మళ్లీ… సీమ పరువు తీస్తున్న సినిమా!

తెలుగు చిత్ర సీమకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ చాలా సంవత్సరాలుగా ఒక హిట్ పార్ములా. ప్రేమ కథలను, ఫ్యాక్షన్ కథలను లెక్కకు మించి తెరెకక్కించేసింది తెలుగు చిత్ర పరిశ్రమ. రాయలసీమ రెడ్లను హీరోలుగా, విలన్లుగా…

తెలుగు చిత్ర సీమకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ చాలా సంవత్సరాలుగా ఒక హిట్ పార్ములా. ప్రేమ కథలను, ఫ్యాక్షన్ కథలను లెక్కకు మించి తెరెకక్కించేసింది తెలుగు చిత్ర పరిశ్రమ. రాయలసీమ రెడ్లను హీరోలుగా, విలన్లుగా చూపుతూ ఇండస్ట్రీ కోట్ల రూపాయలు సంపాదించుకుంది. కొంతమంది హీరోలు తమ కెరీర్‌లోనే సెన్షనల్ హిట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు దశాబ్దంన్నర కిందట రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు టాలీవుడ్‌ను షేక్ చేశాయి. మొదట్లో స్టార్ హీరోల సినిమాలు ఆ బ్యాక్ డ్రాప్‌లో వచ్చాయి. 

అలా ఐదారేళ్లు గడిచే సరికి ఆ ట్రెండ్‌లో వచ్చిన సినిమాలు ప్లాఫులుగా నిలిచే సరికి.. కొంతకాలం పాటు అలాంటి సినిమాల పరంపర ఆగింది. ఆ తర్వాత అల్లరి నరేష్ లాంటి వాళ్లు సీమ బ్యాక్ డ్రాప్‌తో కొన్ని కామెడీ సినిమాలు చేశారు. అంత వరకూ సీమ ఫ్యాక్షనిస్టులను నరరూప రాక్షసులుగా చూపించడం జరిగాకా.. కొన్ని సినిమాల్లో వాళ్లను కమెడియన్లుగా చేసేశారు! మరి ఆ ట్రెండ్ కూడా కుళ్లు కంపు కొట్టినా.. అప్పుడప్పుడు టాలీవుడ్ వాలాలు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు! దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అంతవరకూ వచ్చిన సీమ సినిమాలకు భిన్నంగా యథార్థ సంఘటనలతో కల్పిత గాథ అంటూ ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలు తీశాడు. కొంత వరకూ యాథార్థాన్ని వీలైనంత కల్పితాన్ని చూపించాడు వర్మ. 
 
మరి మనోళ్లు తీసే స్ర్టైట్ సీమ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇదే సమయంలో కొన్ని అనువాద సినిమాలకు కూడా సీమ బ్యాక్ డ్రాప్‌ను అతికించడం మొదలైంది. బీచ్ నేపథ్యంలో సాగే తమిళ సినిమాలను తెలుగులోకి అనువదించినప్పుడు వాటికి విశాఖను బ్యాక్ డ్రాప్‌గా చూపటం చేసే అనువాదకులు.. సినిమాలో మాస్ కంటెంట్ ఎక్కువగా ఉంటే, ఒక ప్రాంతం బీభత్సమైన ఫ్యాక్షన్‌తో ఉన్నట్టుగా చూపిస్తే, సినిమాల్లోని పాత్రలు ప్రతీకారం కోసం ప్రాణాలు తీసేసే టైపు అయితే.. అలాంటి సినిమాలను టక్కున రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లోకి మార్చేయడం జరుగుతూ వస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో విశాల్ సినిమా ‘పందెంకోడి’ని అనంతపురం, కడప నేపథ్యానికి మార్చారు. తమిళ వెర్షన్‌లో ఆ సినిమా సంగతేంటో కానీ.. తెలుగు వెర్షన్‌లో మాత్రం ఆ సినిమా మొత్తం అనంతపురంలో, కడప, పులివెందులలో జరిగినట్టుగా చూపించారు. ఆ తర్వాత తమిళంలో వచ్చిన ‘‘సుబ్రమణ్యపురం’’ అనే సినిమాకు అయితే ఏకంగా ‘‘అనంతపురం’’ అని టైటిల్ పెట్టేశారు. అక్కడ నుంచి తమిళంలో రూపొందే డార్క్ వయొలెంట్ సినిమాలకు అనంతపురాన్నో.. కడపనో.. కర్నూలునో నేపథ్యంగా మారుస్తున్నారు మన సినీ మేధావులు.
 
ఈ మధ్య విడుదలైన సినిమాల విషయంలో మళ్లీ అలాంటి హడావుడి మొదలుకావడం విశేషం. కొంత గ్యాప్ తర్వాత రెండు సినిమాలు అనంతపురం జిల్లా బ్యాక్ డ్రాప్‌తో రూపొంది విడుదల అయ్యాయి. వాటిలో ఒకటి ‘‘స్పీడున్నోడు’’, రెండోది ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’’. ఈ రెండు సినిమాల్లోనూ అనంతపురం జిల్లాలోని ఊర్ల పేరు వినిపించడం విశేషం. స్పీడున్నోడు సినిమా అయితే పెనుకొండ, పేరూరు… వంటి ఊర్లలో జరిగిన కథలాగా చూపించారు. సినిమాలో పెనుకొండ రెవెన్యూ డివిజన్లలోని వివిధ ఊర్ల పేర్లు వినిపిస్తాయి. 

తమిళంలో శశికుమార్ నటించిన ‘సుందరపాండ్యన్’ కురీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు అలా అనంతపురం టచ్ ఇచ్చారు. అదేం విచిత్రమే కానీ.. తమిళంలో శశికుమార్ నటించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసినా, వాటిని రీమేక్ చేసినా వాటినీ సీమ బ్యాక్ డ్రాప్‌లోకే మారుస్తారు. ఇది వరకూ ఈ హీరో తమిళంలో నటించిన ఒక సినిమాను తెలుగులో ‘శంభో శివ శంభో’గా రీమేక్ చేశారు. దాన్ని కూడా కర్నూలు, అహోబిళం బ్యాక్ డ్రాప్‌లో రూపొందించారు.
 
ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథలో అనంతపురం జిల్లా ప్రస్తావన వచ్చింది. ఫ్యాక్షన్‌తో ముడిపడిన ఈ ప్రేమగాథలో అనంతపురం జిల్లా హిందూపురం బ్యాక్ డ్రాప్‌తో రూపొందించినట్టుగా దీని హీరో, దర్శకులు ప్రకటించుకున్నారు. ఈ సినిమాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తావన కూడా ఉంటుందని… ఈ విధంగా మరింత లోకల్ టచ్ ఇచ్చారు రూపకర్తలు. మరి ఒకవారం వ్యవధిలో విడుదలైన ఒక రీమేక్ సినిమా ఒక స్ర్టైట్ సినిమా అనంతపురం జిల్లా బ్యాక్ డ్రాప్‌తో విడుదల అయ్యాయి. 

మరి ఇక్కడ విషాదకరమైన విషయం ఏమిటంటే… విలన్లను వయొలెంట్‌గా చూపడానికో.. సినిమాలో లేనిపోని కట్టుబాట్లను చూపడానికో… హింసాత్మక సన్నివేశాలను, నరుక్కోవడాలను చూపించే ఉద్దేశంతోనే ఈ దర్శకనిర్మాతలు సీమను నేపథ్యంగా తీసుకోవడాన్ని కొనసాగిస్తున్నారు. సీమ సంస్కృతి అంటూ దానికి లేనిపోని చెడును ఆపాదించడానికే వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. దశాబ్దం, రెండు దశాబ్దాల నుంచి కూడా ఇదే తీరు కొనసాగుతోంది. దీనికి పుల్‌స్టాప్ పెట్టడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. 

సీమ ప్రాంతీయులను ఫ్యాక్షన్ పేరుతో నరరూప రాక్షసులుగా ఎగ్జాగరేట్ చేసిన టాలీవుడ్ వారినే కమేడియన్లుగా కొంతకాలం పాటు చూపి.. ఇప్పుడు ఎక్కడెక్కడి జాడ్యపు కథలకూ సీమ టచ్ ఇస్తోంది. ఇదేమైనా భావ్యమా?! తలా ఒకరకంగా రాయలసీమను పరుతీసే వాళ్లే తయారయ్యారు. వీళ్లను నియంత్రించే నాథుడే లేకుండాపోయాడు.

కొసమెరుపు ఏమిటంటే… రాయలసీమ ప్రాంతానికే చెందిన దర్శకుడు మేర్లపాక గాంధీ తన తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ను కొంత వరకూ సీమ బ్యాక్ డ్రాప్‌తో లాగించాడు.  సీమ జిల్లాల్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ జనాలతో బాగా కనెక్టివిటీ ఉన్న ట్రైన్. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలను టచ్ చేస్తూ వెళ్లే వెంకటాద్రికి జనాలతో కూడా బాగా టచ్ ఉంది. అలాగే ఆ సినిమాను కథపరంగా కర్నూలు, డోన్, కడప, తిరుపతిలను వేదికలుగా చూపించారు. మరి అలాంటి సినిమాలో కూడా జయప్రకాష్ రెడ్డి పాత్రకు కొంత ఫ్యాక్షన్ టచ్ ఇచ్చి ఇతర ప్రాంతాల డైరెక్టర్లు, రచయితలనే ఫాలో కావడం!