చిరకాలంగా దర్శకుడు త్రివిక్రమ్ చాలా రకాలుగా విమర్శలకు గురవుతున్నారు. తమ హీరోకి సరైన సినిమాలు సెట్ చేయకుండా, ఏవేవో చేయిస్తున్నారని పవన్ ఫ్యాన్స్ గుస్సా.. మా హీరోని వొదిలేయ్ అంటూ కామెంట్లు. మరోపక్క పవన్ సినిమాల పని మీద పడి తమ హీరో సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదని మహేష్ ఫ్యాన్స్ ఆవేదన.
ఇలాంటి నేపథ్యంలో పవన్ లాంటి టాప్ హీరో త్రివిక్రమ్ గుణగణాలు కీర్తించడం అంటే చెప్పుకోదగ్గు విషయమే. త్రివిక్రమ్ తనకు గురువు లాంటి వారని, ఆయన వల్లే తెలుగు మీద మక్కువ పెంచుకున్నా, బోలెడు సాహిత్యంతో పరిచయం పెరిగింది అంటూ పవన్ బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక మీద చెప్పుకువచ్చారు.
సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన త్రివిక్రమ్ సినిమాల్లోకి వచ్చి, తన ప్రతిభతో పెద్ద దర్శకుడిగా మారారన్నారు. కేవలం సైన్స్, తెలుగు మీద మాత్రమే కాకుండా సంస్కృతం, హిందీ భాషల్లో కూడా త్రివిక్రమ్ విపరీతమైన ప్రవేశం వుందన్నారు. తాను, ఆయన కలిస్తే కేవలం సాహిత్యం గురించే మాట్లాడుకుంటాం తప్ప వేరు కాదన్నారు.
పవన్ ఇలా సందర్భం లేకుండా ప్రసంగం మధ్యలోకి త్రివిక్రమ్ ను తీసుకువచ్చి, ఇంతలా కీర్తించడం అంటే బహశా సోషల్ మీడియాలో జరుగుతున్నది ఆయనకు తెలుసు అనే అనుకోవాల్సి వస్తోంది. వాటికి సమాధానంగానే పవన్ ఇలా మాట్లాడి వుండొచ్చు.