తమ తల్లితండ్రుల మధ్య అగాధం వుందని రాజీవ్, సంజయ్ యిద్దరికీ ఆ పాటికే అర్థమైంది. తమను చూడడానికి తల్లి విడిగా, తండ్రి విడిగా వచ్చేవారు. ఒక్కోసారి ఒకే సర్క్యూట్ హౌస్‌లో పక్కపక్క గదుల్లో వుంటూ పొద్దున్న ఒకరు, సాయంత్రం యింకోరు స్కూలుకి వచ్చేవారు. తీసుకెళ్లే రెస్టారెంట్ మాత్రం ఒకటే – క్వాలిటీ! వాళ్లిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కశ్మీర్ కాంగ్రెసు నాయకుడు శ్రీనగర్‌లో పిల్లలతో సహా శ్రీనగర్‌కు ఒక టూరు ఏర్పాటు చేశాడు. కొన్ని రోజులు సజావుగా వున్నా, మళ్లీ కొట్లాడుకునేవారు. అందువలన విడివిడిగా వుంటేనే మంచిది అనే అభిప్రాయానికి వచ్చారు. పిల్లలు సెలవులకు ఢిల్లీ వచ్చినపుడు తీన్‌మూర్తి భవన్‌లోనే వుంటూండేవారు. ఫిరోజ్ అప్పుడప్పుడు పిల్లల్ని తన యింటికి తీసుకెళ్లి తన గార్డెన్, తను వేటాడిన జంతువుల చర్మాలు, చేపలు పట్టే గాలం అవీ చూపించేవాడు. పిల్లలకు వడ్రంగం కూడా నేర్పించేవాడు. ఇదేమిటి అని ఓ స్నేహితుడు అడిగితే ''మా పిల్లలకు డబ్బున్న తల్లి, పేదవాడైన తండ్రి వున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా వాళ్లకు భుక్తికి లోటు వుండకూడదు కాబట్టి..'' అన్నాడట.
దూన్ స్కూల్లో ఏడాది పోయేసరికి సంజయ్‌కు తనలాటి వాళ్లే అయిన ముగ్గురితో స్నేహం కుదిరింది. కలకత్తాలోని కమల్ నాథ్ (రెండేళ్లు వరసగా పరీక్ష పోయింది, డబ్బులు వెదజల్లేవాడు), కపూర్‌తలా, జింద్‌ల నుంచి మరో డబ్బున్న అబ్బాయిలు. తర్వాతి రోజుల్లో కమల్ నాథ్ సంజయ్‌నే అంటిపెట్టుకుని వున్నాడు. ఎమర్జన్సీ అత్యాచారాల గురించి షా కమిషన్‌ను ఎదుర్కొన్నాడు. 1980 ఎన్నికలలో సంజయ్ అతనికి పార్లమెంటు టిక్కెట్టిచ్చాడు. అతనూ నెగ్గుతూ వచ్చి, తర్వాత మంత్రిగా కూడా చేశాడు. తక్కిన యిద్దరిలో ఒకతను దరిమిలా తాగుడుకు బానిసయ్యాడు, మరొకతను సన్యాసి అయ్యాడు. ఈ గ్రూపుకి కమల్ నాథే నాయకుడు. అందరూ కలిసి అనేక తుంటరి పనులు చేసేవారు. సంజయ్‌కు చిన్నప్పటి నుంచి కార్ల పిచ్చి వుంది. వీళ్లందరూ కలిసి స్కూల్లో తమ పిల్లల్ని చూడడానికి వచ్చిన తల్లితండ్రుల కార్ల మీద కన్నేసి వుంచేవారు. ఎవరైనా తాళం కార్లోనే విడిచి వెళితే వెంటనే కాస్త దూరం తోసుకుని పోయి, కారు తీసుకుని షికారు కొట్టి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా అక్కడ పెట్టేసేవారు.
1958లో ఫిరోజ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. కోలుకున్నాడు కానీ అలవాట్లు మానుకోలేదు, జీవనశైలి మార్చుకోలేదు. 1960 సెప్టెంబరు 7 న అతనికి రెండో ఎటాక్ వచ్చింది. ఛాతీలో నొప్పి వున్నా ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసి పార్లమెంటుకి వెళ్లాడు. అక్కడ జర్నలిస్టు మిత్రుడు ఇందర్ మల్‌హోత్రాని కలిశాడు. ఇందర్ అతని పరిస్థితి గమనించి చివాట్లేస్తే అబ్బే ఏమీ లేదు అంటూ కొట్టి పారేశాడు. అలాక్కాదు, నేను నా కారులో ఆసుపత్రికి తీసుకెళతానని పట్టుబట్టినా ఫిరోజ్ నేనే వెళతానులే అంటూ తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెల్లింగ్డన్ ఆసుపత్రికి వెళ్లి రిసెప్షన్ కౌంటర్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటూనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఇందిర అప్పుడు కేరళలో వుంది. కబురు విని వెంటనే వెనక్కి వచ్చింది. మర్నాడు ఉదయం 7.45 కు విపరీతంగా దగ్గు వచ్చి, ఇందిర చేతుల్లోనే తన 48 వ యేట చచ్చిపోయాడు. రాజీవ్ చితి ముట్టించాడు.
ఎమర్జన్సీ రోజుల్లో సంజయ్ కొన్ని వర్గాల పట్ల నిర్దయగా ప్రవర్తించాడు. ఆ లక్షణాలు స్కూలు రోజుల్లోనే పొటమరించాయా అని పాత్రికేయులు అడిగితే అతని క్లాస్‌మేట్స్ లేదని చెప్పారు. అతను జంతువుల పట్ల ప్రేమగా వుండేవాడనీ, ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించేవాడు కాదనీ చెప్పారు. అతను మరీ మంచివాడు కాదు, మరీ చెడ్డవాడు కాదు, అందుచేత చాలామందికి అతను గుర్తు లేడు. ప్రతీ ఏడూ ఎలాగోలా పరీక్ష గట్టెక్కేవాడు. స్కూలును కాని, టీచర్లను కాని, సహచరులను కానీ యిష్టపడిన దాఖలాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని టీచర్లు క్లాసు టీచరుకి చెప్పగా ఆయన ఇందిరకు యీ సంగతి తెలియపరచి, దీని గురించి ఏమైనా చేస్తే మంచిదని సూచించాడు. ఇందిర వెంటనే వచ్చి 'మా అబ్బాయిని యింటికి తీసుకెళ్లిపోతాను, టిసి యిచ్చేయండి' అంది. టీచరు నచ్చచెప్పబోయినా వినలేదు. రాజీవ్ అప్పటికే ఇంగ్లండు వెళ్లిపోయాడు. 'నాకు స్కూలు బాగా లేదు, హాస్టల్లో ఒక్కణ్నీ వుండను. నేను ఢిల్లీలోనే యింట్లో వుంటూ కాలేజీలో చదువుకుంటా' అంటూ సంజయ్ గోల చేస్తున్నాడు. అందువలన ఇందిర అతన్ని ఢిల్లీకి తీసుకుని వచ్చేసింది. సంజయ్ దుష్ప్రవర్తన వలన దూన్ స్కూలు నుంచి పంపించేశారని తర్వాతి రోజుల్లో వచ్చిన వార్త ఒట్టి పుకారు మాత్రమే. సంజయ్ యింటికి రావడంతో నెహ్రూ కూడా సంతోషించాడు – మనుమల్లో ఎవరో ఒకరైనా యింట్లో వున్నాడు కదాని. ఢిల్లీ వచ్చాక సంజయ్ సెయింట్ కొలంబస్ కాలేజీలో ఐఎస్‌సి చదివాడు. అతి కష్టం మీద పాసయ్యాడు. మేనకా గాంధీ మాత్రం 'మా ఆయనకు మెకానికల్ ఇంజనీరింగులో డిప్లోమా వుంది' అని చెప్పుకునేది.
దెహరాదాన్‌లో వుండే రూల్సవీ ఢిల్లీలో తీన్‌మూర్తి భవన్లో లేవు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. నిప్పుకు గాలి తోడైనట్లు మహమ్మద్ యూనుస్ కొడుకు ఆదిల్ షర్‌యార్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి చాలా సాహసాలు చేసేవారు. సంజయ్‌కు ఎప్పుడూ వాహనాల పిచ్చే. ఓ సారి పాతడొక్కు కారు కొని, ఊరంతా వెతికి స్పేర్ పార్టులు సంపాదించి, దానికి ఫిట్ చేసి, నడిపించి ఆనందించాడు. వేగంగా నడపడం, రిస్కీగా జీవించడం అతనికి సరదా. (అదే ధోరణిలో తగు జాగ్రత్తలు తీసుకోకుండా విమానం నడపడంతోనే అతను మరణించాడు). ఓ సారి బ్రేకులు పనిచేస్తున్నాయో లేదో చూదాం అంటూ వసంత్ విహార్ వద్ద కొండ మీదకు కారెక్కించి దిగేటప్పుడు బ్రేకులు వేసి చూశాడు. '..పనిచేశాయి కాబట్టే యీ విషయం చెప్పడానికి నేను మిగిలి వున్నాను' అనేవాడు ఆదిల్. కారు వేసుకుని తన స్నేహితులతో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లిపోయేవారు. ఎటు వెళ్లాలో ముందే అనుకోకుండా మధ్యదారిలో గమ్యం మార్చేసేవారు. అర్ధరాత్రుళ్లు యిలా విచ్చలవిడిగా తిరగడం ఇందిరకు నచ్చేది కాదు, పైగా అతని స్నేహితుల్లో చదువుసంధ్యలున్నవాళ్లు ఎవరూ లేకపోవడం ఆమెను బాధించేది. 'డబ్బున్న కుటుంబాలకు చెందిన పోకిరీ కుర్రాళ్లు ఢిల్లీలో కార్లు దొంగిలించి షికార్లు కొట్టి ఎక్కడో అక్కడ వదిలేయడం ఎక్కువైంది' అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో 1964 లో వార్త వచ్చింది. ఆ కుర్రాళ్లలో సంజయ్ ఒకడని ఇందిరకు తెలుసు. మందలించినా కొడుకు వినటం లేదు. ఒకనాటి సంఘటన మాత్రం పేపర్ల కెక్కింది.
మే 16 అర్ధరాత్రి సంజయ్, ఆదిల్, మరో అమెరికన్ కుర్రాడు, యింకో కుర్రాడు బాగా తాగేసి మారిషస్‌లో ఇండియన్ హై కమిషనర్‌గా పని చేసిన ధరమ్ యశ్ దేవ్ అనే ఆయనకు చెందిన ఒక కొత్త ఫియట్ కారును కొట్టేసి, మోతీబాగ్‌లోని పెట్రోలు బంకు దగ్గరకు తెచ్చి 20 లీటర్ల పెట్రోలు పోయించుకుని, వాడికి డబ్బులివ్వకుండా పారిపోయారు. దారిలో గోల్ఫ్ లింక్స్ వద్ద ఓ మోటార్ సైకిలు కనబడితే ఆదిల్ కారు దిగి మోటారు సైకిలెక్కాడు. కాస్సేపటికి పాలం ఎయిర్‌పోర్టుకి వెళ్లే దారిలో కింద పడి తల బద్దలై ఆసుపత్రిలో చేరాడు. సంజయ్, తక్కినవాళ్లు కారును ట్రాఫిక్ ఐలండ్‌కు గుద్దేస్తే పోలీసులు పట్టుకుని మోతీబాగ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు మీ అడ్రసులు చెప్పండి అంటే సంజయ్ తీన్‌మూర్తి భవన్ అడ్రసు చెప్పాడు. వేషాలేస్తున్నావా? అంటూ పోలీసు వీపు మీద ఒకటి చరిచాడు. కానీ సంజయ్ మళ్లీ అదే చెప్పడంతో ఎందుకైనా మంచిదని ఇన్‌స్పెక్టరు పై అధికారులకు చెప్పాడు. నెహ్రూ, ఇందిర బొంబాయిలో వున్నారు. కానీ కొద్ది సేపటికే తీన్‌మూర్తి నుంచి ఎవరో వచ్చి వీళ్లను విడిపించారు. పోలీసులు ఆ కారు పాలం ఎయిర్‌పోర్టు వద్ద దొరికిందని చెప్పి, సొంతదారుకి అప్పగించేసి కేసు మూసేశారు.
కొన్ని రోజులు పోయాక దీని గురించి వాజపేయి, రామ్ మనోహర్ లోహియా పార్లమెంటులో ప్రశ్నించినపుడు హోం మంత్రి గుల్జారీలాల్ నందా 'నిందితులు దొరకలేదు' అని చెప్పి వూరుకున్నాడు. సంజయ్ వ్యవహారం పోలీసుదాకా వెళ్లిందని తెలియగానే ఇందిర దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. 17 ఉదయం ఫ్లయిట్‌లో సంజయ్‌ను, మరో ఫ్రెండును శ్రీనగర్ పంపేసింది. అక్కడ ఒక లేడీ టీచరు యింటికి దుమ్ముకొట్టుకుపోయిన బట్టలతో వాళ్లు చేరి, ''మేం ఢిల్లీ నుంచి హిచ్‌హైకింగ్ చేస్తూ వచ్చాం.'' అని నాటకమాడారు. కారు చోరీ రోజున సంజయ్ వూళ్లో లేడు అని ప్రెస్‌కు లీకులు యిచ్చారు. 'కానీ యిదంతా వట్టిదే' అంటూ ''కరంటు'' పత్రికలో ఎడిటరు మొదటిపేజీలో పెద్ద వ్యాసం రాశాడు. తన కొడుక్కి ఆ నాటి ఘటనలో పాత్ర లేదని నిరూపించమని ఇందిరను ఛాలెంజ్ చేశాడు. ఇందిర మౌనంగా వుండిపోయింది. అది సంజయ్‌కు కోపం తెప్పించింది. 'మనం ఎలిబయ్ సృష్టించాం కదా' అని అతని వాదన. పాత్రికేయులు తలచుకుంటే కూపీ లాగి పరువు తీయగలరని, ఛాలెంజ్ స్వీకరించి కెలుక్కోవడం కంటె మిన్నకుండడం మేలని ఇందిర అనుకుంది. – (సశేషం)
(ఫోటో – సంజయ్, రాజీవ్ తల్లితో)
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)