ఎమ్బీయస్: ఇమేజ్ ఛేంజోవర్

నాయకుడనేవాడెప్పుడూ సహచరుల, కార్యకర్తల, అనుయాయుల నమ్మకాన్ని నిలుపుకోవాలి. ఈయన్ని నమ్ముకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా గట్టెక్కిస్తాడన్న విశ్వాసం వుంటేనే  కష్టకాలంలో సైతం అంటిపెట్టుకుని వుంటారు. ఈ సూత్రం రాజకీయ నాయకులేక కాదు, కార్పోరేట్ అధిపతులకూ…

నాయకుడనేవాడెప్పుడూ సహచరుల, కార్యకర్తల, అనుయాయుల నమ్మకాన్ని నిలుపుకోవాలి. ఈయన్ని నమ్ముకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా గట్టెక్కిస్తాడన్న విశ్వాసం వుంటేనే  కష్టకాలంలో సైతం అంటిపెట్టుకుని వుంటారు. ఈ సూత్రం రాజకీయ నాయకులేక కాదు, కార్పోరేట్ అధిపతులకూ వర్తిస్తుంది. కంపెనీ చైర్మన్ లేదా సిఇఓ ఆరోగ్యంగా, చురుకుగా, సమయస్ఫూర్తితో పనిచేస్తూ, పాలకులతో సఖ్యంగా వున్నాడన్న అనిపిస్తేనే ఆ కంపెనీలో సమర్థులు నిలుస్తారు. లేదనిపించినా, సిఇఓ అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నా, ఏవైనా కేసుల్లో ఇరుక్కున్నాడన్నా కంపెనీ షేరు వాల్యూ సైతం పడిపోతుంది. రాజరికం కాలం నుండి వస్తున్నదే ఇది. రష్యాలాంటి పత్రికా స్వేచ్ఛ లేని దేశాల్లో అధినేత జబ్బుపడినా బయటకు పొక్కనిచ్చేవారు కారు, పార్టీలో తిరుగుబాటు వస్తుందేమోనన్న భయంతో!

ఇవి అన్ని దేశాల్లోనూ వున్న విషయమే కానీ, మన దేశంలో జ్యోతిష్యం, ఇతర మతవిషయాలపై గురి జాస్తి. ఫలానా పార్టీ నాయకుడికి వచ్చే ఏడాది ప్రాణగండం వుందట, పదవీభ్రష్టత్వం వుందట, జైలుపాలు అవుతాడట అని వార్తలు వస్తే ఆ పార్టీని విడిచిపెట్టడానికే అందరూ చూస్తారు. అందుకే నాయకులెవ్వరూ తమ జాతకాలను బయటకు పొక్కనివ్వరు. జీవితమన్నాక ఎగుడుదిగుళ్లు తప్పవు. కానీ వచ్చే ఎన్నికల్లో ఫలానా నాయకుడికి ఓటమి తప్పదు అని జాతకచక్రం చూసి ఓ పేరున్న జ్యోతిష్కుడు చెపితే ఆ పార్టీ టిక్కెట్టు తీసుకోవడానికి జనం వెనకాడతారు. తక్కిన రాజకీయపరమైన లెక్కలు వేస్తూనే దీనికి కూడా కొంత వెయిటేజి ఇస్తారు. ‘ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శనిట, అందుకే కలిసి రావటంలేదు, ఈసారి వదిలేసి వచ్చేసారి తీసుకుందాం’ అనే ఆలోచనలు చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు వుంటాయనే రాజు తన జాతకాన్ని గోప్యంగా వుంచాలని రాజనీతి చెప్తుంది. మన నాయకులూ సాధ్యమైనంతవరకు గోప్యతను పాటిస్తారు. ఉగాదికి తమ పార్టీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసే పంచాంగశ్రవణాల్లో ఈసారి జయం తథ్యం అనే మాట అనిపించి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారు.

ప్రస్తుతం కెసియార్ టైము బాగుంది అనే మాట ప్రబలంగా వినబడుతోంది. ఆంధ్రలో చేష్టలుడిగి వున్నా పేరుకైనా ప్రతిపక్షం వుంది. తెలంగాణలో ప్రతిపక్షాలు మటుమాయ మవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాదులో తెరాస, దాని మిత్రపక్షమైన మజ్లిస్ కలిసి ఝంఝామారుతంలా చెలరేగిపోయారు. ఏ రోజు ఏ నాయకుడు తెరాసలో దూకుతాడో తెలియకుండా వుంది. గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఉప ఎన్నికలు వస్తే తెరాస బలం తెలుస్తుందేమో అనుకుంటే ఎర్రబెల్లి టి-టిడిపిని తెరాసలో విలీనం చేస్తూ స్పీకరుకు లేఖ ఇచ్చేశారు. క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం వున్న టిడిపి తెలంగాణ నుండి కనుమరుగైతే కెసియార్‌కు ఎదురు లేనట్లే. కాంగ్రెసులో కలహించే నాయకులు ఎక్కువ, కష్టపడే కార్యకర్తలు తక్కువ. అధినాయకత్వమే నీరసించి వుంది. అందువలన కెసియార్ దూసుకుపోతున్నారు. దీనికి కారణం ఇటీవల ఆయన శ్రద్ధగా ఆయుత మహా చండీయాగం చేయడమే అనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు చాలా మంది. కెసియార్ ఒకప్పుడు చండీయాగాలు చేసినా తెలంగాణ రాలేదు. ఇప్పుడు మాత్రం ఈ ఆయుత యాగఫలం సిద్ధించి గ్రేటర్‌లో వాళ్లూహించిన దాని కంటె ఎక్కువ సీట్లు వచ్చాయంటున్నారు. నిజమో కాదో తెలియదు. ఎందుకంటే మతవిశ్వాసాల విషయంలో తర్కం పనిచేయదు. 

కెసియార్ గురించి ‘మద్యం సేవించి, ఫామ్‌హౌస్‌లోనే పడుకుంటాడు. పొద్దున్న లేవలేడు, ఎక్కడికీ కదలలేడు, అర్ధరాత్రి ఫోన్ చేసి మద్యం మత్తులో ఏదేదో అనేస్తాడు, ఇలాంటి వాడు రాజ్యమేం చేస్తాడు’ అనేవారు. అలాంటిది తెలంగాణ బిల్లు పాసయిన దగ్గర్నుంచి ఆయనలో విపరీతమైన మార్పు వచ్చింది. ఎన్నికలలో పొద్దున్నే లేచి, ప్రచారానికి బయలుదేరేవారు. నెగ్గి ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ అందుబాటులో వుంటూ అధికారులతో చర్చలు జరుపుతూ, రాజకీయంగా చురుగ్గా వుంటూ, ఎక్కడా నీరసం కనబర్చలేదు. ఆయన వేసే రాజకీయపు టెత్తులు బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతున్నాయంటే మేధస్సు ఎంత చురుగ్గా పనిచేస్తోందో అర్థమవుతోంది. ఈ మధ్యే కెటియార్ తన తండ్రి అనారోగ్యంపై వచ్చేవన్నీ పుకార్లేననీ, ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా వుందనీ చెప్పారు. బహుశా అవాట్లు కూడా మార్చుకున్నారేమో తెలియదు. ఇక ఈ యాగం విషయానికి వస్తే దాన్ని భారీ స్థాయిలో నిర్వహించి, హిందువులందరినీ ఆకట్టుకున్నారు. మజ్లిస్‌తో దోస్తీ చేయడం వలన కోపం వచ్చి వున్నా, ఇంతటి దైవభక్తి వున్నవాడు హిందువులకు అన్యాయం చేయడు అని అనుకునేట్లా చేశారు. భారతీయుల్లో ఇదే వీక్‌నెస్. దేవుడి పేరు చెపితే చాలు సులభంగా ఏమారిపోతారు. ‘నేను నాస్తికుణ్ని’ అని ఎవడైనా చెప్పుకున్నాడంటే వాణ్ని పాపాత్ముడిగా చూస్తారు. పూజాపునస్కారం చేసేవాళ్లు దుష్టకర్మలు చేయరని గొప్ప నమ్మకం. కెసియార్ ఇంత పెద్ద యాగమూ తన సొంత ఖర్చుతో చేశానని, ప్రజాధనం వినియోగించలేదనీ చెప్పుకున్నారు. దానితో గౌరవం మరీ పెరిగిపోయింది. శ్రద్ధాభక్తులతో కెసియార్ యాగం చేశారని అందుకే ఆయనకు పనులు సానుకూల పడుతున్నాయని ప్రజలు నమ్మసాగారు.

తెలంగాణ వరకు చూస్తే బాబు టైము బ్యాడ్‌గానే వుందనేది నిస్సందేహం. పార్టీ తరఫున ఇద్దరు, మహా అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలేట్లు లేరు. ఇది ఇవాళ్టి పరిస్థితి. రెండు మూడేళ్లలో పరిస్థితి మారవచ్చు. ప్రస్తుతానికి మాత్రం టీడీపీి కార్యకర్తల స్పిరిట్స్ ‘లో’గా వున్నాయి. ఆంధ్రలో కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏదీ జరగటం లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రత్యేక హోదా సుదూరంగానే వుంది. బాబు తంటాలు పడటం లేదని ఎవరూ అనలేరు. ‘…కానీ పాపం కాలం కలిసిరావటం లేదు’ అనే మాట జనాల్లో రాకుండా చూసుకోవాలి. రాజకీయంగా అయితే ఏ ప్రమాదమూ లేదు. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీికి ఆంధ్రలో ప్రత్యామ్నాయం లేదు. ఆ పార్టీ వీడి వెళ్లేందుకు వేరే పార్టీ లేదు. ప్రజల్లోనే కాస్త ఆశ నింపాలి – తమ ముఖ్యమంత్రికి మరీ వ్యతిరేక పవనాలు లేవులే అని. 

దీనికోసం బాబు కెసియార్ పురోహితులను పిలిచి సొంత డబ్బుతో అక్కడా ఆయుత యాగం చేయించాలా? అబ్బే, అంత దూరం అక్కరలేదు. నా ఉద్దేశంలో బాబు తన ఇమేజిలో కొద్దిపాటి మార్పు చేసుకోవడం అభిలషణీయం. ఆయన పూజాదికాల్లో సంప్రదాయబద్ధంగా కనబడితే బాగుంటుంది. 20 ఏళ్ల క్రితం బాబు ఇమేజి – కార్పోరేట్ సిఇఓ! ఆయన వేసుకున్న డ్రస్సు, బూటు, గడ్డం అన్నీ దానికి సరిగ్గా అమిరాయి. అప్పట్లో ఆయన ముహూర్తాల గురించి, సంప్రదాయాల గురించి పట్టించుకున్నట్లు కనబడేవారు కారు. విపరీతమైన చాదస్తాలు ప్రదర్శించిన ఎన్టీయార్ ఛాందసుడిగా కనబడితే, దానికి కాంట్రాస్టుగా బాబు వ్యక్తిగత నమ్మకాల మాట ఎలా వున్నా ఆధునికతకు ప్రతిబింబంగా, రాబోయే తరానికి ముందుదూతగా కనబడేవారు. 20 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు బాబు వాస్తు గురించి మాట్లాడుతున్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ఏకంగా పురోహితుడి అవతారం ఎత్తేసి ఎంత మట్టిలో, ఎన్ని నీళ్లు శాస్త్రోక్తంగా కలపాలో దగ్గర్నుంచి చెప్పేశారు. మార్పు సహజం. దానికి ప్రజామోదం వున్నపుడు ఇబ్బందేమీ లేదు. 

అయితే ఎన్ని పూజలు చేస్తున్నా, బాబు డ్రస్సులో మార్పులేదు. అది చూడడానికి ఎబ్బెట్టుగా కనబడుతోంది. ‘జైసాదేశ్, వైసావేష్’ అంటారు. దేశం బదులు ప్రదేశం అనుకున్నా సామెత కరెక్టే. చర్చికి వెళ్లినపుడు చొక్కా విప్పి, పంచె కట్టి విబూదినామాలతో వెళితే అదోలా వుంటుంది. గుడికి వెళ్లినపుడు సూటూ, బూటుతో వెళ్లినా అంతే. కేరళ గుళ్లల్లో అయితే చొక్కా తీసేసి, ధోవతితో రమ్మంటారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే పూజల్లో పీటల మీద కూర్చున్నపుడు లక్షణంగా చీరా, జాకట్టులో వున్న భార్య పక్కన బాబు పంచె, లాల్చీ ఉత్తరీయంతో కనబడితే బాగుంటుంది. ఒళ్లు కనబడుతుందన్న సంకోచం ఏమీ పెట్టుకోనక్కరలేదు. పెదరాయుడు టైపు పంచెలు, ఫుల్ హేండ్స్ లాల్చీలు ఏ మాత్రం ఇబ్బంది పెట్టవు. కాస్త బొట్టూ, అదీ దిట్టంగా పెట్టి కెసియార్ టైపులో కాస్సేపు కళ్లు మూసుకుని ధ్యానముద్రలో వుంటూంటే ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాబు మానవ ప్రయత్నానికి తోడు దైవబలం కూడా కలిసి వచ్చి రాష్ట్రం బాగుపడుతుందనే ఆశ చిగురుస్తుంది. ఎవరో చెప్పినట్లు – చీకట్లో చిరుదీపానికి మారుపేరే ఆశ. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నేడు ఆంధ్రులకు కావలసిన ఆశావహదృక్పథమే! దాన్ని అందించడానికి ముఖ్యమంత్రి కాస్త ఇమేజి కరక్షన్ చేసుకున్నా తప్పు లేదు. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016) 

[email protected]