ఇద్దరు కొట్టుకుంటున్నారు. దెబ్బల బాధ భరించలేక వారిలో ఎవరో ఒకరు ఏడవాలి. కాని ఈ కొట్లాటతో సంబంధం లేని మరో వ్యక్తి ఏడిస్తే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇలాగే ఏడుస్తోంది. ఏపీలో కొట్టుకుంటున్నవారు ఎవరో తెలుసు కదా. అధికార టీడీపీ-ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ.
ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి కొనసాగుతున్న వలసల పర్వంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్ల బాంబులు పేలుతున్నాయి. అధికార పార్టీలోకి గుంజుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని వైకాపా నేతలు డిమాండ్ చేస్తుండగా, మీరే రాజీనామా చేసి గెలవాలని టీడీపీ నాయకులు రివర్సులో మాట్లాడుతున్నారు. వైకాపా నుంచి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకులు చెబుతుండగా, టీడీపీ నుంచే తమ పార్టీలోకి వస్తారని వైకాపా నాయకులు రివర్సులో జవాబు ఇస్తున్నారు.
వీళ్ల గొడవ ఇలా జరగుతుంటే మధ్యలో బీజేపీ నాయకులు బాధ పడుతున్నారు. వీళ్లకెందుకు బాధ? ఎందుకంటే వేరే పార్టీల్లోంచి ఎవ్వరూ వచ్చి కాషాయ కండువా కప్పుకోవడంలేదు. 'ఎవరైనా వస్తే మేం కూడా చేర్చుకుంటాం' అని చెబుతున్నారు. అంటే 'ద్వారములు తెరచియే యున్నవి' అని అర్థం. కాషాయం-పచ్చ రంగు బంధం చెదిరిపోతుందా? అనే అనుమానాలు ఎక్కువ కావడంతో కొన్ని రోజుల కిందట కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ నాయకులకు ఉపదేశం చేశారు. ఏమని? టీడీపీతో సఖ్యతగా ఉండండి. అలా ఉంటూనే మన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించండి అని చెప్పారు. కాని విస్తరిద్దామంటే ఎవ్వరూ వచ్చి చేరేలా కనబడటంలేదు.
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన కాంగ్రెసు నాయకులు (కావూరి, పురంధేశ్వరి, కన్నా తదితరులు) హడావిడిగా బీజేపీలో చేరారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సేనని అనుకొని కాషాయం కండువాలు కప్పుకున్నారు. కాని ముక్కలు చేయడానికి సహకరించిన పార్టీ బీజేపీయేనని తెలియదా? తెలుసు. అయితే నరేంద్ర మోదీ ఇమేజ్ తాము పార్టీలో ఎదగడానికి దోహదం చేస్తుందని, పార్టీ ఏపీలో బ్రహ్మాండంగా విస్తరిస్తుందని అనుకున్నారు.
కాని అనుకున్నది ఒకటి. అయ్యింది మరొకటి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నోళ్లు, జగన్ వ్యవహార శైలి నచ్చనోళ్లు తమ పార్టీలోకి వస్తారని బీజేపీ నాయకులు ఊహించుకొని ఉండొచ్చు. కాని వారు టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నారు. అధికార పార్టీలో చేరితో రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఈ రెండున్నరేళ్లలో మంచి పనులు చేస్తే, ప్రజలు ఆదరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీయే అధికారంలోకి రావచ్చు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీలోకి పోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ-బీజేపీ బంధం కొనసాగుతుందనే నమ్మకం లేదని ఎక్కువమంది అభిప్రాయం.
అదీకాకుండా 2014లో మాదిరిగా 2019లో బీజేపీ గెలుపు సులభం కాదనే అంచనాలున్నాయి. ఇక ఏపీ విషయంలో మోదీ రాష్ట్రానికి బాగా అన్యాయం చేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ ఆదరణ కోల్పోయింది. సాధారణంగానే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ అంతంత మాత్రం. ఉమ్మడి రాష్ట్రంలోనూ అంతే కదా.
అందువల్ల బీజేపీ నాయకత్వం తలుపులు బార్లా తెరుచుకొని 'రండి బాబూ రండి' అని పిలిచినా ఎవ్వరూ వెళ్లే అవకాశం లేదు. తెలంగాణలో ప్రతిపక్షాల వారు గులాబీ పార్టీలో చేరినట్లే, ఏపీలో పచ్చ పార్టీలోనే చేరతారు. తెలంగణలో కాంగ్రెసు నాయకుడు వి హనుమంతరావు ఈమధ్య టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి 'టీఆర్ఎస్లోకి ఎందుకయ్యా. కాంగ్రెసులో చేరండి' అని ఆహ్వానించారు. కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి. 'చాలామంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు' అని రాష్ట్ర కేబినెట్లోని బీజేపీ మంత్రి ఒకాయన అన్నారు. కాని అంత సీన్ లేదని తెలుస్తోంది.
కేంద్రం రాష్ట్రానికి ఏదైనా సాయం చేసుంటే దాన్ని ప్రచారం చేసుకొని కొంత లబ్ధి పొందేవారేమో. కేంద్రం రాష్ట్ర బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేసింది. ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి కేంద్రమే అడ్డుపడిందని చెప్పాలి. ఈమధ్య కాంగ్రెసు ఎంపీ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నాడనే ప్రచారం జరిగింది. అది ఉత్తుత్తి ప్రచారమేనని కాషాయ నాయకులు చెబుతున్నారు.