె సిఫార్సుతో మొర్దెకయికి రాజమందిరంలో ఉద్యోగం లభించింది. ఒకసారి కోటకాపలాదారులిద్దరు రాజును హత్య చేయడానికి పన్నుతున్న కుట్రను అతను అనుకోకుండా వినడం జరిగింది. వెంటనే రాజుకి తెలియపరిస్తే, నిజానిజాలు విచారించి రాజు వారిద్దరినీ ఉరి తీయించాడు. ఆ విషయాన్ని రాజకార్యాల దస్తావేజుల్లో నమోదు చేయించాడు. కొన్నాళ్లకు హామాను (Haman The Agagite) అనే అతన్ని రాజు తన వజీరుగా నియమించుకున్నాడు. అతను అహంభావి. తన ముందు అందరూ మోకరిల్లాలని కట్టడి చేశాడు. దేవుడికి తప్ప వేరెవరికీ మోకరిల్లడానికి సమ్మతించని మొర్దెకయి మాత్రం హామాను ఎదుట మోకాలు వంచి దండం పెట్టేవాడు కాదు. మండిపడిన హామాను ఇతనెవరా అని వాకబు చేసి, యూదు జాతీయుడని తెలుసుకుని, యితనితో బాటు యూదుమతస్తులందరినీ తుడిచి పెట్టడానికి నిశ్చయించుకున్నాడు. 

రాజు పరిపాలనలోకి వచ్చిన పన్నెండవ యేట, యూదుల వధకు అనువైన నెల పన్నెండవ నెల అని ముహూర్తం పెట్టించుకుని హామాను పది నెలల ముందే రాజుతో ''మీ సామ్రాజ్యంలో ప్రతి రాష్ట్రంలో యూదుజాతి ప్రజలు నివసిస్తున్నారు. వాళ్లు స్థానికుల ఆచారవ్యవహారాలతో కలవటం లేదు. రాజశాసనాలను ధిక్కరిస్తూ తమకు వేరే దేవుడు వున్నాడంటున్నారు. ఇలాటి అరాచకవాదుల జాతిని నిర్మూలించకపోతే జనులంతా రాజద్రోహులవుతారు. మీరు అనుమతి యివ్వగోరుతున్నాను.'' అన్నాడు. రాజు వెంటనే నీ చిత్తం వచ్చినట్లు చేయి, ఆ ఫర్మానాపై యీ ముద్ర వేయి అని తన వుంగరాన్ని యిచ్చేశాడు. దాని ఆధారంగా ప్రతి రాష్ట్రానికి రాజశాసనపు ప్రతులు పంపుతూ 'ఫలానా రోజున యూదులను వధించి, వారి ఆస్తులను వశపరుచుకోండి.' అని ఆదేశాలు జారీ చేశాడు హామాను. ఇది విని మొర్దెకయి బాధపడ్డాడు. ఎస్తేరు వద్దకు వెళ్లి యీ ఘోరకలిని ఆపాలని బతిమాలాడాడు. ''రాజు నన్ను చూడాలని కబురు పంపేదాకా నేను వెళ్లకూడదు. వెళితే శిరచ్ఛేదమే. నన్ను పిలిచినపుడు నేను ఆయనతో విన్నవిస్తాను.'' అని చెప్పింది ఎస్తేరు. ''నీ సొంత జాతి పట్ల యింత నిరాపేక్ష పనికి రాదు.'' అని మందలించాడు ఆమె అన్నగారు. ''సరే, మన జాతి వాళ్లందరికీ చెప్పి నా ప్రాణం కోసం మూడు రోజులు ప్రార్థన చేయమని చెప్పు. మూడు రోజుల తర్వాత నేను తెగించి రాజు వద్దకు వెళతాను.'' అని మాట యిచ్చింది ఎస్తేరు. 

అలాగే మూడు రోజుల తర్వాత వెళ్లింది. ఆమెను చూస్తూనే అనుజ్ఞ లేకుండా ప్రవేశించినందుకు రాజు కోపంగా చూశాడు. ఆమె భయపడి మూర్ఛపోయింది. రాజు జాలిపడి, చేరదీసి ఏం కావాలి అని అడిగాడు. ''ఈ రోజు రాత్రి నేను ఏర్పాటు చేసే విందుకు మీరు, హామాను రావలసినది.'' అని కోరింది. సరేనన్నాడు, ఆ రాత్రి విందు పూర్తయ్యాక ''నీకు ఏం కావాలో చెప్పు. కావాలంటే రాజ్యంలో అర్ధభాగం యిస్తాను.'' అన్నాడు రాజు. ''రేపు కూడా మీ యిద్దరూ విందుకు రండి.'' అని కోరింది ఎస్తేరు. విందు నుంచి బయటకు వెళుతున్న హామానుని చూసి మొర్దెకయి లేచి నిలబడలేదు. దాంతో హామాను ఉగ్రుడయ్యాడు. ''సాక్షాత్తూ రాణి నన్ను విందుకు పిలిచి సన్మానించింది కానీ యీ సేవకుడికి యింత అహంభావమా? రేపే రాజుతో చెప్పి వీణ్ని ఉరి తీయిస్తాను.'' అనుకున్నాడు. ఆ రాత్రి రాజుకు ఎందుకోగాని నిద్ర పట్టలేదు. లేచి పాత దస్తావేజులు తిరగవేయసాగాడు. తనపై జరిగిన కుట్రను మొర్దెకయి బహిర్గతం చేసిన కాగితం చదవగానే అతనికి కృతజ్ఞతగా ఎలాటి సన్మానం చేయలేదని గుర్తుకు వచ్చింది. మర్నాడు ఉదయం లేవగానే హామానుని పిలిచాడు. మొర్దెకయి ఉరికి సన్నాహాలు చేసుకుని, అనుమతి అడగవచ్చిన అతను నోరెత్తే లోపులే రాజు మొర్దెకయికి సన్మానం చేయమని, రాజవీధుల్లో సకల రాజలాంఛనాల్లో ఊరేగించమని చెప్పాడు. హామాను మొహం వేలాడేసుకుని వెళ్లి రాజాజ్ఞ పాటించాడు. 

ఆ రాత్రి విందు చేస్తూండగా రాజు, ఎస్తేరుతో ''ఇప్పటికైనా నీ కోరిక చెప్పు.'' అన్నాడు. ''నేను యూదుజాతి దాన్ని. మమ్మల్ని బానిసలుగా చేసినా నేను నోరెత్తేదాన్ని కాను. కానీ మా జాతివారందరినీ మూకుమ్మడిగా వధించమని హామాను కుట్రపన్ని మీ చేత ఆమోదముద్ర వేయించుకున్నాడు.'' అంది. రాజుకు కోపం వచ్చి ఏం చేయాలో పాలుపోక బయటకు వెళ్లి ఉద్యానవనంలో తిరగసాగాడు. అతను అలా వెళ్లగానే హామాను గడగడ వణుకుతూ ఎస్తేరు శయనించిన పక్క మీదే కూర్చుని ఆమెను బతిమాలాడసాగాడు. అంతలోనే రాజు తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని చూశాడు. ''వీడు నా ఎదురుగానే నా రాణిని చెరిచే సాహసం చేస్తున్నాడా? వెంటనే ఉరి తీయించండి.'' అన్నాడు. మొర్దెకయికోసం తయారైన ఉరికంబంపై హామాను వేళ్లాడాడు. రాజు హామాను పంపిన తాకీదులను రద్దు చేయించాడు. ఆ విధంగా ఎస్తేరు కారణంగా పారశీక రాజ్యంలో యూదులు రక్షింపబడి దాన్ని పూరీము ఉత్సవంగా జరుపుకుంటారు. దీనితో ఎస్తేరు అధ్యాయం సమాప్తం. – (సశేషం)  

(ఫోటోలు – 1) హోలెఫెర్నెస్‌ తల నరికి తీసుకుని వెళుతున్న యూదితు – 17 వ శతాబ్దం నాటి చిత్రం 2) హామాను, అహస్యూరెస్‌, ఎస్తేరు విందు చేస్తున్న చిత్రం – చిత్రకారుడు 17 వ శతాబ్దపు రెంబ్రాంట్‌ )

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives