ఎర్రబెల్లి దయాకరరావుగారు పదిమంది టిడిపి ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకరుకి లేఖ పంపుతూ తమ టి-టిడిపిని తెరాసలో విలీనం చేశామని, ఆ విషయం గుర్తించాలని లేఖ రాశారు. పార్టీలో మూడింట రెండు వంతుల మందిని చీల్చడంతో ఫిరాయింపు ముద్ర, రాజీనామా చేసి మళ్లీ ఉపయెన్నికలు ఎదుర్కోవలసిన అగత్యాన్ని తప్పించుకున్నారు. తలసాని టిడిపిలో రాజీనామా చేయకుండా తెరాసలో చేరి మంత్రిపదవి చేపట్టడంపై వివాదం నడుస్తూనే వుంది. ఇప్పుడు అలాటి వాళ్లందరూ నిశ్చింతగా వుండవచ్చు. ఈ మ్యాజిక్ ఫిగర్ 10 చేరేవరకు, ఎర్రబెల్లి టి-టిడిపిలోనే వుంటూ అందర్నీ పోగేసివుంటారని అనుకోవడంలో తప్పు వుందా? ఇది ముందే ప్లాన్ చేసి వుండకపోతే తెరాస కనీసం తలసాని చేత రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించేది కదా! ఆ అవసరం పడదనే ధీమాతోనే తెరాస యిన్నాళ్లూ విమర్శలు సహిస్తూ వచ్చింది. ఇలాకాక మరోలా ఎలా ఆలోచించాలో నాకైతే తట్టటం లేదు. ఇదేమీ చెల్లదు, వాళ్లంతా ఒకేసారి ఫిరాయించలేదు, అందులో ఆరుగుర్ని పార్టీలోంచి సస్పెండ్ చేశాం కాబట్టి అనర్హులుగా ప్రకటించమని స్పీకరును కోరుతూ ఎర్రబెల్లే కోర్టులో కేసు వేశారు అని టిడిపివారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎర్రబెల్లి కేసు విత్‌డ్రా చేసుకుంటున్నానని ప్రకటించడం ఖాయం. తర్వాత ఏమవుతుందనేది అప్రస్తుతం కానీ అంత ఎర్రబెల్లి అంతటి కీలకస్థానంలో వుండేట్లా చూడడంలో ముందస్తు ప్రణాళిక లేదనుకోవడం సబబు కాదు.
ఇదంతా రాజకీయకుట్ర అనడం కొంతమందిని నొప్పించింది. రాజకీయంగా ఎప్పుడూ కుట్రలు జరుగుతూనే వుంటాయి. ప్రేమలో, యుద్ధంలో ఏదైనా ఒప్పే అని సామెత. రాజకీయంలో ఎత్తుపైయెత్తులు, కౌటిల్యం పేర కుట్రలు, కూహకాలూ ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. అలా చేయడం వారి జన్మహక్కు అని నాయకులు అనుకుంటారు. సామాన్యప్రజలకు కనీసం వాటిని కుట్రలుగా పేర్కొనే హక్కు కూడా లేదా? నా వ్యాసంలో ఎక్కడా ఎర్రబెల్లితోనే కోవర్టు ఆపరేషన్ ప్రారంభమైందని నేను అనలేదు. మహాభారతంలో శల్యుడే పెద్ద కోవర్టు. కోవర్టు అంటే మన దగ్గర్నుంచి శత్రుపక్షంలోకి పంపబడినవాడు అని ఎవరో అర్థం చెప్పబోయారు. కోవర్టు ఆపరేషన్ అంటే రహస్యంగా చేసే చర్య అనే అర్థం. మన దగ్గర్నుంచి పంపనక్కరలేదు. అక్కడున్నవాణ్నే మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. గూఢజారుల జగత్తులో ఏజంట్లు, డబుల్ ఏజంట్లు పుష్కలంగా వుంటారు. విభీషణుణ్ని అందరూ అనుకునే అర్థంలోనే నేను రాస్తే, ఒకరు నొచ్చుకున్నారు. లోకకల్యాణం గురించి చేశాడన్నారు. రావణుడి పద్ధతి నచ్చక విభీషణుడు పార్టీ మారడం వరకు ఓకే. కానీ యిక్కడకు వచ్చాక అవతలివాళ్ల గుట్టుమట్లు చెప్పడాన్ని ఎలా సమర్థించగలం? రావణుడి పొట్టలో అమృతభాండం వుందని, దాన్ని గురించి విభీషణుడు రాముడికి చెప్పాడనీ వాల్మీకంలో లేదు. కానీ ఇంద్రజిత్తు హోమం చేసే చోటకి లక్ష్మణుణ్ని తీసుకెళ్లి ఆ హోమం జరగకుండా, ఇంద్రజిత్తు భూతబలి యివ్వకుండా అతని చేత భగ్నం చేయించాడని రాసి వుంది. అందుకే యింటిగుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చాడన్న పేరుబడ్డాడు. రావణమృతి తర్వాత సింహాసనం వద్దని అని వుంటే అప్పుడు లోకకల్యాణం కోసం గట్రా అంటే నమ్మవచ్చు. ఇప్పుడు మనింట్లో విభీషణుడు పుట్టాడు కదాని అర్జంటుగా ఆ జాతీయాన్ని మార్చడానికి వీలుపడదు.
విభీషణుడు లంకలో పుట్టాడు కానీ మన దగ్గర అలాటివాళ్లు లేరనుకుని పోతారేమోనని, నియరర్ హోమ్, గోల్కొండ ఉదంతం చెప్పాను. అది తెలంగాణ ప్రజలను అవమానించినట్లుగా నాపై కొందరు ఆరోపణ చేశారు. ఎంత హాస్యాస్పదం? అలెగ్జాండర్‌తో చేతులు కలిపిన అంభి గురించి రాస్తే భారతీయులను అవమానపరచినట్లా? చంద్రబాబు ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచాడని రాస్తే రాయలసీమ వాళ్లు కోస్తావాళ్లకు ద్రోహం చేశారని రాసినట్లా? రోహిత్ విషయంలో సుశీల్ భావప్రకటనా స్వేచ్ఛ గురించి రాస్తే దానిలో దళిత వ్యతిరేకత చూశారు కొందరు. ప్రతీ విషయాన్ని దళిత-దళితేతర కోణంలో చూడడం చాలనట్లు, యిప్పుడు ప్రాంతీయతావాదం కూడానా? అయినా కాకతీయుల కరవాలాల ధాటి… అని రాసినప్పుడో, గోల్కొండలో కోహినూర్ తళతళలు.. అని రాసినప్పుడే – మాదే మాదే అని, గోల్కొండ ద్రోహి గురించి రాయగానే మాది కాదనగలమా? అయినా అప్పుడు ఆంధ్ర, తెలంగాణ గీతలెక్కడ వున్నాయి? అందరూ ఒకటే జాతి! ఇంకో విషయం గమనించాలి. సాధారణంగా కుట్ర చేసేవాడు, కుట్రకు బలైనవాడు ఒకే జాతి, చాలా సార్లు ఒకే కులం, బంధువు కూడా అవుతాడు. జయచంద్రుడు, పృథ్వీరాజ్‌లు యిద్దరూ బంధువులే కదా. జయచంద్రుడి వారసుడు విపి సింగ్ దేశప్రధాని కాలేదా? ఏ సంఘటనను ఆ సంఘటన వరకే చూడాలి. ఇలాటివి సహజమేలే అంటూ గతాన్ని గుర్తు చేసినపుడు ఉలిక్కిపడకూడదు.
1971లో తెలంగాణ ప్రజాసమితి స్థాపించి, పది ఎంపీ సీట్లు గెలిచి గంపగుత్తగా కాంగ్రెసులో కలిపేసినపుడు చెన్నారెడ్డిది ద్రోహం, ఇందిరది కుట్ర అనలేదా? పివి నరసింహారావు భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర కాంగ్రెసు నాయకులు జై ఆంధ్ర ఉద్యమం లేవదీసి, పివిని సీటు దింపి, సంస్కరణలను అటకెక్కించి, ఉద్యమాన్ని చెట్టెక్కించినపుడు అది ఆంధ్రప్రజలపై జరిపిన కుట్ర కాదా? వీటన్నిటిని కుట్ర లనకూడదా? ఇప్పుడు ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణ వ్యక్తి కాబట్టి, బాబు ఆంధ్ర వ్యక్తి కాబట్టి కుట్ర అనకూడదంటే, మరి గతంలో తెరాస టిక్కెట్టుపై గెలిచి కాంగ్రెసులోకి మారినవాళ్ల సంగతేమిటి? వాళ్లు తెలంగాణ పేరుపై గెలిచి వైయస్ ఆకర్ష్‌లో పడి ప్రజలకు జెల్ల కొట్టలేదా? అది వైయస్ కుట్ర కాదా? దాన్ని వైయస్ కుట్ర అనాలా, తెలంగాణపై రాయలసీమ కుట్ర అనాలా? 2009లో అటూ, యిటూ ఎమ్మెల్యేలు ఉత్తుత్తి రాజీనామాలు యిచ్చినపుడు అది ప్రజల పట్ల కుట్ర కాదా? రాజీనామాలపై, పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకరు నాన్చిపెడితే అది ప్రజాస్వామ్యం పట్ల కుట్ర అనడం లేదా? ఆంధ్ర స్పీకరు నుండి, లోకసభ స్పీకరు దాకా వైసీపీ అందర్నీ దుయ్యబడుతోంది. ఎస్పీవై రెడ్డి కేసులో ప్రాంతం లెక్కేసి తెలుగువారి పట్ల ఉత్తరాది సుమిత్రా మహాజన్ కుట్ర అనటం లేదు. రేపు – మాటవరసకి – కెటియార్‌ను వారసుడిగా గుర్తించినందుకు అలిగి హరీశ్‌రావు నేడు తెరాస టిడిపిని దఫదఫాలుగా చీల్చినట్లే, తెరాసను అతను చీలిస్తే…? అప్పుడేమనాలి?
అసలు పార్టీ నాయకుడి మాట అటుంచండి, ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయ్యాక పార్టీ మారదామనుకున్నపుడు మళ్లీ ఓటర్ల ఆమోదం తీసుకోవాలి. లేకపోతే వాళ్ల పట్ల కుట్ర చేసినట్లే. ఇది టి-టిడిపి నాయకులకే కాదు, ఆంధ్రలో, యిక్కడా వున్న వైసిపి నాయకులకూ వర్తిస్తుంది. వాళ్లను చేర్చుకుంటున్న పార్టీలు కుట్ర చేస్తున్నాయని అనడంలో సందేహం ఏముంది? తెలంగాణలో టిడిపి కనుమరుగవుతోందని వార్తలు రాగానే కార్యకర్తల మొరేల్ బూస్ట్ చేయడానికి వెంటనే ఆంధ్రలో 25 మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారనే లీకు వచ్చింది. దాన్ని టిడిపి వేసిన ఎత్తుగా, ట్రిక్కుగా అభివర్ణిస్తే అది ఆంధ్రులను కించపరిచినట్లు అర్థం తీస్తే ఎలా? ఇదెలా వుందంటే ఓటు-నోటు కేసులో చంద్రబాబుకు హస్తం వుందని కెసియార్ అనగానే యావదాంధ్రులకు అవమానం జరిగిందని బాబు గగ్గోలు పెట్టినట్లుంది. ఇక నేను గతంలో జరిగిన కుట్రల గురించి రాశానా లేదా అని కొందరికి సందేహం. అయ్యా నాకు కుట్రలుంటాయనే రాజకీయాలు యిష్టం. రాముడంటే గౌరవం వుంది కానీ యిష్టమైన గ్రంథం భారతమే. అన్నీ వ్యూహప్రతివ్యూహాలే కాబట్టి. ఒట్టి సేవాభావమే కనబరచే వినోబా భావే గురించి రాయమంటే నాకు బోరు. టక్కుటమార విద్యలతో అధికారంలోకి వచ్చిన ఔరంగజేబు గురించి రాయడం యిష్టం. ధీరేంద్రనాథ్ రాసిన పుస్తకానికి మొసలికంటి తిరుమలరావుగారు 'మొఘలాయీ దర్బారు కుట్రలు' పేరుతో చేసిన అనువాదం చిన్నప్పుడు చదివాను. మళ్లీ దొరికితే మీతో పంచుకుందామని ఉబలాటం. అలాగే చాణక్యుడు, రాక్షసుడు పన్నిన పన్నాగాలతో నిండిన 'ముద్రారాక్షసం' కూడా! మన రాష్ట్రంలో కూడా జరిగిన సంఘటనలను ఎందుకు వదిలిపెడతాను స్వామీ, అవి మీ దృష్టికి రాకపోతే నేనేం చేతు? అప్పటికీ కొందరు పాఠకమిత్రులు పాపం గుర్తు తెచ్చుకుని ప్రస్తావిస్తున్నారు కూడా.
నా ఊహాగానంలో తప్పుండవచ్చని నేనే చెప్పాను. ఇప్పుడు ఎర్రబెల్లిని కోవర్టుగా బాబే పంపుతున్నారన్న ఊహాగానంలోనూ సరుకు వుండవచ్చు. కానీ అసలూ వూహే చేయకూడదనడం తప్పు. తెలంగాణ విభజన అనే లక్ష్యం కోసం కెసియార్ ఎన్ని రకాల ఉపాయాలను ప్రయోగించారో చర్చించడంలో తప్పు లేదు. అబ్బే లేదు, ఉపాయాలు, వ్యూహాలు ఏమీ లేకుండానే చెట్టు నుండి ఫలం రాలినట్లు రాలింది అని అనుకునేవాళ్లుంటే వాళ్లకో నమస్కారం. చర్చిస్తే విషం కక్కినట్లు అనుకుంటే రెండు నమస్కారాలు. నిజానికి కెసియార్ వీధుల్లో ఉద్యమం తక్కువగా చేశారు, తెరవెనుక రాజకీయాలతోనే, చర్చలతోనే అనుకున్నది సాధించారు. 2014 దాకా తెలంగాణ వస్తుందని కెసియార్ అనుకోలేదు అని కొందరు రాశారు. అలా అయితే ఆయనా చిరంజీవిలా పార్టీ ఎప్పుడే ఎత్తేసి వుండేవాడు. పుష్కరం పాటు ఎత్తుపల్లాలు చూస్తే మునకలు వేస్తూ యీదుతూండేవాడు కాదు. తను దిగినదే కాక, సొంత పిల్లల్ని దీనిలోకి దింపేవాడు కాడు. పార్టీ నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారం. అధికారం లేకుండా అన్నాళ్లు పార్టీ నడిపారంటే ఆయన్ను నమ్మి నిధులు అందచేసినవారెందరో వుండి వుంటారు. టిడిపిని యిరకాటంలో పెట్టడానికి వైయస్సే నెలనెలా డబ్బిచ్చేవాడన్న వదంతీ వుంది. కనపడని శక్తులెన్నో కెసియార్‌కు అండగా నిలిచాయి. బయటకు కనబడేది మాత్రమే మనకు యిప్పుడు తెలుస్తుంది. పాతికేళ్లు పోయాక హోం శాఖలో పనిచేసినవాళ్లెవరో ఆత్మకథ రాస్తే, అప్పుడు విషయం బయటకు వస్తుంది. కనీసం కాంగ్రెసు పట్ల శకుని పాత్ర పోషించిన జయపాల్ రెడ్డి ఆత్మకథ రాసినా చాలా తెలుస్తుంది.
దక్షిణాది రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోవడం సహించలేని తమిళ, కర్ణాటక నాయకులు ఆంధ్రను చీల్చి బలహీనపరచాలన్న ప్రణాళిక ఎప్పణ్నుంచో వేసుకున్నారు. చిదంబరం వారిలో ప్రథముడు. అతని అనుచరుడు హోం శాఖలో పిళ్లయ్ వున్నాడు. వాళ్లు ముందునుంచి ప్లాను వేసుకుని వున్నారు. 2009 డిసెంబరు 9 నాటి ప్రకటన ఎలా వెలువడిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అసలు కెసియార్ నిరాహారదీక్షకు చేపట్టిన కారణం ఏమిటి, వాళ్ల ప్రకటన దేని గురించి? ఆ నాటి ప్రకటన ఎలా వుండాలో డ్రాఫ్ట్ చేసిన వారిలో జయపాల్ రెడ్డి, జయశంకర్, కెసియార్ వున్నారని తర్వాత వాళ్లే చెప్పుకున్నారు కదా. నిమ్స్‌లో కెసియార్ ఆరోగ్యస్థితిపై రిపోర్టులు యిప్పటివరకు బయటకు వచ్చాయా? కేంద్రంలో కొందరు కెసియార్‌ను ఉపయోగించుకుని తమ లక్ష్యం సాధించుకున్నారు. ఆయన నీరసపడినప్పుడు విభజన తథ్యం, వదిలిపెట్టకు అని వెన్ను తడుతూ వచ్చారు. విభజిస్తే తెలంగాణ ప్రజలు మీ కాళ్లు కడుగుతారంటూ సోనియా, రాహుల్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. నువ్వు ఒకందుకు పోస్తే, నేను మరొకందుకు తాగాను అన్నట్లు కెసియార్ వారికి సహకరించారు, లక్ష్యం సాధించారు. ఈ రోజు కెసియార్ వేరెవరికీ ఘనత కట్టపెట్టకుండా సర్వం తనవలనే జరిగిందని చెప్పుకుంటూ వుంటే జయపాల్ రెడ్డి 'శుంఠ' పదానికి అర్థాన్ని గ్రహించిన ఆత్మజ్ఞానిలా, పుచ్చుబఠాణీ నమిలిన వేదాంతిలా మొహం పెట్టి భరిస్తున్నారు. నాకు నచ్చనిది కనబడితే సొంత పార్టీనైనా విమర్శిస్తా నంటూ కాంగ్రెసులో వుండగా చెలరేగి పోయినా కేశవరావు గొంతు యిప్పుడు మూగబోయిందేం? వ్యక్తి మారాడా? వ్యక్తిత్వం మారిందా? సిద్ధాంతాలు మారాయా? గతంలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకంపై విరుచుకు పడిన తెలంగాణ ఉద్యమకారులందరూ యిప్పుడు కెసియార్ చేస్తున్న అనేకానేక తలతిక్క పనులపై నోరు మెదపరేం? అప్పుడున్న నిర్భయత్వం, చిత్తశుద్ధి, తెలంగాణ పట్ల అంకితభావం గట్రా ఎక్కడ దాక్కున్నాయి?
రాష్ట్రం విడిపోతే పదవులు పెరుగుతాయంటే ఒకాయన నాకు మతి పోయిందన్నాడు. కొత్త జిల్లా ఏర్పడితేనే కొత్త కలక్టరు, డియస్పీ, జెడ్పీటీసీ యిత్యాది పోస్టులు వచ్చినపుడు కొత్త రాష్ట్రం ఏర్పడితే రావా? గతంలో ఒక చీఫ్ సెక్రటరీ, ఒక డిజిపి.. మరి యిప్పుడు? పదవులంటారా? గతంలో వున్న పిఆర్ఓలు, సలహాదార్లు, ప్రెస్ ఎకాడమీ చైర్మన్లు, కార్పోరేషన్ చైర్మన్లు ఎంతమంది? ఇప్పుడెంత మంది? ఒక్కో కార్పోరేషన్ రెండుగా చీలితే పదవులు రెట్టింపు కావా? ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్సయ్యారు స్వామీ? ఇది దీనికి పెద్ద చదివేసి ఉన్న మతి పోగొట్టుకోనక్కరలేదు. ఒక రైతు సంఘం రెండుగా విడిపోతేే యిద్దరు అధ్యక్షులు, యిద్దరు కార్యదర్శులు, యిద్దరు సహాయ కార్యదర్శులు.. తయారవుతారని చదువురాని రైతు కూడా చెప్తాడు. …ఇంకో ఆయన నేను 2019లో ఏం రాయబోతేనే వూహించారు. నేను అప్పటిదాకా బతికి వుంటానో లేదో, వున్నా రాయగలిగే స్థితిలో వుంటానో లేదో కూడా నాకే తెలియదు. ఆయన భవిష్యవాణి కాస్త ఆశ కలిగించింది. …కెసియార్, చంద్రబాబులో ఎవరు ఎక్కువ చాణక్యులనేది డిబేట్‌కు పెట్టలేం. ఎవరైనా కొంతకాలమే వెలుగుతారు. ఒక్కోప్పుడు ఒక్కోరిది పైచేయి అవుతుంది. ఎమర్జన్సీ సీరీస్‌లో కామరాజ్ కథ చదవండి.
వ్యాసంపై 50కు పైబడిి వ్యాఖ్యలు వచ్చాయి. 1994లో కాంగ్రెసు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, 2004లో టిడిపి బాగా దెబ్బతిన్నపుడు జరగని మాస్ స్కేల్ ఫిరాయింపులు యిప్పుడు తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయి అన్నదానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. నాయకుడికి అధికారమే కావాలి అంటే మరి ఆంధ్రలో కూడా వైసిపి తుడిచిపెట్టుకుని పోవాలిగా! టి-టిడిపి నాయకులకు ఆశ పోయింది కాబట్టి తెరాసలో చేరుతున్నారు అంటున్నారు. ఎందుకు పోవాలి? తెరాస కూడా నాయకులతో కిక్కిరిసి పోతే రేపు టిక్కెట్టు దొరుకుతుందన్న నమ్మకం వుందా? టిడిపి, కాంగ్రెసు పార్టీలకు నిధుల కొరత లేదు. ఎన్నికలలో నిలబడితే హై కమాండ్ నుంచి డబ్బులు వస్తాయి. తెరాసలో అయితే పూర్తిగా కుటుంబపాలనే. ఇప్పుడున్న మంత్రులే పనులు చేయించుకోలేక పోతున్నారు. వీళ్లు వచ్చి ఏం చేస్తారు? ఇంకో మాట – టిడిపి, కాంగ్రెసుల నుండే ఎందుకు మారుతున్నారు? బిజెపి నుండి ఎందుకు మారటం లేదు? వాళ్లకు పదవీలాలస లేదా? తమ నియోజకవర్గంలో పనులు జరగాలన్న (తెరాసలో మారేవాళ్ల స్టాండర్డ్ ఎక్స్క్యూజ్ యిది) కోరిక లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేవరకూ నా కుట్ర థియరీని ఒక హైపోథిసిస్గా అంగీకరించి పక్కన వుండనీయండి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)