ఎమ్బీయస్‌ : అరుణాచల్‌లో గవర్నరు అత్యుత్సాహం

అరుణాచల్‌ సమస్యకు ప్రారంభం 2015లో ఏప్రిల్‌ ముఖ్యమంత్రి నబామ్‌ తూకీ ఫైనాన్స్‌ మంత్రి కాలిఖో పూల్‌ను పదవి నుంచి తప్పించడంతో జరిగిందనవచ్చు. కాలిఖో కొంతమంది మద్దతుదారులను వెనకేసుకుని ఢిల్లీ వచ్చి కాంగ్రెసు అధిష్టానంతో మొరపెట్టుకున్నాడు…

అరుణాచల్‌ సమస్యకు ప్రారంభం 2015లో ఏప్రిల్‌ ముఖ్యమంత్రి నబామ్‌ తూకీ ఫైనాన్స్‌ మంత్రి కాలిఖో పూల్‌ను పదవి నుంచి తప్పించడంతో జరిగిందనవచ్చు. కాలిఖో కొంతమంది మద్దతుదారులను వెనకేసుకుని ఢిల్లీ వచ్చి కాంగ్రెసు అధిష్టానంతో మొరపెట్టుకున్నాడు – తూకీ గారి పని పట్టమని. ఎప్పటిలాగే దేనికీ తీరిక లేని, ఏదీ తేల్చని మాతాసుతులు సమస్యను నాన్చారు. ముఖ్యమంత్రి బండి నడిచిపోతోంది. అది సహించలేని అరుణాచల్‌ బిజెపివారు గవర్నరు నిర్భయ్‌ శర్మ వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి పని పట్టమని కోరారు. కానీ ఆయన తన పరిధిలోకి రాని అంశాల జోలికి వెళ్లలేదు. బిజెపివారు అధిష్టానంతో మొరపెట్టుకున్నారు. కేంద్ర బిజెపికి దీనిలో ఒక ఆశాకిరణం గోచరించింది. కాగల కార్యం తీర్చగల గంధర్వుడి కోసం వెతికారు. 

దొరికాడు. ఆయనే జ్యోతి ప్రసాద్‌ రాజ్‌ఖోవా అనే 71 ఏళ్ల 1968 ఐయేయస్‌ బ్యాచ్‌ అధికారి. ఆసాంకు చీఫ్‌ సెక్రటరీగా చేశాడు. సాహిత్యకారుడు. ఆరెస్సెస్‌ భావాలున్న దాఖలాలు ఏమీ లేవు కానీ ఈశాన్యప్రాంతాలకు విదేశీయులు వచ్చి పడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆసాం స్టూడెంట్స్‌ యూనియన్‌ ఉద్యమానికి నైతిక మద్దతు యిచ్చాడట. ఆసాంకు, అరుణాచల్‌కు సరిహద్దు తగాదాలున్నాయి కాబట్టి సాధారణంగా అసామీలను అరుణాచల్‌ గవర్నర్లుగా వేయరు. కానీ యీయన్ని వేద్దామనుకుని శర్మను మిజోరామ్‌కు పంపించేశారు. గతంలో కూడా నచ్చనివాళ్లందరినీ అక్కడకు పంపిస్తూ గత 10 నెలల్లో మిజోరామ్‌కు 8 మంది గవర్నర్లను ప్రసాదించింది బిజెపి ప్రభుత్వం. శర్మ స్థానంలో రాజ్‌ఖోవాను నియమిస్తూ మే నెలాఖరులో ఆదేశాలు వెలువడ్డాయి. జూన్‌ 1 కల్లా ఆయన పదవి చేపట్టాడు. 

ఇక అప్పణ్నుంచి ఆయన కాంగ్రెసు తిరుగుబాటుదారులను దువ్వడం ప్రారంభించారట. పరిస్థితి గమనిస్తే ముఖ్యమంత్రి తూకీకి స్పీకరు నబాం రెబియా అనుయాయి కావడంతో బాటు కజిన్‌ కూడా! స్పీకరు ముఖ్యమంత్రి చేతిలో వుంటే ఎన్ని మ్యాజిక్‌లు చేయవచ్చో ఎన్నోసార్లు చూశాం. తెలంగాణలో టి-టిడిపి తెరాసలో విలీనం వ్యవహారం తాజా ఉదాహరణ. ముఖ్యమంత్రి నిర్ణయాలలో స్వార్థం వుందని, ఆర్థిక అక్రమాలు చేశాడని ఆరోపించడానికిి గవర్నరు ప్రధానికి అక్టోబరులోనే ఒక లేఖ రాశాడు. రాష్ట్రంలో హోలోంగి ఎయిర్‌పోర్టుకై ఎంపిక చేసిన స్థలం వద్ద తూకీ, రెబియాలకు భూములున్నాయని, అందుచేత అక్కడ పెట్టకుండా ఆసాంకు దగ్గరగా వున్న లీలాబాడీ ఎయిర్‌పోర్టును అప్‌గ్రేడ్‌ చేస్తే మంచిదనీ లేఖ రాశాడు. అది బయటకు వచ్చింది. ఇలా ముఖ్యమంత్రిపై ఫైలు బిల్డప్‌ చేస్తూ వచ్చాడు.

నవంబరు కల్లా గవర్నరు ప్రయత్నాలు ఫలించాయి. డిప్యూటీ స్పీకరు నోర్బు తాంగ్డో, కొందరు మంత్రులతో సహా 21 మంది కాంగ్రెసువారు, యిద్దరు స్వతంత్రులు 11 మంది వున్న బిజెపితో కలిశారు. మెజారిటీ వచ్చేసింది. దాంతో ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి జంకాడు. ఈలోగా కాంగ్రెసు హై కమాండ్‌ మేలుకొంది. తిరుగుబాటుదారులను బుజ్జగించే ప్రయత్నాలు చేయడం ఆరంభించింది. మెజారిటీ వచ్చేవరకు ముఖ్యమంత్రిని అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయవద్దంది. ఆర్నెల్లదాకా అంటే జనవరి 14 వరకు ముఖ్యమంత్రికి సమయం వుంది. అప్పటిదాకా ఆగితే వాళ్ల ప్రయత్నాలు ఫలిస్తాయన్న భయం వేసిందో ఏమో రాజ్‌ఖోవా అసెంబ్లీ సమావేశం తేదీని ఒక నెల ముందుకి, అంటే డిసెంబరు 16 కే  జరిపేశాడు. ఇలా చేయడంలో ముఖ్యమంత్రిని కాని, కాబినెట్‌ను కాని సంప్రదించలేదు. ఇది అసాధారణ చర్య. దీనికి ప్రతిగా డిసెంబరు 15 న తన అధికారాలు వుపయోగించి 14 మంది తిరుగుబాటు కాంగ్రెసు సభ్యులను అనర్హులుగా ప్రకటించాడు. 

అలా ప్రకటించినందుకు స్పీకరునే తీసి పారేయాలంటూ బిజెపి గవర్నరును కోరింది. గవర్నరు ఆ అభ్యర్థనను మన్నించి ఈశాన్య రాష్ట్రాలలో గవర్నరుకు ఆర్టికల్‌ 371 (ఎచ్‌) కింద వుండే అసాధారణ అధికారాలను వుపయోగించి, స్పీకరును గుర్తించకుండా డిసెంబరు 16 సమావేశాన్ని నిర్వహించే హక్కును డిప్యూటీ స్పీకరుకు ప్రసాదించేశాడు.  డిసెంబరు 14 న స్పీకరు ఆ సమావేశాన్ని రద్దు చేసినట్లు ప్రకటించి సమావేశం జరగనీయకుండా ఆ భవనానికి తాళాలు వేయించేశాడు. అప్పుడు ముఖ్యమంత్రి వ్యతిరేకులందరూ కలిసి ముందు ఒక కళ్యాణమండపంలో, తర్వాత హోటల్లో సమావేశమై పోయి, డిప్యూటీ స్పీకరు ఆధ్వర్యంలో స్పీకరును, ముఖ్యమంత్రిని పీకి పారేసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. గవర్నరుగారు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించలేదనుకోండి. డిసెంబరు 17 న గవర్నరు చర్యను నిరసిస్తూ ముఖ్యమంత్రి అనుచరులు రాజ్‌భవన్‌ ఎదుట మిథున్‌ను బలియిచ్చారు, కొందరు స్త్రీలు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.  

స్పీకరు వేటుకు గురైన వాళ్లు గువాహతి హై కోర్టుకి వెళ్లారు. కోర్టు జనవరి 6 న యీ అనర్హత వేటు చెల్లదంది. అంతేకాదు, డిసెంబరు 16 నాటి అసెంబ్లీ సమావేశాన్ని గుర్తిస్తూ జనవరి 13న తీర్పు యిచ్చింది. మర్నాడే స్పీకరు రెబియా యీ తీర్పుపై సుప్రీం కోర్టుకి వెళ్లాడు. వ్యవహారం కోర్టులో వుండగానే ఈ లోగా ఏం తోచిందో ఏమో కేంద్ర  కాబినెట్‌ గవర్నరు ద్వారా ఒక నివేదిక తెప్పించేసుకుని, రాష్ట్రపతి పాలన విధించాలని జనవరి 24 న నిర్ణయించింది. వారి సలహా మేరకు జనవరి 26 న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రాజ్‌ఖోవా వెంటనే ఎమర్జన్సీ విధించి తూకీ, అతని సహచర మిత్రుల యిళ్లకు, ఆఫీసులకు పోలీసులను పంపి వారి ఉత్తరప్రత్యుత్తరాలను, డాక్యుమెంట్లను, డేటాను స్వాధీనం చేసుకున్నాడు. (వాటిని తిరిగి యిచ్చేయమని దరిమిలా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది) ఆఫీసులు మూయించేశాడు. నిరసన ప్రదర్శనలు జరగకుండా రాష్ట్రమంతా సెక్షన్‌ 144 విధించాడు. నాటి ఎమర్జన్సీని తలపింపచేసే యీ చర్యలు అన్యాయమంటూ దేశంలో గగ్గోలు పుట్టింది. ఇటువంటి విద్యలన్నీ కాంగ్రెసుకు మాత్రమే వెన్నతో పెట్టిన విద్య అనుకున్నవారు బిజెపి కూడా ఏమీ తీసిపోవడం లేదని గ్రహించారు. చైనాతో సరిహద్దులో వున్న రాష్ట్రంలో యిటువంటి అశాంతి, రాజకీయ అస్థిరత నెలకొనడం అభిలషణీయం కాదని అందరూ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రపతిపాలన విధింపును ఛాలెంజ్‌ చేస్తూ జనవరి 28 న తూకీ సుప్రీంకోర్ట్టులో కేసు వేశాడు. ప్రస్తుతం సుప్రీం కోర్టు కేసు విచారిస్తోంది. రాష్ట్రపతిపాలన విధించవలసిన అత్యవసరం ఏమి వచ్చింది, గవర్నరు మీకు పంపిన రిపోర్టు ఏది అని కేంద్రాన్ని అడిగారు. గవర్నరు జనవరి 15 న పంపిన నివేదికలో ఆయన రాసిన విషయాలు – 'నాకూ, నా కుటుంబానికి ప్రాణభయం వుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. నా రాజ్‌భవన్‌ ఎదురుగానే జంతువధ జరిగింది. నాకు ఏ రిపోర్టూ యివ్వవలసిన పని లేదని ప్రభుత్వం తన సిబ్బందికి ఆదేశాలిచ్చింది, నా మీటింగులకు హాజరు కానక్కరలేదని చెప్పింది' అంటూ ఆరోపణలు చేశారు. కోర్టు అడిగినప్పుడు వీటికి రుజువులు ఎలా చూపగలరో వేచి చూడాలి. జాతీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎమర్జన్సీ, రాష్ట్రపతి పాలన విధించామని కేంద్రం చెప్పుకుంటోంది. గవర్నరు తన యింటి ఎదుట  గోహత్య జరిగిందని ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. అది ఆవు కాదు, మిథున్‌ను. 8 వేల సంవత్సరాలుగా ఆగ్నేయాసియా, బర్మా, చైనా, బంగ్లాదేశ్‌లలో పెరిగే జంతువది. దాని మాంసాన్ని తింటారు, బలులకు సాధారణంగా వుపయోగిస్తారు. 

జనవరి 27 న సుప్రీం కోర్టు గవర్నరుకు నోటీసు యిచ్చి, వారం తర్వాత నాలిక కరుచుకుంది. గవర్నరును ప్రశ్నించే అధికారం తమకు లేదని ఒప్పుకుంటూనే అతని చర్యలను ప్రశ్నించే హక్కు మాత్రం వుందని నిర్ధారిస్తూ విచారణ కొనసాగిస్తోంది.  తిరిగి యిచ్చేయమని కేంద్రాన్ని ఆదేశించింది.  కేం జస్టిస్‌ జె ఎస్‌ ఖేహార్‌ నేతృత్వంలో అయిదుగురు సభ్యులున్న సుప్రీం కోర్టు బెంచ్‌ 'శాసనసభ్యుల అర్హత, అనర్హత నిర్ధారించే హక్కు, పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకునే హక్కు స్పీకరుదే. గవర్నరు ఆ అధికారాలను ఎలా దఖలు పరచుకుంటార'ని అడిగింది. గవర్నరు తరఫున హాజరైన అడ్వకేట్‌ అంధ్యార్జున 'స్పీకరుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి కాబట్టి గవర్నరు తన విచక్షణ (డిస్క్రిషన్‌) వుపయోగించారు. ఆ విచక్షణ ఎలా వుండాలన్నది రాజ్యాంగంలో నిర్వచించబడలేదు. అందువలన అది కోర్టు పరిధిలోకి రాదు.' అని వాదించారు. అసెంబ్లీని ఏర్పాటు చేసే హక్కే తప్ప పార్టీ సభ్యత్వాన్ని నిర్ధారించే హక్కు గవర్నరుకు లేదని న్యాయమూర్తులన్నారు. 

ఈ లోగా రాజ్‌ఖోవా కాంగ్రెసు ప్రభుత్వం ఎంత అసమర్థంగా వ్యవహరించిందో చెప్పడానికి సర్వప్రయత్నాలూ చేస్తున్నాడు. నిన్న చక్మా-హజాంగ్‌ శరణార్థుల సమస్య లేవనెత్తాడు. వారిని పంపించివేయడానికి గత ప్రభుత్వం చేసిన వేసిన కేసును 2015 సెప్టెంబరులో సుప్రీం కోర్టు కొట్టేసివారి స్థిరనివాసానికి ఏర్పాట్లు చేయమంది. తూకీ సరైన లాయర్లను పెట్టలేదని, అందువలన భూమిపుత్రులకు నష్టం కలిగిందని, యీసారి మంచి లాయర్లను నియమించి మళ్లీ కేసు వేయాలని రాజ్‌ఖోవా చీఫ్‌ సెక్రటరీని ఆదేశించాడు. 'త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడే ప్రభుత్వం అరుణాచల్‌లో నెలకొంటుందని' పత్రికలకు చెప్తున్నాడు. వచ్చే రోజుల్లో రాజ్‌ఖోవా గారు యింకెన్ని తమాషాలు చేస్తారో వేచి చూడాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]