సినిమా రివ్యూ: కళ్యాణ వైభోగమే

రివ్యూ: కళ్యాణ వైభోగమే రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీ రంజిత్‌ మూవీస్‌ తారాగణం: నాగశౌర్య, మాళవిక నాయర్‌, పర్ల్‌ మానే, రాశి, ఆనంద్‌, ఐశ్వర్య, రాజ్‌ మదిరాజు, తాగుబోతు రమేష్‌, మిర్చి హేమంత్‌, జెమిని…

రివ్యూ: కళ్యాణ వైభోగమే
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: శ్రీ రంజిత్‌ మూవీస్‌
తారాగణం: నాగశౌర్య, మాళవిక నాయర్‌, పర్ల్‌ మానే, రాశి, ఆనంద్‌, ఐశ్వర్య, రాజ్‌ మదిరాజు, తాగుబోతు రమేష్‌, మిర్చి హేమంత్‌, జెమిని సురేష్‌, ప్రగతి తదితరులు
మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్‌
సంగీతం: కళ్యాణ్‌ కోడూరి
కూర్పు: జునైద్‌ సిద్ధికి
ఛాయాగ్రహణం: జి.వి.ఎస్‌. రాజు
నిర్మాత: కె.ఎల్‌. దామోదరప్రసాద్‌
కథ, కథనం, దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి
విడుదల తేదీ: మార్చి 4, 2016

జీవితంలో పెళ్లి ప్రాధాన్యతని, దానికుండే విలువని చాటిచెప్పిన సినిమాలు ఇప్పటికి చాలానే వచ్చాయి. నందిని రెడ్డి కూడా 'కళ్యాణ వైభోగమే'కి 'వన్‌ లైఫ్‌ వన్‌ సెలబ్రేషన్‌' అంటూ అదే అంశాన్ని తీసుకుంది. కాకపోతే ఈతరం ప్రేక్షకులు రిలేట్‌ చేసుకునేలా క్యారెక్టర్లు, ఆలోచనలు, ప్రవర్తనలు అన్నిటినీ నేచురల్‌గా తీర్చిదిద్ది, చివర్లో కాస్త ఎమోషన్‌ జోడించి మనం ఊహించే ముగింపునే ఇచ్చింది. 'అలా మొదలైంది' చిత్రంలో చూపించినంత కొత్తదనం ఇందులో లేదు కానీ హ్యూమర్‌ పరంగా తనకున్న విభిన్న అభిరుచిని మరోసారి చాటుకుంది. 

సరదాగా నవ్వుకునే సన్నివేశాలు, సందర్భాలు సినిమా అంతటా ఉన్నాయి. మెలోడ్రామా వైపుగా మొగ్గుతోంది అనిపించినప్పుడు కూడా ఏదో ఒక విధంగా వినోదానికి తిరిగి పెద్ద పీట వేయడంతో కాలక్షేపానికి లోటు లేకుండా పోయింది. తల్లిదండ్రుల పోరు పడలేక పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అయిన జంట వెంటనే విడాకులు తీసుకుని ఎవరి దారిన వారు పోవాలని అనుకుంటారు. విడిగా ఉందామని అనుకున్నా కానీ తప్పని పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. 

కానీ తమ ఆశయాలకి, ఆశలకి పెళ్లి, దాంపత్యం వగైరా అవరోధాలు అవుతాయనేది వారి అభిప్రాయం. ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఆ ఇద్దరూ చివరకు ఎలా తమ ఆలోచనలని జయించారు, ఏం పరిష్కారం తెలుసుకున్నారు అనేది కథ. గతంలో ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ అయితే కాదు. లైవ్లీ పాత్రలతో, సరదా సన్నివేశాలతో, వాస్తవిక సంఘటనలతో నందిని రెడ్డి ఈ చిత్రాన్ని కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడంతో ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని, యువతని కూడా ఆకట్టుకుంటుంది.

ప్రథమార్ధంలో ఉన్నంత ఫన్‌ ద్వితీయార్ధంలో ఉండదు. నవీన ఆలోచనలని డిస్కస్‌ చేసిన డైరెక్టర్‌ ఎమోషన్స్‌ విషయానికి వచ్చే సరికి అవే పాత సీన్లపై బేస్‌ అవడం కాస్త నిరాశ పరుస్తుంది. హీరో మరో అమ్మాయికి క్లోజ్‌ అవుతున్నప్పుడు హీరోయిన్‌ జెలస్‌ ఫీలవడం, ఆమె తల్లి (రాశి) చివర్లో కానీ భర్త నిర్ణయానికి ఎదురు నిలబడకపోవడం, హీరోయిన్‌ తనకి దూరంగా వెళ్లాక కానీ ఆమెని ప్రేమిస్తోన్న సంగతి హీరోకి తెలియకపోవడం ఇవన్నీ రెగ్యులర్‌గా రొమాంటిక్‌ డ్రామాల్లో చూసే సన్నివేశాలే. నందిని రెడ్డి ఈ మూసని దాటి ఏదైనా కొత్తగా చూపించే ప్రయత్నం చేసి ఉండాల్సింది. కనీసం ఆ రొటీన్‌ తంతుని వేగంగా అయినా పూర్తి చేసి ఉండాల్సింది. సెకండ్‌ హాఫ్‌లో అవసరానికి మించిన నిడివి నిట్టూర్పులు విడిచేట్టు చేస్తుంది. 

కంప్లయింట్స్‌ లేకపోలేదు కానీ 'కళ్యాణ వైభోగమే' ఓవరాల్‌గా అలరిస్తుంది. ఫ్యామిలీతో సరదాగా ఒకసారి చూడదగ్గ క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటేమీ లేదు కనుక టార్గెట్‌ ఆడియన్స్‌నుంచి మార్కులు వేయించుకుంటుంది. నటీనటవర్గం కూడా ఈ చిత్రానికి బాగా కుదిరింది. 

నాగశౌర్య తనకి సూటయ్యే పాత్రలో ఎంచక్కా ఒదిగిపోయాడు. చాలా ఈజ్‌తో పాత్రకి పరిపూర్ణ న్యాయం చేసాడు. యావరేజ్‌ ఇండియన్‌ గాళ్‌గా మాళవిక అతికినట్టు సరిపోయింది. ఆమె లుక్స్‌పై పాపం చాలానే జోక్స్‌ వేసారు. లుక్స్‌ పరంగా యావరేజ్‌ అయినా కానీ నటిగా ఆమెకి వంక పెట్టలేం. ఎంతటి భావాన్ని అయినా ఆమె కళ్లు ఇట్టే పలికించగలవు. డైరెక్టర్‌కి ఆ సంగతి బాగా తెలుసు కనుకే కీలక సన్నివేశాల్లో ఆమెకి సంభాషణలు లేకుండా కేవలం కళ్లల్లోనే ఫీలింగ్స్‌ క్యాప్చర్‌ చేసారు. రాశి తల్లి పాత్రలో హుందాగా ఉంది. ఐశ్వర్యది ఓవర్‌ ది టాప్‌ క్యారెక్టర్‌. ఆనంద్‌ టిపికల్‌ స్ట్రిక్ట్‌ ఫాదర్‌గా బాగా సెట్‌ అయ్యాడు. హీరో తండ్రి పాత్రలో రాజ్‌ మదిరాజు మెప్పించారు. సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో పర్ల్‌ ఆకట్టుకోదు. పాటలు స్లోగా ఉన్నప్పటికీ మూడ్‌తో సింక్‌లో ఉన్నాయి. అయితే రొమాంటిక్‌ కామెడీస్‌కి క్యాచీ సాంగ్స్‌తోనే రిపీట్‌ వేల్యూ వస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్‌ హాఫ్‌ని ఎడిటర్‌ చాలా ట్రిమ్‌ చేయాల్సింది. 

టైటిలు, ట్రెయిలరు చూసి ఎలాంటి సినిమాని ఆశించి వస్తారో అలాంటి సినిమాని అందించడంలో టీమ్‌ సక్సెస్‌ అయ్యారు. కళ్యాణ వైభోగమేలో చిన్న చిన్న లోపాలైతే లేకపోలేదు కానీ వినోదానికి మాత్రం లోటు లేదు. 

బోటమ్‌ లైన్‌: పసందైన వినోదమే!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri