బీజేపీ, జ‌న‌సేన సీఎం అభ్య‌ర్థిపై ఆమె ఏమ‌న్నారంటే…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల స‌మావేశానికి ఆహ్వానించ‌డం ద్వారా ఆయ‌న ఇగోని బీజేపీ కొంత వ‌ర‌కు చ‌ల్ల‌బ‌రిచింది. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లో కొంచెం మార్పు వ‌చ్చింది. అంత వ‌రకూ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల స‌మావేశానికి ఆహ్వానించ‌డం ద్వారా ఆయ‌న ఇగోని బీజేపీ కొంత వ‌ర‌కు చ‌ల్ల‌బ‌రిచింది. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లో కొంచెం మార్పు వ‌చ్చింది. అంత వ‌రకూ జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మ‌నో, ఇంకో మాటో మాట్లాడేవారు. కానీ ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ త‌ర్వాత ప‌వ‌న్ స్వ‌రంలో మార్పును గ‌మ‌నించొచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్డీఏ స‌ర్కార్ వ‌స్తుంద‌ని ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి అధికారికంగా జ‌న‌సేన మాత్ర‌మే వుంది. అందుకే ఆ పార్టీకి మాత్ర‌మే బీజేపీ ఆహ్వానం పంపింది. ఏపీ బీజేపీ నాయ‌కత్వ బాధ్య‌త‌ల్ని ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి అప్ప‌గించ‌డంతో రాజ‌కీయంగా ఆ పార్టీ సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. జ‌న‌సేన‌తో సంబంధాల‌పై పురందేశ్వ‌రి ప‌దేప‌దే వ్యూహాత్మ‌కంగా మాట్లాడుతున్నారు.

రాజ‌మండ్రిలో బుధ‌వారం పురందేశ్వ‌రి మీడియాతో మాట్లాడుతూ జ‌న‌సేన‌తో పొత్తు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే ఇవాళే కాదు, రేపు కూడా జ‌న‌సేన‌తో పొత్తు వుంటుంద‌ని చెప్ప‌డం విశేషం. టీడీపీతో పొత్తును ఆమె కొట్టి పారేయ‌లేదు. ఆ విష‌యం కేంద్ర పార్టీ చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం అభ్య‌ర్థిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.

జ‌న‌సేన‌-బీజేపీ ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది త‌మ పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టిస్తుంద‌ని తేల్చి చెప్పారు. త‌మ నాయ‌కుడిని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన నాయ‌కులు ఎప్ప‌టి నుంచో బీజేపీని డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడే ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం లేద‌ని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఎన్నిక‌ల స‌మీపించిన‌ప్పుడు సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది త‌మ పార్టీ తేలుస్తుంద‌ని బీజేపీ ముఖ్య నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో, ఆయ‌న ఎంత వ‌ర‌కూ స్థిరంగా వుంటారో చూసుకుని సీఎం అభ్య‌ర్థిగా నిర్ణ‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీఎం అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించ‌డానికి సిద్ధంగా ఉంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. త‌ద్వారా టీడీపీ వైపు ప‌వ‌న్ వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేయాల‌న్న‌ది కేంద్ర బీజేపీ ప్లాన్‌. 

అయితే ఏపీ బీజేపీలో టీడీపీ శ్రేయోభిలాషులు ఎక్కువ‌. అయితే ప్ర‌స్తుతానికి వారి ఆట‌లు బీజేపీలో చెల్లుబాటు కావ‌డం లేదు. బీజేపీ, జ‌న‌సేన సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను ప్ర‌క‌టించ‌డం అంటే, చంద్ర‌బాబుకు చెక్ పెట్ట‌డ‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.