కుల రహిత సమాజం ఎలా ఉండదో, కుల రహిత రాజకీయాలూ ఉండవు. ఇది మన దేశం సంగతి మాత్రమే. చాలామంది రాజకీయ నాయకులు, మంత్రులు వగైరాలు కుల రహిత సమాజం రావాలి. సమసమాజం ఏర్పడాలి అంటూ ప్రసంగాలు దంచేస్తుంటారు. కాని కులం పేరు ఎత్తకుండా రాజకీయాలు చేయగలరా? కుల రహితంగా ప్రతిభాపాటవాల ఆధారంగా ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వగలరా? సూక్తిముక్తావళి ప్రసంగాలకు పనికొస్తుందిగాని ఆచరణలో ఎందుకూ ఉపయోగపడదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకున్నామంటే ఈమధ్యే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వరంగల్ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల. ఎర్రబెల్లి సీనియర్ నాయకుడని, సమర్థ నేత అని ప్రాధాన్యం ఇస్తున్నారా? లేదా తన కులం వాడని (వెలమ) ప్రాధాన్యం ఇస్తున్నారా? ఇది అర్థం కాక టీఆర్‌ఎస్ నాయకులు తలకాయలు పట్టుకుంటున్నారట. కొందరు మండిపడుతున్నట్లు కూడా సమాచారం.
ఎర్రబెల్లికి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే 'ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి' అన్న చందంగా ఉందని చెవులు కొరుక్కుంటున్నారట. టీడీపీలో ఉండగా శాసనసభాపక్ష నాయకుడుగా వెలగబెట్టిన దయాకర్‌రావు కేసీఆర్‌ను పిచ్చిపిచ్చిగా తిట్టారు. అనరాని మాటలన్నారు. టీఆర్‌ఎస్ నాయకుల మీద కేసులేశారు. టీడీపీ నుంచి గులాబీ పార్టీలోకి ఫిరాయించిన ద్రోహులను అనర్హులను చేయాలని స్పీకరుకు లేఖలు ఇచ్చారు. గవర్నర్‌కు వినతిపత్రాలిచ్చారు. కోర్టులో పిటిషన్లు వేశారు. ఇంత చేసిన వ్యక్తి టీఆర్‌ఎస్‌లో చేరి గులాబీ కండువా కప్పుకోగానే కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడైపోయారు. ఆయన కోటరీలో మనిషైపోయారని వార్తలొస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో చేరగానే కేసీఆర్ జన్మదినం రావడంతో దగ్గరుండి కేక్ తినిపించారు.
టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను తిట్టినందుకు లెంపలేసుకున్నారు. పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చారు. పాపం చేశానని కుమిలిపోయారు. తాను కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని, పార్టీ 'డైరెక్షన్' ఇస్తే తిట్టానని, తాను అమాయకుడినని ఏడ్చారు. తన తండ్రి భోళా శంకరుడని, మనసులో ఏం ఉంచుకోడని కేసీఆర్ కుమార్తె కవిత ఓసారి చెప్పింది. అది నిజమని అనిపించేలా బండబూతులు తిట్టిన ఎర్రబెల్లిని కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఎర్రబెల్లిది రాజకీయ చేరిక కాదని, రాజకీయ పునరేకీకరణ అని ముఖ్యమంత్రి భాష్యం చెప్పారు. ఎర్రబెల్లిని అక్కున చేర్చుకున్న కేసీఆర్ అంతటితో ఊరుకోలేదు. ఆయనకు ఏం పదవి ఇవ్వాలా? అని ఆలోచిస్తున్నారట. తనకు మంత్రి పదవి వస్తుందని ఎర్రబెల్లి సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. మంత్రి పోస్టు అవకాశం లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు. పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.
వరంగల్‌లోనే కాకుండా హోల్ తెలంగాణలో 'జంప్ జిలానీ'లను వెతికి తెచ్చే బాధ్యత కూడా ఎర్రబెల్లికి అప్పగిస్తారట. ఎర్రబెల్లికి మంత్రి పదవో, కార్పొరేషన్ ఛైర్మన్ పదవో ఇస్తే సీనియర్లు ఊరుకుంటారా? దయాకర్‌రావు గులాబీ కండువా కప్పుకోవడానికి గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కమ్ విద్యా మంత్రి కడియం శ్రీహరి అడ్డుపడ్డారు. ఆయనకు, ఈయనకు పడదు. ఎర్రబెల్లికి మంత్రి పదవిస్తే శ్రీహరితో సమానమవుతారు. కొండా సురేఖ దంపతులు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అభ్యంతరం పెట్టకుండా ఉంటారా? కేసీఆర్ మంత్రులతో జరిపే సమీక్షా సమావేశాల్లో ఎర్రబెల్లిని కూర్చోబెట్టుకుంటున్నారని సమాచారం.
మిషన్ భగీరథపై జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పక్కనే దయాకర్ రావు కూర్చోడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈయన టీడీపీలో ఉండగా కొందరు టీఆర్‌ఎస్ నాయకులపై కేసులేశారు. ఆయన వేసిన కేసుల్లో తాము చచ్చీ చెడి తిరుగుతుండగా, కేసీఆర్ ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారట. పైకి ఏమనలేరు కాబట్టి లోపల కుళ్లుకుంటున్నారు. ఏది ఏమైనా ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పుకున్న మరుసటి రోజు నుంచే కేసీఆర్‌కు ముద్దొచ్చాడు. ఇంత ముద్దు రావడానికి కారణం తనవాడు కావడమేనా? మరో కారణముందా?