సెన్సారు అధికారిణి ధనలక్ష్మి బదిలీపై వెళ్లిపోయాక, టాలీవుడ్ జనాలు ఊపిరి పీల్చుకున్నారు. తమ చిత్తానికి హాయిగా సెన్సారు చేయించేసుకుంటున్నారు. సెన్సారు అధికారులు కూడా కత్తెరలకు పదును తగ్గించి, నిబంధనలకు వెసులుబాట్లు ఇచ్చేసారు. ఎ సర్టిఫికెట్ ల కన్నా యు/ఎ లు ఎక్కువైపోయాయి.
ఆ సంగతి అలా వుంచితే, పెద్ద సినిమాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెన్సారు ముందుకు వస్తున్నాయి. గతంలో అలా వుండేది కాదు. అయితే ఇలా హాయిగా సాగిపోతున్న హానీమూన్ కు బ్రేక్ పడిందా అన్న అనుమానం కలుగుతోంది. కృష్ణాష్టమి సినిమా సెన్సారు ముందు కాస్త ఇబ్బందులు ఎదుర్కోంటోందని వినికిడి. ఎప్పటి మాదిరిగా, షెడ్యూలు అయిన వేరే సినిమాల జనాల నుంచి లెటర్లు తీసుకువెళ్లి, కృష్ణాష్టమిని సెన్సారుకు పెట్టారట.
కానీ సెన్సారు అధికారి, తాను ఆ సినిమాలే తప్ప, ఈ సినిమా చూడనని చెప్పేసారట. దాంతో ముందు అనుకున్న పడేసావే సినిమానే సెన్సారు అయింది. కృష్ణాష్టమి ఆగింది. అలాగే మరో సినిమా అప్పుడు అలా…ఇప్పుడు అలా కూడా సెన్సారుకు వచ్చింది. దాని బదులు కృష్ణాష్టమి చూడమని చెప్పేసారని వినికిడి. మరి ఈ రోజు కృష్ణాష్టమి చూస్తారో, లేక షెడ్యూలు ప్రకారం క్యూలో రమ్మంటారో? అలా అయితే విడుదలకు సమస్యే మరి.