ఎమ్బీయస్‌ కథలు: అచలపతీ – ఆశాపరులూ

''ప్రజల కింత ధనాశ ఎందుకోయి, అచలపతీ?'' Advertisement ''ఇల్లాశ, కారాశ, చీరాశ, నగలాశ…. ఇలా విడివిడిగా అనేక ఆశలు పెట్టుకునే బదులు ధనాశ ఒక్కటే  పెట్టుకుంటే  చాలుకదా, డబ్బుంటే అన్నీ వస్తాయి కదా అని…

''ప్రజల కింత ధనాశ ఎందుకోయి, అచలపతీ?''

''ఇల్లాశ, కారాశ, చీరాశ, నగలాశ…. ఇలా విడివిడిగా అనేక ఆశలు పెట్టుకునే బదులు ధనాశ ఒక్కటే  పెట్టుకుంటే  చాలుకదా, డబ్బుంటే అన్నీ వస్తాయి కదా అని ప్రజలు ఆలోచించి ఉంటారు సర్‌''.

''పోనీ నన్ను  చూసైనా  ప్రజలు  నేర్చుకోవచ్చు కదా! నేనేమైనా  డబ్బు కోసం వెంపర్లాడుతున్నానా?''

''మీ అంత ఆస్తి వాళ్లకు లేకపోవడం ఒక కారణం కావచ్చేమో పరిశీలించారా సర్‌?''

''పోనీ నా అంత, అంటే.. నా ఆస్తంత  ఆస్తి కలవాళ్లకూ, అంతకంటే  ఎక్కువ  ఆస్తి కలవాళ్లకూ, అంతకంటే తక్కువ ఆస్తి కలవాళ్లకూ అందరికీ  డబ్బాశ ఉందే. వాళ్లంతా  నాలాగ  ఎందుకుండలేరు?''

''వై కాంట్‌ ఎ వుమన్‌ బీ లైకే మ్యాన్‌' అని ప్రొఫెసరు హిగ్గిన్స్‌  కూడా చాలా ఇదయ్యేవారుట. ఎవరి పద్ధతి వారిదేనండి.  మీ మార్గాన మీ యంతటి నియంత లేరంటే, ఆ మార్గంలో పయనిస్తున్నది మీరొక్కరే  కావడం  కూడా కారణం  కావచ్చని తోస్తోంది  సర్‌''.

ఇది కాంప్లిమెంటో కాదో తేల్చుకోలేకపోయేను. బండిని పట్టాలమీదకు లాక్కొద్దామని- ''జీవించడానికి మనిషికి డబ్బు కావాలన్నమాట ఒప్పుకుంటాను. కానీ దాన్ని  ఏ దారిలో పడితే ఆ దారిలో మల్టిప్లయ్‌ చేసేయాలనే ఆ కోరికుంది చూశావూ… అవునూ,  'కోరికయే అన్ని  దుఃఖాలకు మూలం'  బ్రహ్మాండమైన  కొటేషన్‌  కొట్టిందెవరోయ్‌?''

 ''గౌతమబుద్ధుడు, సర్‌.  ఈయన్నే  శాక్యముని, తథా..''

 ''నా క్కూడా అలాటి  కొటేషనొకటి కొటేషించి పేరు తెచ్చుకోవాలని  మహా కోరికగా  ఉందోయ్‌''.

''మరి  అది ఏ దుఃఖానికి దారి తీస్తుందో సర్‌''.

*************

పై సంభాషణంతా కాగితం మీద రాసి  రంగడికిచ్చి చదవమన్నాను. వాడు చదివి ''ఏమిటిదంతా?''  అన్నాడు.

''ఇదంతా నేనిక్కడకు వచ్చేందుకు నాలుగు రోజులకు ముందు అచలపతితో భాషించిన సంభాషణ. అప్పటికింకా యయాతి మామయ్య పెళ్లంటూ నాకు పెటకం పెడతాడనీ,  నేను మీ విజయవాడకు పరిగెత్తుకు రావడం జరుగుతుందనీ, మీ ఫైనాన్స్‌ కంపెనీల గురించి  నీ ఘోష వింటాననీ అనుకోలేదు. కానీ దీని గురించి ముందే డిస్కస్‌ చేసాం, చూసావా''.

''అయితే ఏమిటంటావ్‌?'' అన్నాడు వాడు విసుగు దాచుకోవాలనే  ఇంగితం  లేకుండా.

''దాని  ఉపయోగం నీకు తెలియలేదా? రేపొద్దున్న నా మీద  ఎవరైనా  సినిమా  తీసారనుకో. అప్పుడు  ఇలాంటిది టైటిల్స్‌  ముందు చూపించి, టైటిల్స్‌ తర్వాత నీ కథ చూపించాలి''.

''టైటిల్స్‌  ముందు కథ  ఎందుకురా, నాకు తెలీక అడుగుతాను? టైటిల్సే కదా సిగరెట్టు పూర్తయ్యేక  వెళదాంలే  అని హాలు  బయట తిరిగే స్మోకర్స్‌ మీద  కసితో  పెట్టిన పద్ధతది.  పది నిమిషాల తర్వాత  వచ్చి కథయిపోయిందని లబోదిబోమంటారు వాళ్లు''.

''అయితే నా కథలు సినిమాగా వద్దంటాను. టీవీ సీరియల్‌గా తీయమంటాను. సిగరెట్టు ఇంట్లోనే కాల్చుకుంటారు.''

''అయినా నీ నా కథ లెవడ్రా తీసేవాడు?''

''ఏం? 'ఎర్‌క్యూల్‌ పాయ్‌రా ఇన్వెస్టిగేట్స్‌' అంటూ వరసగా ఎపిసోడ్లు తీయటం లేదూ? 'ది కేస్‌ ఆఫ్‌ రంగభూపతి, ద రిఫార్మర్‌' అని పేరు పెట్టి ఈ కథ ఎపిసోడ్‌గా లాగించేయవచ్చు''.

*************

మా రంగడిని  రిఫార్మర్‌గా పేర్కొనడం తప్పు కాదని  మీరూ  ఒప్పుకుంటారు, వాడి  సదాశయం వింటే. విజయవాడలో  కొత్త కొత్త  ఫైనాన్స్‌ కంపెనీలు  వెలిసి మధ్యతరగతి  ప్రజల్ని అధోగతి పట్టిస్తున్నాయిట.  జనాలకు వడ్డీ మీద మోజయితే  కంపెనీలకు  అసలు మీదే  కన్ను. మొదట్లో నలుగురైదుగురికి హెచ్చు వడ్డీలిచ్చి అందర్నీ ఆకర్షించడం, ఆ తర్వాత  బోర్డు  తిప్పే టైము, జండా ఎత్తేసే తీరికా లేకుండానే  ఉడాయించడం కంపెనీ వంతయితే, ఉడాయించిన మర్నాడు వాళ్లాఫీసు మీద  దాడిచేసి ఆ తిప్పడాలూ,  ఎత్తడాలూ, అక్కడ  మిగిలిన ఫర్నిచర్‌ ధ్వంసం చేయడాలు ప్రజల వంతట.

అలా మోసపోయిన ప్రజలు కూడా మళ్ళీ  ఏ కంపెనీ వస్తుందా, ఏమారిపోదామాని కాచుకుంటున్నారట కానీ మారిపోదామని మాత్రం అనుకోవటం లేదుట.  మన రంగడు వాళ్లందరికీ నీతులు చెప్పి చూసాడట.  'అంతంత వడ్డీలు  ఇవ్వడం అసాధ్యం, న్యాయమైన వ్యాపారంలో గిట్టుబాటు  కాని వడ్డీ రేట్లవి, నమ్మవద్దు' అని  చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాట్ట.

''చిలక్కి  చెప్పినట్లు  మనుషులకి చెప్తే ఎలాగరా? అందుకనే వినలేదేమో'' అన్నాను నేను.

''ఇప్పుడేం చేయాలో చెప్పు. నా అదృష్టం కొద్దీ నువ్వొచ్చి విజయవాడలో మకాం పెట్టావు.  చిన్నప్పటి  క్లాసుమేటువి కదా. సలహా చెప్పి పుణ్యం కట్టుకో. ఈ మూర్ఖ ప్రజలను  ఆదుకో''.

బ్రహ్మాదిదేవతలు వచ్చి ఆదుకోమన్నప్పుడు శ్రీ మహావిష్ణువు చేసేదే నేనూ చేశాను. అయిడియా చెప్పాను.

''నువ్వే ఓ ఫైనాన్సు కంపెనీ పెట్టు.  మిగతా వాళ్లందరి కంటే ఎక్కువ  వడ్డీ  ఇస్తానను. అందరూ నీ దగ్గరే ఇన్వెస్ట్‌ చేస్తారు. మిగతా దొంగ  కంపెనీలన్నీ  మార్కెట్లోంచి కనుమరుగై పోతాయి…''

''కానీ నేను మాత్రం వడ్డీ ఎలా ఇవ్వ…?''

''అపోజిషన్‌ మెంబర్లా మాటమాటకు మాటకు అడ్డురాకు.  టీవీలో  పార్లమెంటు సమావేశాలు చూడడం తగ్గించు. పిల్లల్ని చూడనివ్వక, రౌడీతనం నేర్చుకుంటారు..''

'' ..ఈ సంగతి చెప్పు చాలు''.

''డబ్బు  పోగడ్డాక ఓ నాట్‌ – సో – ఫైన్‌- మార్నింగ్‌ మాయమయిపో. జనాలంతా  నీ ఆఫీసు మీద పడే లోపుల నువ్వే  ఫర్నిచర్‌  విరక్కొట్టి  వెళ్లిపో- తమకంటే  ముందే  వేరెవరో వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయుంటారు అనుకుని  ఊరుకుంటారు.  రెండ్రోజుల  తర్వాత  బయటకు  రా.  'బుద్ధొచ్చెనా  నీకు మనసా?'  అని పాట పాడి ఎవరి డబ్బు  వాళ్ల కిచ్చెయ్‌. గుణపాఠం  నేర్పించినందుకు టీచింగు   ఫీజుగా  ఓ వంద రూపాయలు  హుండీలో వేయమను.  ఇక మళ్లీ వాళ్లు జన్మలో ఇలాంటి  కంపెనీల జోలికి పోరు.''  

ఒక మంచి  ఆలోచనగానీ  వస్తువుగానీ  కన,లేక విన / విన, లేక కన- బడినప్పుడు ఇంతమంచిది  మనకెలా  దక్కుతుందిరా అన్న సందేహం  వస్తుంది సాధారణ ప్రజలకు.  అందుకే రంగడు నేను సలహా చెప్పిన తక్షణమే ఎగిరిగంతెయ్యకపోయినా నేను నొచ్చుకోలేదు.  కాస్సేపు ఆలోచించి, తల పంకించి 'కానీయ్‌'  అన్న  ధోరణిలో  నిట్టూర్చడమే నాకు నచ్చలేదు.  మనస్సులో ఏమనుకున్నాడో తెలియదు కానీ  జనాంతికంగా అన్నది మాత్రం ఇది-

''అయిడియా బాగానే ఉన్నట్టుంది.  చేసిచూద్దాం. కానీ  వాళ్లిచ్చే వడ్డీయే 'ఇమ్‌ప్రాక్టికల్‌' అని అంటూ నేనంతకంటే  ఎక్కువ వడ్డీ  ఇవ్వజూపితే…''

''ఆ, అంతపాటి  వివేకం ఉన్నవాళ్లయితే, ఒకసారి దెబ్బతినగానే మరో కంపెనీ జోలికిపోయి ఉండేవారు కారు.  అంతగా  శంకాలియాలు  ఉంటే  పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు  ఇయ్యి.  నాలిగ్గీసుకోడానికి వాళ్లకి  భేషుగ్గా  పనికొస్తాయి''.

రంగడు నా అయిడియా ఒప్పుకుంటూనే  ఓ షరతు పెట్టాడు.  తనకు ప్రచారం కావాలంటే  నాబోటివాడి అవసరం  ఉంటుందిట. 'రంగడు పచ్చి మోసగాడు. వాడి కంపెనీలో  డబ్బు వేయవద్దని' నేను చెప్పాలిట.

''అలా ఎందుకు?'' 

''ఎందుకంటే, దీనివల్ల  పబ్లిసిటీ జరుగుతుంది. 'ఫలానా  రంగడు  దొంగ  సుమా' అని ఉపన్యాసాలిచ్చి, ప్రకటనలు గుప్పించావనుకో. 'అసలీ  రంగడెవరా' అని క్యూరియాసిటీ పెరుగుతుంది. 'వరద ప్రమాదం ఉంది.  ఏటి గట్టుకు  వెళ్లకండి'  అంటే చాలు, అంతా పసుపుకుంకాలు పట్టుకుని ఏటి గట్టుకెళ్లి నిలబడతారు. కొందరు  ఉత్సాహవంతులు దిగి దుంగలు కొట్టుకొద్దామని ఉరకలు వేస్తారు,  ఉరుకుతారు. అలాగే  మన నిజనిజాలు నిగ్గు తేలుద్దామని ఆఫీసుకొచ్చి చూడబోతారు, మన బుట్టలో పడతారు''.

''అలా అయితే బుట్ట పెద్ద సైజుది చేయించుకో.  నువ్వు  పరమ మోసగాడివని రోజుకో ప్రకటన ఇస్తా''.

*************

రంగడి వ్యాపారం  అడ్డూ  అదుపూ లేకుండా పెరిగింది. ప్రజలంతా  పరిగెట్టుకొచ్చి డబ్బు దాచమన్నారు.  మొదట  వచ్చినవాళ్లకి  వడ్డీతో డబ్బు  తిరిగి ఇవ్వబోతుంటే, వడ్డీతో  సహా మళ్లీ డిపాజిట్‌  చేయమని  బతిమాలేరు. 'స్టాఫ్‌ లేరు, డిపాజిట్లు  తీసుకోవడం  కష్టంగా  ఉంది. రిజర్వుబ్యాంకు ఒక లిమిట్‌కు మించి ఒప్పుకోదు' అని చెబితే రికమండేషన్లు  కొట్టించి డిపాజిట్లు పడేసిపోయారు. అలా డిపాజిట్‌ రెన్యూ  చేసినప్పుడల్లా  వాళ్ల గాలిమేడలకి ఒక్కో అంతస్తూ పెంచుకుంటూ పోయారు. మార్కెట్లో  పోటీగా  ఉన్న కంపెనీలు  వాళ్లంతట వాళ్లే  బోర్డులు దింపుకునే పరిస్థితి  వచ్చిందని పదిహేను రోజుల తర్వాత రంగడు  నేను బస చేసే హోటల్‌కి వచ్చి చెప్పినప్పుడు తెలిసింది.

''మూసేసిన కంపెనీల్లో  ఒకదాంట్లో  మేనేజరుగా పనిచేసే  సారంగన్‌  అనే అతను  మన దగ్గిర చేరతామంటున్నాడురా,  ఏమందాం?''  అని అడిగాడు.

''ఈ సారంగడికి మన దగ్గర  చేరాలన్న ఉబలాటం ఎందుకో?''

''కుంభకోణం వాడట! ఆ కంపెనీని నమ్ముకుని వచ్చి విజయవాడలో  స్థిరపడిపోయాట్ట. ఉద్యోగం  ఊడి వెనక్కెళితే మొహం  చెల్లదట.  ఈ పని  తప్ప వేరే రాదట. అందుకని..''

''…అవునొరే, కుంభకోణం  ఊరి వాళ్లు  వాళ్ల ఊరి  పేరు అంత ధైర్యంగా  ఎలా చెప్పుకుంటార్రా?  తంజావూరు జిల్లావాడినని… ఇంకా తంజావూరు జిల్లాయేనా? అన్నై, తంబై, చిదంబరనార్‌,  పడగోట్టి  లాటి పేరేదైనా మార్చారా.. ఆ జిల్లావాడినని చెప్పుకోవచ్చుగా!?''

''ఎలా చెప్పినా  మనవాళ్లకు  అరవ్వాళ్ల తెలివి మీద  మంచి గురి-  ఓ అరవ్వాడు  మన కంపెనీలో ఉంటే జనం  ఇంకా వస్తారు చూడు''.

''బానే  ఉంది కానీ  'పంచతంత్రంలో' ఇలాటి  కథ ఏదో ఉందిరా. లూకాయో యేదో..''

''నీ తెలివి తెల్లారినట్టుంది.  లూకా బైబిలులో ఉన్నట్టుంది.  చర్చి గోడల మీద ముప్ఫై ఈస్టూ నలభై అని రాసి,  ముందు లూకా అనీ పైన 'ఇచ్చట బాజాలు  వాయించరాదు' అని రాయిస్తారు.  ఇదిగో,  నీకు పాఠాలు చెప్పే తీరిక లేదు,  అవతల ఖాతాదార్లు  కాచుకున్నారు. నా సామిరంగా,  సారంగడు వచ్చాక బిజినెస్‌  ఇంకా పెరుగుతుంది చూస్తూండు. అప్పుడు  నువ్వే మా  ఆఫీసుకొచ్చి ఎపాయింట్‌మెంట్‌  తీసుకోవాల్సి  ఉంటుంది'' అన్నాడు  రంగడు అడావుడిగా వెళ్లిపోతూ.

వాడు వెళ్ళాక ఆ సారంగుడి గురించి ఆలోచించాను-  ఈ పార్టీ   ఫిరాయింపుదారును ఎంతవరకు నమ్మవచ్చాని. ఓ దొంగ కంపెనీలో  పనిచేసేవాడు కాబట్టి  విలన్‌  ముఠావాడో.. లేక విలనేమో కూడా. ఈ విలన్‌కు హృదయపరివర్తన (గుండెమార్పిడి అనాలా  తెలుగులో?) నిజమా? నాటకమా?  కథల్లో  అయితే తెలిసి  పోతుంది. బతికినంత కాలం  చిత్తం వచ్చినట్టు ఝామ్మని బతికేసి  ఆఖరి నిమిషంలో 'సారీ'  అనేస్తే చాలనుకుంటారు విలన్లు . 'సారీ'  అనేసిందాకా ఉండి బోల్డన్నీ  రోజులు బతకాల్సి  వస్తే మిగతాకాలం  అంతా మంచివాడిలా బతుకీడ్చవల్సిన ఖర్మ పడుతుంది. అందుచేత  విలన్లెప్పుడూ  చివర్లోనే రిఫార్మ్‌ అవుతారు, కంచికెళ్లే కథ ఆఖరి బోగీ కూడా దక్కదేమోనని. అంచాత కథ  పొడుగెంతో చూసుకుంటే పశ్చాత్తాపం పర్మనెంటో కాదో తెలిసిపోతుంది.  టీవీ ఎపిసోడ్‌లో టైము బట్టీ, సినిమాలో రీలు నెంబరు బట్టీ తెలిసి పోతుంది.  కానీ జీవితం  అలా కాదు. ఎంతకాలం  ఉంటుందో ఆ విలన్‌కీ  తెలీదు, మనకీ తెలీదు.

*************

అదేమిటో మనకు తెలివితేటలుంటాయి గానీ ఒక్కోప్పుడు సమయానికి మాట తోచి చావదు.  ఎవడితోనైనా వాదించేటప్పుడు ఎదుటివాణ్ణి చిత్తు చేయగల  మంచి, మంచి పాయింట్లన్నీ ఎక్కడో దాక్కుంటాయి.  వాడు వెళ్లిపోయాక, రాజీ కుదిరిపోయాక అవన్నీ  చక్కటి పదబంధాలూ,  సామెతలతో సహా తయారవుతాయి 'మేం రెడీ' అని. . ఏం లాభం?

రంగడు సారంగుడి  కథ చెప్పేటప్పుడు నాకు 'పంచతంత్రం' కథ  గుర్తుకు  రాలేదు. వచ్చివుంటే, 'తొల్లి గుంటనక్క కథ వింటివా..'  అని చెప్పేసి ఉందును. వాడు వెళ్లిపోయిన  పది రోజులకు  హఠాత్తుగా గుర్తొచ్చింది, నాక్కావలసిన మాట  'కాకోలూకీయము'  అని.  ఆ వెంటనే  సందర్భమూ  గుర్తొచ్చింది.  వెంటనే ఫోన్‌ చేసా. రంగడు  ఆఫీసులో లేడట.

''ఎక్కడి కెళ్లుంటాడు?'' అని అడిగా.  

''అనంత్‌ దగ్గరికి'' అని  నా వెనక్కాలనుంచి వినబడింది.

తిరిగి చూశా. కాంగ్రెస్‌ మద్దతుపోయిన  దేవెగౌడలా  ఉన్నాడు. అయినా   నాకు గుర్తొచ్చిన జ్ఞానాన్ని  అందించి  అలరిద్దామని చూశా.

''ఒరేయ్‌, అది  'కాకోలూకీయం'  కాకులు, గుడ్లగూబలు కొట్టుకొంటాయి చూడు, ఆ చాప్టర్‌. ఓ ముసలి కాకి పార్టీ ఫిరాయించానని  చెప్పి గుడ్లగూబల వైపు  వచ్చేస్తుంది..''

 ''తెలుసు, ఆ కాకి అరవది.'' అన్నాడు  దేవెగౌడంత  కసిగా.

 ''ఏం గిరాకి..? అంత కాకిపై ఎందుకా కసి??'' అడిగా.

 ''..వెన్నుపోటు''.

 ''అర్థోపెడిక్‌  డాక్టరు దగ్గరకు వెళ్లలేక పోయావా?''

 ''ఆ పోటు కాదు, చంద్రబాబు మార్కు వెన్నుపోటు''.

''సారంగుడా?''

''కరెక్టుగా చెప్పేసావే? నువ్వెలా ఊహించ గలిగేవు చెప్మా?''

''వాడి మొహం  చూడగానే  అనిపించింది- వీడే సారంగధరుడైతే చిత్రాంగినే చెడగొట్టి ఉండేవాడని. బైదివే, సారంగధరుడి కథకు చారిత్రక ఆధారాలు  లేవనీ, రాజమండ్రిలో సారంగధర మెట్ట…''

''…చరిత్ర  వద్దు,  చెప్పింది విను..''

''వినడం ఎందుకు? నేనే ఊహిస్తా. సారంగుడు  డబ్బుతో ఉడాయించాడు. ప్రజల  చేతిలో నీకు చావు మూడింది''.

''…మూడకుండా నాకో అయిడియా  తట్టింది, చెప్పనా?''

*************

మన పురాణాల్లో గమ్మత్తైన  క్యారక్టర్లుంటాయి. శిధీచుడో, దభీచుడో గానీ ఓ ఋషి వుంటాడు.  దేవతలందరూ  'నువ్వు  చచ్చిపో, మా ఇంద్రుడికి విల్లు కావాలిట'  అంటే ' ఓ దానికేం భాగ్గెం' అంటూ ఉంటాడాయన. మన క్లాసు పుస్తకాల్లోకి ఎక్కాలన్న ముచ్చట కొద్దీ  ఆ ఋషి గారు సరే అన్నారనుకున్నా, ఇన్‌ ది ఫస్ట్‌ ప్లేసు 'మా పని కోసం  నువ్వు  టపా కట్టెయ్యి' అని దేవతలు ఏ మొహం పెట్టుకుని అడిగి ఉంటారని అనుకుంటూ  ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది. మా రంగడి  మొహం పెట్టుకుని  వెళ్లి ఉంటారు.

''…అంచాత, నిజం చెబితే 'ఆ సారంగుణ్ణి  ఎందుకు నమ్మేవు? వాడు సొమ్ము కాజేస్తుంటే  నీకు మాత్రం ఒళ్లూ  పై తెలీకుండా ఉందా? మీ ఇద్దరూ తోడుదొంగలై ఉంటారు' అని జనాలు అంటారు. అదే నీ పేరు చెప్పావనుకో. 'అవును, ఆయన ముందు  నుంచీ ఈయన మీద దుష్ప్రచారం  చేస్తున్నాడు.  అసూయ కొద్దీ డబ్బు  కొట్టేసి కంపెనీ దివాళా తీయిద్దామనుకున్నాడు' అని నమ్ముతారు.  అందువల్ల..'' అంటున్నాడు రంగడు.

ఆధునిక  ప్రపంచంలో అతి తరచుగా వినబడే  ప్రశ్న 'కోహం?'  కాదు, 'వై మీ?'! ఎవరికైనా  ఏదైనా పని చెప్పగానే  'నాకే ఎందుకు చెప్పావు?  అవతలివాడి  కెందుకు చెప్పలేదు? అన్నీ నేనే చెయ్యాలా?' అని అంటారని నా కంప్లెయింటు.  కానీ ప్రస్తుతం  నేనే ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది.

''వై మీ ? నిమిషానికి డజన్ల  కొద్దీ పుట్టుకొస్తున్నారుకదా! వారిలో ఎవరినైనా  బలిపశువు చేయవచ్చుకదా.  ఈ ముళ్ల కిరీటం నాకే తొడగడమెందుకు? నీ  పాపాలకు  నేను శిలువ నెక్కడం ఎందుకు? 'నా యొద్దకు రండు. మీ మీ పాపములు వెంటతెండు!' అని నేను  కాన్వాస్‌ చేసుకోలేదుగా?''

''అయినా ఈ భారం  నీదేరా.  నీకేం నష్టం  లేదు.  మర్నాడే మద్రాసు  రైలెక్కేయొచ్చు''.

మన పురాణాల్లో  పురుషుల్లో శంకరుడు  నా కిష్టమైన  కారెక్టరు.  విష్ణువులా జిత్తులమారి కాదు. సంతోషం వచ్చినా  కోపం వచ్చినా  డాన్స్‌  చేసుకుంటూ కూచుంటాడు. ఆఫ్‌కోర్స్‌, తనని  ఒకింటివాణ్ణి చేద్దామని వచ్చినవాణ్ణి  ఇల్లు ఒళ్లూ కూడా లేకుండా కాల్చేసి మోస్ట్‌  అన్‌ రొమాంటిక్‌  పనులు చేసాడని కథ ఉందనుకోండి.  అయినా  డాన్స్‌ చేసే కళాత్మక  హృదయం  కలవాడు,  ఇలాటి ఓఘాయిత్యప్పని చేస్తాడా? అసలతనూ, ఇతనూ  ఒకడేనా  అని నా కప్పుడప్పుడు అనుమానం వస్తూంటుంది. శివుడు, రుద్రుడు, శంకరుడు,  ఈశ్వరుడు – వీళ్లందరూ వేరే వేరే దేవుళ్లనీ, అందర్నీ  కలిసి  ఒకే  దేవుణ్ణి  చేసారనీ రాహుల్‌ సాంకృత్యాయనో,  జాకోబియో,  కంభంపాటి-సీ యో, ముక్కామల నాగభూషణమో  ఈ పాటికే రాసేసి వుండవచ్చు.

చెప్పొచ్చేదేమంటే,  అలాటి లవబుల్‌ ఫెలో, బొత్తిగా బోళావాడు, కాలకూట విషం 'కాస్త   దాహం పుచ్చుకోమ్మా'  అంటే ఆవుదం తాగాల్సిన పిల్లకాయ చేసేటంత  మారామయినా  చేయకుండా  గడగడా తాగేశాడు.  అంత బుర్ర లేకుండా (బుర్రలు అనాలేమో  పంచాననుడు  అంటారుగా) ఎలా  ప్రవర్తించాడో  అని అనుకునే  నేను, రంగడి  ప్రపోజల్‌కి  ఎందుకు సమ్మతించానో  నాకూ తెలియదు.  ప్రతీ నరుడిలోనూ  హరుడుంటాడంటారు,  ఇదే కాబోలు.

సిడ్నీ కార్టన్‌లో కూడా శివుడు ఉండి ఉంటాడు కాబట్టే గిల్లెటిన్‌ ఎక్కేసి ఉంటాడు.  కానీ  అతనికి  తెలిసి ఉంటుంది,  చార్లెస్‌  డికెన్స్‌  అతని కథ పుస్తకంగా  రాసి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెడతాడని. కానీ మనకా గ్యారంటీ ఏది? జనాలు మన మీద  పడి చెన్నపట్నానికి  కాక మోక్ష పట్నానికి  దారి చూపితే , పేపర్లో సంతాపసందేశమైనా వేస్తారా? అని.  ఆపాటి భాగ్యమే ఉంటే, నా కథలు నేనే  ఎందుకు రాసుకుంటాను? వేరే  ఎవరైనా రాయకపోయారా?

''అంతా బాగానే ఉందిరా! నీకు బ్యాడ్‌ పబ్లిసిటీ ఇచ్చే సందర్భంలో నా ఫోటోలు కూడా పేపర్లో  వేయించావు గదరా!  ఇవాళ  రాత్రికి రాత్రి వెళదామంటే రైలుందో లేదో..''

''అబ్బే, ఉన్నా నువ్వెళ్లొద్దు.  ఒక్కరోజైనా ఉండి  ప్రజల  తిట్లు, శాపనార్ధాలు వినందే  వెళ్లొద్దు.  లేకపోతే  వాళ్ల అక్కసు ఎలా తీరుతుంది? తీరకపోతే వాళ్లందరూ పోలోమని  మద్రాసొచ్చి వేధిస్తారు కూడాను..''.

''తిట్లతో  సరిపెడతారంటావా? కొందరైనా ఆచరణవాదులుండరూ..''

''…నే నన్ని ఏర్పాట్ల్లూ చేశానులే… వాళ్లలోనే మనవాళ్లు  కొందరుంటారు. ముందు  వరసలో ఉండి అడావుడి చేస్తూనే  నీకేమీ కాకుండా చూస్తారు.  మావాళ్ల  బందోబస్తు  ఎలాగూ ఏర్పాటు  చేస్తున్నా ఎందుకైనా మంచిదని ఓ నలుగురు గూండాల్ని  బాడీగార్డులుగా పెడతాను.  ఫస్ట్‌క్లాసు  దిష్టిబొమ్మ ఒకటి తయారు  చేయిస్తున్నాను, హోటల్‌  ఎదుట మైదానంలో  తగలేయడానికి..''

 ''దిష్టిబొమ్మల్లో ఫస్టు క్లాసు వెరైటీ  లేముంటాయిరా? ఓ కర్రకు పాత పాంటూ, చొక్కా తొడిగి,  'అనంత్‌' అని బోర్డు రాసి మెళ్లో వేలాడేస్తారు. అంతేగా.. ఇదేమైనా   కంచు విగ్రహమా, నా పోలికలతో  తయారయిందా  లేదా అని పేచీలు రావడానికి?''

''మాములు దిష్టిబొమ్మలయితే  నువ్వు  చెప్పినట్టే  ఉంటాయి. టీవీ కవరేజి ఏర్పాటు  చేస్తున్నాం కదా,  కాస్త హంగుగా తయారు చేయించాను. ఓ పిల్లకవి చేత  బ్రహ్మాండమైన స్లోగన్స్‌  కూడా  రాయించానులే – 'నమ్మకద్రోహి అనంతం, చూస్తాం నీ అంతం','అసలు సిసలు దొంగా, అసలైనా కక్కు', 'వడ్డీ ఇచ్చుకుంటావా? నడ్డి  విరచమంటావా?'  ఎలా ఉన్నాయి స్లోగన్స్‌?''

రంగడు రాగయుక్తంగా చదివినప్పుడు బాగానే అనిపించాయి కానీ  ఓ రెండు వందల మంది  గోలగోలగా అరిచినప్పుడు వినడానికి  బాగాలేదు. ఆ విషయమే  వాళ్లకి చెప్పబోయా, ఒక్కడూ వినిపించుకుంటేగా!?

అందులోను – ముఖ్యంగా ఒకడికి – నా పేరు  పలకడమే రావటం లేదు.  'నమ్మక ద్రోహి అంతం' అంటున్నాడు. వాడి దగ్గరకు వెళ్లి భుజంమీద తట్టా – 'చూడు  బాబూ'  అంటూ. కానీ  అది వాళ్ళు  అపార్థం  చేసుకున్నారులా  ఉంది, 'చెయ్యెత్తుతావా రాస్కెల్‌?' అంటూ మీద పడ్డారు. రంగడు మనుషులు  కూడా అడ్డురాలేక  పోయారు. నన్ను లాక్కెళ్లి  హోటల్‌ రూములో పడేశారు చివరికి.  జనం వదిలి పెట్టలేదు. గది చుట్టూ   ఘెరావ్‌ చేసేశారు.  రూము విడిచి వెళ్లడానికే లేదు.  రైలెక్కడం ఎలా?

************

ఫ్రెంచి విప్లవం టైంలో ఉండక  పోవడం  వల్ల నాకు  కొన్ని  అపోహలు  ఏర్పడ్డాయి. విప్లవంలో ప్రజలంతా కవాతు  చేస్తూ  శ్రీశ్రీ పాటలు పాడుతూ  వెళుతుంటారనీ, బ్యాక్‌గ్రౌండ్‌లో రణభేరి మోగుతూ ఉంటుందని, ఓ ఊహ,  ఎందుకో గానీ, మనసులో ముద్రపడి పోయింది.  లెట్‌ మీ  టెల్యూ-  ప్రజాచైతన్యం అనేది అంత రొమాంటిక్‌గా  ఉండదు. ఒకటే గోల. ప్రజలు కూడా రిథిమిక్‌గా నినాదాలివ్వరు. పరమ బూతులు  మాట్లాడతారు.   చేతికి ఏది  దొరికితే  అది విరక్కొడతారు.  అంతా నానా  కంగాళీగా  ఉంటుంది. హోటల్‌ రూం బాయ్‌  ద్వారా అచలపతికి టెలిగ్రాం ఇవ్వచ్చన్న అయిడియా  నాకా రోజు వచ్చి ఉండకపోతే  నేను ఆవాళే చరిత్ర  పుటల్లోకి ఎక్కేసి  ఉండేవాణ్ణి, రేదర్‌..  వాళ్లు నన్ను బలవంతంగా ఎక్కించి  ఉండేవారు.

రంగడి వ్యవహారమంతా  ముందుగానే  ఉత్తరం రాసి ఉన్నాను కాబట్టి 'సారంగణ్ణి అదుపులోకి తీసుకుని, ప్రజలసొమ్ము స్వాధీనం చేసుకుని నన్ను విముక్తుణ్ణి  చేయవలసిందిగా విజయవాడ పోలీసులను నా తరఫున రిక్వెస్టు  చేయమని'  నేనిచ్చిన  టెలిగ్రాం అచలపతికి  సులభంగానే అర్థమవుతుందనుకున్నాను.

టెలిగ్రాం  ఇచ్చాను కాబట్ట్టి హీరోను  శాపవిముక్తుణ్ణి  చేసాక విలన్‌ పని పట్టవలసినది  అతనే తప్ప తాను కాదని  గ్రహించిన ఋషీశ్వరుడిలా నాకు తెలిసిన యోగముద్రలోకి  వెళ్లిపోయాను.

మర్నాడు మధ్యాహ్నం కళ్లు తెరిచి చూసేసరికి  కోట బయట ముట్టడి వేసిన జనం కనబడలేదు. కందకం గేటు కాపలాదారుతో బేరం కుదిరి లోపల కొచ్చేసేరేమోనని భయం  వేసి కారిడార్‌లో వెతకబోయా. ఎవరూ లేరు.  పోలీసులు  ఇంత త్వరగా  రంగంలోకి దిగి  ప్రజలను తరిమి  వేయడం అసంభవం.

ఇది కలేమో ననిపించింది. కల బాగుంది కదాని నిద్ర కొనసాగించా.

సాయంత్రానికి అచలపతి నుండి ఫోన్‌  వచ్చిందని రూం బాయ్‌ లేపాడు.  

''అచలపతీ,  ఓ తమాషా చెప్పనా, మధ్యాహ్నం వచ్చిన కలలు కూడా నిజమవుతాయ్‌  తెలుసా,  మా హోటల్‌  బయట జనాలు ఎవరూ లేరు తెలుసా, వాళ్లని  చెదరగొట్టడానికి ఎంతమంది పోలీసులు రావాల్సి  వచ్చిందో యేమో'' అన్నాను ఫోన్లో.

 ''ఫైనాన్స్‌ కంపెనీ ఆఫీసుకొస్తే ఎవరి డబ్బు వారికిచ్చేస్తారని ఒక పోలీసు చెప్పినా చాలు కదా  సార్‌, ప్రజలు  అక్కడికి  పరిగెట్టుకు వెళ్లి ఉండవచ్చుగా''.

''అదంతా ఈజీనా? సారంగుడు దొరకాలి, వాడి దగ్గిర డబ్బు పోలీసులు స్వాధీనం  చేసుకోవాలి.  అదంతా పంచి పెడతామని  పోలీసులు  నిర్ణయం  తీసుకోవాలి….''

''..సారంగుడితో పనేముంది సర్‌?  రంగడు డబ్బుతో  దొరికి పోయేక  శాంతి భద్రతల సమస్యను  దృష్టిలో పెట్టుకుని  కోర్టు ప్రమేయం  లేకుండా  పోలీసులు..''

''.. ఆగాగు, పోలీసులు  డబ్బు స్వాధీనం చేసుకున్నదెవరి దగ్గర?''

''రంగడు గారు కదా సార్‌, మీ టెలిగ్రాం  ప్రకారమే  రంగడిని  పట్టుకోమని పోలీసులకు నేను కంప్లయింట్‌ ఇచ్చాను  కదా''.

''మళ్లీ  ఆగు, కదలకు, నేను టెలిగ్రాం ఇచ్చినది  సారంగుణ్ణి పట్టుకోమని  కదా?''

''మీరు  పొరబడినట్టున్నారు సర్‌,  రంగడినే..''

 ''…కాదయ్యా  బాబూ, సారంగుడంటూ  వుంటే అసలు…''

''అయితే  టెలిగ్రాఫ్‌ డిపార్టుమెంటువారి పుణ్యాన సారంగుడి పేరు రెండుగా విడిపోయి  వుండవచ్చు సర్‌. ఏదిఏమైనా కథ నిలువుగా తిరిగింది కదా. ఇంకెందుకు చింత?''

 అప్పటికి చింత లేకపోయినా  మద్రాసు  తిరిగొచ్చి, నా టెలిఫోన్‌  కింద మడిచి  పెట్టి ఉన్న  టెలిగ్రాం చూడగానే  చింత పుట్టుకొచ్చింది- అచలపతి  కళ్లు చెడిపోయాయా,  బుర్ర చెడిపోయిందాని! టెలిగ్రాంలో సారంగన్‌ అని ఉంది.  పేరులోని 'ఎస్‌'  ముందు మాటైన అరెస్టుతో కలిసిపోయింది. ఎ విడిగా ఉంది.  రంగన్‌ విడిగా ఉంది.  అచలపతి  ఇంగ్లీషు పరిజ్ఞానానికి పరీక్ష పెట్టవలసిన సమయం  అసన్నమైందని  పించింది.

 ''అచలపతీ, 'ఆస్క్‌ పోలీస్‌ టు  అరెస్ట్స్‌..'  ఈ వాక్యం  తప్పా?  ఒప్పా?''

''మీరు  ఉటంకిస్తున్నది అమెరికన్‌ ఇంగ్లీషులోనా?  బ్రిటిష్‌  ఇంగ్లీషులోనా? టెలిగ్రాం ఇంగ్లీషులోనా? తెలుసుకోవచ్చా, సర్‌''

''అమెరికన్‌ ఇంగ్లీషంటే కొన్ని అక్షరాలు అవీ ఎగరకొట్టేస్తారని తెలుసు. మరి టెలిగ్రాం ఇంగ్లీషంటే..?'

''… మాటలే ఎగరగొట్టేస్తారు సర్‌.  కొన్ని  వాక్యాలు  కలిపేస్తారు కూడా.  అందువల్ల  ఎవరికి  తోచిన విధంగా వారు దానిని చదివే అవకాశం  ఉంది సర్‌''.

''అంటే  రంగడే దొంగని నీకు ముందే  తోచిందంటావా?''

''డబ్బు  పోగేసి  ఉన్నది ఆయన దగ్గరే కదా సర్‌. అంత డబ్బు చూడగానే ఆశపుట్టి అక్రమాలు చేయబుద్ధి పుట్టడం ఆయన  విషయంలోనే సాధ్యం.  సారంగన్‌  సలహాలు చెప్పి ఉండవచ్చు కానీ  ఆశకు లొంగే అవకాశం రంగడికే ఉంది కదా సర్‌''.

''అయితే… నేను ఉత్తరం  రాసినప్పుడే  .. అంటే ఇదంతా… ఇలా… జరిగిందని నేను నీకు తెలియపరచడానికి ముందే… అంటే…రంగడే… ఇలా అని… అంటే..''.

''మీరింకేమీ  అనవద్దు సర్‌.  వేడి కాఫీ  తెస్తాను..  తల తిరుగుతూంటే  సర్దుకుంటుంది''.

కాఫీ మాట వినగానే  అచలపతికేసి ఆశగా  చూసా!

(రచన 1998 లో ప్రచురితం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]